క్యూఆర్‌ స్కాన్‌ చేస్తే ఆధార్‌ వివరాలు.. కేంద్రం కొత్త యాప్‌ | New Aadhaar App Launched works with Face ID And QR Code | Sakshi
Sakshi News home page

క్యూఆర్‌ స్కాన్‌ చేస్తే ఆధార్‌ వివరాలు.. కేంద్రం కొత్త యాప్‌

Published Wed, Apr 9 2025 2:32 PM | Last Updated on Wed, Apr 9 2025 3:22 PM

New Aadhaar App Launched works with Face ID And QR Code

క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధార్ యాప్‌ను కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టారు. ఇన్‌స్టంట్‌ వెరిఫికేషన్, ఆథెంటికేషన్ కోసం రియల్ టైమ్ ఫేస్ ఐడీతో కొత్త యాప్‌ పని చేస్తుందని చెప్పారు. ఈ యాప్‌తో సులభంగా ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చని తెలిపారు. భారత పౌరులు తమ ఆధార్ కార్డును కొన్ని సందర్భాల్లో భౌతికంగా చూపించడానికి బదులుగా వారి గుర్తింపును ధ్రువీకరించడానికి ఈ యాప్‌ను ఉపయోగించవచ్చని పేర్కొన్నారు.

‘కేవలం ఒక ట్యాప్‌తో వినియోగదారులు అవసరమైన డేటాను మాత్రమే ఇతరులతో పంచుకునేలా ప్రభుత్వం వీలు కల్పిస్తుంది. ఇది వారికి తమ వ్యక్తిగత సమాచారంపై పూర్తి నియంత్రణను అందిస్తుంది. న్యూ ఆధార్ యాప్ (బీటా టెస్టింగ్ దశలో ఉంది) ద్వారా వెరిఫికేషన్ యూపీఐ పేమెంట్ చేసినంత సులభంగా ఉంటుంది. యూజర్లు తమ వివరాలు నిర్ధారించేటప్పుడు వారి ఆధార్‌ను డిజిటల్‌గా ధ్రువీకరించవచ్చు. యూపీఐ లావాదేవీల మాదిరిగా కేవలం క్యూఆర్‌ను స్కాన్‌ చేయడం ద్వారా ఇదంతా సులువుగా చేయవచ్చు’ అని మంత్రి తెలిపారు.

ఆధార్ ఫేస్ అథెంటికేషన్

దేశంలో యూపీఐ చెల్లింపులకు విస్తృతంగా వినియోగించే క్యూఆర్ కోడ్‌ల మాదిరిగానే ఆధార్ ధ్రువీకరణకు ‘పాయింట్స్ ఆఫ్ అథెంటికేషన్(వెరిఫికేషన్‌ భాగస్వాములు)’ వద్ద అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. యూపీఐ యాప్‌ల మాదిరిగానే కొత్త ఆధార్ యాప్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వెంటనే వారి ఫేస్‌ వెరిఫై ఆప్షన్‌ వస్తుంది. ఇది ఆధార్ హోల్డర్లకు వారి వ్యక్తిగత సమాచారంపై పూర్తి నియంత్రణను కలిగిస్తుంది. ఈ యాప్ రిక్వెస్ట్ అప్లికేషన్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా డిజిటల్ వెరిఫికేషన్, సమాచార మార్పిడికి అనుమతి లభిస్తుంది. ఇది భౌతిక ఫోటోకాపీల అవసరాన్ని తొలగిస్తుంది. ఇకపై హోటల్ రిసెప్షన్లు, షాపులు, ప్రయాణాల సమయంలో ఆధార్ ఫొటోకాపీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.

ఇదీ చదవండి: వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం ఎప్పటి నుంచంటే..

బీటా వెర్షన్

ఈ యాప్ బీటా వెర్షన్‌ టెస్టింగ్ దశలో ఉందని మంత్రి అన్నారు. కానీ దేశవ్యాప్తంగా ఇది విస్తృతంగా అమలైతే, పౌరులు ఇకపై వారి భౌతికంగా తమ ఆధార్ లేదా ఫోటోకాపీని ఇవ్వాల్సిన అవసరం తగ్గుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ యాప్‌కు సంబంధించి నిర్దిష్ట యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా యూఐడీఏఐ త్వరలోనే దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement