జూన్‌ 14 తర్వాత ఆధార్‌ పనిచేయదా..? స్పష్టతనిచ్చిన యూఐడీఏఐ | Aadhaar will not work after June 14..: UIDAI clarified | Sakshi
Sakshi News home page

జూన్‌ 14 తర్వాత ఆధార్‌ పనిచేయదా..? స్పష్టతనిచ్చిన యూఐడీఏఐ

Published Wed, Jun 5 2024 9:40 AM | Last Updated on Wed, Jun 5 2024 11:29 AM

Aadhaar will not work after June 14..: UIDAI clarified

ఆధార్‌కార్డులోని వ్యక్తిగత వివరాలను జూన్‌ 14 లోపు అప్‌డేట్‌ చేయకపోతే కార్డు పని చేయదంటూ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ వార్తలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యూఐడీఏఐ) స్పష్టతనిచ్చింది. అలా వస్తున్న వార్తలను నమ్మకూడదని చెప్పింది.

ఆధార్‌లోని వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవడానికి జూన్‌ 14 గడువు విధించినట్లు చెప్పింది. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు మార్చుకోకపోయినా ఆధార్‌ పనిచేస్తుందని స్పష్టం చేసింది. తర్వాత కూడా  వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఆధార్‌ సెంటర్లలో నిర్దేశిత రుసుము చెల్లించి వివరాలు అప్‌డేట్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

ఆన్‌లైన్‌లో ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు ఉడాయ్‌ గతంలో 2023 డిసెంబర్‌ 14 వరకు అవకాశం ఇచ్చింది. తర్వాత దాన్ని రెండుసార్లు పొడిగించి చివరగా జూన్‌ 14 గడువు విధించింది. ఆలోపు ఆన్‌లైన్‌లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

ఉడాయ్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి కూడా ఉచితంగా వివరాలు అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా తాజా గుర్తింపు కార్డు, అడ్రస్‌ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, కిసాన్‌ పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్‌షీట్‌, పాన్‌/ఇ-పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా విద్యుత్‌, నీటి, గ్యాస్‌, టెలిఫోన్‌ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించుకోవచ్చని ఉడాయ్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement