ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుతున్నాయా.. లేదా.. అని చూసేందుకు సరిపడా అధికారులు లేరు. ఫలితంగా ప్రజా పంపిణీ సజావుగా సాగడం లేదు. జిల్లాలో ఒక్కో డివిజన్‌కు ఒక ఏఎస్‌వో స్థాయి అధికారి విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే వీరు జిల్లాలో అవసరమైనంత మంది లేకపోవడంతో పర్యవేక్షణ పడకేసింది.
జిల్లాలో ఉన్న రేషన్ షాపులు, కిరోసిన్, వంటగ్యాస్ సంస్థలపై తరచుగా ప్రత్యేక బృందాలు దాడులు చేస్తేనే పౌరసరఫరాలో లోటుపాట్లు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి దాడులు లేకపోవడంతో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం కిరాణం షాపుల్లో, మిల్లర్ల వద్ద దర్శనమిస్తున్నాయి. వంట గ్యాస్ సిలెండర్లను కమర్షియల్ సిలెండర్లుగా, వివిధ కార్లకు ఇంధనంగా వినియోగిస్తున్నారు. ఏఎస్‌వో స్థాయి అధికారులు సరిపడా లేకపోవడంతో మండల కేంద్రాల్లో ఉన్న సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఐదుగురికి ఒక్కరే...
ప్రజా పంపిణీ వ్యవస్థపై పర్యవేక్షణకు డివిజన్ స్థాయిలో ఒక అధికారి ఉంటారు. జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు, డీఎస్వో కార్యాలయంలో పాలన పరమైన అంశాలు చూసేందుకు మరొకరు జిల్లా కేంద్రంలో ఉంటారు. అయితే జిల్లాలో ఐదుగురు ఏఎస్‌వోలకు గాను ప్రస్తుతం ఒక్కరే డీఎస్వో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నా రు. మిగిలిన నాలుగింటిలో భద్రాచలం డివి జన్‌లో పోస్టు ఖాళీగా ఉంది. ఇక ఖమ్మం ,కొత్తగూడెం, పాల్వంచలలో పని చేస్తున్న వారు డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాలో పరిస్థితి అధ్వానంగా తయారైంది. అలాగే భద్రాచలం డివిజన్‌లో ఒక్క డీటీ మాత్రమే పనిచేస్తున్నారు. బూర్గం పాడు మండలంలో సైతం సివిల్ సప్లై డీటీ పోస్టు ఖాళీగానే ఉంది.
పర్యవేక్షణ కరువు....
డివిజన్ పరిధిలో ఏఎస్‌వో స్ధాయి అధికారి విధుల్లో కొనసాగితే ఆ పరిధిలోని డిప్యూటి తహశీల్దార్లను అప్రమత్తం చేస్తూ అక్రమ మార్గంలో తరలే నిత్యావసర వస్తువులకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. అయితే పై స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మండలస్ధాయిలో సివిల్ సప్లై డీటీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అక్రమ దందా .....
సరైన పర్యవేక్షణ లేని కారణంగా రేషన్ బియ్యం అక్రమ దందా యథేచ్చగా కొనసాగుతోంది. ప్ర జా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం భారీ ఎత్తున ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. కిరోసిన్ అక్రమదందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎప్పుడో ఒకసారి జరిగే దాడుల్లో దొరుకుతున్నప్పటికీ అంత గా చర్యలు లేకపోవడంతో అక్రమ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయల్లా కొనసాగుతోంది.
పెద్దల ముసుగులో అక్రమ వ్యాపారం...
జిల్లాలో బియ్యం, కిరోసిన్, గ్యాస్ తదితర నిత్యావసర వస్తువులు అక్రమ మార్గంలో తరలివెళ్లడంలో పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పెద్దల ముసుగులో కొందరు అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం జిల్లా అధికారులకు తెలుసో.. తెలియదో కానీ కిందిస్థాయి ఉద్యోగులు మాత్రం అక్రమార్కుల జోలికి వెళ్లడంలేదు.
ఒకవేళ ఎవరినైనా పట్టుకుంటే ‘పెద్దాయన.. అదే మీబాస్ మా దగ్గరి చుట్టం.. ఆయనతో మాట్లాడించాలా’ అని అనడంతో మాకెందుకులే అని సిబ్బంది నోరు మెదపకుండా వస్తున్నారు. ఈ తరహా వ్యవహారం ఖమ్మంలో అధికంగా సాగుతోందని పౌరసరఫరాల అధికారులే పేర్కొనడం కొసమెరుపు.
అస్తవ్యస్తం !
Published Thu, Aug 21 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM
Advertisement