సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా రేషన్‌షాపుల్లో ఇచ్చే బియ్యం, కిరోసిన్ కోటాకు కోత పడనుంది. వచ్చే నెల ఇచ్చే రేషన్‌లో కొందరు తెల్ల రేషన్‌కార్డుదారులకు బియ్యం, కిరోసిన్ కట్ చేయనున్నారు. ఆధార్ వివరాలతో సరిపోల్చడం ద్వారా గుర్తించిన బోగస్ యూనిట్లకు, గ్యాస్ కనెక్షన్ ఉన్న కార్డుదారులకు ఈ నిబంధన వర్తింపజేయనున్నారు.
బోగస్ యూనిట్లుగా తేలిన వారికి నాలుగు కిలోల బియ్యం, గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి ఒక లీటర్ కిరోసిన్ కట్ చేయనున్నారు. గురువారం రాష్ట్రస్థాయి అధికారుల సమక్షంలో జరిగిన ఎలక్ట్రానిక్ ప్రజా పంపిణీ వ్యవస్థ (ఈపీడీఎస్) సమావేశంలో ఈ నిబంధన ద్వారా వచ్చే నెల జిల్లా రేషన్‌కోటాలో తగ్గే బియ్యం, కిరోసిన్‌లపై అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు గుర్తించిన 14 వేలకుపైగా బోగస్ కార్డులు, 2.5 లక్షల యూనిట్ల (వ్యక్తుల)కు గాను వచ్చే నెల రేషన్‌లో దాదాపు 4.8 లక్షల కిలోల బియ్యం, 75 వేల లీటర్ల కిరోసిన్ కోత పడనుంది. ఇందుకు సంబంధించి అన్ని వివరాలను జాయింట్ కలెక్టర్ కె. సురేంద్రమోహన్ సమన్వయపరుస్తున్నారు. ఆధార్ సరిపోల్చిన వివరాలను, ఎల్‌పీజీ కనెక్షన్ ఉన్న కార్డుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఉన్నతాధికారులు చెపుతున్నారు.
జిల్లాలో 2.5 లక్షల యూనిట్లు ఎక్కువ..
జిల్లాలో ఉన్న కుటుంబాల కన్నా రేషన్‌కార్డులు ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అధికారంలోనికి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా తెల్లకార్డుల విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి బోగస్‌కార్డులుంటే తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డుల ద్వారా కార్డుదారుల వివరాలను జిల్లా యంత్రాంగం సరిపోల్చింది. జిల్లాలో 97 శాతం మందికి ఆధార్ నంబర్లు వచ్చినా ఇందులో 74 శాతం మంది వివరాలను మాత్రమే రేషన్‌కార్డులతో పోల్చి చూశారు.
అలా చూస్తే దాదాపు జిల్లాలో 2.5 లక్షల బోగస్ యూనిట్లు (రేషన్‌కార్డులో పేరున్న వ్యక్తులు) ఉన్నట్టు తేలింది. అంటే... ఇకే వ్యక్తి పేర్లు రెండు, మూడు కార్డుల్లో ఉండడం, కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం, కుటుంబ యజమానుల పేర్లు కుటుంబ సభ్యుల పేరిట జారీ అయిన కార్డుల్లో ఉండడం వంటి అవకతవకలు ఉన్నాయని తేలింది. ఈ విధంగా తెలంగాణలోనే అత్యధికంగా జిల్లాలో 2.5 లక్షల యూనిట్లు వెలుగులోనికి వచ్చాయి. అంటే ఒక్కో యూనిట్‌కు నాలుగు కిలోల బియ్యం ఇప్పటివరకు అదనంగా ఇస్తున్నారు. వీరందరికీ ఆ నాలుగు కిలోల బియ్యాన్ని నిలిపివేయనున్నారు.
కుటుంబ సభ్యులు ఎంత మంది ఉన్నా నెలకు 20 కిలోల బియ్యం మాత్రమే ఇస్తారు. ఇలాంటి కార్డుల్లో ఐదుగురి కన్నా ఎక్కువ మంది ఉన్న కార్డుల్లో నుంచి కొందరిని తీసివేసినా ఆ కార్డుపై కోటా మాత్రం తగ్గదు. అంటే కొన్ని యూనిట్లు తగ్గినా కోటా తగ్గదు. ఈ నేపథ్యంలో జిల్లాలో వచ్చే నెల బియ్యం కోటాలో 4.8 లక్షల కిలోల బియ్యం (408 టన్నులు) తగ్గనుంది. తద్వారా ప్రభుత్వానికి నెలకు రూ.65 లక్షలకు పైగా ఆదా కానుంది. వాస్తవానికి రేషన్ ద్వారా ఇచ్చే బియ్యాన్ని ప్రభుత్వం కిలోకు రూ.25 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఇందులో రూ.8 కేంద్రం భరిస్తుండగా, మరో రూపాయి కార్డుదారుడి నుంచి వసూలు చేస్తున్నారు. అంటే కిలో బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం రూ.16 చెల్లించాల్సి వస్తోంది. వచ్చే నెల నుంచి 4.8 లక్షల కిలోల బియ్యం తగ్గితే ప్రభుత్వానికి కిలోకు రూ.16 చొప్పున రూ.65 లక్షల మేరకు ఆదా కానుంది.
గ్యాస్ ఉంటే కిరోసిన్ లేదు..
తెల్లకార్డుల ద్వారా ఒక్కో కుటుంబానికి నె లకు రెండు లీటర్ల కిరోసిన్ ఇస్తున్నారు. అయితే, నిబంధనల ప్రకారం గ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబానికి కేవలం ఒక లీటర్ కిరోసిన్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. ఈ కారణంతో ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల నుంచి మండలాల వారీగా క నెక్షన్ల వివరాలను జేసీ తెప్పించుకున్నారు. ఈ వివరాలను మండల స్థాయిలో తహశీల్దార్లకు పంపి పరిశీలన జరిపిన అనంతరం ఏ కార్డుదారునికి లీటర్ కిరోసిన్ ఇవ్వాలో నిర్ణయించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు క్షేత్రస్థాయి నుంచి అందిన వివరాల విషయంలో ఎక్కడా తప్పులు జరగకుండా ఉండేందుకు గాను తహశీల్దార్ల నుంచి వ్యక్తిగత పూచీకత్తు కూడా తీసుకున్నారు. ఈ విధంగా గ్యాస్‌కు, కిరోసిన్‌కు లింకు పెట్టడం ద్వారా వచ్చే నెల 75 వేల లీటర్ల కిరోసిన్ కోత పడనుంది. లీటర్‌కు ప్రభుత్వంపై పడే భారం రూ.15 చొప్పున మరో రూ.11.25 లక్షలు కిరోసిన్ కోత ద్వారా ప్రభుత్వానికి ఆదా కానుంది.
రేషన్ కట్
Published Fri, Jul 25 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM
Advertisement
Advertisement