గ్యాస్‌ ఉంటే.. కిరోసిన్‌ కట్‌ | No Kerosene In Ration Shop For Gas Connection People In Medak | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ ఉంటే.. కిరోసిన్‌ కట్‌

Published Sat, Aug 3 2019 10:35 AM | Last Updated on Sat, Aug 3 2019 10:36 AM

No Kerosene In Ration Shop For Gas Connection People In Medak - Sakshi

గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న వారికి కిరోసిన్‌ బంద్‌ చేయనున్నారు. రేషన్‌ దుకాణాల ద్వారా ఇచ్చే నీలి కిరోసిన్‌ను ఈనెల నుంచే నిలిపి వేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని  సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. గ్యాస్‌ కనెక్షన్లు లేని దీపం పథకం కింద సిలిండర్లు పొందిన లబ్ధిదారులకు మాత్రమే నెలకు లీటర్‌ చొప్పున కిరోసిన్‌ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. గ్యాస్‌ సిలిండర్లు ఉన్నవారికి కిరోసిన్‌ ఇస్తే దానిని బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారని భావించిన పౌరసరఫరాల శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.         

సాక్షి, మెదక్‌ : జిల్లా వ్యాప్తంగా 521 రేషన్‌దుకాణాలు ఉండగా 2,14,165 రేషన్‌ కార్డులు  ఉన్నాయి. వాటిలో ఆహారభద్రత(తెల్లరేషన్‌) కార్డులు 2,01,059 అంత్యోదయ కార్డులు 13018 అన్నపూర్ణ 88 కార్డులు చొప్పున జిల్లాలో ఉన్నాయి. వీరికి నెలకు 2,14,000 లీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో నేరుగా తీసుకున్న వాటితో పాటు దీపం, పథకం కింద గ్యాస్‌పు పొందిన వారితో పాటు అసలే గ్యాస్‌ కనెక్షన్లు లేని వారు మొత్తం జిల్లాలో 84 వేల కుటుంబాలు ఉన్నాయి. ఈలెక్కన స్వయంగా గ్యాస్‌కనెక్షన్లు పొందిన వారి సంఖ్య 1,30,165 మంది ఉన్నారు. దీంతో వీరందరికి ఈనెల నుంచి కిరోసిన్‌ బంద్‌ కానుంది. కేవలం దీపం పథకం ద్వారా గ్యాస్‌ పొందిన వారితో పాటు అసలు ఏ గ్యాస్‌కనెక్షన్‌ లేనటువంటి 84 వేల కుటుంబాలకు మాత్రమే నెలకు ఒక్కో కుటుంబానికి 1లీటర్‌ కిరోసిన్‌ ఇవ్వనున్నారు. ఇంతకు ముందు గ్యాస్‌కనెక్షన్‌తో సంబంధం లేకుండా ఒక్కో కార్డుపై రూ.33కు లీటర్‌ చొప్పున అందించే వారు. ఇక నుంచి అన్ని కుటుంబాలకు ఇవ్వరాదని అధికారులు నిర్ణయించారు.

నల్లబజారుకు తరలిస్తున్నారని..
కిరోసిన్‌ నల్లబజారుకు తరలిపోకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో అందరికి గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా పల్లెలోనూ వివిధ పథకాల కింద కొంత మంది లబ్ధిదారులకు అందించారు. వీరికి రేషన్‌ కార్డులు ఉండటంతో ప్రతినెలా రేషన్‌ దుకాణాల ద్వార కిరోసిన్‌ తీసుకునే వారు. వారిలో కొందరికి  కిరోషిన్‌ అవసరం లేకున్నా తీసుకెళ్లి బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తూ అమ్ముకుంటుండగా, అవసరం లేని వారు రేషన్‌ షాపుల్లో నుంచి తీసుకెళ్లేవారు కాదు. దీంతో సదరు డీలర్‌ మిగిలిన దానిని నల్లబజార్లో విక్రయించుకునే వారు. దీంతో గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న వారికి కిరోసిన్‌ నిలిపి వేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించి ఈ నెల నుంచి జిల్లాకు కిరోసిన్‌ నిలిపివేశారు.
 
కరెంట్‌పోతే చీకట్లోనే..
గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నవారికి కిరోసిన్‌ నిలిపివేస్తునట్లు పౌరసరాఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో 1,30,165 కుటుంబాలకు సంబంధించి గ్యాస్‌ కనెక్షన్లు నేరుగా తీసుకున్న వారు ఉన్నారు. దీంతో వీరందరికి ఈనెల నుంచే కిరోసిన్‌ నిలిపివేస్తునట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కానీ రాత్రి వేళలో కరెంట్‌ పోయినట్లయితే ఆ కుటుంబాలు చీకట్లో మగ్గే  పరిస్థితి నెలకొంటుంది. దీంతో జిల్లాలో ఈ విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నాయి. నేడు గ్యాస్‌ కనెక్షన్‌ పొందిన వారు ధనవంతులు అనుకుంటే పౌరసరఫరాల శాఖ పప్పులో కాలు వేసినట్లే. గతంలో వంటచెరుకు కోసం అడవులను నరికిన జనాలకు వాటిని నరకటంతో జరిగిన నష్టాలను తెలుసుకొని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గ్యాస్‌ కనెక్షన్లు తీసుకున్నారు. వారిని అభినందించాల్సిన  పౌరసరఫరాలశాఖ, ప్రభుత్వం వారిని ధనవంతుల కింద జమకట్టి కిరోసిన్‌ కట్‌ చేయటం సమంజసం కాదని పలువురు పేర్కొంటున్నారు.

ఇక నుంచి కిరోసిన్‌ బంద్‌
గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న వారందరికీ ఈనెల నుంచి కిరోసిన్‌ నిలిపివేస్తున్నాం. దీపం పథకంలో గ్యాస్‌ కనెక్షన్లు పొందిన పేదలతో పాటు అసలు   గ్యాస్‌ కనెక్షన్‌ లేని వారికి మాత్రమే నెలకు ఒక లీటర్‌ చొప్పున కిరోసిన్‌ ఇస్తాం. జిల్లాలో మొత్తం 2,14,165 రేషన్‌ కార్డులు ఉండగా అందులో దీపం పథకం ద్వారా గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకున్న వారితో పాటు అస్సలు గ్యాస్‌ కనెక్షన్లు లేనివారు 84 వేల మంది ఉన్నారు. వారికి మాత్రమే నెలకు లీటర్‌ చొప్పున కిరోసిన్‌ ఇవ్వటం జరుగుతుంది. ఈలెక్కన 1,30,165 మందికి కిరోసిన్‌ నిలిపి వేయటం జరిగింది. – శ్రీకాంత్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఎస్‌వో 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement