ఖమ్మం: సహజంగా ఎవరి కంటి నుంచైనా నీరు కారడం, పూసులు రావడం సహజమే. కానీ ఓ చిన్నారి కంటి నుంచి బియ్యం గింజలు, ప్లాస్టిక్ ముక్కలు, గోర్లు ఇలాంటివి వస్తున్నా యి. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా.. పాప కంట్లో వ్యర్థాలను పెట్టుకోవడంతో అవి కాసేపటికి బయటకు వస్తున్నాయని తేల్చారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలుకు చెందిన భూక్యా దస్రూ, దివ్య దంపతుల కుమార్తె ఆరేళ్ల సౌజన్యకు మూడు నెలల క్రితం కంట్లో నుంచి పత్తి గింజ పడగా.. తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. అయినా మళ్లీ కంట్లో నుంచి పేపర్, ప్లాస్టిక్ ముక్కలు, బియ్యం గింజలు పడడంతో ఆందోళనకు గురైన వారు శనివారం ఖమ్మంలోని మమత ఆస్పత్రికి తీసుకొచ్చారు.
దీంతో వైద్యులు పరీక్షించి పాప గోళ్లు కొరికి ఆ ముక్కలను కంట్లో పెట్టుకుంటుండడంతో పాటు ఇతర వ్యర్థాలను కంట్లో పెట్టుకోగా, ఆతర్వాత బయటకు వస్తున్నాయని తెలిపారు. పాపను రెండు గంటల గాటు పరిశీలనలో ఉంచగా, ఆమె గోర్లు కొరికి కంట్లో పెట్టుకున్నట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా తేల్చారు. కౌన్సెలింగ్ ద్వారా ఈ అలవాటును మాన్పించవచ్చని వైద్యులు చెప్పినా.. తల్లిదండ్రులు మాత్రం వాటంతట అవే కంట్లోంచి వస్తున్నాయంటూ వాపోయారు.
దీంతో రెండు రోజులు సౌజన్యను ఆస్పత్రిలోనే పరిశీలనకు ఉంచి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చాక డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి ఆర్‌ఎంఓ సంతోష్‌రెడ్డి, సూపరింటెండెంట్ రామస్వామి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment