ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో పత్తి, వరి తరువాత అధిక విస్తీర్ణంలో సాగు చేసేది మిర్చి. దాదాపు 30 వేల హెక్టార్లలో ఈ పంట సాగవుతోంది. మిర్చి సాగుకు ఖర్చు అధికంగా ఉన్నా ఆశించిన దిగుబడులతో పాటు అనుకూలమైన ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. జిల్లాలో అధికంగా భద్రాచలం, చర్ల, మొరంపల్లిబంజర, ఖమ్మం, మధిర తదితర వ్యవసాయ డివిజన్లలో ఈ పంట సాగు అధికంగా ఉంది.
నాలుగైదు సంవత్సరాలుగా మిరప రైతాంగం మంచి దిగుబడులను సాధిస్తున్నారు. కానీ మిరప పంటను తరచూ చీడపీడలు ఆశించి రైతులకు ఖర్చు అధికమవుతోంది. తద్వారా నికర ఆదాయం తగ్గుతోంది. చీడపీడల మీద ఖర్చు తగ్గించుకోవాలంటే నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి.
విత్తనం
ఎంచుకున్న హైబ్రిడ్ విత్తనాలను ఎకరాకు 650 గ్రాములు నారు పోసుకోవాలి. నేరుగా విత్తనం ఎదబెట్టే పరిస్థితిలో ఎకరాకు రెండున్నర కిలోల విత్తనం వాడాలి.
విత్తన శుద్ధి
సాధారణంగా హైబ్రిడ్ మిరప విత్తనాన్ని విత్తన సంస్థలు విత్తన శుద్ధి చేసిన విత్తనాన్నే అమ్ముతూ ఉంటారు. హైబ్రిడ్, సూటి రకాలు విత్తనశుద్ధి చేయకపోతే మూడు రకాలుగా విత్తనశుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది.
ఠమొదటగా వైరస్ తెగుళ్ల నివారణకు ట్రైసోడియం ఆర్థో ఫాస్పేట్ 150 గ్రాముల మందును ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. 150 గ్రాముల ఈ మందును ఒక లీటరు నీటిలో కలిపి కిలో మిరప విత్తనాలను ఆ నీటిలో పోసి 20-30 నిమిషాలు నానబెట్టిన తరువాత ఆ నీటిని తీసివేసి మంచినీటితో రెండుమూడు సార్లు కడిగి నీడలో ఆరబెట్టాలి.
రసంపీల్చు పురుగుల నివారణకు 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేయాలి. అప్పుడే తెల్లనల్లి తప్ప మిగతా రసం పీల్చు పురుగులను అరికట్టవచ్చు.
చివరిగా విత్తనం ద్వారా వ్యాపించే బూజు తెగుళ్లను నివారించటం కోసం 3 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.
నారుమడి
నారుమడికి ఎంపిక చేసిన భూమిని బాగా దుక్కి దున్ని ఎత్తై నారుమళ్లు చేసుకోవాలి. ఒక మీటరు వెడల్పు, 40 మీటర్ల పొడవు 15 సెం.మీ ఎత్తు ఉండేటట్లు నారుమడులు తయారు చేసి మధ్యలో 30 సె.మీ. కాలువలు తీయాలి.
ఠవిత్తనంతో పాటు సెంటునారుమడికి 80 గ్రాముల ఫిఫ్రోనిల్ గుళికలను వాడితే రసంపీల్చు పరుగులు నివారించవచ్చు. సెంటుకు కిలో వేపపిండిని కూడా వేయాలి.
నారు కుళ్లు తెగులు
లేత మొక్కల కాండం మెత్తబడి గుంపులు, గుంపులుగా నారు చనిపోతుంది. దీని నివారణకు విత్తనం మొలకెత్తిన వెంటనే ఒకసారి మరల వారం రోజులకు ఒకసారి మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఎత్తై నారుమడులలో నారును పెంచాలి. విత్తనం వత్తుగా విత్తకూడదు. నారుకుళ్లు కనబడిన వెంటనే తడులను ఆపివేయాలి.
బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు
వాతావరణం మబ్బుగా ఉండి, వర్షాలు పడినప్పుడు ఈ తెగులు ఎక్కువగా కనబడుతుంది. ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పండుబారి రాలిపోతాయి. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు, ఒక గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ఆరు వారాల వయసు కలిగిన మొక్కలు నాటటానికి అనుకూలం.
‘నారు’కొద్దీ పైరు
Published Mon, Aug 25 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM
Advertisement
Advertisement