మంథని మండలం గద్దలపల్లిలో పట్టుబడ్డ వాహనాలు
సాక్షి, కరీంనగర్: వాస్తవానికి ‘ఏక్‌రూపాయ్‌వాలా’ అనేది ఓ కోడ్. ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న బియ్యాన్ని తరలించే వ్యక్తులు చెక్‌పోస్టుల వద్ద వాడే పేరు ఏక్‌రూపాయ్‌వాలా.! అంటే రూపాయి కిలో బియ్యాన్ని అక్రమంగా సేకరించి, కొంచెం ప్రాసెస్ చేసి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించే దందాకు అక్రమార్కులు పెట్టుకున్న ముద్దుపేరు.
ఉమ్మడి కరీంనగర్ కేంద్రంగా సాగుతున్న ‘ఏక్‌రూపాయ్‌వాలా’ నెట్‌వర్క్ రోజురోజుకూ విస్తరిస్తోంది. రాష్ట్ర సరిహద్దులు దాటి మహారాష్ట్రలోని సిరోంచా, గోండియాలో స్థావరాలు ఏర్పాటు చేసుకునేదాకా వెళ్లింది. అక్రమార్గంలో మహారాష్ట్రకు చేరిన తెలంగాణ సర్కారు బియ్యం అటు తిరిగి.. ఇటు తిరిగి.. మన రాష్ట్రంలోని కొన్ని రైస్‌మిల్లులకు చేరుకుంటున్న వైనం ఇది.
దళారుల ద్వారా స్మగ్లర్ల ద్వారా చేతులు మారుతూ రాష్ట్ర సరిహద్దులు దాటి మహారాష్ట్రలోని సిరోంచా, గొండియా మిల్లులకు చేరుకున్న పీడీఎస్ బియ్యం అక్కడ రాష్ట్ర సర్కారుకు లెవీ కింద కొంత బియ్యం పెట్టి మిగతా బియ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలోని మిల్లులకు అక్రమంగా తరలిస్తున్నారు.
ఎందుకిలా?
రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్లు, సింగిల్ విండో, మార్కెట్ కమిటీ ద్వారా సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద మిల్లులుకు అప్పగి స్తుంది. వారు ఆ ధాన్యాన్ని మర ఆడించి ప్రతీ క్వింటాకు రా రైస్ అయితే 67 కిలోలు, బాయిల్డ్ రైస్ అయితే 68 కిలోల చొప్పున ఎఫ్‌సీఐకి పంపుతారు. ఇక్కడే కొందరు రైస్‌మిల్లర్లు తమ చేతివాటం చూపుతున్నారు.
ప్రభుత్వం అప్పగించిన ధాన్యంలో కొంతభాగం ఇతర రాష్ట్రాలకు అంటే కనీస మద్దతు ధర అధికంగా ఉన్న రాష్ట్రాలకు తరలించి అక్కడ విక్రయిస్తారు. ఈలోపు ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన బియ్యంలో అక్రమమార్గంలో సేకరించిన పీడీఎస్ బి య్యాన్ని కలుపుతున్నారు. ఇదంతా తెలిసిన విషయమే. కానీ.. ఈ బియ్యాన్ని తొలుత మహారాష్ట్రకు తరలించి అక్కడ సీజ్ చేసిన బియ్యంగా రశీదులు సృష్టించి తిరిగి తెలంగాణకే తరలిస్తున్నారు. ఇది ఈ దందాలో పూర్తిగా కొత్తకోణం. ఈ మొత్తం వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి.
నిబంధనల ప్రకారం చేయాల్సిన మిల్లులో ధాన్యాన్ని ఆడించాలి. కానీ.. రెడీమేడ్‌గా అక్రమ మార్గంలో సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని అందులో కలుపుతున్నారు. తద్వారా మిల్లులపై ఒత్తిడి లేకుండా కరెంటు, మ్యాన్ పవర్, రవాణా చార్జీలను ఆదా చేసుకుంటున్నారు. ఇందుకోసం దళారులను పెట్టి రూపాయి కిలో బియ్యం సేకరిస్తున్నారు. వీరు కొందరు యాచకులను చేరదీ స్తారు. వారితో ఇంటింటికీ తిరిగి పీడీఎస్ బియ్యాన్ని కిలో రూ.7 నుంచి రూ.9 చొప్పున సేకరిస్తారు.
వాటిని మధ్యవర్తులు, దళారుల నుంచి రూ.15లకు కొనుగోలు చేసి, మహారాష్ట్రలోని సిరోంచా, గోండియా రైస్‌మిల్లర్లకు రూ.25 విక్రయిస్తారు. మహారాష్ట్రలో దొడ్డుబియ్యానికి డిమాండ్ ఉండడంతో.. అక్కడి మిల్లర్లు ఈ బియ్యాన్ని మహారాష్ట్ర ప్రభుత్వానికి కిలో రూ.32 లేదా కొత్తగా ప్యాకింగ్ చేసి బహిరంగ మార్కెట్లో కిలో రూ.40కిపైగా విక్రయిస్తారు.
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో ఏక్‌రూపాయ్‌వాలా దందాను నడిపించేది ఒకే వ్యక్తి కావడం గమనార్హం. ఉమ్మడి ఆదిలా బాద్‌లోని అర్జునగుట్ట, ప్రాణహిత నదుల మీదుగా మహారాష్ట్రకు, లేదా మంథనిలోని కాళేశ్వరం ప్రాజెక్టు మీదుగా మహారాష్ట్రకు మరోరూటులో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఉన్న చెక్‌పోస్టులు, రెవెన్యూ, పోలీస్, ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు, పౌరసరఫరా ల శాఖలకు లక్షలాది చేతులు మారుతున్నాయి.
కరోనా విజృంభించడం, చెక్‌పోస్టుల వద్ద నిఘా తీవ్రం కావడంతో స్థానిక రైస్ స్మగ్లర్లు రూటుమార్చారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిపోయిన పీడీఎస్ బియ్యాన్ని మహారాష్ట్ర నుంచి తిరిగి రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. మహారాష్ట్రలో సీజ్ చేసిన బియ్యంగా చూపించేందుకు నకిలీ రశీదులు సృష్టిస్తున్నారు. సోమవారం రాత్రి మంథని మండలంలో పోలీసులు పట్టుకున్న పీడీఎస్ రైస్ వాహనాలే ఇందుకు నిదర్శనం.
మహారాష్ట్రలోని సిరోంచా, సరిహద్దు నుంచి వచ్చిన వీరి వాహనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి దాదాపు 70 కి.మీ. దూరం ప్రయాణించాయి. ఈ మధ్యలో వారిని ఎవరూ అడ్డుకోకపోవడం అనుమానాల కు తావిస్తోంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో యాచకుల నుంచి ఉన్నతా ధికారుల వరకు విస్తరించిన ఈ నెట్‌వర్క్‌కు కేంద్రం కరీంనగర్ కావడం గమనార్హం. కోట్లాది రూపాయల అక్రమ దందా చేస్తున్న ‘ఏక్‌రూపాయ్‌వాలా’ ఆటకట్టించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
మా దృష్టికి రాలేదు
‘ఏక్‌రూపాయ్‌వాలా’కు సంబంధించి మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. మా దృష్టికి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి దాడులు చేస్తున్నాం. ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
– సురేశ్‌రెడ్డి, డీఎస్‌వో, కరీంనగర్
ఎవరినీ వదలం..
రేషన్ బియ్యం సమాచారం వస్తే ఎవరినైనా ఎక్కడైనా పట్టుకుంటాం. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పట్టుకొని అదనపు కలెక్టర్ పేసిలో కేసులు నడుస్తున్నాయి. పట్టుకున్న బియ్యం ప్రభుత్వం నిర్ణయించిన ధరకు వేలం వేస్తాం.
– వెంకటేశ్, డీఎస్‌వో, పెద్దపల్లి
చదవండి: Ranga Reddy: బాలికను కిడ్నాప్ చేసి.. పెళ్లి చేసుకున్నాడు
Comments
Please login to add a commentAdd a comment