ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కరీంనగర్: ఉన్నవి రెండే పోస్టులు.. వచ్చినవి 87 దరఖాస్తులు.. ఇంకేముంది చేతివాటానికి దారి దొరికింది. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు బేరసారాలు నడుస్తున్నట్లు తెలిసింది. రూ.2 లక్షలిస్తే చాలు అర్హతలున్నా.. లేకున్నా.. ఉద్యోగ నియామకపత్రం ఇంటికి వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో జరిగిన కాంట్రాక్టు పోస్టుల భర్తీ ప్రక్రియలో ఆసుపత్రిలో పనిచేసే ఓ కీలక అధికారి చక్రం తిప్పి చేతివాటం ప్రదర్శించారు.
అదే అధికారి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియలోనూ తన చతురతను ప్రదర్శిస్తుండడంతో దరఖాస్తుదారులు ఆ అధికారి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికే రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అమ్మకం జరిగాయని పలువురు చర్చించుకుంటున్న నేపథ్యంలో... ఒక పోస్టును ఆసుపత్రిలోనే ఔట్‌సోర్సింగ్‌లో పనిచేసే వ్యక్తికి కట్టబెట్టేందుకు అధికారులు ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది.
డబ్బులు ముట్టజెప్పిన సదరు వ్యక్తి కూడా తనకు పోస్టు దక్కుతుందనే భరోసాతో ఉన్నట్లు తోటి దరఖాస్తుదారులు చెబుతున్నారు. ఖరారైన పోస్టు రూ.2 లక్షలు పలుకగా, మరో పోస్టుకు మాత్రం లాభసాటిగా బేరం కుదుర్చేందుకు డబ్బులు పెట్టే సత్తా ఉన్న అభ్యర్థిని వెతుకుతున్నట్లు తెలిసింది.
2 పోస్టులు.. 87 దరఖాస్తులు..
జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది మార్చి నెలలో నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు పోస్టులకు 87 మంది అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇదే అదనుగా కీలక అధికారి బేరసారాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. గతంలో జరిగిన కాంట్రాక్టు పోస్టులన్నీ సదరు అధికారి కనుసన్నల్లలోనే భర్తీ కావడంతో అతన్ని ప్రసన్నం చేసుకుంటే చాలు పోస్టు వచ్చినట్లేనని ప్రచారం బహిరంగంగా జరుగుతోంది.
అర్హుల ఎంపికతో నోటీసు...
దరఖాస్తుదారుల లిస్టు ప్రకారం అర్హులు, అనర్హుల లిస్టు తయారు చేసి ఈ నెల 14న అధికారులు ఆసుపత్రిలో నోటీసు బోర్డుపై అంటించారు. ఈనెల 17న సాయంత్రం 5 గంటల లోపు అభ్యంతరాలుంటే తెలపాలని, లేని పక్షంలో రెండు పోస్టులకు తుది నిర్ణయం తీసుకుంటామని ఆ నోటీసులో పేర్కొన్నారు.
ఎంఎల్‌టీ చేసిన వారు అనర్హులట..
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్‌టీ) పూర్తి చేసి పారా మెడికల్ బోర్డునుంచి సర్టిఫైడ్ అయిన వాళ్లని సైతం అనర్హులుగా ప్రకటించారు. పారామెడికల్ బోర్డు ఆక్ట్ నెం.38 ఆఫ్ 2006 ప్రకారం ఎంఎల్‌టీ చదివిన వారు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగాలకు అర్హులు. కానీ ఆసుపత్రిలో మాత్రం కొత్త నిబంధన పెట్టారని పలువురు ఎంఎల్‌టీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోస్టుల ఎంపికపై అభ్యంతరం...
ఎంఎల్‌టీ చదివిన వారిని అనర్హులుగా ప్రకటిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై శ్రీనాథ్ అనే దరఖాస్తుదారుడు అభ్యంతరం తెలుపుతూ లిఖిత పూర్వకంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు గురువారం లేఖను అందించారు. ఈ లేఖలో మరో వివాదాన్ని సైతం లేవనెత్తారు. నోటిఫికేషన్‌లో కరీంనగర్ జిల్లాకు చెందిన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఉన్నప్పటికీ, ఎంపిక నోటీసు వచ్చే సరికి జోనల్ స్థాయి నియామకం అని ఉండడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఎల్‌టీ చదివిన వారికి న్యాయం చేయాలని కోరారు.
నిబంధనల ప్రకారమే రిక్రూట్‌మెంట్..
ల్యాబ్ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ నిబంధనల ప్ర కారమే చేపట్టాం. డీఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ అర్హత ఉన్నవారిని మాత్రమే తీసుకుంటామని నోటిఫికేష న్‌లో స్పష్టం చేశాం. అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నాం.
– డాక్టర్ రత్నమాల, ఆసుపత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment