Rice smuggling
-
AP: బియ్యం అక్రమ రవాణా కేసుల విచారణకు సిట్
సాక్షి, విజయవాడ: బియ్యం అక్రమ రవాణా కేసుల విచారణకు సిట్ ఏర్పాటైంది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే, ‘సీజ్ ది షిప్’ ఎపిసోడ్‌పై విచారణను మాత్రం సిట్‌కి అప్పగించలేదు. గత నెల, ఈ నెలలో జరిగిన బియ్యం అక్రమ రవాణా అంశాలను సిట్ పరిధికి ప్రభుత్వం అప్పగించలేదు.స్టెల్లా, కెన్ స్టార్ షిప్‌లలో బియ్యం రవాణా అంశాన్ని సిట్‌కి అప్పగించని ప్రభుత్వం.. జూన్, జులైలో నమోదైన రేషన్ బియ్యం రవాణా కేసుల విచారణను మాత్రమే సిట్‌కి అప్పగించింది. 13 ఎఫ్ఐఆర్లు నమోదైన కేసులు సిట్‌కి అప్పగించింది. సిట్ జీవోలో ఎక్కడా కూడా సీజ్ ది షిప్ ఎపిసోడ్ ప్రస్తావన లేదు.ఇదీ చదవండి: ఓరి మీ యేశాలో!.. కాకినాడ పోర్టు కబ్జాకు బాబు, పవన్ ఎత్తులు -
‘ఏక్‌రూపాయ్‌వాలా కోడ్’.. రూ.కోట్ల దందా!
సాక్షి, కరీంనగర్: వాస్తవానికి ‘ఏక్‌రూపాయ్‌వాలా’ అనేది ఓ కోడ్. ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న బియ్యాన్ని తరలించే వ్యక్తులు చెక్‌పోస్టుల వద్ద వాడే పేరు ఏక్‌రూపాయ్‌వాలా.! అంటే రూపాయి కిలో బియ్యాన్ని అక్రమంగా సేకరించి, కొంచెం ప్రాసెస్ చేసి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించే దందాకు అక్రమార్కులు పెట్టుకున్న ముద్దుపేరు. ఉమ్మడి కరీంనగర్ కేంద్రంగా సాగుతున్న ‘ఏక్‌రూపాయ్‌వాలా’ నెట్వర్క్ రోజురోజుకూ విస్తరిస్తోంది. రాష్ట్ర సరిహద్దులు దాటి మహారాష్ట్రలోని సిరోంచా, గోండియాలో స్థావరాలు ఏర్పాటు చేసుకునేదాకా వెళ్లింది. అక్రమార్గంలో మహారాష్ట్రకు చేరిన తెలంగాణ సర్కారు బియ్యం అటు తిరిగి.. ఇటు తిరిగి.. మన రాష్ట్రంలోని కొన్ని రైస్‌మిల్లులకు చేరుకుంటున్న వైనం ఇది. దళారుల ద్వారా స్మగ్లర్ల ద్వారా చేతులు మారుతూ రాష్ట్ర సరిహద్దులు దాటి మహారాష్ట్రలోని సిరోంచా, గొండియా మిల్లులకు చేరుకున్న పీడీఎస్ బియ్యం అక్కడ రాష్ట్ర సర్కారుకు లెవీ కింద కొంత బియ్యం పెట్టి మిగతా బియ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలోని మిల్లులకు అక్రమంగా తరలిస్తున్నారు. ఎందుకిలా? రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్లు, సింగిల్ విండో, మార్కెట్ కమిటీ ద్వారా సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద మిల్లులుకు అప్పగి స్తుంది. వారు ఆ ధాన్యాన్ని మర ఆడించి ప్రతీ క్వింటాకు రా రైస్ అయితే 67 కిలోలు, బాయిల్డ్ రైస్ అయితే 68 కిలోల చొప్పున ఎఫ్‌సీఐకి పంపుతారు. ఇక్కడే కొందరు రైస్‌మిల్లర్లు తమ చేతివాటం చూపుతున్నారు. ప్రభుత్వం అప్పగించిన ధాన్యంలో కొంతభాగం ఇతర రాష్ట్రాలకు అంటే కనీస మద్దతు ధర అధికంగా ఉన్న రాష్ట్రాలకు తరలించి అక్కడ విక్రయిస్తారు. ఈలోపు ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన బియ్యంలో అక్రమమార్గంలో సేకరించిన పీడీఎస్ బి య్యాన్ని కలుపుతున్నారు. ఇదంతా తెలిసిన విషయమే. కానీ.. ఈ బియ్యాన్ని తొలుత మహారాష్ట్రకు తరలించి అక్కడ సీజ్ చేసిన బియ్యంగా రశీదులు సృష్టించి తిరిగి తెలంగాణకే తరలిస్తున్నారు. ఇది ఈ దందాలో పూర్తిగా కొత్తకోణం. ఈ మొత్తం వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. నిబంధనల ప్రకారం చేయాల్సిన మిల్లులో ధాన్యాన్ని ఆడించాలి. కానీ.. రెడీమేడ్‌గా అక్రమ మార్గంలో సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని అందులో కలుపుతున్నారు. తద్వారా మిల్లులపై ఒత్తిడి లేకుండా కరెంటు, మ్యాన్ పవర్, రవాణా చార్జీలను ఆదా చేసుకుంటున్నారు. ఇందుకోసం దళారులను పెట్టి రూపాయి కిలో బియ్యం సేకరిస్తున్నారు. వీరు కొందరు యాచకులను చేరదీ స్తారు. వారితో ఇంటింటికీ తిరిగి పీడీఎస్ బియ్యాన్ని కిలో రూ.7 నుంచి రూ.9 చొప్పున సేకరిస్తారు. వాటిని మధ్యవర్తులు, దళారుల నుంచి రూ.15లకు కొనుగోలు చేసి, మహారాష్ట్రలోని సిరోంచా, గోండియా రైస్‌మిల్లర్లకు రూ.25 విక్రయిస్తారు. మహారాష్ట్రలో దొడ్డుబియ్యానికి డిమాండ్ ఉండడంతో.. అక్కడి మిల్లర్లు ఈ బియ్యాన్ని మహారాష్ట్ర ప్రభుత్వానికి కిలో రూ.32 లేదా కొత్తగా ప్యాకింగ్ చేసి బహిరంగ మార్కెట్లో కిలో రూ.40కిపైగా విక్రయిస్తారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో ఏక్‌రూపాయ్‌వాలా దందాను నడిపించేది ఒకే వ్యక్తి కావడం గమనార్హం. ఉమ్మడి ఆదిలా బాద్‌లోని అర్జునగుట్ట, ప్రాణహిత నదుల మీదుగా మహారాష్ట్రకు, లేదా మంథనిలోని కాళేశ్వరం ప్రాజెక్టు మీదుగా మహారాష్ట్రకు మరోరూటులో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఉన్న చెక్‌పోస్టులు, రెవెన్యూ, పోలీస్, ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు, పౌరసరఫరా ల శాఖలకు లక్షలాది చేతులు మారుతున్నాయి. కరోనా విజృంభించడం, చెక్‌పోస్టుల వద్ద నిఘా తీవ్రం కావడంతో స్థానిక రైస్ స్మగ్లర్లు రూటుమార్చారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిపోయిన పీడీఎస్ బియ్యాన్ని మహారాష్ట్ర నుంచి తిరిగి రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. మహారాష్ట్రలో సీజ్ చేసిన బియ్యంగా చూపించేందుకు నకిలీ రశీదులు సృష్టిస్తున్నారు. సోమవారం రాత్రి మంథని మండలంలో పోలీసులు పట్టుకున్న పీడీఎస్ రైస్ వాహనాలే ఇందుకు నిదర్శనం. మహారాష్ట్రలోని సిరోంచా, సరిహద్దు నుంచి వచ్చిన వీరి వాహనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి దాదాపు 70 కి.మీ. దూరం ప్రయాణించాయి. ఈ మధ్యలో వారిని ఎవరూ అడ్డుకోకపోవడం అనుమానాల కు తావిస్తోంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో యాచకుల నుంచి ఉన్నతా ధికారుల వరకు విస్తరించిన ఈ నెట్‌వర్క్‌కు కేంద్రం కరీంనగర్ కావడం గమనార్హం. కోట్లాది రూపాయల అక్రమ దందా చేస్తున్న ‘ఏక్‌రూపాయ్‌వాలా’ ఆటకట్టించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మా దృష్టికి రాలేదు ‘ఏక్‌రూపాయ్‌వాలా’కు సంబంధించి మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. మా దృష్టికి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి దాడులు చేస్తున్నాం. ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – సురేశ్‌రెడ్డి, డీఎస్వో, కరీంనగర్ ఎవరినీ వదలం.. రేషన్ బియ్యం సమాచారం వస్తే ఎవరినైనా ఎక్కడైనా పట్టుకుంటాం. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పట్టుకొని అదనపు కలెక్టర్ పేసిలో కేసులు నడుస్తున్నాయి. పట్టుకున్న బియ్యం ప్రభుత్వం నిర్ణయించిన ధరకు వేలం వేస్తాం. – వెంకటేశ్, డీఎస్వో, పెద్దపల్లి చదవండి: Ranga Reddy: బాలికను కిడ్నాప్ చేసి.. పెళ్లి చేసుకున్నాడు -
తినే బియ్యం తాగుడికి
సాక్షి, ఒంగోలు సిటీ: తినే బియ్యం తాగుడికి. వింటుంటేనే ఎబ్బెట్టుగా లేదు. ఇప్పుడు జరుగుతున్న దందా ఇదే. పేదల కడుపు నింపడానికి ప్రభుత్వం రూపాయికే ఇస్తున్న సబ్సిడీ బియ్యం లిక్కర్ ఫ్యాక్టరీలకు తరలిపోతోంది. లిక్కర్ తయారీకి మొక్కజొన్న వాడుతున్నారు. దీని ధర మార్కెట్లో బాగా పెరిగిన నేపథ్యంలో ‘చౌక’ బియ్యాన్ని కొంటున్నారు. గోనె సంచులు మార్చి రవాణా చేస్తున్నారు. దళారులు దండిగా సంపాదిస్తున్నారు. ఈ దందా గురించి అధికారులకు తెలియదా అంటే..తెలుసనే జవాబు వస్తుంది. ఏ గల్లీలోని సామాన్యుడిని కదిలించినా కొందరు దళారులు రూపాయి బియ్యాన్ని కొంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ మాట అధికారుల చెవికెక్కదా మరీ. జిల్లాలో 9,90,501 తెల్లకార్డులు ఉన్నాయి. నెలనెలా 15,117.120 టన్నుల బియ్యం కార్డుదారులకు కిలో రూపాయి కింద పంపిణీ చేస్తున్నారు. మొత్తం 24 లక్షల యూనిట్లకు ఈ బియ్యం వినియోగమవుతున్నట్లుగా లెక్కలున్నాయి. ప్రభుత్వం నెలనెలా బియ్యం సబ్సిడీ కింద జిల్లాకు రూ.64 కోట్లు ఖర్చు పెడుతోంది. అన్ని ఖర్చులను కలుపుకొని ప్రభుత్వం కిలోకు రూ.34 లెక్కన ఖర్చుచేస్తోంది. ఇక వీటితో పాటు చక్కెర 518.895 టన్నులు, కందిపప్పు 1981.002 టన్నులు పంపిణీ చేస్తున్నారు. రాగులు, జొన్నలు సుమారు 4 వేల టన్నుల వరకు కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. వీటిలో రూపాయి బియ్యం పెద్ద ఎత్తున పక్కదారి పడుతోంది. విజిలెన్సు తనిఖీల్లో వెల్లడి విజిలెన్సు అధికారులకు వస్తున్న సమాచారంతో చేస్తున్న తనిఖీల్లోనే భారీగా బియ్యం అక్రమ రవాణా గుర్తించారు. ఆరు నెలల వ్యవధిలోనే జిల్లాలో విజిలెన్సు, పౌరసరఫరాల అధికారులు పట్టుకున్న కేసులు 128 వరకు ఉన్నాయి. ఇందులో విజిలెన్సు అధికారులు పట్టుకున్న బియ్యమే పెద్ద మొత్తంలో ఉన్నట్లుగా సమాచారం. జిల్లా నలుమూలల నుంచి అధికారులకు బియ్యం అక్రమ రవాణా, రూపాయి బియ్యం దందా గురించి సమాచారం ఇస్తున్నా కొందరు అధికారులు ఈ సమాచారాన్ని దళారులకు, కొందరు మిల్లర్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రజా పోలిసింగ్ వ్యవస్థ నిఘా పెరిగితే ఈ దందాకు అడ్డుకట్టపడేదని కొందరు అధికారులు వాపోతున్నారు. మచ్చుకు మాత్రమే కొన్ని కేసులను పట్టుకొని మిగిలిన బియ్యాన్ని జిల్లా హద్దు దాటించి లిక్కర్ ఫ్యాక్టరీ గుమ్మాలను ఎక్కిస్తున్నారన్న విమర్శలున్నాయి. ► 5వతేదీ ఎన్జీపాడు మండలం కళ్లగుంటలో విజిలెన్సు అధికారుల దాడిలో 1870 కిలోలు బియ్యం పట్టుబడింది. అదే రోజు నాగులుప్పలపాడులో 6,674 కిలోల బియ్యాన్ని పట్టుకున్నారు. ► 7వ తేదీ కొత్తపట్నంలో విజిలెన్స్ అధికారులు దాడి చేసి 3,300 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ► 3వ తేదీ పర్చూరులోని నూతలపాడు గ్రామం వద్ద బియ్యం అక్రమ రవాణా అడ్డుకొని 2,935 కిలోల బియ్యం పట్టుకున్నారు. ► 4వ తేదీ ఇంకొల్లు మండలం గంగవరం గ్రామంలో బియ్యాన్ని తరలిస్తుండగా విజిలెన్సు అధికారులు దాడి చేసి 2,200 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. ► 5వ తేదీ సంతనూతలపాడు చిలకచర్ల మార్గంలో 5,060 కిలోలు, అదే రోజు కనిగిరిలో 9,625 కిలోలు బియ్యాన్ని పట్టుకున్నారు. ► 3వ తేదీ ముండ్లమూరు మండలంలోని పోలవరం గ్రామంలో 8,357 కిలోలు పట్టుకున్నారు. ► 2వ తేదీ కనిగిరిలో దాడి చేసి 8,150 కిలోలు పట్టుకున్నారు. జిల్లాలో బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడలేదు. దళారులు చెలరేగిపోతున్నారు. వీరికి కొందరు మిల్లర్లు తోడయ్యారు. ఇప్పుడు కస్టమ్ మిల్లింగ్ కూడా లేకపోవడంతో మిల్లర్లు కొందరు మిల్లు ఆడించడానికి ఈ దొంగ బియ్యాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. ఎంచక్కా వీరికి కొందరు ఎన్ఫోర్సుమెంట్ అధికారులు అండదండలు ఇవ్వడంతో దుకాణాల నుంచి మిల్లులకు, అక్కడి నుంచి బాగా గిరాకీగా ఉన్న లిక్కర్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. నిఘా కళ్లుగప్పి పోతుందే అధికం జిల్లాలోని వివిధ మండల కేంద్రాల్లో పౌరసరఫరాల నిఘా అధికారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మందికి నెలవారీ మామూళ్లు అందుతున్నట్లుగా అభియోగాలు ఉన్నాయి. రూపాయి బియ్యాన్ని దందా చేస్తున్న దళారులకు వీరు కొమ్ము కాస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో ఎక్కడా నిఘా అంతగా లేదు. దుకాణాదారుల వద్దనే బియ్యం పక్కదారి వ్యవహారం మొదలవుతుంది. అందిన సమాచారం మేరకు కొందరు కార్డుదారుల నుంచి బియ్యాన్ని కిలో రూ.11కి కొనుగోలు చేస్తున్నట్లుగా సమాచారం. వీటిని కొన్న డీలర్లు కిలోకి రూ.5–రూ.6 లాభం చూసుకొని వీటిని రవాణా చేసే మిల్లర్లకు తోలుతున్నారు. మిల్లరు పాలిష్ పట్టించి వేరే గోనె సంచుల్లోకి ఎత్తి క్వింటా రూ.2,100– రూ.2,300 వరకు విక్రయిస్తున్నారు. ఈ దందా మొత్తం నెల మొదటి అర్ధ భాగంలోనే జరిగిపోతుంది. నెల చివరి వారంలో మిల్లర్లు దళారుల సహకారంతో ఈ పాలిష్ పట్టిన బియ్యాన్ని లిక్కర్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. ఈ తంతు నెలనెలా జరిగేదే. పౌరసరఫరాల అధికారుల్లో కొందరు అవినీతిపరుల అవతారమెత్తినందునే ప్రభుత్వ సబ్సిడీ మొత్తాలు రూ.కోట్లలోనే దుర్వినియోగం అవుతోంది. మొక్కజొన్న పెరిగినందునే.. లిక్కర్ తయారీదారులు మొక్కజొన్నను అధిక భాగం ఉపయోగిస్తున్నారు. జిల్లాలో మొక్కజొన్న ఉత్పత్తి బాగానే ఉంది. అయితే మొక్కజొన్న కన్నా సబ్సిడీ బియ్యం బాగా తక్కువ ధరలకు మార్కెట్లో లభిస్తుండడంతో వీటి కొనుగోళ్లకే ఆసక్తి చూపిస్తున్నారు. మొక్కజొన్న క్వింటా ధర రూ.2,600– రూ.2,800 వరకు పలుకుతుంది. అదే మిల్లర్లు సేకరించిన ఈ సబ్సిడీ బియ్యం క్వింటా రూ.2,100– రూ.2,300 లభిస్తోంది. క్వింటాకు రూ.500 ధరల్లో తేడా ఉండంతో లిక్కర్ ఉత్పత్తికి అయ్యే వ్యయంతో కాస్త ఖర్చు తగ్గుతోంది. దీంతో లిక్కర్ ఫ్యాక్టరీల వారు మిల్లర్లు నుంచి వస్తున్న బియ్యాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు కాకినాడ పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు పాలిషింగ్ బియ్యం వెళ్లేది. ఇప్పుడు లిక్కర్ తయారీ దారులు బియ్యాన్ని స్థానిక మార్కెట్లోనే కొనుగోలు చేస్తున్నారు. దళారుల అవతారమెత్తిన మిల్లర్లు జిల్లాలోని కొందరు మిల్లర్లు దళారుల అవతారమెత్తారు. ఇప్పుడు కస్టమ్ మిల్లింగ్ రైస్ లేదు. ఇంకా పంట రావడానికి కొద్ది నెలల సమయం ఉంది. ఈ లోగా మిల్లు ఆడించాలంటే ఈ తరహా దందాలు చేసే వారితో చేతులు కలపాలనుకున్నారు. బియ్యం దందాలో భాగస్వాములవుతున్నారు. జిల్లాలోని వివిధ కేంద్రాలలో దళారులు చౌక బియ్యాన్ని సేకరించి మిల్లులకు తరలించే చర్యలు తీసుకుంటున్నారు. ఈ దందా బహిరంగంగానే జరుగుతున్నా నిఘా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో అదీ విజిలెన్సు అధికారులు స్పందించి వెంటనే దాడులకు ఉపక్రమిస్తున్నారు. ప్రభుత్వం కార్డుదారులకు నాణ్యమైన బియ్యం ఇవ్వడానికి చర్యలు తీసుకుంటుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి నాణ్యమైన బియ్యం కార్డుదారులకు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో బియ్యం దొంగల పని పట్టకుంటే బంగారం లాంటి పథకాలను బొక్కేసే వీలుంది. బియ్యం అక్రమ రవాణా దందాను నిలుపుదల చేయడానికి అధికారులు పూనుకోవాలని ప్రజానీకం కోరుతోంది. -
డబుల్ దందా..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్–కర్ణాటక మధ్య జరుగుతున్న అక్రమ రవాణా గుట్టును విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు. నగరం నుంచి రేషన్ బియ్యాన్ని తీసుకెళుతున్న ఓ వ్యక్తి అక్కడి నుంచి పాలపొడిని పంపించేస్తున్నాడు. ఈ దందాలో సికింద్రాబాద్‌కు చెందిన భార్యభర్తలు అతడికి సహకరిస్తున్నారు. దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు ఆదివారం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, మూడు వాహనాలు సహా రూ.కోటి విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సూత్రధారుల కోసం గాలిస్తున్నారు. రెండో చోట్లా దళారులు.. తెలంగాణ సరిహద్దుల్లోని యాదగిరి జిల్లాలో గుర్మీత్కాల్ ప్రాంతానికి చెందిన మణికంఠ రాథోడ్‌కు అక్కడ ఓ రైస్‌మిల్లుతో పాటు కొన్ని డీసీఎంలు ఉన్నాయి. ఇతను హైదరాబాద్‌లో పలువురు దళారులను ఏర్పాటు చేసుకుని వారి సహకారంతో రేషన్ బియ్యాన్ని సమీకరించే వాడు. అనంతరం వాటిని నకిలీ వేబిల్లులతో తన వాహనాల్లోనే గుర్మీత్కాల్కు తరలిస్తాడు. అక్కడ తన రైస్ మిల్లులో ఈ బియ్యాన్ని రీ–సైకిల్ చేయ డం ద్వారా ప్యాకింగ్ మార్చి మార్కెట్‌కు తరలించేవాడు. ఇందుకుగాను అతను కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు పాల పొడిని పంపేవాడు. అక్కడి ప్రభుత్వం పిల్లలకు ఉచితంగా సరఫరా చేస్తున్న పాలపొడిని దళారుల ద్వారా సేకరించి సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ప్రేమల్ దమానీ, అతడి భార్య ద్వారా నగరానికి సరఫరా చేసేవాడు. కాటేదాన్‌లో నిలువ చేసి... నగరం నుంచి రేషన్ బియ్యం తీసుకెళ్లే మణికంఠకు చెందిన వాహనాల్లోనే ప్రేమల్ 25 కేజీల కెపాసిటీ ఉన్న బ్రౌన్ కలర్ సంచులను పంపేవాడు. అక్కడ సేకరించిన పాలపొడిని గుర్మీత్కాల్లోని తన రైస్‌మిల్లులో రీ–సైకిల్ చేస్తున్న మణికంఠ 25 కేజీల చొప్పున ఆయా సంచుల్లో ప్యాక్ చేస్తున్నాడు. దీనిపై ఎలాంటి పేర్లు, ఇతర వివరాలు ఉండవు. తవుడు తీసుకువస్తున్నట్లు నకిలీ వేబిల్లులు సృష్టించే అతను డీసీఎం వాహనాల్లో అడుగున పాలపొడి, పైన తవుడు సంచులు వేసి అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రేమల్కు సికింద్రాబాద్‌లో కార్యాలయం, కాటేదాన్ ప్రాంతంలో ఓ గోదాము ఉన్నాయి. తొలుత ఆ గోదాముకు ఈ పాలపొడిని తీసుకువచ్చే వీరు అక్కడ బ్రాండెడ్పేర్లతో ఉన్న 25 కేజీల బ్యాగ్‌లలోకి మారుస్తున్నారు. ఫ్యాక్టరీలకు విక్రయం... సికింద్రాబాద్‌లో తన భార్యతో కలిసి కార్యాలయం నిర్వహిస్తున్న ప్రేమల్ ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్ల ఆధారంగా పాలపొడి సరఫరా చేస్తున్నాడు. ప్రధానంగా చాక్లెట్, బిస్కెట్, ఐస్‌క్రీమ్ కంపెనీలకు 25 కేజీలు రూ.10 వేల చొప్పున అమ్ముతున్నాడు. దాదాపు ఐదేళ్లుగా యథేచ్ఛగా సాగుతున్న ఈ దందాపై విజిలెన్స్ విభాగానికి సమాచారం అందడంతో అదనపు ఎస్పీ ముత్యంరెడ్డి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్లు పి.రాజు, ఆర్.చంద్రమౌళి సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో నిఘా ఉంచిన వీరు ఆదివారం పాల పొడిప్యాకెట్లతో వచ్చిన డీసీఎం, మూడు ఆటోలు స్వాధీనం చేసుకుని డ్రైవర్లను అరెస్టు చేశారు. వీరిచ్చిన సమాచారంతో కాటేదాన్‌లోని గోదాముపై దాడి చేశారు. మొత్తమ్మీద రూ.కోటి విలువైన పాలపొడి స్వాధీనం చేసుకుని కేసును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న మణికంఠ, ప్రేమల్ తదితరుల కోసం గాలిస్తున్నారు. ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిందని అధికారులు పేర్కొన్నారు. -
బియ్యం అక్రమ రవాణా నిత్యకృత్యం
చౌటుప్పల్ :ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా బియ్యాన్ని రవాణా చేయడం వ్యాపారులకు నిత్యాకృత్యంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్ల అక్రమ వ్యాపారుల పంట పండుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బియ్యాన్ని తరలించాలంటే అనుమతులు పొందాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి వాహనంలో లోడు విలువను బట్టి ఐదు శాతం ట్యాక్స్ చెల్లించాలి. కానీ ట్యాక్స్ చెల్లించేందుకు అధికారులు సిద్ధపడట్లేదు. తప్పనిసరిగా ట్యాక్స్ చెల్లించాల్సి వస్తే.. తిమ్మినిబమ్మిని చేసి నామమ్రాతంగా చెల్లించి అక్కడి నుంచి జారుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో ట్యాక్స్ చెల్లించిన దానికంటే రెండింతలు ఎక్కువగా లోడును తీసుకెళ్తారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం చూసీచూడనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఎప్పుడోఒకప్పుడు నామమాత్రపు దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. తాజాగా నాలుగు డీసీఎంల బియ్యం పట్టివేత ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నాలుగు డీసీఎం వాహనాల్లో తరలుతున్న బీపీటీ బియ్యంతోపాటు ఇసుకను తీసుకెళ్తున్న మరో డీసీఎంను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి వద్ద జాతీయ రహదారిపై జీఎమ్మార్ టోల్‌ప్లాజా వద్ద విజిలెన్స్ సీఐ రాజు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్రమంగా తరలుతున్న బియ్యం, ఇసుక డీసీఎం వాహనాలను గుర్తించా రు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నుంచి హైదరాబాద్‌కు తరలుతున్న ఒక డీసీఎంతో పాటు అదే జిల్లా మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న రెండు డీసీఎంలు, అలా గే గరిడేపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న మరో డీసీఎంను పట్టుకున్నారు. ఇవేకాక, నకిరేకల్ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఇసుక డీసీఎం పట్టుబడింది. సరుకుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వాహనాలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ కేసుకు సంబంధిచిన సమాచారాన్ని సంబంధిత శాఖల అధికారూలకు అందించామని విజిలెన్స్ సీఐ రాజు తెలిపారు. ఆయా శాఖల అధ్వర్యంలోనే కేసులు నమోదు చేస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా నాలుగు డీసీఎంలలో ఎన్ని క్వింటాళ్ల బియ్యం ఉన్నాయన్న విషయాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. -
స్మగ్లింగ్ గుట్టు.. విభేదాలతో రట్టు
– పక్కా సమాచారంతో అధికారులకు ఫిర్యాదులు – భారీ స్థాయిలో పట్టుబడుతున్న రేషన్ బియ్యం – శాంతిభద్రతల సమస్యగా మారే పరిస్థితులు – నివురుగప్పిన నిప్పులా స్పర్థలు స్మగర్ల మధ్య విభేదాలు రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టు రట్టు అవుతోంది. అధికారుల మధ్య సమన్వయలోపాన్ని..నిర్లక్ష్యాన్ని, పోలీస్, విజిలెన్స్ నిఘా కొరవడాన్ని ఆసరాగా చేసుకుని తమిళ, ఆంధ్ర రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి స్మగ్లర్లు రూ.కోట్లు గడించారు. తాజా పరిణామాలు ఇందుకు భిన్నంగా మారాయి. స్మగ్లర్ల మధ్య విభేదాల నేపథ్యంలో బియ్యం అక్రమ రవాణా, నిల్వలపై ఏకంగా విజిలెన్స్, సివిల్ ఎస్పీలకు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు ఫోన్‌చేసి ఉప్పందిస్తున్నారు. కింది స్థాయి అధికారులకు చెబితే వ్యవహారం మారిపోతుందని భావించి ప్రతీకారేచ్ఛలకు పాల్పడుతున్నారు. తడ : జిల్లా, తమిళ రాష్ట్రం సరిహద్దు మండలాల్లో కొన్నేళ్లుగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ గుట్టుగా సాగుతుంది. రేషన్ స్మగ్లర్ల మధ్య తలెత్తిన విభేదాలు తారా స్థాయికి చేరుకోవడంతో బియ్యం అక్రమ రవాణా బట్టబయలవుతుంది. ఇప్పటికే ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ 9 లారీల బియ్యం వివిధ ప్రాంతాల్లో అధికారులకు పట్టించారు. స్థానిక అధికారులకు సమాచారం ఇస్తే వెంటనే స్మగ్లర్లకు సమాచారం చేరవేసి ఉత్తుత్తి దాడులతో సరిపుచ్చే అవకాశం ఉండటంతో నేరుగా ఎస్పీలు, కలెక్టర్లకు ఫోన్లు చేసి మరీ ఒకరి లారీలు మరొకరు పట్టించుకుంటున్నారు. వాహనాల నంబర్లు, ఎప్పుడు, ఎక్కడ వస్తున్నది, ఏఏ ఇంట్లో బియ్యం నిల్వలు ఉన్నాయి వంటి విషయాలన్ని పక్కాగా సమాచారం అందిస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో తప్పని సరి పరిస్థితుల్లో దాడులు చేసి పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. గతంలోనూ.. గతంలో ఇంతకంటే ఎక్కువ స్థాయిలో స్మగ్లింగ్ జరిగేది. అప్పట్లోనూ ఇదే తరహాలో స్మగ్లర్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుని పట్టించారు. దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి దిగారు. ఈ క్రమంలో తమిళనాడు పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసులు నమోదు చేశారు. స్మగ్లర్లను అదుపులోకి తీసుకునేందుకు తమిళ పోలీసులు ప్రయత్నించిన సందర్భంలో స్మగ్లర్లు తమకు అనుకూలమైన వ్యక్తులతో తడ పోలీస్‌స్టేషన్ వద్దే తమిళ పోలీసులపై రాళ్లతో దాడులు చేసేందుకు కూడా వెనుకాడలేదు. దీంతో తమిళ పోలీసులు తీవ్రంగా పరిగణించి స్మగ్లర్లపై పీడీ యాక్ట్ పెట్టేలా సమాయత్తం కావడంతో ఈ వ్యాపారులు కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం గత పరిస్థితులు ఉత్పన్నమవుతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వాటాలాపై స్పర్థలే కారణం కొంత కాలం వెనుకడుగు వేసిన స్మగ్లర్లు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు అవకాశం ఉన్న వ్యాపారాన్ని వదులుకునేందుకు ఇష్టపడక తిరిగి వ్యాపారాన్ని మొదలు పెట్టారు. గతంలో చక్రం తిప్పిన వారు కొద్ది మంది మాత్రమే ప్రస్తుత వ్యాపార ంలో ఉండగా కొత్త వారు అధిక మంది ఉన్నారు. వ్యాపారం పెరిగే కొద్దీ శత్రువులు పెరిగారు. కొందరు ఇందులో వాటాల కోసం కోరగా స్మగ్లర్లు నిరాకరించడంతో వివాదాలు మొదలయ్యాయి. స్మగ్లింగ్ ఇలా.. ఈ వ్యాపారంలో వాటంబేడుకు చెందిన వ్యక్తులు ఆరితేరిన స్మగ్లర్లుగా పేరు తెచ్చుకున్నారు. పడవల ద్వారా రేషన్‌డీలర్ నుంచి గోతాలు సైతం సీల్ తీయకుండా బియ్యం బస్తాలు వాటంబేడు, తడ, పూడి, ఖాశింగాడు కుప్పం తదితర రేవులకు చేరుస్తారు. తడ, పూడికుప్పం, సెల్వకుప్పం గ్రామాల్లో చిల్లరగా బియ్యం కొనుగోలు చేసి సేకరించిన బియ్యాన్ని నిల్వ చేస్తారు. రాత్రి సమయంలో లారీకి లోడింగ్ చేసి తరలిస్తూ ఉంటారు. తమిళనాడులో ఉచితంగా ఇచ్చే ఈ ఉప్పుడు బియ్యం అక్కడ సేకరించేవారు రూ.5 నుంచి రూ.7 వరకు కొనుగోలు చేస్తారు. అక్కడి నుంచి దళారుల వద్దకు రూ.10 నుంచి రూ.12లకు విక్రయిస్తున్నారు. దారి పొడవునా ఉన్న అడ్డంకులను డబ్బుతో తొలగించుకుంటూ స్మగ్లర్లు ఈ బియ్యాన్ని గమ్యస్థానం చేర్చడం ద్వారా కిలో రూ.24లకు విక్రయిస్తారు. ఎన్ని ఖర్చులు పోయినా ఒక్కో లోడుపై భారీగా ఆదాయం మిగులుతూ ఉండటంతో స్మగ్లర్లు ఈ వ్యాపారం ద్వారా లక్షాధికారులు అవుతున్నారు. సూళ్లూరుపేటలోని ఒకరిద్దరు బియ్యం వ్యాపారులు దళారులుగా రేషన్‌బియ్యం కొనుగోలు చేస్తూ కోట్లకు పడగలెత్తడం చూస్తే ఇందులో ఉన్న ఆదాయం ఎంతో ఇట్టే అర్థం అవుతుంది. -
అక్రమాల అడ్డుకట్టకు చట్ట సవరణ
• బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం • దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ • పౌరసరఫరాల శాఖ సమీక్షలో మంత్రి ఈటల రాజేందర్ సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖలో అక్ర మాలకు అడ్డుకట్ట వేయడానికి చట్ట సవరణ చేస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పేదవాడికి అందాల్సిన ఫలాలు పక్కదారి పట్టకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, గత రెండేళ్లుగా పౌర సరఫరాల శాఖను దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బుధవారం ఇక్కడ ఆయన, ఆ శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్, జాయింట్ కలెక్టర్లు, డీఎస్వోలు, డీఎంలతోపాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. చట్టసవరణ కోసం వెంటనే ఒక కమిటీని వేయాలని కమిషనర్‌కు సూచించారు. ఈ ఖరీఫ్‌లో కనీసం 25 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని, ప్రతి రైతుకు కనీస మద్దతుధర లభించేలా చూడాలని, ఆన్లైన్ విధానం లోనే డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రూ.1,075 కోట్లతో చేపట్టిన కొత్త గోదాముల నిర్మాణం 70% పూర్తయ్యిందని, ఈ సీజన్లోనే అవి అందుబాటులోకి వస్తాయన్నారు. దీపం పథకం కింద 20 లక్షల గ్యాస్ కనెక్షన్ల మంజూరు లక్ష్యం కాగా, 8 లక్షల మందికే ఇవ్వడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల విభజన పూర్తి చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ-పాస్ విధానం వల్ల 25 శాతం అక్రమ రవాణకు అడ్డుకట్ట పడడడంతో, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రూ.203 కోట్ల బకాయిల వసూలు: సీవీ ఆనంద్ కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద మిల్లర్ల దగ్గర పెండింగ్‌లో ఉన్న రూ.482 కోట్ల విలువైన బియ్యం నిల్వలకు ఇప్పటివరకు రూ.203 కోట్ల మేర బకాయిలను రాబట్టామని కమిషనర్ సి.వి.ఆనంద్ మంత్రికి వివరించారు. ఈ నెల 30లోగా పూర్తిస్థాయిలో సీఎంఆర్ బకాయిలను మిల్లర్ల నుంచి రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. గోదాముల నుంచి రేషన్ షాపులకు బియ్యం తీసుకెళ్లే వాహనాలు దారిమళ్లితే ఆ సమాచారం ఎస్ఎంఎస్ రూపంలో అందేలా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. రైతుల దగ్గర కొన్ని ధాన్యానికి 4 రోజుల్లో చెల్లింపులు పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. -
ఆగని బియ్యం స్మగ్లింగ్
సాక్షి టాస్క్‌ఫోర్స్ : తడ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని తడకండ్రిగ పంచాయతీ మదీనా కుప్పం కేంద్రంగా బియ్యం స్మగ్లింగ్ జరుగుతోంది. పోలీసులు నెల మామూళ్లకు అలవాటుపడి ఏనాడూ అటువైపు తొంగి చూసిన దాఖలాల్లేవని స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టపగలే తమిళనాడు నుంచి ఉప్పుడు బియ్యం మండలంలో మదీనాకుప్పం, పూడికుప్పానికి చేరుతున్నాయి. జిల్లా లో వివిధ రేషన్‌షాపుల్లో ఇచ్చే బియ్యం కూడా ఇక్కడికే చేరుతున్నాయి. మదీనా కుప్పంలో ఒకరిద్దరు మత్స్యకారులు ఈ వ్యాపారంలో ఆరితేరిపోయారు. ఇళ్లల్లోనే లోడ్లకు లోడ్లు బియ్యం స్టాక్ చేసి రాత్రి వేళల్లో లారీలకు ఎత్తి పోలీస్‌స్టేషన్ వెనుక వైపు రోడ్డు మీద నుంచి నేషనల్ హైవే ఎక్కి నెల్లూరుకు దర్జాగా తరలిస్తున్నారు. నెల్లూరులోని కొన్ని రైస్‌మిల్లర్లు ఈ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రతి రోజు రాత్రి వేళల్లోనే బియ్యం లోడ్‌చేసి లారీ రోడ్డు ఎక్కే వరకు అడుగడుగునా స్మగ్లర్లు నిఘా పెట్టి దాటించేస్తున్నారు. అయితే ఇదంతా పోలీసుల సహకారంతోనే జరుగుతుందనే ఆరోపణలున్నాయి. సూళ్లూరుపేట, తడ మండలం వాటంబేడుకు చెందిన కొంత మంది సిండికేట్‌గా ఏర్పడి ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. తడలో లారీ బయలు దేరిందంటే తడ నుంచి నాయుడుపేట వరకు అన్ని స్టేషన్లకు మామూళ్లు కట్టుకుంటూ ఒక బ్యాచ్ వెళుతుంది. నాయుడుపేట తర్వాత ఎవరైనా లారీ ఆపితే రూ.10 వేల నుంచి రూ.20 వేలు ముట్టచెప్పి పోతున్నట్లు సమాచారం. బియ్యం అక్రమ వ్యాపారులు తడ, సూళ్లూరుపేట పోలీస్స్టేషన్లకు నెలకు రూ.3 లక్షల వరకు మామూళ్లు ముట్టజెప్పుతున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ వ్యాపారంలో రాజకీయ నాయకులు కూడా భాగస్తులుగా ఉండేవారంటే ఏ స్థాయిలో ఆదాయా లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఈ వ్యాపారం చేస్తున్న వారు రెండు వర్గాలుగా విడిపోయి లారీలు పట్టించడంతో కొం తకాలం ఆపేశారు. గడిచిన రెండేళ్లుగా మళ్లీ వ్యాపారులు కొంత మంది సిండికేట్‌గా ఏర్పడి తడ కేంద్రంగా ఈ వ్యాపారాన్ని పునః ప్రారంభించారు. తాజాగా మళ్లీ వీరి మధ్య విభేదాలు వచ్చాయి. బియ్యం లారీలు వెళుతున్న విషయాన్ని విజిలెన్స్ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఇటీవల వెంకటాచలం వద్ద ఒక లారీని పట్టుకున్నారు. వెంకటాచలంలోని ఓ రైసుమిల్లులో కూడా రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగిన వెంటనే నాయుడుపేటలో కూడా పోలీసులు ఒక లారీ ని పట్టుకున్నారు. పోలీసుల సాక్షిగా జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు విజిలెన్స్ అధికారులైనా రంగంలో దిగి పేదల నోటికాడ కూడు లాగేసుకుంటున్న ఈ అక్రమార్కులకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. -
బియ్యం మాఫియా!
జిల్లాలో బియ్యం మాఫియా విజృంభిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా అందించే చౌక బియ్యాన్ని దొడ్డిదారిన ఇక్కడకు దిగుమతి చేసుకుని పాలిష్ పట్టి అమ్ముతూ, కర్ణాటకకు ఎగుమతి చేస్తూ అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు. చెక్‌పోస్టులు, పోలీసులతో పాటు పలు ప్రభుత్వ శాఖలకు చెందిన కొందరు అధికారులకు మామూళ్లు సమర్పించి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. చిత్తూరు ప్రాంతానికి చెందిన ఓ అధికార పార్టీనేత బియ్యం అక్రమ రవాణాలో కీలక పాత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది. సాక్షి, చిత్తూరు: తమిళనాడులో పేదలకు ఒక్కో కుటుంబానికి 10 కిలోల మామూలు బియ్యం, 10 కిలోలు ఉప్పుడు బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఇక్కడి అక్రమార్కులు ఆ బియ్యాన్ని ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసి లారీల ద్వారా చిత్తూరుకు తరలిస్తున్నారు. దీంతోపాటు తమిళనాడులోని కాట్పాడి ప్రాంతం నుంచి బొమ్మసముద్రం మీదుగా ట్రైన్‌లోనూ చిత్తూరుకు చేరుస్తున్నారు. ఇక్కడికి చేరిన బియ్యాన్ని పాలిష్ పట్టి జిల్లాలో కొంత మేరకు విక్రయిస్తారు. మిగిలిన బియ్యాన్ని ప్రత్యేక లారీల ద్వారా కర్ణాటక రాష్ట్రంలోని బంగారుపేటకు తరలిస్తారు. అక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రమంతటా ఈ బియ్యాన్ని అమ్ముతున్నారు. తమిళనాడులో ఈ బియ్యం కిలో రూ.3 నుంచి రూ.4 కు మాత్రమే కొనుగోలు చేసి పాలిష్ పట్టి కిలో రూ.30 నుంచి రూ.40కి అమ్ముతున్నారు. రోజూ ఇలాంటి బియ్యం జిల్లా నుంచి కర్ణాటకకు 3 నుంచి 5 లారీల్లో తరలుతున్నట్టు సమాచారం. అధికారుల సహకారం.. బియ్యం అక్రమ రవాణాకు అటు తమిళనాడు అధికారులతో పాటు ఇటు చిత్తూరు జిల్లాకు చెందిన చెక్‌పోస్ట్, సివిల్‌పోలీసు, అటవీశాఖ, రెవెన్యూ, విజిలెన్స్, కమర్షియల్‌ట్యాక్స్ విభాగాలకు చెందిన కొందరు అధికారులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ అక్రమ బియ్యం వ్యాపారం చిత్తూరు కేంద్రంగానే సాగుతున్నట్టు సమాచారం. చిత్తూరు ప్రాంతానికి చెందిన ఓ అధికార పార్టీనేత మరికొందరితో కలిసి బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 12 సంవత్సరాలుగా ఆ నేత ఇదే వృత్తి సాగిస్తున్నాడు. పై స్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతోనే కింది స్థాయి అధికారులు, సిబ్బంది వీరికి సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 170 బస్తాల బియ్యం స్వాధీనం ఇటీవల కర్ణాటకకు తరలిస్తున్న 170 బస్తాల తమిళనాడు బియ్యాన్ని చిత్తూరు పోలీసులు పెనుమూరు క్రాస్‌వద్ద స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న ఎస్సార్‌పురం మండలం నెలవాయి గ్రామానికి చెందిన భాస్కర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు తాలూకా ఎస్సై ‘సాక్షి’కి తెలిపారు.