స్వాధీనం చేసుకున్న బియ్యం బస్తాలు ,మణికంఠ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్–కర్ణాటక మధ్య జరుగుతున్న అక్రమ రవాణా గుట్టును విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు. నగరం నుంచి రేషన్ బియ్యాన్ని తీసుకెళుతున్న ఓ వ్యక్తి అక్కడి నుంచి పాలపొడిని పంపించేస్తున్నాడు. ఈ దందాలో సికింద్రాబాద్‌కు చెందిన భార్యభర్తలు అతడికి సహకరిస్తున్నారు. దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు ఆదివారం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, మూడు వాహనాలు సహా రూ.కోటి విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సూత్రధారుల కోసం గాలిస్తున్నారు.
రెండో చోట్లా దళారులు..
తెలంగాణ సరిహద్దుల్లోని యాదగిరి జిల్లాలో గుర్మీత్‌కాల్ ప్రాంతానికి చెందిన మణికంఠ రాథోడ్‌కు అక్కడ ఓ రైస్‌మిల్లుతో పాటు కొన్ని డీసీఎంలు ఉన్నాయి. ఇతను హైదరాబాద్‌లో పలువురు దళారులను ఏర్పాటు చేసుకుని వారి సహకారంతో రేషన్ బియ్యాన్ని సమీకరించే వాడు. అనంతరం వాటిని నకిలీ వేబిల్లులతో తన వాహనాల్లోనే గుర్మీత్‌కాల్‌కు తరలిస్తాడు. అక్కడ తన రైస్ మిల్లులో ఈ బియ్యాన్ని రీ–సైకిల్ చేయ డం ద్వారా ప్యాకింగ్ మార్చి మార్కెట్‌కు తరలించేవాడు. ఇందుకుగాను అతను కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు పాల పొడిని పంపేవాడు. అక్కడి ప్రభుత్వం పిల్లలకు ఉచితంగా సరఫరా చేస్తున్న పాలపొడిని దళారుల ద్వారా సేకరించి సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ప్రేమల్ దమానీ, అతడి భార్య ద్వారా నగరానికి సరఫరా చేసేవాడు.
కాటేదాన్‌లో నిలువ చేసి...
నగరం నుంచి రేషన్ బియ్యం తీసుకెళ్లే మణికంఠకు చెందిన వాహనాల్లోనే ప్రేమల్ 25 కేజీల కెపాసిటీ ఉన్న బ్రౌన్ కలర్ సంచులను పంపేవాడు. అక్కడ సేకరించిన పాలపొడిని గుర్మీత్‌కాల్‌లోని తన రైస్‌మిల్లులో రీ–సైకిల్ చేస్తున్న మణికంఠ 25 కేజీల చొప్పున ఆయా సంచుల్లో ప్యాక్ చేస్తున్నాడు. దీనిపై ఎలాంటి పేర్లు, ఇతర వివరాలు ఉండవు. తవుడు తీసుకువస్తున్నట్లు నకిలీ వేబిల్లులు సృష్టించే అతను డీసీఎం వాహనాల్లో అడుగున పాలపొడి, పైన తవుడు సంచులు వేసి అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రేమల్‌కు సికింద్రాబాద్‌లో కార్యాలయం, కాటేదాన్ ప్రాంతంలో ఓ గోదాము ఉన్నాయి. తొలుత ఆ గోదాముకు ఈ పాలపొడిని తీసుకువచ్చే వీరు అక్కడ బ్రాండెడ్‌పేర్లతో ఉన్న 25 కేజీల బ్యాగ్‌లలోకి మారుస్తున్నారు.
ఫ్యాక్టరీలకు విక్రయం...
సికింద్రాబాద్‌లో తన భార్యతో కలిసి కార్యాలయం నిర్వహిస్తున్న ప్రేమల్ ఆన్‌లైన్‌లో వచ్చిన ఆర్డర్ల ఆధారంగా పాలపొడి సరఫరా చేస్తున్నాడు. ప్రధానంగా చాక్లెట్, బిస్కెట్, ఐస్‌క్రీమ్ కంపెనీలకు 25 కేజీలు రూ.10 వేల చొప్పున అమ్ముతున్నాడు. దాదాపు ఐదేళ్లుగా యథేచ్ఛగా సాగుతున్న ఈ దందాపై విజిలెన్స్ విభాగానికి సమాచారం అందడంతో అదనపు ఎస్పీ ముత్యంరెడ్డి ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్లు పి.రాజు, ఆర్.చంద్రమౌళి సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో నిఘా ఉంచిన వీరు ఆదివారం పాల పొడిప్యాకెట్లతో వచ్చిన డీసీఎం, మూడు ఆటోలు స్వాధీనం చేసుకుని డ్రైవర్లను అరెస్టు చేశారు. వీరిచ్చిన సమాచారంతో కాటేదాన్‌లోని గోదాముపై దాడి చేశారు. మొత్తమ్మీద రూ.కోటి విలువైన పాలపొడి స్వాధీనం చేసుకుని కేసును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న మణికంఠ, ప్రేమల్ తదితరుల కోసం గాలిస్తున్నారు. ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment