
బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో తమిళ పోలీసులు రాక
తమకు సమాచారం లేదని వారిని పట్టుకున్న ఆంధ్ర పోలీసులు
కుప్పంలో కలకలం రేపిన తమిళనాడు బియ్యం అక్రమ రవాణా
ఇందులో టీడీపీ నేత హస్తమున్నట్లు అనుమానం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కుప్పం మీదుగా కర్ణాటకకు తరలిస్తున్న తమిళనాడు బియ్యం అక్రమ రవాణా కలకలం రేపింది. దీనిని అరికట్టేందుకు తమిళనాడు పోలీసులు ఆంధ్ర వాహనాల వెంటపడ్డారు. దీంతో.. తమకు సమాచారం లేకుండా ఆంధ్ర ప్రాంతంలో దాడులు ఏమిటని ఏపీ పోలీసులు తమిళనాడు పోలీసులను నిలదీశారు. ఈ విషయం కుప్పం నియోజకవర్గంలో ఆదివారం చినికి చినికి గాలివానైంది. చివరికి.. ఏపీకి వచ్చిన తమిళనాడు పోలీసులను కుప్పం పోలీసుస్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టడం వివాదాస్పదమైంది. వివరాలివీ..
తమిళనాడు పోలీసులను పట్టుకున్న ఆంధ్ర పోలీసులు..
తమిళనాడు బియ్యాన్ని కుప్పం మీదుగా కర్ణాటకకు తరలించేందుకు శాంతిపురానికి చెందిన ఓ టీడీపీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు ప్రోత్సహిస్తున్నాడనే సమాచారం మేరకు తమిళనాడు పోలీసులు శనివారం రాత్రి నిఘా ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా శాంతిపురం మండలం, గెసికపల్లి మార్గంలో ఓ బియ్యం వాహనాన్ని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.
సమాచారం తెలుసుకున్న కుప్పం పోలీసులు తమిళనాడు పోలీసులను ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. కుప్పం సీఐ కార్యాలయానికి తమిళనాడు పోలీసులను తరలించారు. దీంతో తమిళనాడు పోలీసులు భారీగా తరలివచ్చి ఇదేమని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు కలుగజేసుకుని తమిళనాడు పోలీసులను విడిచిపెట్టారు. కాగా.. బియ్యం అక్రమ రవాణాలో హస్తమున్న ఓ ప్రధాన నాయకుడే ఆంధ్ర పోలీసులపై ఒత్తిడితెచ్చి తమిళ పోలీసులను అడ్డుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
టీడీపీ కూటమి నాయకుల తప్పుడు కార్యకలాపాలవల్లే ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య సమస్యలు తలెత్తినట్లయ్యింది. దీనిపై కుప్పం రూరల్ సీఐ మల్లేష్‌యాదవ్‌ను వివరణ కోరగా.. కుప్పం ప్రాంతంలో కొంతమంది వచ్చి దాడులు చేస్తున్నారన్న సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమన్నారు. తీరా విచారణ చేపట్టాక వారు తమిళనాడు పోలీసులని తేలిందని చెప్పారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని విడిచిపెట్టినట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment