Tamil Nadu police
-
‘అంబేద్కర్ చెప్పినదానికంటే నేనేం ఎక్కువ మాట్లాడలేదు’
చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు ఎప్పటికీ కట్టుబడి ఉంటానని తమిళనాడు నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. ఈ వ్యవహారంలో తమిళనాడు పోలీసులు వ్యవహరించిన తీరుపై మద్రాస్ హైకోర్టు మండిపడింది. ఉదయనిధితో పాటు పీకే శేఖర్ బాబుపై చర్యలు తీసుకోవడంలో పోలీస్ శాఖ తాత్సారం చేసిందంటూ న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పనిలో పనిగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను కోర్టు తప్పుబట్టింది. అయితే.. కోర్టులో ఇవాళ జరిగిన పరిణామాలపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. తాను న్యాయపరంగా ఈ అంశాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నానంటూ ప్రకటించారు. అంతేగానీ సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి మాత్రం తీసుకోబోనని స్పష్టం చేశారు. ‘‘నేనేం తప్పుగా మాట్లాడలేదు. మాట్లాడింది సరైందే కాబట్టి న్యాయపరంగా ఈ అంశాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. గతంలో నేను ఇచ్చిన ప్రకటనలో ఏమాత్రం మార్పు లేదు. నేను నమ్మే సిద్ధాంతాన్నే బయటకు చెప్పా. అలాగని రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ చెప్పినదానికంటే ఎక్కువ మాట్లాడలేదు. పెరియార్, తిరుమవలవన్‌లు ఏం చెప్పారో.. అంతకంటే కూడా నేను ఎక్కువ మాట్లాడలేదు. నేను ఎమ్మెల్యే అయినా, మంత్రిని అయినా, యువ విభాగపు నేతను అయినా.. రేపు పదవుల్లో లేకపోయినా ఫర్వాలేదు. కానీ, మనిషిగా ఉండడమే నాకు ముఖ్యం. నీట్ అంశం ఆరేళ్లనాటిది. కానీ, సనాతన ధర్మం వందల ఏళ్లనాటి అంశం. కాబట్టి, సనాతన ధర్మాన్ని ఎప్పటికీ మేం వ్యతిరేకిస్తూనే ఉంటాం అని స్టాలిన్ పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోలుస్తూ దానిని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. అది సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకమని నాటి ప్రసంగంలో పేర్కొన్నారాయన. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. డీఎంకేపై బీజేపీ అయితే తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇవాళ్టి కోర్టులో.. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల విషయంలో తమిళనాడు పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని.. చర్యలు తీసుకోలేని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. ఆపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘అధికారంలో ఉన్న ఓ వ్యక్తి మతాలు, కులాలు, సిద్ధాంతాల పేరిట అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం సరికాదు. బదులుగా అవినీతి, అంటరానితనం సామాజిక రుత్మతలనో లేదంటే ఆరోగ్యాన్ని పాడు చేసే మాదకద్రవ్యాలు, మత్తుపానీయాలనో నిర్మూలించాలని ప్రకటన చేయడం సరైందని ఈ న్యాయస్థానం అభిప్రాయపడుతుంది. విభజన ఆలోచనలను ప్రోత్సహించడానికి లేదంటే ఏదైనా భావజాలాన్ని రద్దు చేయడానికి ఏ వ్యక్తికి హక్కు ఉండదు. ఉదయనిధిపై చర్యలు తీసుకోకపోవడంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అని జస్టిస్ జీ జయచంద్రన్ వ్యాఖ్యానించారు. -
పోలీసులకు వీక్లీ ఆఫ్.. ఉత్తర్వులు జారీ
సాక్షి, చెన్నై: రాష్ట్ర పోలీసులకు వీక్లీ ఆఫ్ అమల్లోకి వచ్చింది. ఇందుకు తగ్గ ఉత్తర్వులు బుధవారం జారీ అయ్యాయి. రాష్ట్రంలో లక్ష మంది మేరకు పోలీసులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. పని ఒత్తిడితో కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో పోలీసులకు ఆయా జిల్లాల్లో వారంలో ఏదో ఒక రోజు సెలవుతో పాటు, వివాహ, బర్తడే రోజుల్లో అనధికారింగా సెలవు ఇచ్చేవారు. అయితే, ఇది ఆచరణలో విఫలం కాక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో పోలీసులకు వారంలో ఓ రోజు వీక్లీఆఫ్ అనివార్యంగా సీఎం స్టాలిన్ భావించారు. చదవండి: (మారియప్పన్‌కు సర్కారీ ఉద్యోగం: సీఎం స్టాలిన్) విధులను పక్కన పెట్టి వారంలో ఓ రోజుకు కుటుంబంతో గడిపేందుకు వీలుగా వీక్లీ ఆఫ్ అమలుకు సిద్ధం అయ్యారు. ఫస్ట్, సెకండ్ గ్రేడ్ పోలీసులు, హెడ్ కానిస్టేబుళ్లకు వారంలో ఓ రోజు వీక్లీ ఆఫ్ తీసుకునే అవకాశం కల్పించారు. సిఫ్ట్ పద్ధతిలో ఆయా స్టేషన్లలో సిబ్బంది వీక్లీ ఆఫ్ తీసుకోవచ్చు. దీనిపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐఎస్ఓ గుర్తింపు చెన్నై డీజీపీ కార్యాలయం ఆవరణలో ప్రజల సేవ నిమిత్తం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే ఫిర్యాదులు ఆయా జిల్లాలకు పంపించి, పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాదిలో 1.12 కోట్ల ఫిర్యాదులు రావడం, వాటికి పరిష్కారం చూపడం రికార్డుకు ఎక్కింది. బ్రిటీష్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ఈ కంట్రోల్ రూమ్‌కు ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను అందజేసింది. ఈ సర్టిఫికెట్‌ను బుధవారం సీఎం స్టాలిన్ చేతుల మీదుగా డీజీపీ శైలేంద్ర బాబు, హోం శాఖకార్యదర్శి ప్రభాకర్ అందుకున్నారు. -
రూ.2 వేల నోట్ల రద్దంటూ రూ.45 లక్షలు దోపిడీ
చిత్తూరు అర్బన్ (చిత్తూరు జిల్లా): ‘ఇదిగో బాబూ.. నా వద్ద పెద్ద మొత్తంలో బ్లాక్‌మనీ ఉంది.. అన్నీ రూ.2 వేల నోట్లే.. త్వరలో కేంద్ర ప్రభుత్వం వీటిని రద్దు చేస్తానంటోంది. నీకు తెలిసినవాళ్లు ఎవరైనా ఉంటే చెప్పు.. వాళ్లు రూ.500 నోట్లు రూ.90 లక్షలు ఇస్తే.. నేను రూ.2 వేల నోట్లు రూ.కోటి ఇస్తా.. నీకు 2 శాతం కమీషన్ అదనంగా ఇస్తా’.. అంటూ డీల్ కుదుర్చుకుని రూ.45 లక్షలు దోచుకెళ్లిన ఘటన చిత్తూరులో సంచలనం సృష్టించింది. ఈ ఘరానా మోసానికి సంబంధించి చిత్తూరు పోలీసులు గురువారం తమిళనాడుకు చెందిన ఆర్.నరేష్కుమార్ (29), అబీద్‌బాషా (37), డి.రమేష్ ప్రభాకర్ (54), వి.కె.కుమార వడివేలు (54), ఆర్.విజయానందన్ (45), జి.మురుగదాస్ (55), సి.జయపాల్ (27), ఎ.జగన్‌రాజ్ (25)లతోపాటు చిత్తూరులోని గుడిపాలకు చెందిన డి.శ్రీకాంత్‌రెడ్డి (45)ని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.32 లక్షల నగదు, రెండు తుపాకులు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో ఏఎస్పీ మహేష్, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ బాలయ్య ఈ ఘటన వివరాలను వెల్లడించారు. ఘరానా మోసం జరిగిందిలా.. కేరళకు చెందిన కె.వి.అశోకన్ చెన్నైలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నారు. వ్యాపారంలో భాగంగా ఆయనకు కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మహ్మద్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. కోయంబత్తూరుకు చెందిన షేక్ అబ్దుల్లా అనే వ్యక్తి తన పేరు సాయికృష్ణ అని మహ్మద్‌తో పరిచయం పెంచుకున్నాడు. తన వద్ద పెద్ద మొత్తంలో బ్లాక్‌మనీ ఉందని.. త్వరలో రూ.2 వేల నోట్లను రద్దు చేస్తారని.. వీటిని రూ.500 నోట్లుగా మార్పించి ఇస్తే 2 శాతం కమీషన్ ఇస్తానని మహ్మద్‌కు చెప్పాడు. దీంతో తనకు పరిచయం ఉన్న అశోకన్‌కు మహ్మద్ విషయం చెప్పగా.. రూ.45 లక్షలున్న రూ.500 నోట్లను తీసుకుని సాయికృష్ణ చెప్పినట్టు చిత్తూరు శివారులోని గంగాసాగరం వద్దకు వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడకు తమిళనాడు పోలీసు దుస్తుల్లో, వాహనాల్లో అక్కడకు చేరుకున్న సాయికృష్ణ అనుచరులు అశోకన్‌కు తుపాకులు చూపించి రూ.45 లక్షలు దోచుకున్నారు. దీంతో అశోకన్ చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ ఫుటేజీల సాయంతో 9 మంది నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు షేక్ అబ్దుల్లా అలియాస్ సాయికృష్ణ కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో మరో రూ.13 లక్షలు రికవరీ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. తమిళనాడు కృష్ణగిరిలో రూ.80 లక్షల లూటీ, చిత్తూరులోని యాదమరిలో రూ.10 లక్షల దోపిడీ కేసుల్లో సైతం నిందితుల హస్తం ఉందని పోలీసులు తెలిపారు. -
పోలీసులకు మ్యారేజ్ డే సెలవు
సాక్షి, చెన్నై: విల్లుపురం జిల్లా పోలీసులకు ప్రత్యేకంగా మ్యారేజ్ డే సెలవు మంజూరు కానుంది. బుధవారం ఎస్పీ రాధాకృష్ణన్ ఈ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో సుమారు లక్షన్నర మంది విధుల్ని నిర్వర్తిస్తున్నారు. ఇందులో లక్ష మంది మేరకు పోలీసులు ఉన్నారు. వీరికి సెలవులు దొరకడం అరుదే. ఈ కరోనా కాలంలో అయితే, రేయింబవళ్లు శ్రమించక తప్పడం లేదు. సెలవుల కరువు, పనిభారం వెరసి అనేక మంది పోలీసులు మానసిక వేదనకు గురవుతున్నట్టుగతంలో వెలుగు చూసింది. ఇందుకు తగ్గట్టుగానే పలువురు బలన్మరణాలకు సైతం పాల్పడ్డారు. దీంతో పోలీసుల్లో మానసిక వేదనను తగ్గించే రీతిలో అప్పుడుప్పుడు ప్రత్యేకంగా యోగా క్లాస్‌లను సైతం నిర్వహించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో విల్లుపురం ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రాధాకృష్ణన్, కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఇక, జిల్లా పరిధిలో ఉన్న పై స్థాయి అధికారి మొదలు, కింది స్థాయి పోలీసు వరకు వారి పెళ్లిరోజున సెలవు తీసుకునే అవకాశం కల్పించారు. జిల్లాల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది అందరూ తమ మ్యారెజ్ డే రోజు వివరాలను జిల్లా కేంద్రానికి సమర్పించాలని ఎస్పీ రాధాకృష్ణన్ ఆదేశించారు. ఆయా సిబ్బంది మ్యారేజ్ డే రోజున శుభాకాంక్షలతో కూడిన కార్డును పంపించడమే కాదు, ఆ రోజు సెలవు కేటాయిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ సంప్రదాయానికి శ్రీకారం చుడుతూ బుధవారం ఐదు మంది సిబ్బందికి శుభాకాంక్షలతో కూడిన కార్డు, సెలవు మంజూరు చేశారు. కుటుంబాలతో గడిపేందుకు పోలీసులకు సమయం అన్నది అరుదేనని, అందుకే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టామని, ఈ ఒక్క రోజైనా కుటుంబీకులతో ప్రతి పోలీసు ఆనందంగా గడపాలని కాంక్షిస్తున్నట్టు జిల్లా ఎస్పీ పేర్కొనడం విశేషం. -
మణివణ్ణన్.. పోలీస్ మన్మథుడు
సాక్షి, చెన్నై: ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చే అందమైన యువతుల నంబర్లు సేకరించి ప్రేమ పాఠాలు వళ్లిస్తూ వచ్చిన ఓ సీఐ మన్మథుడి లీల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విచారణలో ఒకటి కాదు, పదుల సంఖ్య మహిళలకు ఈ అధికారి వేధింపులు ఇచ్చి ఉండడంతో బలవంతంగా పదవీ విరమణకు ఆదేశాలు జారీ చేసి ఉండడం వెలుగు చూసింది. (ఎంక్వైరి పేరుతో మహిళకు అర్థరాత్రి ఫోన్) తిరుచ్చి జిల్లా మన్నచ్చనల్లూరు సిరువనూరు పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్గా మణివణ్ణన్ పనిచేస్తున్నారు. పలు స్టేషన్లలో పనిచేసి, ఇక్కడకు వచ్చిన మణివణ్ణన్, తానోమన్మ«థుడు అన్నట్టుగా వ్యవహరించే వారని సమాచారం. స్టేషన్‌కు అందమైన యువతులు, మహిళలు వస్తే చాలు తన గదిలోకి పిలిపించి మరీ వారి విన్నపాలు, ఫిర్యాదులు స్వీకరించే వారు. వారి ఫోన్ నంబర్లను సేకరించి రాత్రుల్లో విచారణ పేరిట మాటలు కలిపి, తర్వాత ప్రేమ పాఠాలు వల్లించే పనిలో పడ్డట్టున్నారు. ఓ యువతిని తన వైపునకు తిప్పుకునేందుకు మణివణ్ణన్ సాగించిన లీల అంతా ఇంతా కాదు. చివరకు ఫిర్యాదు ఇచ్చిన ఆ యువతికి వ్యతిరేకంగానే కేసు నమోదు చేయించేందుకు సిద్ధమయ్యారు. చివరకు విసిగి వేసారిన ఆ యువతి ఏకంగా డీఐజీ బాలకృష్ణన్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. తన వద్ద ఉన్న ఆడియోను సమర్పించారు. దీనిపై రహస్య విచారణ సాగగా, ఒక్క ఆయువతినే కాదు, అనేక మంది మహిళలు వద్ద, గతంలో తాను పనిచేసిన చోట్ల కూడా ఈ పోలీసు మన్మథుడు సాగించిన లీలలు ఒకటి తర్వాత మరకొటి వెలుగు చూశాయి. బలవంతంగా పదవీ విరమణ.. ఈ పోలీసు మన్మథుడి లీలలు ఆధారాలతో సహా బయట పడడంతో డీఐజీ బాలకృష్ణన్ కఠినంగానే వ్యవహరించారు. ఇతగాడు విధుల్లో కొనసాగిన పక్షంలో ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చే యువతులు, మహిళలకు భద్రత కరువు అవుతుందేమో అన్న ఆందోళనను పరిగణించినట్టున్నారు. ఇక, విధుల్లో మణివణ్ణన్ కొనసాగేందుకు వీలు లేదని ఆదేశిస్తూ, బలవంతంగా పదవీ విరమణ చేయించేందుకు తగ్గ చర్యలు చేపట్టారు. మణివణ్ణన్ పదవీ విరమణ చేయడానికి మరో ఆరేళ్లు సమయం ఉన్నా, ముందుగానే ఆయన చేత బలవంతంగా పదవీ విరమణ చేయించేందుకు సర్వం డీఐజీ సిద్ధం చేసినట్టున్నారు. దీంతో సెలవుపై చెక్కేసిన మణివణ్ణన్ తాజాగా మళ్లీ స్టేషన్లో ప్రత్యేక్షం అయ్యారు. ఇందుకు కారణం, డీఐజీ మార్పు జరగడమే. డీఐజీ మారడంతో తన ఉద్యోగానికి ఇక, డోకా లేదనుకున్న మణివణ్ణన్‌కు పెద్ద షాక్ తప్పలేదు. స్టేషన్‌కు వెళ్లిన ఆయనకు అక్కడి సిబ్బంది డీఐజీగా బాలకృష్ణన్ జారీ చేసి వెళ్లిన ఆదేశాల ఉత్తర్వులను మణివణ్ణన్ చేతిలో పెట్టడం గమనార్హం. -
ఇండియా ‘జార్జి ఫ్లాయిడ్’లు
చెన్నై: తమిళనాడు పోలీసుల రాక్షసత్వంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో తండ్రీకొడుకుల్ని హింసించి చంపడంపై జనం మండిపడుతున్నారు. వీరిని ఇండియన్ ‘జార్జ్ ఫ్లాయిడ్’లు అంటూ నెటిజన్లు సోషల్‌మీడియాలో వ్యాఖ్యాని స్తున్నారు. తమిళనాడులోని శాంతాకులం ప్రాంతానికి పి.జయరాజ్ (62) జూన్ 19న తన దుకాణాన్ని లాక్డౌన్ నిబంధనల ప్రకారం సాయంత్రం 7 గంటలకు మూసివేయకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తండ్రి గురించి కనుక్కోవడానికి వెళ్లిన జయరాజ్ కొడుకు బెనిక్స్‌నూ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి వారి బంధువులు 20న స్టేషన్‌కెళ్లారు. అప్పుడే వారిద్దరి నడుము భాగాల కింద తీవ్రంగా రక్తస్రావం అవుతుండడాన్ని గుర్తించారు. 21న వీరిద్దరూ రిమాండ్‌లోనే కన్నుమూశారు. ప్రైవేటు భాగాల్లోకి లాఠీలు దూర్చారు 19న రాత్రంతా పోలీసులు వీరిద్దరిని తీవ్రంగా హింసించారని ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు చెప్పారు. వారి ప్రైవేటు భాగాల్లోకి లాఠీలు దూర్చారని తెలిపారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకొని విచారించనున్నట్లు తమిళనాడు హైకోర్టు ప్రకటించింది. తమిళనాడు పోలీసుల అమానుషత్వాన్ని అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ ఉదంతంతో పోలుస్తూ గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ ట్వీట్ చేశారు. -
పోలీసులకు రూ.40 వేల జరిమానా
తమిళనాడు,టీ.నగర్: కట్టపంచాయితీ వ్యవహారానికి సంబంధించి ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్కు తలా రూ.40 వేల అపరాధం విధిస్తూ మానవ హక్కుల కమిషన్ సోమవారం ఉత్తర్వులిచ్చింది. ధర్మపురి జిల్లా పాలక్కోడు కరకదహల్లి గ్రామానికి చెందిన టి.శివషణ్ముగం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను న్యాయవాదిగా పనిచేస్తున్నానని, గత 2018లో ఒక సివిల్ వివాదంలో కొందరు కట్టపంచాయితీ జరిపి తనను, తన కుటుంబ సభ్యులపై మారణాయుధాలతో దాడి చేసినట్లు చెప్పారు. గాయపడిన తాము ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నట్లు వివరించారు. దీనిపై ఫిర్యాదు చేసినా సంబంధిత వ్యక్తులపై అప్పటి సీఐ సతీష్‌కుమార్, ఎస్ఐ చంద్రన్ కేసు నమోదు చేయలేదని వెల్లడించారు. కోర్టులో తప్పుడు సమాచారాన్ని అందజేసి నిందితులు బెయిలు పొందేందుకు సహకరించారని ఆరోపించారు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడు చిత్తరంజన్ మోహన్‌దాస్ సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది. పిటిషన్‌పై విచారణ జరిపిన ఆయన పోలీసులు ఇరువురూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలుపుతూ బాధితుడు శివషణ్ముగంకు రూ.40 వేలను రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఎనిమిది వారాల్లోగా అందజేసి, ఈ మొత్తాన్ని పోలీసు ఇన్స్పెక్టర్ సతీష్‌కుమార్, ఎస్ఐ చంద్రన్ల వద్ద వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వులిచ్చారు. అంతేకాకుండా వారిపై అడిషనల్ సెక్రటరీ క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిఫార్సులు చేశారు. -
పోలీసులకు లైంగిక ఎర
తమిళనాడు, టీ.నగర్: మదురైలో పోలీసులను వ్యభిచారానికి ఆహ్వానించిన మహిళ సహా నలుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మదురైలో కిడ్నాప్‌ల నిరోదక విభాగం పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు తిరుపతి. ఇతనికి గురువారం సెల్ఫోన్లో ఒక ఎస్ఎంఎస్ వచ్చింది. మహిళలతో జల్సాగా గడపాలనుకుంటే ఈ కింది నెంబర్‌కు సంప్రదించాలని అందులో పేర్కొన్నారు. ఈ నెంబర్ ఆధారంగా తిరుపతి అక్కడికి వెళ్లగా సుబ్రమణి అనే వ్యక్తి తనను పరిచయం చేసుకున్నాడు. అక్కడ బేరసారాలు జరిగిన తర్వాత తిరుపతి వద్ద అక్కడున్న ముఠా నగదు లాక్కుని ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. తర్వాత ఒక మహిళను అతనితో పాటు ఒక గదికి పంపారు. ఈ లోపున తిరుపతి మరుగుదొడ్డికి వెళ్లి వస్తానని చెప్పి, అక్కడి నుంచి పోలీసులకు సమాచారం తెలిపారు. దీంతో హుటాహుటిన అక్కడికి వచ్చిన పోలీసులు వ్యభిచారం జరుపుతున్న అయ్యనార్, శేఖర్, మనోజ్ కుమార్‌తో సహా నందిని అనే మహిళను అరెస్టు చేశారు. -
పోలీసులే మహిళతో..
సాక్షి ప్రతినిధి, చెన్నై: నేరస్థులను పోలీసులు పట్టుకుంటారు. పోలీసులే నేరస్థులుగా మారితే....లంచం సొమ్ము కోసం నేరాలు చేయిస్తే దిక్కెవరు. నామక్కల్ జిల్లాలో అదే జరిగింది. మహిళ చేత బలవంతంగా గంజాయి అమ్మించిన నేరంపై ఇద్దరు పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారి ఒకరు ఏసీబీ కేసుల్లో చిక్కుకున్నారు. నామక్కల్ జిల్లా తిరుచెంగోట్టైకి చెందిన కుమార్ (24) గంజాయి వ్యాపారం చేస్తున్న కారణంగా గతంలో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అతడి నుంచి 1,300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని గూండా చట్టం కింద కేసులు పెట్టారు. భర్తను జైలు నుంచి బెయిలుపై విడుదల చేసేందుకు సేలంలోని మత్తుపదార్థాల నిరోధక విభాగ డీఎస్పీ కుమార్‌ను జైల్లో ఉన్న కుమార్ భార్య రాణి కలుసుకున్నారు. ఇతని పరిధిలో సేలం, నామక్కల్, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాలు ఉన్నాయి. డీఎస్పీ కుమార్ 2014లో రాణిని కలుసుకుని గంజాయి అమ్మకాల ద్వారా నెలకు లక్ష రూపాయల చొప్పున లంచం ఇస్తేనే నీ భర్త బెయిలుపై విడుదలకు సహకరిస్తానని చెప్పాడు. అయితే అంతమొత్తం చెల్లించలేను, రూ. 25 వేలయితే సంపాదించగలనని చెప్పి గంజాయి అమ్మకాలు చేయసాగింది.. ఆ తర్వాత రాణి, ఆమెకు తెలిసిన మురుగన్ అనే వ్యక్తితో డీఎస్పీని పలు చోట్ల కలుసుకుంటూ అనేక వాయిదాల్లో సొమ్మును చెల్లిస్తూ వచ్చింది. ఒక సందర్భంలో ఆ మొత్తాన్ని సీపీ చక్రవర్తి అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలో వేయాలని డీఎస్పీ తెలిపాడు. ఆ సీపీ చక్రవర్త తంజావూరులో ప్రభుత్వ గణాంకాలు, ట్రెజరీలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. అతను డీఎస్పీకి సన్నిహితుడు. ఇదిలా ఉండగా 2017 నవంబర్‌లో మత్తుపదార్థాల నిరోధక విభాగం ఇన్స్పెక్టర్ శాంత అనే మహిళ రాణిని బెదిరించి డబ్బులు గుంజే ప్రయత్నం చేసింది. లంచం ఇవ్వకుంటే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బెదిరించింది. దీంతో భయపడిపోయిన రాణి ఇన్స్పెక్టర్ శాంతకు రూ.45 వేలను మురుగన్ ద్వారా పంపింది. లంచం ముట్టజెపుతున్నా నెలరోజుల తర్వాత రాణిని, మురుగన్‌ను గంజాయి కేసులో ఇన్స్పెక్టర్ శాంత అదుపులోకి తీసుకుంది. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. 2 లక్షలు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో రూ. 80 వేలు చెల్లించింది. మిగతా రూ. 1.20 లక్షలు త్వరలో చెల్లించాలని హెచ్చరించి వారిని పంపివేసింది. పోలీసుల వేధింపులు భరించలేని రాణి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి తలదాచుకుంది. అయినా కూడా రాణీని వదలని డీఎస్పీ కుమార్ సెల్‌ఫోన్ ద్వారా మిగిలిన సొమ్ము ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో విరక్తి చెందిన రాణి సేలంలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో డీఎస్పీ కుమార్, ఇన్స్పెక్టర్ శాంత, గణాంకాల అధికారి సీపీ చక్రవర్తిలపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. -
డుమ్మా కొడితే దొరికిపోతారమ్మా!
సాక్షి ప్రతినిధి, చెన్నై: గస్తీ పేరుతో షికార్లు కొట్టే పోలీసులకు ఇకకాలం చెల్లింది. గస్తీ తిరిగే పోలీసు వాహనాలను కదలికలను గుర్తించేందుకు మొబైల్ యాప్‌ను చెన్నై పోలీస్ ప్రవేశపెట్టింది. దీంతో గస్తీ పేరుతో విధులకు డుమ్మా కొట్టే పోలీసులకు కళ్లెం వేసామని, ఇలాంటి పనిదొంగ పోలీసులు మొబైల్ యాప్‌తో సులభంగా చిక్కిపోతారని ఉన్నతాధికారులు తెలిపారు. చెన్నై నగరం, శివార్లలోని 135 పోలీస్స్టేషన్ల పరిధిలో జనాభాశాతానికి అనుగుణంగా పోలీసులు గస్తీ తిరుగుతుంటారు. ఇందు కోసం ఇన్నోవా, జిప్సీ, బోలెరో తదితర 360 కార్లు, 403 ద్విచక్ర వాహనాలను వినియోగిస్తున్నారు. పోలీస్‌స్టేషన్ ఆఫీసర్లు తమ పరిధిలో ఇప్పటికే చోటుచేసుకున్న చైన్ స్నాచింగ్, దారిదోపిడీలు, ఇళ్లలో దొంగతనాలు, నేరస్థులు సులువుగా పారిపోయే ప్రాంతాల్లో తమకు కేటాయించిన వాహనాల్లో సంచరిస్తూ నేరాలను అరికట్టాల్సి ఉంది. ఇరుకైన ప్రాంతాల్లో గస్తీకి 250 సైకిళ్లను సైతం ప్రభుత్వం గతంలో కేటాయించింది. అయితే అవన్నీ పర్యవేక్షణ లోపం వల్ల పాత ఇనుప సామన్లకు వేసే స్థితికి చేరుకున్నాయి. గస్తీ తిరగాల్సిన పోలీసులు అధికారిక వాహనాలను మరుగైన ప్రదేశంలో పెట్టేసి సొంత పనులు చక్కబెట్టేందుకు వెళ్లిపోతున్నట్లు ఉన్నతాధికారులకు ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు అందాయి. మరికొందరు పోలీసులు సమీపంలోని కల్యాణ మండపాలకు చేరుకుని గురకలు పెడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మరికొందరైతే పరిసరాల్లో సినిమా హాళ్లలో కూర్చుని చక్కగా ఎంజాయి చేసేస్తున్నారు. గస్తీ పోలీసుల నిర్లక్ష్య వైఖరి దొంగలకు అనువుగా మారింది. దీంతో గస్తీ వాహనాలను మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షించాలని పోలీసుశాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ‘మొబైల్ డేటా టెర్మినల్ సిస్టమ్’ (ఎండీటీఎస్) అనే మొబైల్ యాప్‌ను సిద్ధ్దం చేశారు. తొలిదశగా చెన్నై పోలీసు పరిధిలో ప్రయోగాత్మకంగా 360 నాలుగు చక్రాల వాహనాలకు మొబైల్ యాప్ ను అమర్చారు. ఈ కొత్త విధానంపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, గస్తీ విధుల్లో ఉండే పోలీసులకు స్మార్ట్ ఫోన్లను అందజేశామని, వీరంతా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఎండీటీసీ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించాలని తెలిపారు. వారి మొబైల్ ఫోన్లను చెన్నై కమిషనర్ కార్యాలయంలోని కంట్రోలు రూముతో అనుసంధానం చేశాము. దీంతో గస్తీ విధులకు డుమ్మా కొట్టే పోలీసులు సులభంగా దొరికిపోతారు. చార్జింగ్ పెట్టడం మరిచిపోయామని తప్పించుకునే వీలులేకుండా వారికి కేటాయించిన వాహనాల్లో మొబైల్ చార్జింగ్ వసతిని కూడా కల్పించాం. మొబైల్ వినియోగంలో ఉందని పేర్కొంటూ తమ సెల్‌ఫోన్ ద్వారా ఫొటో తీసుకుని ప్రత్యేకంగా రూపొందించిన వాట్సాప్ గ్రూప్‌లో పోస్టింగ్ పెట్టాలి. గస్తీ పోలీసులు సరిగా విధులు నిర్వర్తిస్తున్నారా అని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఇన్స్పెక్టర్లను నియమించాం. మొబైల్ యాప్ పోలీసు కమిషనర్ కార్యాలయం నుంచే తగిన ఆదేశాలు జారీచేస్తూ అవసరమైన సహాయం కోసం సమీపంలోని గస్తీ వాహనాలను ఆయా ప్రదేశాలకు పంపే వీలుకలుగుతుందని ఆయన తెలిపారు. -
కమల్ హాసన్‌పై కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, చెన్నై: సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడులో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతుండగా అరవకురిచ్చిలో ఈనెల 12న కమల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ‘గాంధీ విగ్రహం ముందు నిలుచుని చెబుతున్నా స్వాతంత్య్ర భారతావనిలో తొలి తీవ్రవాది ఒక హిందువు. అతని పేరు నాథూరాం గాడ్సే’ అని పేర్కొన్నారు. దీంతో ఆయనపై మత విశ్వాసాలను రెచ్చగొట్టినందుకు, విద్వేషాలను ప్రేరేపించినందుకు సెక్షన్లు 153ఏ, 295ఏ కింద కేసులు నమోదు చేసినట్లు కరూర్ జిల్లా పోలీసులు తెలిపారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్‌లో ‘హిందూ మున్నాని’ నేతలు కమల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ పరిణామంతో పోలీసులు చెన్నై ఆళ్వార్‌పేట, ఈసీఆర్ రోడ్డులోని కమల్ నివాసాలు, పార్టీ కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన ఎంఎన్ఎం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కమల్‌పై నిషేధం విధించాలంటూ బీజేపీ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్ ఢిల్లీ హైకోర్టులో మంగళవారం పిల్ దాఖలు చేశారు. కాగా, కమల్ వ్యాఖ్యలను బీజేపీ, ఏఐఏడీఎంకే ఖండించగా, కాంగ్రెస్, డీఎంకే సమర్థించాయి. -
తుపాకీతో కాల్చుకున్న కానిస్టేబుల్
సాక్షి, చెన్నై: న్యాయమూర్తి ఇంటి వద్ద భద్రతా విధుల్లో ఉన్న తమిళనాడు సిరప్పు కావల్ పడై ( ప్రత్యేక పోలీసు విభాగం) కానిస్టేబుల్ బుధవారం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తాను మరణిస్తే, యూనిఫాం సహా అంత్యక్రియలు నిర్వహించాలని ఓ లేఖను రాసి పెట్టి మరీ ఆ కానిస్టేబుల్ కాల్చుకున్నాడు. గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో పోలీసుల బలవన్మరణాలు కలకలం రేపిన విషయం తెలిసిందే. సెలవుల కరువు, పని భారం, మానసిక ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు అంటూ ఆత్మహత్యలకు పాల్పడే వారు కొందరు అయితే, రాజీనామాలు సమర్పించి గుడ్ బై చెప్పిన వాళ్లు మరెందరో. తమపై విమర్శలు పెరగడంతో చివరకు పోలీసుల్లో నెలకొన్న మానసిక ఒత్తిడి తగ్గించేందుకు తగ్గట్టుగా ప్రత్యేక కార్యాచరణకు అధికార వర్గాలు శ్రీకారం చుట్టాయి. దీంతో బలవన్మరణాలు కాస్త తగ్గాయి. అయితే, గత నెల సాయుధ బలగాల విభాగం ఐజీ కార్యాలయం క్వార్టర్స్‌లో పేలిన తుపాకీ మళ్లీ పోలీసుల్లో కలవరాన్ని రేపింది. తిరుత్తణి సమీపంలోని పళ్లిపట్టు వేటకారన్ గ్రామం అమ్మన్ కోవిల్ వీధికి చెందిన కన్నన్, రాధా దంపతుల కుమారుడు మణికంఠన్(26) తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బర్త్‌డేను డెత్‌గా అతడు మార్చుకున్నారు. ఈ ఘటన తదుపరి మరో ముగ్గురు నలుగురు పోలీసులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బుధవారం తమిళనాడు సిరప్పు కావల్ పడై విభాగంలో కానిస్టేబుల్‌గా ఉన్న శరవణన్(29) తుపాకీతో కాల్చుని ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టమిట్టాడుతుండడం పోలీసుల్లో ఆందోళన రేపింది. లేఖ రాసి పెట్టి మరీ : అడయార్‌లోని ఓ న్యాయమూర్తి క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ శరవణన్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా తన వద్ద ఉన్న తుపాకీ తీసుకుని కాల్చుకున్నట్టు సమాచారం. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకున్న అక్కడున్న సహచరులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో శరవణన్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శరవణన్ తుపాకీతో కాల్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందోనని అభిరామపురం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగా శరవణన్ రాసి పెట్టిన లేఖ ఒకటి బయటపడింది. అందులో తన మరణానికి కారకులు ఎవరూ లేరని, తన తల్లిదండ్రులు చాలా మంచి వాళ్లు అని, వారిని చాలా బాగా చూసుకోవాలని, తాను మరణిస్తే వచ్చే మొత్తాన్ని వారికే అప్పగించాలని విజ్ఞప్తి చేశాడు. అలాగే, తాను మరణిస్తే తన శరీరం మీదున్న యూనిఫాంను మాత్రం దయచేసి తొలగించ వద్దు అని, తనకు యూనిఫాం అంటే చాలా ఇష్టం అని, అలాగే తనకు అంత్యక్రియలు జరిపించాలని, ఇదే తన చివరి కోరిక అని రాసి పెట్టి మరీ కాల్చుకుని ఉండడం సహచరుల్ని తీవ్ర వేదనలో పడేసింది. -
టిక్ టాక్ వీడియో కేసులో ఇద్దరు అరెస్టు
చెన్నై ,తిరువొత్తియూరు: పోలీసుస్టేషన్ ముందు నిలబడి టిక్‌టాక్ వీడియో తీసి విడుదల చేసిన కళాశాల విద్యార్థులు సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. నెల్లై జిల్లా చేరమాన్దేవి సమీపంలోని కారుకురిచ్చి పుదుకుడి గ్రామానికి చెందిన యువకుడు సీతారామన్ (28). గత 3న ఆలంకులం పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా మద్యం మత్తులో బైకుపై వచ్చిన సీతారామన్‌ను పోలీసులు అదుపుతోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సంగతి తెలుసుకున్న అతని బంధువులు, ప్రైవట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న అతని స్నేహితులు పోలీసుస్టేషన్‌కు వచ్చారు. వారు వేర్వేరుగా ప్రముఖ సినిమా పాటలకు తగినట్టు సెల్ఫోన్లో టిక్‌టాక్ వీడియో తీసి వాటిని వాట్సాప్‌లలో ఉంచారు. ఈ వీడియోలు సామాజిక మాద్యమంలో వైరల్‌గా మారియి. విషయం తెలుసుకున్న ఆలంకులం సీఐ అయ్యప్పన్ విచారణ ఆ వీడియో తీసిన ఇద్దరు కళాశాల విద్యార్థులపై కేసు నమోదు చేశారు. సీతారామన్ సహా ముగ్గురిని గురువారం అరెస్టు చేశారు. -
కుష్బూపై కేసు
సాక్షి, చెన్నై: సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇచ్చిన సమయానికి కంటే ఎక్కువసేపు పార్టీ సమావేశం నిర్వహించినందుకు ఈ చర్య తీసుకున్నారు. నెల్లై జిల్లా, ముక్కూడల్‌లో శుక్రవారం రాత్రి జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పోలీసులు రాత్రి 10 గంటల వరకే ఈ సమావేశానికి అనుమతి ఇచ్చారు. సమయం ముగిసినా సమావేశం కొనసాగడంతో పోలీసులు కుష్బూ, నేతలపై ఐపీసీ 143, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రసాభాసగా సమావేశం తమకు ఆహ్వానం అందలేదని మాజీ మంత్రి ధనుష్‌కోఠి ఆదిత్య సహా జిల్లా కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. సీనియర్ నాయకులతో వాగ్వాదానికి దిగడంతో గందరగోళం రేగింది. ఆదిత్యకు నచ్చజెప్పి మొత్తానికి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుష్బు మాట్లాడుతూ.. తాను పార్టీ అభివృద్ధికి కష్ట పడుతున్నానని, కొందరు అలా భావించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కలిసి రావాలని కోరారు. -
పాత దుస్తుల మాటున ఎర్రచందనం రవాణా
-
పాత దుస్తుల మాటున ఎర్రచందనం రవాణా
కాంచీపురం (తమిళనాడు): పాత దుస్తుల మాటున ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న లారీని తమిళనాడు పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమారు రూ.30 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూరు సమీపంలోని బన్రుట్టి అనే గ్రామంలో కలైసెల్వం అనే వ్యక్తికి చెందిన స్థలంలో రెండు గోదాములున్నాయి. వీటిని లీజుకు తీసుకుని పలువురు పాత దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. అయితే అక్కడి నుంచి ఎర్రచందనం రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు శనివారం రాత్రి ఆ సమీపంలో మాటు వేసి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. లారీలోని పాత దుస్తుల మూటల్లో దాచిన 15 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గోదాములో అక్రమంగా ఉంచిన 10 టన్నుల దుంగలను స్వాధీనం చేసుకుని, గోదామును సీజ్ చేశారు. లారీ డ్రైవర్‌ను, గోదాములో పనిచేస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. -
సౌతిండియా మాఫియా డాన్ ఆత్మహత్య..
సాక్షి, చెన్నై: నిన్నటి వరకూ దక్షిణ భారతాన్ని గడగడలాడించిన డాన్ ఆశ్చర్యకరంగా ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు పోలీసులతో పాటు దక్షిణ భారతంలోని అన్ని రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన డాన్ శ్రీధర్ ధనపాలన్(44) బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. తమిళనాడుకు చెందిన శ్రీధరన్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. అతి తక్కువ కాలంలోనే దక్షిణ భారత దావూద్ ఇబ్రహీంగా పేరుపొందాడు. ఇప్పటి వరకూ ఇతనిపై 43కేసులు నమోదయ్యాయి. ఇందులో 7హత్యారోపణలు కూడా ఉన్నాయి. అనంతరం పోలీసుల తనిఖీలు పెరిగిపోవడం, పెద్ద మాఫియా డాన్‌గా ఎదగాలనే కోరికతో పోలీసుల కన్ను కప్పి కంబోడియాకు పారిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యుల మద్య వివాదాలు నడుస్తున్నాయి. దీంతో విసుగు చెంది తన నివాసంలో సైనేడ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఆసుపత్రికి తరలించగా, సాయంత్రం 6.30 ప్రాంతంలో మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 2013లో భారత్ నుంచి తప్పించుకొని కంబోడియాకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులను వదిలేసి ఒక్కడే ఉంటున్నాడు. శ్రీధర్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. కుమారుడు లండన్‌లో విద్యనభ్యసిస్తున్నాడు. అయితే శ్రీధర్ మరణ వార్త విని అతని స్వస్థలం కాంచీపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. -
చెన్నైలో ప్రాచీన విగ్రహాలు స్వాధీనం
విలువ రూ. 50 కోట్లకు పైనే సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రాచీన విగ్రహాలను విదేశాలకు అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టును తమిళనాడు పోలీసులు రట్టు చేశారు. చెన్నై, ఆళ్వార్‌పేటలోని ముఠా నాయకుడి ఇంటిపై మంగళవారం దాడులు నిర్వహించి రూ. 50 కోట్ల విలువైన 54 ప్రాచీన విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీనదయాళన్ 2005లో విగ్రహాల తరలింపు కేసులో అరెస్టయినట్లు గుర్తించారు. ఇతని ముఠాలోని సభ్యులైన మాన్సింగ్, కుమార్, రాజామణిని పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ విగ్రహం.. మోదీకి కానుక: పంజాబ్‌కు చెందిన సుభాష్‌కపూర్ తమిళనాడులో దొంగిలించిన నటరాజ, అర్ధనారీశ్వర విగ్రహాలనుఆస్ట్రేలియాలో అమ్మినట్లు, ఇటీవల ఆస్ట్రేలియాకు వెళ్లిన ప్రధాని మోదీకి ఈ రెండు విగ్రహాలను అక్కడి ప్రభుత్వం బహుమతిగా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
ఉద్యాన నగరిపై ఉగ్రవాదుల గురి
రాష్ర్టంలో హైఅలర్ట్ ఢిల్లీలో ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు విధానసౌధతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ఐటీ కంపెనీల పేల్చివేతకు కుట్ర ముమ్మరంగా నాకాబందీ ఐపీఎల్ నేపథ్యంలో స్టేడియం, క్రీడాకారులు బసచేసే హోటళ్లకు మూడంచెల భద్రత సాక్షి, బెంగళూరు : కర్ణాటక పరిపాలన కేంద్ర బిందువైన విధాన సౌధను పేల్చడానికి కుట్రపన్నిన ఐఎస్ఐ ఉగ్రవాదిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారన్న వార్తల నేపథ్యంలో హోం శాఖ రాష్ట్ర మంతటా హై అలర్ట్ ప్రకటించింది. బెంగళూరులోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రముఖ ఐటీ కంపెనీల భవనాలకు భద్రతను పెంచారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు జాహీర్ హుసేన్ అనే ఐఎస్ఐ ఉగ్రవాదిని చెన్నైలో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. విచారణలో బెంగళూరులోని విధానసౌధతో పాటు మరికొన్ని ఐటీ కంపెనీల కేంద్ర కార్యాలయాలను బాంబులు పెట్టి పేల్చి వేయడానికి కుట్ర పన్నినట్లు జాహీర్హుసేన్ పోలీసులకు తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా బెంగళూరు నుంచి తమిళనాడుకు వెళ్లే రహదారి ప్రాంతాల్లో నాకాబందీ చేపట్టారు. అనుమానితులను అదుపులోకి విచారణ అన ంతరం వదిలిపెడుతున్నారు. ఐపీఎల్-7 సీజన్లో భాగంగా ఐదు మ్యాచ్‌లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు దేశవిదేశాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు బెంగళూరుకు చేరుకోనున్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడే సూచనలు ఉండటంతో స్టేడియంతోపాటు, క్రీడాకారులు బసచేసే హోటల్స్ చుట్టూ మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. క్రీడాకారులు ఒంటరిగా బయటకు వెళ్లకుండా రాష్ట్ర హోం శాఖ ఆదేశాలను జారీ చేయనుంది. ఇదిలా ఉండగా ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటూ కేంద్ర, రాష్ట్ర కారాగారాల్లో ఉంటున్న ఖైదీలను కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా 100కి ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.