డుమ్మా కొడితే దొరికిపోతారమ్మా! | Mobile App For Night Police on Movement | Sakshi
Sakshi News home page

డుమ్మా కొడితే దొరికిపోతారమ్మా!

Published Sat, Jul 20 2019 9:06 AM | Last Updated on Sat, Jul 20 2019 9:06 AM

Mobile App For Night Police on Movement - Sakshi

పోలీసుల గస్తీ వాహనాల కదలికలను కనిపెట్టే మొబైల్‌ యాప్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: గస్తీ పేరుతో షికార్లు కొట్టే పోలీసులకు ఇకకాలం చెల్లింది.  గస్తీ తిరిగే పోలీసు వాహనాలను కదలికలను గుర్తించేందుకు మొబైల్‌ యాప్‌ను చెన్నై పోలీస్‌ ప్రవేశపెట్టింది. దీంతో గస్తీ పేరుతో విధులకు డుమ్మా కొట్టే పోలీసులకు కళ్లెం వేసామని, ఇలాంటి పనిదొంగ పోలీసులు మొబైల్‌ యాప్‌తో సులభంగా చిక్కిపోతారని ఉన్నతాధికారులు తెలిపారు.

చెన్నై నగరం, శివార్లలోని 135 పోలీస్‌స్టేషన్ల పరిధిలో జనాభాశాతానికి అనుగుణంగా పోలీసులు గస్తీ తిరుగుతుంటారు. ఇందు కోసం ఇన్నోవా, జిప్సీ, బోలెరో తదితర 360 కార్లు, 403 ద్విచక్ర వాహనాలను వినియోగిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌ ఆఫీసర్లు తమ పరిధిలో ఇప్పటికే చోటుచేసుకున్న చైన్‌ స్నాచింగ్, దారిదోపిడీలు, ఇళ్లలో దొంగతనాలు, నేరస్థులు సులువుగా పారిపోయే ప్రాంతాల్లో తమకు కేటాయించిన వాహనాల్లో సంచరిస్తూ నేరాలను అరికట్టాల్సి ఉంది. ఇరుకైన ప్రాంతాల్లో గస్తీకి 250 సైకిళ్లను సైతం ప్రభుత్వం గతంలో కేటాయించింది. అయితే అవన్నీ పర్యవేక్షణ లోపం వల్ల పాత ఇనుప సామన్లకు వేసే స్థితికి చేరుకున్నాయి. గస్తీ తిరగాల్సిన పోలీసులు అధికారిక వాహనాలను మరుగైన ప్రదేశంలో పెట్టేసి సొంత పనులు చక్కబెట్టేందుకు వెళ్లిపోతున్నట్లు ఉన్నతాధికారులకు ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు అందాయి. మరికొందరు పోలీసులు సమీపంలోని కల్యాణ మండపాలకు చేరుకుని గురకలు పెడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మరికొందరైతే పరిసరాల్లో సినిమా హాళ్లలో కూర్చుని చక్కగా ఎంజాయి చేసేస్తున్నారు. గస్తీ పోలీసుల నిర్లక్ష్య వైఖరి దొంగలకు అనువుగా మారింది. దీంతో గస్తీ వాహనాలను మొబైల్‌ యాప్‌ ద్వారా పర్యవేక్షించాలని పోలీసుశాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ‘మొబైల్‌ డేటా టెర్మినల్‌ సిస్టమ్‌’ (ఎండీటీఎస్‌) అనే మొబైల్‌ యాప్‌ను సిద్ధ్దం చేశారు. తొలిదశగా చెన్నై పోలీసు పరిధిలో ప్రయోగాత్మకంగా 360 నాలుగు చక్రాల వాహనాలకు మొబైల్‌ యాప్‌ ను అమర్చారు.

ఈ కొత్త విధానంపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, గస్తీ విధుల్లో ఉండే పోలీసులకు స్మార్ట్‌ ఫోన్లను అందజేశామని, వీరంతా గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఎండీటీసీ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వినియోగించాలని తెలిపారు. వారి మొబైల్‌ ఫోన్లను చెన్నై కమిషనర్‌ కార్యాలయంలోని కంట్రోలు రూముతో అనుసంధానం చేశాము. దీంతో గస్తీ విధులకు డుమ్మా కొట్టే పోలీసులు సులభంగా దొరికిపోతారు. చార్జింగ్‌ పెట్టడం మరిచిపోయామని తప్పించుకునే వీలులేకుండా వారికి కేటాయించిన వాహనాల్లో మొబైల్‌ చార్జింగ్‌ వసతిని కూడా కల్పించాం. మొబైల్‌ వినియోగంలో ఉందని పేర్కొంటూ తమ సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటో తీసుకుని ప్రత్యేకంగా రూపొందించిన వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టింగ్‌ పెట్టాలి. గస్తీ పోలీసులు సరిగా విధులు నిర్వర్తిస్తున్నారా అని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఇన్‌స్పెక్టర్లను  నియమించాం. మొబైల్‌ యాప్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయం నుంచే తగిన ఆదేశాలు జారీచేస్తూ అవసరమైన  సహాయం కోసం సమీపంలోని గస్తీ వాహనాలను ఆయా ప్రదేశాలకు పంపే వీలుకలుగుతుందని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement