మైక్రోచిప్పులు, హోలోగ్రామ్‌లు, బయోమెట్రిక్ ఫోటోలు, బార్ కోడ్లతో నిండిన నేటి పాస్‌పోర్టులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అద్భుతాలు. ఇప్పుడు మనం చూస్తున్న పాస్ పోర్ట్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో తయారైంది. చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి తెరతీసింది. కానీ దాని మూలాలు సహస్రాబ్దాల నాటివి. మానవ చరిత్ర ప్రారంభ యుగాల్లో ఎలాంటి సరిహద్దులు లేవు. స్వేచ్ఛా వలసలు ఉండేవి. తర్వాత ఉద్భవించిన నాగరికతలు భూమిని విభజించడమే గాక అన్వేషణ, పరిశోధనల సారాన్ని మార్చేశాయి. ఆ క్రమంలో సురక్షితంగా దేశాలు దాటేందుకు అధికారిక పత్రంగా పాస్‌పోర్టు పుట్టుకొచ్చింది.
క్రీస్తుపూర్వం 2000 ప్రాంతంలో మెసపొటేమియాలో ప్రయాణ అనుమతులకు మట్టి పలకలు వాడారు. ఒకరకంగా వీటిని అత్యంత పురాతన పాస్‌పోర్టులుగా చెప్పవచ్చు. పురాతన ఈజిప్టులో ప్రయాణికులు, వ్యాపారుల భద్రత కోసం అధికారిక లేఖలను ఉపయోగించారు. భారత ఉపఖండంలో ప్రయాణాలను మౌర్య సామ్రాజ్య కాలం నుంచి డాక్యుమెంట్ చేసినట్టు ఆనవాళ్లున్నాయి. అవి నేటి ప్రయాణ అనుమతుల వంటివి కావు. కేవలం ప్రయాణికుల ప్రవర్తన తదితరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలుగా మన్నన పొందేవి. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోకుని పాలనలో ప్రయాణాలను సులభతరం చేయడానికి, రక్షణ, అధికారిక ఆమోదాన్ని తెలపడానికి శాసనాలు జారీ చేశారు.
మొదటి ప్రపంచ యుద్ధంతో..
యూరప్ వలసవాదులు ప్రస్తుత పాస్‌పోర్ట్ వ్యవస్థ రూపశిల్పులని చెప్పవచ్చు. అన్వేషణలో భాగంగా వారు ప్రపంచవ్యాప్తంగా కలియదిరిగి భూభాగాలను ఆక్రమించుకుంటూ వెళ్లారు. 20వ శతాబ్దపు తొలినాళ్ల ప్రయాణాల్లో కొన్ని పద్ధతులు వచ్చి చేరాయి. ఆరోగ్య పరీక్షలు, కొన్ని ప్రశ్నలతో సరిహద్దులు దాటనిచ్చేవారు. అప్పటికి ప్రయాణ పత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఏకీకృత ప్రమాణమంటూ లేదు. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో పాస్‌పోర్ట్ నియంత్రణ స్వరూపం నాటకీయంగా మారింది. సంఘర్షణ నేపథ్యం నుంచి పుట్టిన నానాజాతి సమితి శాంతి, సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రపంచ ప్రయాణానికి ప్రామాణిక వ్యవస్థను రూపొందించింది. 1921 నాటికి కఠినమైన వలస నియంత్రణలను విధించడానికి అమెరికా నాటి రాజకీయ అవకాశాలను ఉపయోగించుకుంది. ఎమర్జెన్సీ కోటా చట్టం, 1924 ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని తీసుకొచి్చంది. ఇవి వలసల ప్రవాహాన్ని తగ్గించాయి. ఒకప్పుడు స్వేచ్ఛకు చిహ్నంగా ఉన్న పాస్‌పోర్టు ఆ తరువాత పాశ్చాత్య కేంద్రీకృత శక్తులు ఆధిపత్యం చెలాయించడానికి ఉపయోగించే నియంత్రణ సాధనంగా మారింది.
మొగలుల కాలంలో..
మధ్యయుగానికి వచ్చే నాటికి ప్రయాణ డాక్యుమెంటేషన్ ప్రగతి సాధించింది. ప్రయాణాల పర్యవేక్షణ, నియంత్రణకు భారత ఉపఖండమంతటా పలు రకాల చట్టబద్ధత, ఆమోదంతో కూడిన పత్రాలు జారీ చేసేవారు. మొగల్ చక్రవర్తులతో పాటు ప్రాంతీయ పాలకులుం కూడా ప్రయాణికులకు, వ్యాపారులకు, యాత్రికులకు, దౌత్యవేత్తలకు ‘సనద్’లు, సురక్షిత ప్రవర్తన లేఖలు జారీ చేశారు. వాణిజ్య, సాంస్కృతిక మారి్పడిని ప్రోత్సహించి వారు సురక్షితంగా ప్రయాణించేలా చూశారు. శతాబ్దాల క్రితంం వెలుగు చూసిన ‘సౌఫ్ కండిక్ట్’ (సేఫ్ కండక్ట్) పాస్‌ను ప్రాథమిక ప్రయాణ పత్రంగా చెప్పవచ్చు. అయితే ఇది ప్రధానంగా పాలకుల మధ్య లిఖితపూర్వక ప్రతిజ్ఞ. యుద్ధ భయం లేకుండా సరిహద్దులు దాటి సురక్షితంగా ప్రయాణించేలా చేసుకున్న పెద్దమనుషుల ఒప్పందం వంటిది.
1920 నాటి ‘పాస్‌పోర్ట్ తీర్మానం’ అంతర్జాతీయ ప్రయాణాల్లో కొత్త శకానికి నాంది పలుకుతూనే, అసమానతలకు పునాది వేసిందంటారు. ఎందుకంటే అప్పట్లో అమెరికాలో కూడా మహిళలకు ప్రత్యేకంగా పాస్‌పోర్ట్ ఉండేది కాదు. భర్తల పాస్‌పోర్టులోనే ఫుట్ నోట్సులో భార్య పేరు పేర్కొనేవారు. దాంతో వారు స్వతంత్రంగా సరిహద్దులను దాటలేకపోయారు. ఇవన్నీ నాటి సమాజ లింగ అసమానత, మహిళలపై వివక్షకు అద్దం పట్టేవే. ఇటీవలి దశాబ్దాల్లో పాస్‌పోర్ట్ ప్రపంచ రాజకీయాలు, మార్కెట్ శక్తుల ఇష్టాలకు లోబడి డిమాండ్ ఉన్న వస్తువుగా మారిపోయింది. 2016లో అమెరికాలోనే ఏకంగా 1.86 కోట్ల పాస్‌పోర్టులు జారీ అయ్యాయంటే వాటి డిమాండ్ ఎంతటిదో అర్థమవుతోంది. ప్రపంచానికి ప్రవేశ ద్వారమైన పాస్‌పోర్ట్ కొందరికి అధికార చిహ్నం. మరికొందరికి మినహాయింపులకు సాధనం. మనం పుట్టిన దేశాన్ని బట్టి, పాస్ పోర్ట్ మనకు అత్యంత సౌలభ్యాన్ని ఇవ్వొచ్చు. లేదా విపరీతమైన బాధను కలిగించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment