అందమైన కరేబియన్ ద్వీప దేశం డొమినికా తమ దేశ పాస్‌పోర్ట్‌లను అమ్మకానికి పెట్టింది. ఏడేళ్ల క్రితం మారియా హరికేన్ విధ్వంసంతో దెబ్బతిన్న ఈ ఐలాండ్ పునర్నిర్మాణానికి విభిన్న రీతిలో నిధుల సమీకరణ చేపడుతోందని ‘వాషింగ్‌టన్ పోస్ట్’ పేర్కొంది.
ప్రపంచంలోనే వాతావరణ పరిస్థితులకు తట్టుకుని నిలిచిన అత్యంత దృఢమైన ద్వీపంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ కరేబియన్ దేశం.. ఇందుకోసం భారీ అప్పులు చేయకుండా, సంపన్న దేశాల సహాయం కోసం ఎదురుచూడకుండా నిధులు సంపాదించుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా చైనా, మిడిల్ ఈస్ట్ దేశాల్లోని సంపన్నులకు పాస్‌పోర్ట్‌ల ద్వారా తమ దేశ పౌరసత్వాన్ని విక్రయిస్తోంది.
ఆ దేశ పౌరసత్వ ప్రదాన కార్యక్రమం 90ల నాటి నుంచే ఉన్నప్పటికీ హరికేన్ తర్వాత వేగంగా విస్తరించింది. ఇదే దేశ ఆదాయానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఈ నిధులను కొత్త మెడికల్ క్లినిక్‌లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లతో సహా కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వినియోగిస్తున్నారు. ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిన్ బారన్ ఈ చొరవను ఆపద్బాంధవిగా పేర్కొన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఈ కార్యక్రమం తమకు "స్వయం-స్వతంత్ర ఫైనాన్సింగ్"గా ఉపయోగపడుతోందని ఆర్థిక మంత్రి ఇర్వింగ్ మెక్‌ఇన్‌టైర్ చెబుతున్నారు.
ఈ పౌరసత్వ కార్యక్రమం విజయవంతం అయినప్పటికీ, పారదర్శకత, భద్రతా సమస్యలపై ఆందోళనలను పెంచింది. ఈ దేశ పౌరసత్వ కనీస ధర ఇటీవలే 2 లక్షల డాలర్లకు (రూ. 1.68 కోట్లు) పెరిగింది. అయినప్పటికీ ఇదే ప్రపంచవ్యాప్తంగా అత్యంత సరసమైన ఎంపికలలో ఒకటిగా ఉంది. 71,000 జనాభా కలిగిన ఒక చిన్న ద్వీపంలో పౌరసత్వాన్ని పొందినవారిలో కొంతమంది ఇక్కడ నివసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment