అరెస్టయిన నిందితులు, సీజ్ చేసిన వాహనాలు
చిత్తూరు అర్బన్ (చిత్తూరు జిల్లా): ‘ఇదిగో బాబూ.. నా వద్ద పెద్ద మొత్తంలో బ్లాక్‌మనీ ఉంది.. అన్నీ రూ.2 వేల నోట్లే.. త్వరలో కేంద్ర ప్రభుత్వం వీటిని రద్దు చేస్తానంటోంది. నీకు తెలిసినవాళ్లు ఎవరైనా ఉంటే చెప్పు.. వాళ్లు రూ.500 నోట్లు రూ.90 లక్షలు ఇస్తే.. నేను రూ.2 వేల నోట్లు రూ.కోటి ఇస్తా.. నీకు 2 శాతం కమీషన్ అదనంగా ఇస్తా’.. అంటూ డీల్ కుదుర్చుకుని రూ.45 లక్షలు దోచుకెళ్లిన ఘటన చిత్తూరులో సంచలనం సృష్టించింది. ఈ ఘరానా మోసానికి సంబంధించి చిత్తూరు పోలీసులు గురువారం తమిళనాడుకు చెందిన ఆర్.నరేష్‌కుమార్ (29), అబీద్‌బాషా (37), డి.రమేష్ ప్రభాకర్ (54), వి.కె.కుమార వడివేలు (54), ఆర్.విజయానందన్ (45), జి.మురుగదాస్ (55), సి.జయపాల్ (27), ఎ.జగన్‌రాజ్ (25)లతోపాటు చిత్తూరులోని గుడిపాలకు చెందిన డి.శ్రీకాంత్‌రెడ్డి (45)ని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.32 లక్షల నగదు, రెండు తుపాకులు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో ఏఎస్పీ మహేష్, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ బాలయ్య ఈ ఘటన వివరాలను వెల్లడించారు.
ఘరానా మోసం జరిగిందిలా..
కేరళకు చెందిన కె.వి.అశోకన్ చెన్నైలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నారు. వ్యాపారంలో భాగంగా ఆయనకు కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మహ్మద్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. కోయంబత్తూరుకు చెందిన షేక్ అబ్దుల్లా అనే వ్యక్తి తన పేరు సాయికృష్ణ అని మహ్మద్‌తో పరిచయం పెంచుకున్నాడు. తన వద్ద పెద్ద మొత్తంలో బ్లాక్‌మనీ ఉందని.. త్వరలో రూ.2 వేల నోట్లను రద్దు చేస్తారని.. వీటిని రూ.500 నోట్లుగా మార్పించి ఇస్తే 2 శాతం కమీషన్ ఇస్తానని మహ్మద్‌కు చెప్పాడు. దీంతో తనకు పరిచయం ఉన్న అశోకన్‌కు మహ్మద్ విషయం చెప్పగా.. రూ.45 లక్షలున్న రూ.500 నోట్లను తీసుకుని సాయికృష్ణ చెప్పినట్టు చిత్తూరు శివారులోని గంగాసాగరం వద్దకు వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడకు తమిళనాడు పోలీసు దుస్తుల్లో, వాహనాల్లో అక్కడకు చేరుకున్న సాయికృష్ణ అనుచరులు అశోకన్‌కు తుపాకులు చూపించి రూ.45 లక్షలు దోచుకున్నారు. దీంతో అశోకన్ చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ ఫుటేజీల సాయంతో 9 మంది నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు షేక్ అబ్దుల్లా అలియాస్ సాయికృష్ణ కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో మరో రూ.13 లక్షలు రికవరీ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. తమిళనాడు కృష్ణగిరిలో రూ.80 లక్షల లూటీ, చిత్తూరులోని యాదమరిలో రూ.10 లక్షల దోపిడీ కేసుల్లో సైతం నిందితుల హస్తం ఉందని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment