cancellation of notes
-
రూ.2 వేల నోట్ల రద్దంటూ రూ.45 లక్షలు దోపిడీ
చిత్తూరు అర్బన్ (చిత్తూరు జిల్లా): ‘ఇదిగో బాబూ.. నా వద్ద పెద్ద మొత్తంలో బ్లాక్‌మనీ ఉంది.. అన్నీ రూ.2 వేల నోట్లే.. త్వరలో కేంద్ర ప్రభుత్వం వీటిని రద్దు చేస్తానంటోంది. నీకు తెలిసినవాళ్లు ఎవరైనా ఉంటే చెప్పు.. వాళ్లు రూ.500 నోట్లు రూ.90 లక్షలు ఇస్తే.. నేను రూ.2 వేల నోట్లు రూ.కోటి ఇస్తా.. నీకు 2 శాతం కమీషన్ అదనంగా ఇస్తా’.. అంటూ డీల్ కుదుర్చుకుని రూ.45 లక్షలు దోచుకెళ్లిన ఘటన చిత్తూరులో సంచలనం సృష్టించింది. ఈ ఘరానా మోసానికి సంబంధించి చిత్తూరు పోలీసులు గురువారం తమిళనాడుకు చెందిన ఆర్.నరేష్కుమార్ (29), అబీద్‌బాషా (37), డి.రమేష్ ప్రభాకర్ (54), వి.కె.కుమార వడివేలు (54), ఆర్.విజయానందన్ (45), జి.మురుగదాస్ (55), సి.జయపాల్ (27), ఎ.జగన్‌రాజ్ (25)లతోపాటు చిత్తూరులోని గుడిపాలకు చెందిన డి.శ్రీకాంత్‌రెడ్డి (45)ని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.32 లక్షల నగదు, రెండు తుపాకులు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో ఏఎస్పీ మహేష్, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ బాలయ్య ఈ ఘటన వివరాలను వెల్లడించారు. ఘరానా మోసం జరిగిందిలా.. కేరళకు చెందిన కె.వి.అశోకన్ చెన్నైలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నారు. వ్యాపారంలో భాగంగా ఆయనకు కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మహ్మద్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. కోయంబత్తూరుకు చెందిన షేక్ అబ్దుల్లా అనే వ్యక్తి తన పేరు సాయికృష్ణ అని మహ్మద్‌తో పరిచయం పెంచుకున్నాడు. తన వద్ద పెద్ద మొత్తంలో బ్లాక్‌మనీ ఉందని.. త్వరలో రూ.2 వేల నోట్లను రద్దు చేస్తారని.. వీటిని రూ.500 నోట్లుగా మార్పించి ఇస్తే 2 శాతం కమీషన్ ఇస్తానని మహ్మద్‌కు చెప్పాడు. దీంతో తనకు పరిచయం ఉన్న అశోకన్‌కు మహ్మద్ విషయం చెప్పగా.. రూ.45 లక్షలున్న రూ.500 నోట్లను తీసుకుని సాయికృష్ణ చెప్పినట్టు చిత్తూరు శివారులోని గంగాసాగరం వద్దకు వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడకు తమిళనాడు పోలీసు దుస్తుల్లో, వాహనాల్లో అక్కడకు చేరుకున్న సాయికృష్ణ అనుచరులు అశోకన్‌కు తుపాకులు చూపించి రూ.45 లక్షలు దోచుకున్నారు. దీంతో అశోకన్ చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ ఫుటేజీల సాయంతో 9 మంది నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు షేక్ అబ్దుల్లా అలియాస్ సాయికృష్ణ కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో మరో రూ.13 లక్షలు రికవరీ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. తమిళనాడు కృష్ణగిరిలో రూ.80 లక్షల లూటీ, చిత్తూరులోని యాదమరిలో రూ.10 లక్షల దోపిడీ కేసుల్లో సైతం నిందితుల హస్తం ఉందని పోలీసులు తెలిపారు. -
నోట్ల రద్దు వేళ శశికళ ఆస్తులు పైపైకి
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ పెద్ద నోట్ల రద్దు సమయంలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆదాయపన్ను శాఖ (ఐటీ) విచారణలో తేలింది. ఆ సమయంలో ఆమె మాల్స్, భవనాలను కొనుగోలు చేసినట్టు గుర్తించారు. పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో కొన్ని ఆస్తులు చేతులు మారినట్లు కనుగొన్నారు. మద్రాసు హైకోర్టులో శశికళ ఆదాయ వ్యవహారాలకు సంబంధించిన ఓ పిటిషన్‌పై స్టే విధించాలని శశికళ రిట్ దాఖలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఐటీ శాఖను కోర్టు ఆదేశించింది. శనివారం న్యాయమూర్తి అనితా సుధాకర్ ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. శశికళ ఆదాయ, ఆస్తుల వ్యవహారం ముగిసిన అధ్యాయమని, ఇప్పుడు దానిపై విచారణ అవసరం లేదని శశికళ తరఫు లాయర్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో శశికళ చెన్నై పెరంబూరు, మదురై, కేకే నగర్లలో షాపింగ్ మాల్స్ పుదుచ్చేరిలో ఒక రిసార్ట్, కోయంబత్తూరులో పేపర్ మిల్, చెన్నై ఒరగడంలో చక్కెర మిల్లు, పాత మహాబలిపురం రోడ్డులో సాఫ్ట్వేర్ కంపెనీ, కోయంబత్తూరులో 50 పవన విద్యుత్ ప్లాంట్లు కొనుగోలు చేసినట్టు ఐటీ తరఫు న్యాయవాది ఆధారాలను కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ ఆస్తులన్నీ నగదు ద్వారానే జరిగినట్టు చెప్పారు. దీనిని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి త్వరితగతిన అన్ని ప్రక్రియలు ముగించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేశారు. -
క్యాష్ ఈజ్ కింగ్!
పెద్దనోట్లను రద్దు చేసి ఇవ్వాల్టికి మూడేళ్లు. అప్పట్లో పెద్దనోట్లంటే 1,000... 500 మాత్రమే. ఇప్పుడు 2000 లాంటి పేద్ద నోటు కూడా వచ్చేసింది లెండి!!. కాకపోతే మోదీ సర్కారు వాటిని రద్దు చేయటానికి చెప్పిన ప్రధాన కారణాలు రెండే!. ఒకటి నల్లధనాన్ని వెలికి తీయటం. రెండు డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించడం. మరి ఈ లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయి? ఆర్థిక వ్యవస్థపై, సామాన్యుల జీవితాలపై ఇది చూపిన ప్రభావమెంత? నోట్ల రద్దు సైడ్ ఎఫెక్ట్స్ పూర్తిగా బయటపడినట్లేనా? సాక్షి, బిజినెస్ విభాగం: 2016 నవంబర్ 8న.. రాత్రి 8 గంటల సమయంలో టీవీపై ప్రత్యక్షమైన ప్రధాని మోదీ ఆ రోజు అర్ధరాత్రి నుంచి 1000... 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రొటీన్ ప్రసంగాన్ని అంతే రొటీన్‌గా చూస్తున్న జనానికది ఊహించని షాక్. జేబులోని డబ్బు మొదలెడితే... అవసరాల కోసం ఇంట్లో పెట్టుకున్న డబ్బంతా బ్యాంకుల్లోకి వచ్చింది. చేతిలో ఉన్న డబ్బును బ్యాంకు లో వేసేస్తే తర్వాతెప్పుడైనా తీసుకోవచ్చనే ఉద్దేశంతో జనాలు బారులు తీరారు. ఇక ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే డబ్బుపై పరిమితులు విధించడంతో.. ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. ఇలా... చెప్పుకుంటూ పోతే ఆ కష్టాలకు అంతే ఉండదు. ఈ అవకాశాన్ని పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌లు అందిపుచ్చుకున్నాయి. ఇతర యాప్‌లూ వచ్చాయి. ప్రభు త్వం భీమ్ యాప్‌ను తెచ్చింది. డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. కానీ ఇప్పుడు..?!! మళ్లీ క్యాష్ జమానా! నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ (ఎన్ఏఎస్) గణాంకాల ప్రకారం... 2011–12 తర్వాత కరెన్సీ రూపంలో దాచుకునే నగదు పరిమాణం అత్యధిక స్థాయిలో ఉన్నది ఇప్పుడే!. ప్రజలు పొదుపు చేసే మొత్తంలో.. నగదు వాటా 2011–12లో 11.4 శాతం కాగా... 2017–18 నాటికి ఏకంగా 25.2 శాతానికి ఎగిసింది. అదే సమయంలో డిపాజిట్ల రూపంలో దాచుకునే మొత్తం 57.9 నుంచి 28 శాతానికి పడిపోయింది. మరోవైపు, చలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్ల విలువలో ప్రజలు కరెన్సీ రూపంలో తమ దగ్గర దాచుకున్న నోట్ల విలువ 2011–12 నుంచి 2015–16 మధ్య 9–12 శాతంగా ఉండేది. 2017–18 లో ఇది 26 %కి పెరిగిపోయింది. ప్రజలు డబ్బును బ్యాంకుల్లో ఉంచడం కన్నా తమ ఇంట్లో దాచుకోవటమే మంచిదన్నట్లు ఈ ధోరణి తెలియజేస్తోందని ఎన్ఏఎస్ వెల్లడించింది. మరి బ్లాక్‌మనీ సంగతి? నలుపు... తెలుపైపోయిందా? నల్లధనంపై పోరు పేరిట మోదీ సర్కార్ ప్రయోగించిన నోట్ల రద్దు అస్త్రం విఫలం కావటమే కాక దేశ ఆర్థిక వ్యవస్థను కకావికలం చేసిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆర్బీఐ ముద్రించిన నగదులో నిర్దిష్ట మొత్తం.. లెక్కలు చెప్పని నల్ల ధనం రూపంలో (రూ.500, రూ.1,000 నోట్ల కింద) ఉల్లంఘనుల దగ్గర ఉందన్న అంచనాలతో ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించింది. లెక్కలు చెప్పాల్సి వస్తుంది కనక ఉల్లంఘనులు పెద్ద నోట్లను డిపాజిట్ చేయరని, నికరంగా వ్యవస్థలో వైట్ మనీ ఎంతుందో తేలుతుందని ప్రభుత్వం భావించింది. ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. ఆర్బీఐ 2018 నాటి నివేదిక ప్రకారం.. రద్దయిన నోట్లలో ఏకంగా 99.3% నోట్లు బ్యాంకులకు తిరిగొచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత.. వాటికన్నా అధిక విలువుండే రూ.2,000 నోట్లు ప్రవేశపెట్టారు. వీటినీ దాచేయటం పెరిగి.. చలామణీ తగ్గిపోతుండటంతో ఈ నోట్ల ముద్రణను ఇటీవల నిలిపేసినట్లు సమాచారం. రేపో మాపో వీటినీ రద్దు చేయొచ్చనే వదంతులు షికార్లు చేస్తున్నాయి. ► రద్దు చేసిన పెద్ద నోట్ల విలువ రూ. 15.41 లక్షల కోట్లు ► బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగొచ్చినది రూ. 15.30 లక్షల కోట్లు ► వ్యవస్థలోకి తిరిగి రాని కరెన్సీ విలువ రూ. 10,720కోట్లు ► తిరిగొస్తుందని ప్రభుత్వం అంచనా రూ. 10 లక్షల కోట్లు డిజిటల్ లావాదేవీల్లోనూ వృద్ధి.. నోట్ల రద్దు తరవాత డిజిటల్ లావాదేవీలు పుంజుకున్నాయనేది నిజం. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ వంటివి బాగా వాడకంలోకి వచ్చాయి. మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా పేమెంట్స్ సేవల్లోకి వస్తోంది. ఆర్బీఐ, ఎన్పీసీఐ గణాంకాల ప్రకారం 2016లో యూపీఐ ద్వారా 30 బ్యాంకుల నుంచి రూ.100 కోట్ల విలువైన 0.2 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. 2018లో 128 బ్యాంకుల నుంచి రూ.74,978 కోట్ల విలువైన 482 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) మెషీన్లలో డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 0.8 బిలియన్ల నుంచి 3.3 బిలియన్లకు... మొబైల్ వాలెట్ల లావాదేవీలు 0.32 బిలియన్ల నుంచి 3.4 బిలియన్లకు పెరిగాయి. మందగమనానికి బీజం.. ఆర్థిక వ్యవస్థ నుంచి నల్లధనాన్ని తొలగించడంలో నోట్ల రద్దు ప్రయోగం విఫలమైందనే ఆరోపణలున్నాయి. ప్రజలు కరెన్సీ రూపంలో భారీగా నగదు దాచిపెట్టుకోవడానికి ఎప్పుడేం ముంచుకు వస్తుందోనన్న భయం కారణమైనప్పటికీ.. ప్రస్తుతం దేశీయంగా ఆర్థిక మందగమనానికి ఇది కూడా ఒక కారణమనే అభిప్రాయాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి ముందుగా అంచనా వేసినట్లు 6.8 శాతం కాకుండా 6.1 శాతానికే పరిమితం కావొచ్చని ఆర్బీఐ ఇటీవలే పేర్కొంది. మూడీస్ వంటి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు 5.8%కే పరిమితం కావొచ్చని చెబుతున్నాయి. మందగమనానికి నోట్ల రద్దుతో పాటు ఇతరత్రా అంశాలూ కారణంగా మారుతున్నాయి. ► నోట్ల రద్దుతో వినియోగం గణనీయంగా దెబ్బతింది. ఉద్యోగాల కోత, ఆదాయాల తగ్గుదలకు, డిమాండ్ మరింత పడిపోవడానికి దారి తీసింది. ► 2017 జులైలో కొత్తగా అమల్లోకి వచ్చిన వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ).. వ్యవస్థను మరింత కుంగదీసింది. ఎగుమతిదారులకు రీఫండ్లలో జాప్యాల వల్ల ఆ ఏడాది ఎగుమతుల వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడింది. ► నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలు తగ్గుతున్నాయనుకుంటున్న తరుణంలో.. రుణాలభారంతో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కుదేలవటం గతేడాది నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాన్ని అతలాకుతలం చేసింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధాలతో పరిస్థితి మరింత దిగజారింది. కష్టాలకు అదే మూలం.. డీమోనిటైజేషన్ వల్ల నగదు లభ్యత తగ్గిపోయి.. నగదు లావాదేవీలపైనే ఎక్కువగా ఆధారపడే అసంఘటిత రంగానికి పెద్ద దెబ్బ తగిలింది. అవినీతి అంతం లక్ష్యమని చెప్పినప్పటికీ మరింత పెద్ద నోట్లను ప్రవేశపెట్టడం వల్ల అక్రమ చెల్లింపులు మరింత సులభతరం చేసినట్లయింది. – అభిజిత్ బెనర్జీ, ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత -
50 లక్షల ఉద్యోగాలు ఆవిరి
బెంగళూరు: దేశంలో 2011 నుంచి 2018 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో నిరుద్యోగం రెండింతలు పెరిగినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో ఉద్యోగావకాశాలు క్షీణించడంతోపాటు గడిచిన రెండేళ్ల(2016–18)లో 50 లక్షల మంది పురుషులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు జరిగిన నాటి నుంచే దేశంలో ఉద్యోగావకాశాలు తగ్గుతూ వచ్చాయని తెలిపింది. అయితే ఉద్యోగావకాశాల క్షీణతకు పెద్ద నోట్ల రద్దుకు ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేకున్నా.. పెద్ద నోట్ల రద్దు జరిగిన నవంబర్ 2016 నుంచే ఉద్యోగాలు తగ్గిపోవడం గమనార్హం అని పేర్కొంది. ది స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా(ఎస్‌డబ్ల్యూఐ)–2019 పేరిట బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను దేశంలోని ఉద్యోగాల స్థితిగతులను లెక్కించే కన్సూమర్ పిరమిడ్స్ సర్వే ఆఫ్ ది సెంటర్ ఫర్ మోనిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ(సీఎమ్ఐఈ–సీపీడీఎక్స్) సంస్థ నుంచి 2016–18 మధ్య గల సమాచారాన్ని సేకరించి రూపొందించారు. ఈ నివేదికలో కేవలం పురుషులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఒకవేళ మహిళలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కోల్పోయిన ఉద్యోగాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. నిరుద్యోగుల్లో ముఖ్యంగా ఉన్నత చదువులు చదివిన వారితోపాటు యువకులే అధికంగా ఉన్నారని పేర్కొంది. ఇదేకాలంలో తక్కువ విద్యార్హత గల వారు కూడా ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు ఆ స్థాయిలో కూడా ఉద్యోగావకాశాలు తగ్గాయని తెలిపింది. ఈ విషయంలో మహిళల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని పేర్కొంది. ఈ నివేదిక రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించిన అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అమిత్ బాసోల్ మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఉద్యోగాలను సృష్టించేందుకు కొన్ని పరిష్కార మార్గాలను నివేదికలో తాము సూచించామని అన్నారు. ‘మేము సూచించిన పరిష్కార మార్గాలు ఉద్యోగాల సృష్టికి ఊతమివ్వడంతోపాటు దేశంలోని అందరికీ సమానమైన ఉద్యోగావకాశాలను కల్పిస్తాయని బలంగా నమ్ముతున్నాం’అని పేర్కొన్నారు. పరిష్కార మార్గాలు.. ► దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ తరహాలోనే అర్బన్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ తేవాలని నివేదిక సూచించింది. దీని ద్వారా చిన్న పట్టణాల్లో సుమారు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలిపింది. ► స్థూల దేశీయ ఉత్పత్తిలో విద్యపై 6 శాతం, వైద్యంపై 3 శాతం అదనంగా ఖర్చు పెట్టగలిగితే సుమారు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చని వెల్లడించింది. అలాగే దీని ద్వారా అత్యంత నాణ్యమైన ప్రజా సేవలను అందించవచ్చని పేర్కొంది. ► భారతీయ తయారీ రంగాన్ని పునరుద్ధరించడానికి సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకురావడం అత్యవసరమని స్పష్టం చేసింది. -
అతిపెద్ద కుంభకోణం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక విడుదల చేసిన వేళ ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు దేశచరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. గురువారం రాహుల్ మీడియాతో మాట్లాడారు. పారిశ్రామికవేత్తలైన స్నేహితులకు డబ్బులు సమకూర్చేందుకే సామాన్యులపై మోదీ నోట్ల రద్దు అస్త్రాన్ని ప్రయోగించారని విమర్శించారు. ‘పెద్ద నోట్ల రద్దు కారణంగా చెల్లకుండాపోయిన నగదంతా బ్యాంకులకు తిరిగివచ్చేసింది. ఇది భారీ కుంభకోణానికి ఏమాత్రం తక్కువకాదు’ అని వ్యాఖ్యానించారు. ‘దాదాపు 20 మంది పారిశ్రామికవేత్తలైన ఆయన మిత్రులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రధాని ఉద్దేశపూర్వకంగా నోట్ల రద్దుతో సామాన్యులపై దాడికి పాల్పడ్డారు.గత ఎన్నికల్లో ప్రచారానికి భారీగా డబ్బులు ఖర్చుపెట్టిన పారిశ్రామికవేత్తలకు సాయం చేయడమే ఆయన లక్ష్యం’ అని రాహుల్ మండిపడ్డారు. బీజేపీ చీఫ్ అమిత్ షా డైరెక్టర్‌గా ఉన్న గుజరాత్‌లోని ఓ సహకార బ్యాంకులో ఏకంగా రూ.700 కోట్ల విలువైన రద్దయిన నోట్లను కొందరు మార్చుకోవడంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ‘గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకులో ఎవరి నగదు మార్పిడి జరిగిందో విచారణ జరిపారా? అని ప్రశ్నించారు. రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని ఆర్థికమంత్రి జైట్లీకి తాము పెట్టిన డెడ్‌లైన్ గడువు ముగుస్తోందన్నారు. రాహుల్‌తో కుమారస్వామి భేటీ కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాహుల్‌గాంధీని కర్ణాటక సీఎం కుమారస్వామి ఢిల్లీలో కలిశారు. కర్ణాటక మంత్రివర్గ విస్తరణపై ఇద్దరు నేతలు చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై త్వరలో∙నిర్ణయం తీసుకుంటామని అనంతరం కుమారస్వామి మీడియాతో అన్నారు. -
నోట్ల రద్దుతో తగిన ప్రయోజనాలు: ఐఎంఎఫ్
వాషింగ్టన్: డీమోనిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) వల్ల నగదు కటకటతో ఆర్థిక వృద్ధికి తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడినప్పటికీ అవి తొలగిపోతున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) పేర్కొంది. ‘‘ఏడాది క్రితం చోటు చేసుకున్న డీమోనిటైజేషన్‌తో లాభాలేంటో చూస్తూనే ఉన్నాం. అవి ఇక ముందూ కొనసాగుతాయి’’ అని ఐఎంఎఫ్ డిప్యూటీ అధికార ప్రతినిధి విలియం ముర్రే చెప్పారు. మధ్య కాలానికి డీమోనిటైజేషన్ వల్ల చక్కని ప్రయోజనాలు సాకారమవుతాయన్న ఆయన... ఆర్థిక రంగ క్రమబద్ధీకరణ, ఆర్థిక కార్యకలాపాలపై తగిన సమాచారం, బ్యాంకింగ్ వ్యవస్థ, డిజిటల్ చెల్లింపులను మెరుగ్గా వినియోగించుకోవడం ద్వారా సమర్థవంతమైన చెల్లింపుల వ్యవస్థను ప్రయోజనాలుగా పేర్కొన్నారు. -
రెండువేల నోట్లను రద్దుచేస్తారా?
► రాజ్యసభలో విపక్షాల ప్రశ్న ► స్పందించని ఆర్థిక మంత్రి జైట్లీ ► ఉభయసభల్లో ప్రతిపక్షాల ఆందోళన న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రూ.2వేల నోట్లను రద్దుచేస్తారా అని విపక్షం రాజ్యసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం వెంటనే సమాధానమివ్వాలని డిమాండ్ చేసింది. రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ ‘ప్రభుత్వం రూ.2వేల నోట్లను రద్దుచేయాలని నిర్ణయించింది. ఈ నోట్ల ముద్రణను ఆపేయాలని రిజర్వ్ బ్యాంకు ఆదేశించింది. దీనిపై విధానమైన నిర్ణయమేదైనా తీసుకుంటే ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసే లోగా సభలో వెల్లడించాలి. రెండోసారి నోట్ల రద్దు చేపట్టాలన్న ఆలోచన ఉందా?’ అని ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ పక్షనేత ఆజాద్ జోక్యం చేసుకుని ప్రభుత్వం వెంటనే బదులివ్వాలని డిమాండ్ చేశారు. ‘రూ.వెయ్యి నాణేలను తెచ్చే ఆలోచన ఉందా?’ అని ప్రశ్నించారు. అయితే దీనిపై జైట్లీ స్పందించలేదు. మౌనంగానే ఉన్నారు. దీంతో మరో సారి నోట్లరద్దు జరగొచ్చని.. జైట్లీ మౌనం దీనికి నిదర్శనమని విపక్ష సభ్యులు అన్నారు. జైట్లీ వర్సెస్ విపక్షాలు బుధవారం రాజ్యసభ ప్రారంభం కాగానే.. బీజేపీ కావాలనే గాంధీ, నెహ్రూ, ఇందిరలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తోందని, దీనిపై చర్చ జరగాలని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ వాయిదా తీర్మానాన్నిచ్చారు. దీన్ని డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆమోదించా రు. ఈ దశలో జోక్యం చేసుకున్న రాజ్యసభ నాయకుడు, కేంద్ర మంత్రి జైట్లీ.. ‘విపక్షాలు వాయిదా తీర్మానాలను దుర్వినియోగం చేస్తున్నాయి. టీవీ చానెళ్లలో ప్రచారం కోసమే వీటిని వాడుకుంటున్నాయి’ అని విమర్శించారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ కేసుపై చర్చించాలంటూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఇచ్చిన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌తోపాటుగా ఇతర సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాలను చర్చించాలని జైట్లీ పట్టుబట్టారు. ‘ప్రచారం’ వ్యాఖ్యలపై భగ్గుమన్న విపక్షాలు జైట్లీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చాయి. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అటు, ఆరుగురు కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తేయాలం టూ లోక్‌సభలో విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఇది కొనసాగుతుండగానే.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సవరణ) బిల్లు– 2017 ఆమోదం పొందింది. -
‘మోదీ ఫొటోను చెప్పులతో కొట్టండి’
పట్నా: నోట్ల రద్దుకు నిరసనగా జరిగిన సభలో ప్రధాని మోదీని ఫొటోను చెప్పులతో కొట్టాలని బిహార్ ఎక్సైజ్ మంత్రి అబ్దులజలీల్ మస్తాన్ ప్రజలకు వివాదాస్పద విజ్ఞప్తి చేశారు. దీంతో కొందరు వేదికపై కుర్చీలోని మోదీ ఫొటోపై చెప్పులు విసిరారు. ఈ నెల 22న మంత్రి నియోజకవర్గమైన పూర్ణియా జిల్లా అమోర్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు మంగళవారం స్థానిక చానళ్లలో ప్రసారం కావడంతో దుమారం రేగింది. నోట్ల రద్దుతో తలెత్తిన సమస్యలను 50 రోజుల్లో పరిష్కరిస్తానని, అలా చేయకపోతే శిక్ష ఎదుర్కొంటానని ప్రధానే స్వయంగా చెప్పారని మస్తాన్ అన్నట్లు వీడియోలో ఉంది. -
‘నోట్ల రద్దు’ ముగిసినట్లే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ
లండన్ : భారత్‌లో నోట్ల రద్దు ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, ప్రపంచంలోనే సజావుగా సాగిన పెద్ద నోట్ల మార్పిడి ఇదేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక లండన్ స్కూలు ఆఫ్ ఎకనామిక్స్ విద్యా సంస్థలో శనివారం విద్యార్థులు, అధ్యాపకుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ... అధిక వృద్ధి రేటును సాధించేందుకు నోట్ల రద్దు నిర్ణయం దోహద పడుతుందని చెప్పారు. నగదు మారకంపై ఆధారపడ్డ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు డిజిటల్‌కు మారిందని జైట్లీ పేర్కొన్నారు. నోట్ల రద్దుతో బ్యాంకింగ్ వ్యవస్థలోకి అధిక నగదు చేరిందని, ఇది ఆదాయ ఉత్పత్తికి దారి తీస్తుందని చెప్పారు. అలాగే దీర్ఘకాలంలో అధిక జీడీపీ వృద్ధికి సాయపడుతుందన్నారు. ఈ సందర్భంగా వేల కోట్ల రుణ ఎగవేతదారు విజయ్ మాల్యాను పరోక్షంగా ప్రస్తావిస్తూ జైట్లీ ప్రసంగించారు. బ్రిటన్ లో ప్రజాస్వామ్యం మరింత ఉదారంగా... రుణ ఎగవేతదారులు తలదాచుకునే దేశంగా ఉందని వ్యాఖ్యానించారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా... లండన్ వచ్చి తలదాచుకోవచ్చని చాలామంది అనుకుంటున్నారని, ఆ నమ్మకాన్ని పటాపంచలు చేయాలని జైట్లీ అభిప్రాయపడ్డారు. -
నోట్లరద్దు నిర్ణయం దారుణం
రాజ్యసభలో ప్రభుత్వంపై చిదంబరం తీవ్ర విమర్శలు న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశపరిచిందని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ ఎంపీ చిదంబరం రాజ్యసభలో ధ్వజమెత్తారు. 2017–18 బడ్జెట్‌పై మాట్లాడుతూ.. మోదీ నోట్లరద్దు నిర్ణయం అత్యంత దారుణమైనదని అభివర్ణించారు. ఈ నిర్ణయం వల్ల అవినీతి, నల్లధనం తగ్గకపోగా దేశ ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపిందని మండిపడ్డారు. ‘తడబాటు, గందరగోళం, తలాతోకాలేని విధానం’తో ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ‘ఎన్ ఎస్ఎస్ఓ లెక్కల ప్రకారం దేశంలో 40 కోట్ల మంది రోజూవారీ కూలీలున్నారు. మీ నిర్ణయంతో వీరి జీవితాలు అగమ్యగోచరంగా మారాయి’ అని విమర్శించారు. అటు లోక్‌సభలో యూపీఏ ప్రభుత్వం తీసుకున్న విధానాల ద్వారా జరిగిన నష్టాలను జైట్లీ ఎండగట్టారు. -
ఎన్నికలు–నోట్ల రద్దు వేరువేరు!
ఐదు రాష్ట్రాల్లో విజయం మాదే! ► రామమందిరం జాతీయ స్వాభిమానాంశం ► అభివృద్ధే ఎజెండా ► సాక్షి ఇంటర్వ్యూ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సాక్షి ప్రతినిధి : దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. అధికారంలో ఉన్న బీజేపీకి కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో యూపీతోపాటుగా పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికల్లో నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం ఎంత? అభివృద్ధి నినాదం పనిచేస్తుందా? లేక రామమందిరం మరోసారి ఊపిరిపోస్తుందా? మణిపూర్‌లో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందా? అనే అంశాలపై మణిపూర్‌లో పార్టీ బాధ్యతలు చూస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంట ర్వ్యూవిశేషాలు. ఐదు రాష్ట్రాల్లో పరిస్థితిపై... ఈ ఐదు రాష్ట్రాల్లో గెలవటం మాకు చాలా కీలకం. ఐదుచోట్లా గెలిచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. యూపీలో ఎస్పీ–కాంగ్రెస్ ఏకమై బీజేపీ విజయాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయి. ప్రజలకు మోదీ పాలనపై అపారమైన విశ్వాసం ఉంది. ప్రజలు అభివృద్ధినే విశ్వసిస్తారు. మా ప్రచారం కూడా అభివృద్ధి ఎజెండాగానే సాగుతోంది. యూపీలో కచ్చితంగా కనీస మెజారిటీని సంపాదిస్తాం. పంజాబ్‌లో గట్టిపోటీ ఉంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకత సహజమే. అయినా మాకే విజయావకాశాలున్నాయి. గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌ల్లోనూ గెలుస్తాం. ఓట్లకోసమే ‘రామమందిరం’ మళ్లీ తెరపైకి తెచ్చారన్న విమర్శలపై ఈ ఆరోపణలు అర్థరహితం. 1989 నుంచీ బీజేపీ అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని జాతీయ స్వాభిమానాంశంగా గుర్తించి మేనిఫెస్టోలో పెడుతూ వస్తోంది. దీన్ని మతపరమైన అంశంగా మేమెప్పుడూ గుర్తించలేదు. రామమందిర నిర్మాణం అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున దీనిపై వ్యాఖ్యానించటం సరికాదు. ట్రిపుల్ తలాక్‌పై..: ట్రిపుల్ తలాక్ అంశం మేం లెవనెత్తింది కాదు. ముస్లిం మహిళలే తమ స్వాభిమానం కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాతే ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై మీ అభిప్రాయం చెప్పమని సుప్రీంకోర్టు అడిగినప్పుడే ప్రభుత్వం స్పందించింది. మణిపూర్‌లో పరిస్థితేంటి? మణిపూర్‌లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. దీనికి కారణం అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వమే. తన పీఠాన్ని కాపాడుకునేందు కు నాగాలు, మైతీల మధ్య కాంగ్రెస్ చిచ్చుపెడుతూ వచ్చింది. అదే నేటి పరిస్థితి (బంద్‌లు హింసాత్మకంగా మారాయి)కి కారణమైంది. చాలా సమస్యలు మణిపూర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. మేం కూడా ‘చేంజ్, ప్రొగ్రెస్, డెవలప్మెంట్’ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. నోట్లరద్దు... బీజేపీకి వరమా? శాపమా? నోట్లరద్దు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం కాదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం. అయినా ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందా లేదా అన్నది ఎన్నికల ఫలితాల తర్వాతే విశ్లేషణ చేయాలి. ఒకటి మాత్రం స్పష్టం. దేశంలో 70–80 శాతం ప్రజలు ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. మాది మాటల ప్రభుత్వం కాదు. చేతల ప్రభుత్వం. 2019 ఎన్నికలే మోదీ ప్రభుత్వం పనితీరుకు రెఫరెండం. -
నోట్ల రద్దుకు ప్రజల మద్దతు: దత్తాత్రేయ
ఇటీవలి స్థానిక, ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు పెద్ద కుంభకోణమంటూ కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఖండించారు. రద్దు తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి, ఎన్డీఏకి మద్దతు తెలపడం ద్వారా మోదీకి ప్రజలు అందించిన మద్దతు స్పష్టమవుతోందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలో జరిగే అన్ని ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ.. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పనిగట్టుకుని అవినీతి కోణాన్ని చూపుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు. లంచాలను తీసుకోవడంలో చిదంబరం పరిజ్ఞానాన్ని ప్రశ్నించ దలుచుకోలేదని.. ప్రతిభ గల న్యాయవాదిగా చిదంబరం రూ. 2వేలు లంచంగా ఎలా తీసుకోవచ్చో ప్రజలకు సలహాలు ఇవ్వొచ్చని వ్యంగ్యంగా అన్నారు. అయితే ప్రస్తుతమున్నది ఎన్డీఏ ప్రభుత్వమని గుర్తించాలని, ఇలాంటి చర్యలకు పాల్పడితే పట్టుబడటం ఖాయమని చెప్పారు. -
పంట రుణాలపై 660 కోట్ల వడ్డీ మాఫీ
నవంబర్, డిసెంబర్లకు వర్తింపు ► గృహ రుణ వడ్డీ రాయితీ పథకానికి ఓకే ► వరిష్ట పెన్షన్ బీమా యోజనకూ ఆమోదం ► కేంద్ర కేబినెట్ నిర్ణయాలు న్యూఢిల్లీ: నోట్ల రద్దుతో నగదు దొరక్క ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం కాస్త ఊరట కల్పించింది. సహకార బ్యాంకుల నుంచి 2016 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య తీసుకున్న స్వల్పకాలిక పంటరుణాలపై ఆ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలకుగాను రూ. 660.50 కోట్ల వడ్డీని మాఫీ చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్, డిసెంబర్ల వడ్డీని చెల్లించిన రైతులకు ఆ మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తుందని వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ చెప్పారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సహకార బ్యాంకులకు 4.5 శాతం వడ్డీతో రుణంగా ఇవ్వడానికి రూ. 20 వేల కోట్ల రుణాలను తీసుకునేందుకు నాబార్డ్‌కు కేబినెట్ అనుమతినిచ్చింది. 1.8 శాతం వడ్డీ రాయితీ, 0.2 శాతం పాలనా వ్యయాన్ని నాబార్డ్ భరించేందుకు రూ. 400 కోట్ల గ్రాంట్ కూడా ఇవ్వాలని నిర్ణయించింది. గృహ రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ గ్రామీణ ప్రజలు కొత్త ఇళ్లు కట్టుకోవడానికి, లేదా ప్రస్తుత ఇళ్ల అభివృద్ధి కోసం తీసుకునే గృహ రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ ఇచ్చే పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాసయోజన(గ్రామీణ్) కిందికి రాని ప్రతి కుటుంబానికీ రూ. 2 లక్షల వరకు రుణంపై ఈ రాయితీ ఇస్తారు. దీనితో పేదలకు నెల వాయిదాల(ఈఎంఐ)పై భారం తగ్గుతుందని, ఈ పథకాన్ని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అమలు చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రధాని మోదీ కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా ఈ పథకాన్ని ప్రకటించడం తెలిసిందే. సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీ సీనియర్ సిటిజన్లకు పదేళ్లపాటు ఏటా 8 శాతం వడ్డీ ఇచ్చే వరిష్ట పెన్షన్ బీమా యోజన–2017 పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది.. వీటిలో దేన్ని ఎంచుకుంటే దాని ప్రాతిపదికగా పెన్షన్ అందిస్తారు. ఎల్ఐసీ అమలు చేయనున్న ఈ పథకంలో 60 ఏళ్లు, ఆపై వయసున్న వారు పథకం మొదలైన నాటి నుంచి ఏడాది లోపల చేరవచ్చు. ఐఐఎంల నుంచి ఇక డిగ్రీలు దేశంలోని 20 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లు ఇకపై తమ విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా, ఫెలో ప్రోగ్రామ్స్ ఇన్ మేనేజ్మెంట్లు కాకుండా ఎంబీఏ వంటి డిగ్రీలు, పీహెచ్‌డీలు ఇవ్వనున్నాయి. ఐఐఎంలను ఇకపై జాతీయ ప్రాధాన్య సంస్థలుగా గుర్తిస్తారు. దీనికి సంబంధించిన ఐఐఎం–2017 బిల్లును కేబినెట్ ఆమోదించింది. దీన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఐఐఎంలకు సంపూర్ణ స్వయంప్రతిపత్తిపై బిల్లు దృష్టి సారించిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఐఐఎంలు సొసైటీల చట్టం కింద రిజిస్టర్ అయి ఉండడంతో వీటికి డిగ్రీలు ఇచ్చే అవకాశం లేదు. ఈ సంస్థలు ఇచ్చే డిప్లమాలు, ఫెలో ప్రోగ్రామ్‌లు.. ఎంబీఏ, పీహెచ్‌డీలకు సమానంగా భావిస్తున్నా వీటి సమానత్వంపై సార్వత్రిక ఆమోదం లేదు. కాగా, హరితవాయు ఉద్గారాల కట్టడికి కోసం క్యోటో ప్రొటోకాల్ రెండో దశ అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నారైలకు ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనూ, ప్రతినిధి ద్వారానూ ఓటు వేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనను వాయిదా వేసింది. -
దోపిడీ రాజ్యం
భైంసా :ఎలాంటి పరిస్థితులైనా వ్యాపారులకే కలిసి వస్తున్నాయి. అవకాశాలను తమవైపు తిప్పుకుని డబ్బులను సంపాదించడంలో ఆరితేరిన వారు భైంసా మార్కెట్లో తమదైన శైలిలో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పాత నోట్ల రద్దు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఏ రోజు బ్యాంకు గడప తొక్కని వారికి అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. రైతులు ఆరుగాలం శ్రమించి పంట చేతికి వచ్చిన సమయంలోనే ఈ పరిస్థితి వచ్చింది. దీంతో అమాయక రైతులు ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా భావించి పలువురు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. రైతులకు అవసరం ఉన్న నగదును ఇవ్వాలంటే దానికి వ్యాపారులు అడత్(కమీషన్ ) ధరను మరింతగా పెంచేశారు. కూలీలకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో రైతులు చేసేది లేక వ్యాపారులు ఎలాచెబితే అలా ఒప్పుకుంటున్నారు. పలువురు వ్యాపారులు ఎంచక్కా చేతి నిండా నగదు ఉంచుకుని ప్రతీ రోజు మార్కెట్‌కు వెళ్లి డబ్బు అవసరం ఉన్న రైతులతో బేరం కుదుర్చుకుని తమ వ్యాపారం కానిచ్చేస్తున్నారు. సీజన్ ప్రారంభం నుంచే... రైతులకు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నా ఇప్పటి వరకు అందులో లావాదేవీలు జరుపలేదు. ఖాతాలకు సంబంధించి ఏటీఎం కార్డులు లేవు. నిరక్ష్యరాస్యులైన రైతులకు బ్యాంకు అధికారులు చెక్కులు కూడా ఇవ్వలేదు. సగానికి పైగా రైతులకు బ్యాంకు ఖాతాలే లేవు. నగదు లావాదేవీలకు అలవాటు పడ్డ రైతులకు ఇప్పటి వరకు ఏ పంట అమ్మినా చెక్కు తీసుకున్న పరిస్థితులు కూడా తలెత్తలేదు. అలాంటి ఈ ఏడాది సీజన్ ప్రారంభంతోనే నగదు కష్టాలు ఆరంభమయ్యాయి. భైంసా మార్కెట్లో సోయా, కందులు, మినుము, పెసర, పత్తి పంటలు విక్రయానికి తీసుకువెళ్తున్నారు. సీజను ప్రారంభం నుంచే నగదు ఇవ్వమని వ్యాపారులు చెప్పేస్తున్నారు. అమ్మిన పంటకు చెక్కులు ఇచ్చేస్తామని చెప్పడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకు ఖాతాలు లేక... పంట పొలంలో కూలీలతో పని చేయించి వారికి ఇచ్చేందుకు కూడా రైతుల చేతిలో చిల్లిగవ్వ ఉండడంలేదు. ఏడాదిలో ఒక్కసారే పంట అమ్మకంతో డబ్బులురైతుల చేతుల్లోకి వస్తాయి. ఇలాంటి తరుణంలో వచ్చే డబ్బులు కూడా చెక్కుల రూపంలో అందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఖాతాలు ఉన్న అధికారులు చెక్కు ట్రాన్స్ ఫర్ చేసేందుకు పక్షం రోజులు చేస్తున్నారు. రైతులు చెక్కులను పట్టుకుని బ్యాంకుల్లో నిరీక్షిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు లేని రైతులైతే ప్రతీ రోజు దరఖాస్తులు పట్టుకుని తిరుగుతున్నారు. కొత్తగా ఖాతాలు ఇవ్వక చెక్కులు వేసుకోలేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సొమ్ము చేసుకుంటూ... బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు నగదు కావాలని వ్యాపారుల వద్ద ప్రాధేయ పడుతున్నారు. ఈ పరిస్థితిని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాగైనా రైతులకు డబ్బు అవసరం రావడంతో పంట అమ్మితే వచ్చే డబ్బులపై ఒక్కసారిగా అడత్(కమీషన్ ) పెంచేశారు. కొంతమంది ఇదే వ్యాపారాన్ని చేస్తున్నారు. నూటికి ఆరు నుంచి ఏడు రూపాయల వరకు అడత్ రూపంలో కట్ చేసుకుని రైతులకు డబ్బులు ఇస్తున్నారు. క్వింటాలు పత్తి అమ్మితే రైతు చేతికి రూ.5 వేలు అందుతాయి. నగదు కావాలంటే రైతు వ్యాపారుల వద్ద రూ.300 నుంచి రూ.350 వరకు అడత్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. ఇలా అడత్ రూపంలో డబ్బులు ఇచ్చిన వ్యాపారులు రైతులు తీసుకువచ్చిన పంటను తమ పేరిట విక్రయించి చెక్కులు తీసుకుంటున్నారు. బ్యాంకుల్లో తిరగలేక చెక్కులు ఇచ్చిన డబ్బులు సమయానికి అందక రైతులు వచ్చినకాడికి సరేనని వ్యాపారులకే ఎక్కువ మొత్తం అడత్కు పంటను విక్రయించి నగదు పట్టుకువెళ్తున్నారు. ఈ వ్యాపారం అధికారుల కళ్లముందే జరుగుతున్నా ఏ ఒక్కరూ చర్యలు తీసుకోవడంలేదు. రైతులు వెళ్తే కసురుకునే బ్యాంకు సిబ్బంది వ్యాపారులకైతే అడిగినంత డబ్బులు ఇస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దృష్టి సారిస్తే... ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించి రైతులు పడుతున్న నగదు ఇక్కట్లను తీర్చాలి. ఆరుగాలం శ్రమించి వచ్చిన పంటను అమ్ముకునే సమయంలో తలెత్తుతున్న పరిణామాలతో రైతన్నకు అండగా నిలబడాలి. రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది రైతులకు పంట అమ్మే సమయంలో తలెత్తుతున్న పరిస్థితులను చక్కదిద్దాలి. బ్యాంకుల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. పట్టాపాసు పుస్తకాలతో వెళ్తున్న బ్యాంకు ఖాతాలు లేని రైతులకు తక్షణమే ఖాతాలు ఇచ్చేయాలి. పంట అమ్మిన రోజునే చెక్కు ఇస్తే అలాంటి రైతులకు కొంతమేర నగదు అదే రోజున ఇప్పించాలి. ఇలా చేస్తే రైతులు ఇంటికి వెళ్లి పంట కోసం కూలీలకు కొంత మేర నగదును ఇవ్వగలుగుతారు. అధికారులు రైతుల పక్షాన నిలబడి వారి ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించాలి. ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాల్లో రైతుల పేరిట అధిక మొత్తంలో జరిగిన పంట లావాదేవీలపైన దృష్టి సారించాలి. అలాంటి ఖాతాలపైన దృష్టిపెట్టి పెద్ద మొత్తంలోనే నగదు కోసం అడత్ రూపంలో రైతులు నష్టపోయిన డబ్బులను ఇప్పించాలి. లేనిపక్షంలో ఈ ఏడాది కూడా రైతులు నగదు లావాదేవీలు లేక పంట అమ్మిన పూర్తిస్థాయిలో నష్టపోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. -
నోట్ల రద్దు నష్టం రూ.1.28 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వంపై ఉత్తమ్ ధ్వజం ► మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని మండిపాటు ►ఆర్బీఐ కార్యాలయం ఎదుట టీ పీసీసీ ధర్నా సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం అపార నష్టం కలిగించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ .ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు అనిల్ శాస్త్రి మండిపడ్డారు. మోదీ సర్కారు అనాలోచిత, మూర్ఖపు, పిచ్చి తుగ్లక్ నిర్ణయం వల్ల అన్ని రంగాలకు దాదాపు రూ. 1.28 లక్షల కోట్ల నష్టం కలిగిందన్నారు. నోట్ల రద్దును నిరసిస్తూ హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రాంతీయ కార్యాలయం ఎదుట టీ పీసీసీ శుక్రవారం ధర్నా నిర్వహించింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్ష నేతలు కె. జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతోపాటు కాంగ్రెస్ సీనియర్లంతా ధర్నాలో పాల్గొన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పేదలపై సర్జికల్ స్ట్రైక్ అన్నారు. దేశంలో 86 శాతం చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా పేదలు, మధ్య తరగతి ప్రజలు, రైతులు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రధాని తన నిర్ణయంతో ఆర్బీఐపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని కూడా దెబ్బ తీశారని విమర్శించారు. ఈ నిర్ణయం తర్వాత 138 సార్లు నగదు డిపాజిట్లు, ఉపసంహరణల నిబంధనలను మార్చారన్నారు. నగదు కోసం బ్యాంకుల వద్ద కూలైన్లలో నిలబడి దాదాపు 120 మంది ప్రాణాలను పోగొట్టుకున్నారని, ఇందుకు బాధ్యత వహించి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. మాట మార్చిన మోదీ... పెద్ద నోట్ల రద్దు జాతీయ స్థూల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిందని, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్నదని, రబీలో సాగు విస్తీర్ణం చాలా వరకు పడిపోయిందని ఉత్తమ్ పేర్కొన్నారు. నోట్ల రద్దుతో నల్లధనం బయటకు రాకపోగా, నిజాయితీపరులే నగదు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో నల్లధనం బయటకు రాకపోవడంతో ప్రధాని మోదీ నగదు రహిత, డిజిటల్ లావాదేవీలంటూ కొత్తరాగం అందు కున్నారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని ఆర్బీఐ కార్యాలయంలో నోట్ల మార్పిడి లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రజలు నోట్లను మార్చుకోవాలనుకుంటే నాగపూర్, చెన్నై ఆర్బీఐ కార్యాలయాలకు వెళ్లాలని బ్యాంకులు చెబుతున్నా యని...దీనిపై సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నోట్ల రద్దును తొలుత దిక్కుమాలిన నిర్ణయంగా అభివర్ణించిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత మాటమా ర్చడంలో మతలబు ఏమిటో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ధర్నాలో ఏఐసీసీ కార్యదర్శులు ఆర్.సి.కుంతియా, జి.చిన్నారెడ్డి, వి.హన్మంతరావు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, డి.కె.అరుణ, సునీతా లక్ష్మా రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆకుల లలిత, రంగారెడ్డి, నేతలు నేరెళ్ల శారద, అంజన్ కుమార్ యాదవ్, దాసోజు శ్రవణ్, బండ కార్తీకరెడ్డి పాల్గొన్నారు. నష్టపోతున్నామంటూ కేంద్రానికి మద్దతేల? పెద్ద నోట్ల రద్దు వల్ల రుణమాఫీ చేయలేకపోతున్నా మని, ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేకపోతున్నా మని, ఆదాయం పడిపోయిందని చెబుతున్న కేసీఆర్... మోదీ ప్రభుత్వానికి ఎందుకు మద్దతిస్తున్నారని ఉత్తమ్, నోట్ల రద్దు వ్యతిరేక ఉద్యమ కార్యాచరణ కమిటీ చైర్మన్ పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దును దిక్కుమాలిన నిర్ణయమంటూ అసహనం ప్రదర్శించిన కేసీఆర్... ఉన్నఫళంగా వైఖరిని ఎందుకు మార్చుకున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో వారు విలేకరులతో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్... కేంద్రానికి మద్దతు ఇవ్వడంలో అసలు రహస్యం ఏమిటో ప్రజలే చర్చించుకుంటున్నారని చెప్పారు. పేద మహిళల ఖాతాల్లో రూ. 25 వేలు డిపాజిట్ చేయాలి: అనిల్‌శాస్త్రి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు అనిల్ శాస్త్రి మాట్లాడుతూ విదేశీ కంపెనీలకు ప్రజాధనాన్ని దోచిపెట్టడానికి, దేశంలోని బడా కంపెనీలను బాగుచేయడానికే మోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. నోట్ల రద్దుతో నష్టపోయిన ప్రజలకు ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు బ్యాంకులో వేసుకున్న నగదును ఉపసంహరించుకోవడానికి పరిమితు లను తొలగించాలని డిమాండ్ చేశారు. పేద మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ. 25 వేల చొప్పున జమ చేయాలని కోరారు. అలాగే ఉపాధి హామీ చట్టం కూలీ రేట్లు పెంచాలని, పని దినాలను రెట్టింపు చేయాలని, చిరు వ్యాపారులకు పన్ను మినహాయింపునివ్వాలని డిమాండ్ చేశారు. 27న జన ఆవేదన సమ్మేళనం పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను కేంద్రానికి తెలియ జేప్పేందుకు ఈ నెల 27న సికింద్రాబాద్‌లో భారీగా జన ఆవేదన సమ్మేళనాన్ని నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. నోట్ల రద్దుపై టీపీసీసీ ఉద్యమ కార్యాచరణ కమిటీ చైర్మన్ పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన శుక్రవారం గాంధీ భవన్ లో సమావేశమైంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా ముఖ్య నేతలంతా ఈ భేటీకి హాజరయ్యారు. -
మోదీపైనే అవినీతి మరకలు...
సురవరం సుధాకర్‌రెడ్డి జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మహబూబ్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశం నుంచి అవినీతిని పారదోలుతానని చెబుతున్న ప్రధాని మోదీనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నారు. ఆయన నల్లధనాన్ని పారదోలుతానని నీతులు చెబితే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. చంద్రబాబు మిత్రుడు శేఖర్‌రెడ్డికి రూ.100కోట్ల కొత్త నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ప్రపంచశాంతికి పోరాడుదాం: ‘అణుబాంబులు.. మారణా యుధాలు.. ఉగ్రవాదులు లేని నూతన శాంతి ప్రపంచం నిర్మాణం కోసం ప్రతిపౌరుడు కృషి చేయాలని, దీనికి ప్రభుత్వాల నుంచి మద్దతుకావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కోరారు. వీటన్నింటికీ పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమ వుతుందన్నారు. అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభను ఆయన ప్రారంభించారు. అప్పట్లో రాజ్యాలు.. నీళ్ల కోసం యుద్ధాలు జరిగితే ప్రస్తుతం మతాల కోసం దాడులు చేసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు ఆయుధాల కొనుగోలు కోసం కేటాయించే నిధుల్లో 10 శాతం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజల ప్రగతికి ఖర్చు చేస్తే పేదరికం మాటే ఉండదన్నారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి మాట్లా డుతూ ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు పోయి రాద్ధాంతాల కోసం ఒకరిపై మరొకరు విమర్శలకు దిగుతున్నారన్నారు. మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి శ్రావణ్‌కుమార్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రజల నెత్తిపై మోది వేశారు
► పెద్దలను వదలి పేదలపై పడ్డారు ► ప్రధానిది అనాలోచిత చర్య : జయప్రకాష్ నారాయణ్ ► పెద్దల అభిప్రాయాలతో ప్రధానికి నివేదిక ► ‘నోట్ల రద్దు–భావి మార్గం’ అంశంపై ఇండియా నెక్ట్స్ చర్చా గోష్టి సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వివిధ రంగాలకు చెందిన పెద్దలంతా ముక్తకంఠంతో నిరసించారు. ఇది అనాలోచిత, తొందరపాటు చర్య అని అభివర్ణించారు. ఖాతాదారులు బ్యాంకుల్లోని తమ సొమ్మునే డ్రా చేసుకునే వీలులేకుండా చేయడం రాజ్యాగం ఉల్లంఘన కిందకే వస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘నోట్ల రద్దు–భావి మార్గం’ అంశంపై ఇండియా నెక్ట్స్ అనే స్వచ్ఛంద సంస్థ శనివారం చెన్నైలో చర్చా గోష్టి కార్యక్రమాన్ని నిర్వహించింది. మూడున్నర గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన మేధావులు, విద్యావేత్తలు, ప్రముఖులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన జయప్రకాష్ నారాయణ్ కీలకోపన్యాసం చేస్తూ, ప్రధాని ఆశయం మంచిదైనా పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోకుండా ఆచరణలో సాధకబాధకాలు బేరీజు వేసుకోకుండా ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకోవడం అనుచితమని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త నోట్ల ముద్రణలో ఆర్బీఐ సామర్థ్యాన్ని తెలుసుకోకుండా పాత నోట్ల రద్దు దేశ ప్రజలను గందరగోళానికి గురిచేసిందని అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోదీ ప్రకటించినపుడు మద్దతు ప్రకటించిన వాళ్లలో తాను ప్ర«థముడని అన్నారు. అయితే కాలక్రమేణా దాని పర్యవసానాలు గమనిస్తే ఇది ఎంత అనాలోచిత చర్యనో అర్థమైందని అన్నారు. నోట్ల రద్దు వల్ల సామాన్య ఉద్యోగులు, చిన్నపాటి వ్యాపారస్తులు, ప్రజలు ఇలా అన్ని వర్గాలవారు తమ డబ్బును తాముతీసుకోలేక పడుతున్న కష్టాలను, దీని వల్ల స్తంభించిపోయిన ఆర్థిక కార్యకలాపాలను వివరించారు. నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్ద వాళ్లను వదిలేసి కాయకష్టం మీద చిన్నచిన్న సంపాదనలపై ఆధారపడి జీవిస్తున్న చిరుద్యోగులు, కార్మికులు, రైతుల జీవనం అస్తవ్యస్తమైందని ఆయన అన్నారు. మాజీ ప్రధాన మంత్రి సమాచార సలహాదారు, కేంద్ర ప్రభుత్వ మాజీ అధికార ప్రతినిధి ఎస్ నరేంద్ర మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలు పాలనపారమైన సమస్యలను దృష్టిలో పెట్టుకోకుండా ప్రధాని తొందరపాటుæ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల స్థాయిలోని అవినీతి సమస్యను చర్చించి ముందుజాగ్రత్త చర్యలతో పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. వ్యాధి నివారణకు కొన్నిసార్లు చేదు మందులు, మరికొన్నిసార్లు సర్జరీలు కూడా అవసరమని డాక్టర్ సీఎంకే రెడ్డి అన్నారు. ఈ నోట్ల రద్దును కూడా ఆదే దృష్టితో చూడాలని అన్నారు. గతాన్ని వదిలేసి ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. ప్రముఖ వ్యాపారవేత్త, ఇండియా నెక్ట్స్ సలహామండలి వైస్ చైర్మన్ అనిల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కొందరు నల్లకుబేరులను పట్టుకునేందుకు ప్రజలందరినీ క్రిమినల్స్‌గా చూడటం సరికాదని హితవు పలికారు. పైగా నోట్ల రద్దు తరువాత దేశవ్యాప్తంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కబెట్టడంలో ప్రభుత్వం సమర్దవంతంగా వ్యవహరించలేదని అన్నారు. దక్షిణ భారత తెలుగు చలన చిత్ర మండలి గౌరవ కార్యదర్శి, నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయం సినిమా రంగాన్ని తీవ్రంగా కుంగదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్లకు ప్రేక్షకులు తగ్గిపోయారు, షూటింగులు నిలిచిపోయాయని అన్నారు. నగదు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం సినిమారంగానికి కొంత మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇండియా నెక్ట్స్ ప్రధాన కార్యదర్శి మాలినేని అమరేంద్ర స్వాగతోపన్యాసం చేస్తూ, నల్ల ధనం నిర్మూలనకు నోట్ల రద్దు నిర్ణయం మంచిదైనా ప్రభుత్వం చేసిన ప్రకటనలు, ఆంక్షలు ప్రజల్లో అనేక భయ సందేహాలను సృష్టించాయని అన్నారు. దీనిని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేఅన్నారు. సదస్సులో మాట్లాడిన ప్రముఖలంతా ఏటీఎంల పరిస్థితిని సరిచేసి సామాన్య, పేద ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరారు. ఏకపక్షంగా ఎలాంటి ముందుస్తు చర్యలు లేకుండా ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం బాధాకరమని అన్నారు. ఇది ప్రాధమిక హక్కులకు భంగకలిగించేంతటి పరిణామాలకు దారితీసిన ఈ దేశ ప్రజలు సహనంతో భరిస్తున్నారని జేపీ, నరేంద్ర తదితరులు అన్నారు. వక్తల అభిప్రాయాలతో ఒక నివేదికను ప్రధానికి, ఆర్దికశాఖస్థాయి సంఘానికి సమర్పించాలని సదస్సు తీర్మానించింది. ఈ సదస్సులో తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్, హిందూ దినపత్రిక అసోసియేట్ ఎడిటర్ కే టీ జగన్నాథన్, మాజీ ఐఏఎస్ అధికారులు ఎన్ మురుగన్, రాజ్‌కుమార్, చార్టెడ్ అకౌంటెంట్ల సంఘం దక్షిణాది రాష్ట్రాల విభాగం అధ్యక్షులు వీ మురళి, సైబర్ సొసైటీ ఆఫ్ ఇండియా పాలనామండలి చైర్మన్ వీ రాజేంద్రన్, డాక్టర్ సీఎంకే రెడ్డి, ఐక్యరాజ్యసమితి ఉద్యోగి వీ హరిప్రసాద్, ప్రైంపాయింట్ ఫౌండేషన్ చైర్మన్ ఏ శ్రీనివాసన్, అడయార్ ఆనంద భవన్ మేనేజింగ్ డైరెక్టర్ కేటీ శ్రీనివాసరాజా, కేసీపీ సిమెంట్ లిమిటెడ్ ఎగ్జిక్యుటీవ్ ప్రెసిడెండ్ ఏ శివరామప్రసాద్, విజయ్ హాస్పిటల్స్ జనరల్ మేనేజర్ డీ రాంబాబు, ఎస్‌ఏఈ ఎండి ఎగ్జిక్యుటీవ్ డైరెక్టర్ శేషాద్రి, సిమ్సన్ అండ్ కంపెనీ కార్యదర్శి, కలప, బంగారు వ్యాపారవేత్త జోయల్ వక్తలుగా పాల్గొని తమరంగాల్లో నోట్లరద్దు ప్రభావాన్ని, సాధకబాధకాలు వివరించారు. ఇండియన్ నెక్ట్స్ అధ్యక్షులు దువ్విగుంట వెంకటేశ్వర్లు, కోశాధికారి పెమ్మసాని మురళి, సలహా మండలి చైర్మన్ పద్మయ్య, పారిశ్రామికవేత్త అనిల్‌కుమార్ రెడ్డి ఈ సదస్సుకు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. -
ఆ బ్లాక్‌మనీ ఎంతో బయటపెట్టండి
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ డిమాండ్ సాక్షి, సూర్యాపేట: పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో బ్లాక్‌మనీ వెలికితీత, ఉగ్రవాదంపై ఉక్కుపాదం, నకిలీ నోట్ల చలామణి అరికడతామని చెప్పిన ప్రధాని.. ఇప్పటి వరకు ఎంత మంది వద్ద ఉన్న బ్లాక్ మనీని బయట పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు శనివారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షకు హాజరైన ఉత్తమ్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయం వల్ల దేశ ప్రజలు రోడ్డున పడ్డారని అన్నారు. ప్రజలకు బాసటగా నిలవాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మోదీకి వంత పాడ టం సిగ్గుచేటన్నారు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, సంక్షేమ రుణాలు, మధ్యాహ్న భోజనం బిల్లులు అందించేం దుకు డబ్బులు లేవని చెబుతున్న ముఖ్య మంత్రి.. మిషన్ భగీరథ, ఇరిగేషన్ కాంట్రా క్టర్లకు రూ.20 వేల కోట్లు చెల్లించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. వారికి బుద్ధి చెప్పాలి: జానా సీఎల్పీ నేత కె.జానారెడ్డి మాట్లాడుతూ నోట్ల రద్దుతో పేదలకు, కూలీలకు పని దొరక డంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కొత్త హామీలు కురి పించి తిరిగి అధికారంలోకి రావాలని చూస్తు న్నారని, వచ్చే ఎన్నికల్లో వీరిద్దరికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మోదీ కక్కుర్తి: కుంతియా ఏఐసీసీ కార్యదర్శి రామచంద్రన్ కుంతియా మాట్లాడుతూ డెబిట్, క్రెడిట్ కార్డుల చెలామణి పేరుతో అంతర్జాతీయ సంస్థలకు లాభం చేకూరుస్తున్నారని ఆరోపించారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి మోదీ తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిం దన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, ఏఐసీసీ కో–ఆర్డినేటర్ చార్లెస్ పాల్గొన్నారు. -
నోట్లరద్దే మన ప్రచారాస్త్రం!
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అమిత్ షా ► సర్జికల్ దాడులు, నోట్లరద్దు చారిత్రక నిర్ణయాలని ప్రశంస ► ఐదు రాష్ట్రాల్లో విజయం సాధిస్తామంటూ ధీమా సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నోట్లరద్దే ప్రధాన ప్రచారాస్త్రమని.. దీని వల్ల జరిగే మేలును సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని షా ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. కోజికోడ్‌లో జరిగిన పార్టీ కార్యవర్గ భేటీ తర్వాత మోదీ ప్రభుత్వం సాహసోపేతమైన, చరిత్రాత్మక నిర్ణయాలు చేపట్టిందని చెప్పారు. పాకిస్తాన్ పై సర్జికల్ దాడులు, పెద్ద నోట్ల రద్దు నిర్ణయాలకు ప్రజలు, ప్రత్యేకించి పేదలు మద్దతు పలికారన్నారు. ఇవే ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్రా్తలన్నారు. నోట్ల రద్దు వల్ల పన్నుకట్టేవారి సంఖ్య పెరగటంతో.. ప్రభుత్వానికి ఆదాయం మరింత పెరిగి.. పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చన్నారు. ఇదే విషయాన్ని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. పాకిస్తాన్ ప్రచ్ఛన్న యుద్ధాన్ని కొనసాగిస్తే మరోసారి భారత్ భారీ చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ కార్యవర్గ సమావేశం వివరాలను కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. కొద్దిరోజులపాటు ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నా.. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం సహనంగా మద్దతు తెలిపారని.. దీని వల్ల దేశవ్యాప్తంగా నగదురహిత లావాదేవీలు, డిజిటల్ లావాదేవీలు పెరిగాయన్నారు. వారం రోజుల క్రితం ప్రధాని విడుదల చేసిన ‘భీమ్’ యాప్‌ను 70 లక్షల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారన్నారు. 5 రాష్ట్రాలలో ఎన్నికలను అమిత్ షా ప్రస్తావిస్తూ పార్టీకి కార్యకర్తలు, నాయకులే బలమని.. ఈ రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఏ మార్పుకోసమైతే మోదీ నాయకత్వంలోని ఎన్డీఏకు ప్రజలు మద్దతిచ్చారో.. ఆ మార్పును గమనిస్తున్నందున రాష్ట్రాల్లోనూ బీజేపీకి పట్టంగడతారన్నారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం, పార్టీలకు అందే నిధులపై పారదర్శకతపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరగాల్సిన ఆవశ్యతపై సమావేశంలో చర్చించినట్లు జవదేకర్ వెల్లడించారు. మమతది రాజకీయ అసహనం విపక్షాలు.. ప్రజావ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్న రాజకీయ తీర్మానాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకొని ప్రజాస్వామ్య సంస్థలపై గౌరవాన్ని మంటగలిపాయని తీర్మానంలో పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ ప్రభుత్వ దుష్పరిపాలనలో రాజకీయ కార్యకలాపాలు దుర్భరమయ్యాయని, బీజేపీ ప్రధాన కార్యాలయంపై దాడులతో అధికార పార్టీ ప్రదర్శిస్తున్న రాజకీయ అసహనం స్పష్టమైందని, పశ్చిమ బెంగాల్, కేరళల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని తీర్మానంలో ప్రస్తావించారు. కేరళ, బెంగాల్ రాష్ట్రాలలో మత, రాజకీయ హింసతో నష్టపోయిన ప్రజలకు కార్యవర్గం సానుభూతి ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో పార్టీ అధికారాన్ని తిరిగి పొందడానికి అవకాశం ఏర్పడిందని, 5 రాష్ట్రాలలో తీర్పు బీజేపీ అనుకూలంగా సాధించేందుకు కార్యకర్తలు గట్టిగా కృషి చేయాలని జాతీయ కార్యవర్గం పిలుపునిచ్చింది. -
నోట్ల రద్దుతో ఆర్థిక మందగమనం
పేదల కష్టాలపై తక్షణం దృష్టిపెట్టాలన్న రాష్ట్రపతి న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయంతో తాత్కాలికంగా దేశ ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు అనంతరం తలెత్తిన ఇక్కట్ల నేపథ్యంలో పేదలు ఎక్కువ సమయం వేచి ఉండలేరని, వారికి తక్షణ సాయం అందాల్సిన అవసరముందన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రణబ్ ప్రసంగించారు. ‘నల్లధనం, అవినీతిపై పోరాడేందుకు తీసుకున్న ఈ నిర్ణయంతో పేదలు ఇబ్బంది పడకుండా అదనపు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. దీర్ఘకాలంలో ఆశించిన అభివృద్ధి కోసం ఇది తప్పనిసరి. అప్పుడే ఆకలి, నిరుద్యోగం, దోపిడీ నిర్మూలన కోసం సాగుతున్న ప్రయాణంలో వారు క్రియాశీల భాగస్వాములు కాగలరు’ అని చెప్పారు. పేదరిక నిర్మూలనకు తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల్ని అభినందిస్తున్నానని, అయితే ఫలితాలు దక్కేందుకు పేదలు ఇంకెంత కాలం వేచి ఉండాలో స్పష్టం గా చేప్పలేనన్నారు. దీర్ఘకాల లాభాల కోసం తాత్కాలిక ఇబ్బందులు తప్పవన్నారు. ఇటీవల పేదల కోసం ప్రధాని ప్రకటించిన ప్యాకే జీ వారికి కొంత ఉపశమనం కలిగిస్తుందన్నారు. అనేక యూనివర్సిటీలకు చాన్సలర్లుగా వ్యవహరిస్తున్న గవర్నర్లు... ఉన్నత విద్య ప్రమాణాల మెరుగుదల కోసం విద్యా రంగ నిపుణులతో కలిసి పనిచేయాలన్నారు. -
నల్లధనం ఎంతొచ్చిందో చెప్పాలి
ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలి: సురవరం సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు ప్రక్రియతో ఎంతమేర నల్లధనం బయటకు వచ్చిందో ప్రధాని మోదీ స్పష్టం చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత యాభై రోజులు ఓపిక పడితే మంచి రోజులు చూపిస్తానన్న మోదీ.. ఎలాంటి మార్పు తీసుకువచ్చారో తెలియజేయాల న్నారు. ‘మంచిరోజుల సంగతి అటుంచితే, సగటు జీవి బ్యాంకు ఖాతాలో వేసిన నగదు ఎన్నిరోజుల్లో బయటకు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ప్రజలు డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి ఎన్నిరోజుల్లో ఇచ్చేస్తారు’ అని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం మక్దూం భవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నోట్ల రద్దుతో నెలకొన్న పరిస్థితులపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ‘డిసెంబర్ 30 నాటికి ఎన్ని కొత్త నోట్లు ముద్రించారు, బ్యాంకుల్లో జమైన నిధులెన్ని, కొత్త నోట్లు ముద్రించి ఏయే బ్యాంకులకు ఎంత ఇచ్చారనే పశ్నలకు మోదీ జవాబు చెప్పాల్సిందే. అధికారం, రాజకీయ అండ ఉన్న వారివద్దే నల్లడబ్బు ఉంటుందన్న కనీస పరిజ్ఞానం మోదీకి లేనట్లుంది. ఒక వైపు నల్లధనాన్ని ఎరవేసి ఉత్తరప్రదేశ్ బహిరంగ సభల్లో జనాన్ని పోగు చేస్తూ, మరోవైపు నల్లధనాన్ని తరిమేస్తానని ప్రసగింస్తున్నారు. ఇదీ.. మోదీ స్వరూపం’ అంటూ మండిపడ్డారు. చేసిన తప్పును అంగీకరించి దేశానికి క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ, ఈనెల 9న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చాడ వెంకటరెడ్డి తెలిపారు. బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద వినియోగదారులతోనే ఈ కార్యక్రమాలు చేపడతామన్నారు. -
పెద్దనోట్ల రద్దుపై
రేపు భారీ ర్యాలీ: దానం సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దుతో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు నిరసనగా గురువారం హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టుగా మాజీమంత్రి, జీహెచ్ఎంసీ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ ప్రకటించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్, పార్టీ నగర పరిశీలకురాలు కవితారెడ్డితో కలసి మంగళవారం గాంధీభవన్ లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ దిక్కుమాలిన నిర్ణయం తీసుకుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతునిస్తూ పనికిమాలిన పనిచేస్తున్నాడని విమర్శించారు. 5వ తేదీన జరిగే ర్యాలీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ .ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పార్టీ ముఖ్యనేతలంతా హాజరవుతారని చెప్పారు -
జనధన్ ఖాతాలో డబుల్ ధనం
న్యూఢిల్లీ: నోట్ల రద్దు తర్వాత 45 రోజుల్లో జనధన్ ఖాతాల్లో డబ్బు రెట్టింపు జమ అయింది. ఈ ఖాతాల్లో గతేడాది నవంబర్ 10 నుంచి డిసెంబర్ 23 మధ్య రూ. 41,523 కోట్లు జమ అయ్యాయి. దీంతో ఆ ఖాతాల్లో మొత్తం సొమ్ము రూ. 87 వేల కోట్లకు చేరింది. రూ. 30 వేల నుంచి రూ. 50 వేల మధ్య ఉన్న నగదు జమలు రూ. 2 వేల కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్ 9కి ముందు జనధన్ ఖాతా ల్లో మొత్తం రూ. 45,637 కోట్లు ఉంది. నోట్ల రద్దు ప్రకటన తర్వాత తొలి వారంలో జనధన్ ఖాతా ల్లో అత్యధికంగా రూ. 20,224 కోట్లు జమ అయినట్లు ఆ అధికారి చెప్పారు. ఆ తర్వాత రోజుల్లో ఐటీ శాఖ హెచ్చరికలతో డిపాజిట్లు తగ్గాయని ఆయన తెలిపారు. జనధన్ ఖాతా ల నుంచి గత పక్షం రోజుల్లో రూ.3,285 కోట్ల డబ్బును ప్రజలు విత్ డ్రా చేసుకున్నారు. ఆశ్చర్యకరంగా 24.13 శాతం జనధన్ ఖాతా లు ఇంకా సున్నా బ్యాలెన్స్ తోనే ఉన్నాయి. జనధన్ ఖాతా ల్లోకి అత్యధిక మొత్తాల్లో డిపాజిట్లు వచ్చిన రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. -
నోట్ల రద్దుపై కాంగ్రెస్ నిరసనలు
2 నుంచి 11 వరకు కార్యక్రమాలు: ఉత్తమ్ ► జనవరి రెండో వారంలో రాష్ట్రానికి రాహుల్‌గాంధీ! ► గాంధీభవన్‌లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ► హాజరైన ఏఐసీసీ పరిశీలకులు కేబీ కృష్ణమూర్తి, కర్ణాటక మంత్రి శివకుమార్ సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చేపట్టనున్న నిరసనల్లో భాగంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రకటించారు. జనవరి 2న జిల్లా కేంద్రాల్లో, పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మీడియా సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. తర్వాత జనవరి 5, 6, 7 తేదీల్లో కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని, 9న మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామని వివరించారు. అనంతరం 11వ తేదీన ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగే సభకు భారీ సంఖ్యలో తరలి వెళ్లాలని నిర్ణయించామని, మండల, జిల్లా కేంద్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అనంతరం సమావేశం వివరాలను ఉత్తమ్ మీడియాకు వివరించారు. జనవరి రెండో వారంలో రాష్ట్రానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జనవరి 11 తర్వాత 24 గంటల సత్యాగ్రహ దీక్ష చేస్తామని తెలిపారు. ప్రజల డబ్బుపై ఆంక్షలెందుకు..? పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏఐసీసీ తరఫున పీసీసీ సమావేశానికి పరిశీలకుడిగా హాజరైన కర్ణాటక మంత్రి శివకుమార్ అన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై 15 రోజుల పాటు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరిం చారు. ప్రజలు కష్టపడి సంపాదించుకుని బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుల పై ఎందుకు ఆంక్షలు పెట్టారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. నల్ల ధనాన్ని వెలికితీయడానికి తాము వ్యతిరేకం కాదని, చిన్న వ్యాపా రులకు పన్నుల్లో మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొ న్నారు. పీసీసీ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకుడు కేబీ కృష్ణమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డి, నేతలు షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హన్మంతరావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, వంశీచంద్‌రెడ్డి, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో టీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన భూసేకరణ చట్టం, బలవంతపు భూసేకరణ చట్టమేనని, సభలో సీఎం కేసీఆర్ అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని పీసీసీ సమా వేశంలో నేతలు పేర్కొన్నారు. అసెంబ్లీలో సీఎం వ్యవహారశైలి తెలంగాణ పరువు తీసేలా ఉందని, 2013 భూసేకరణ చట్టాన్ని యూపీఏ సర్కార్ పార్లమెంట్ లో తీసుకొచ్చినప్పుడు, ఆరోజు కేసీఆర్ ఎం దుకు వ్యతిరేకించలేదని నేతలు మండిపడ్డారు. కొత్త భూసేకరణ చట్టంపై కాంగ్రెస్ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. -
ఆర్థిక విధ్వంసం నోట్ల రద్దుపై రాహుల్
-
ఆర్థిక విధ్వంసం నోట్ల రద్దుపై రాహుల్
ధర్మశాల: ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు పెంచారు. మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైందన్నారు. పేదలు, రైతులు, కష్ట జీవులపై ఇది బాంబు దాడిలాంటిదన్నారు. దేశాన్ని పేద–ధనిక వర్గాలుగా విభజించిందని శనివారం ఇక్కడ జరిగిన ర్యాలీలో ఆరోపించారు. ‘పెద్ద నోట్ల రద్దు రాష్ట్ర పర్యాటక, ఉద్యాన, వ్యవసాయ రంగాలపై తీవ్ర ప్రభావం చూపించడం ద్వారా హిమాచల్ ప్రదేశ్ టోపీని తొలగించింది. ఇక్కడి సాగు భూములను చిరునవ్వుతో మోదీ తగులబెట్టారు. ఇది నల్లధనం, అవినీతిపై లక్షిత దాడి కాదు. పేదలు, రైతులు, కార్మికులు, ఆర్థిక వ్యవస్థపై బాంబు దాడి. దేశంలో 6 శాతం నల్లధనం మాత్రమే ఉంది. మిగిలిన 94 శాతం నల్లధనం రియల్ఎస్టేట్, బంగారం, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతోంది. మోదీజీతో కలిసి అమెరికాకు వెళ్లేవారి వద్దే నల్లధనం ఉంది. ప్రధాని మోదీ పేదలకు రూ.3 లడ్డూ ఇచ్చారని, బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యాకు మాత్రం రూ.1,200 కోట్ల లడ్డూ ఇచ్చారని రాహుల్ ఎద్దేవా చేశారు. -
ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులు?
-
పాతనోట్ల డిపాజిట్లపై ఆంక్షలు
-
అవినీతికి విపక్షాల రక్షణ
అందుకే పార్లమెంటు సమావేశాల స్తంభన: ప్రధాని మోదీ కాన్పూర్: అవినీతిపరులను రక్షించడానికే ప్రతిపక్షాలు పార్లమెంటు సమావేశాల్ని స్తంభింపజేశాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. అందుకే నోట్ల రద్దు, నల్లధనం వెలికితీత, ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై చర్చకు వెనుకంజ వేశాయని అన్నారు. వారికి ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ఆసక్తి లేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సోమవారం జరిగిన ‘పరివర్తన్ ర్యాలీ’లో ప్రధాని మోదీ మాట్లాడుతూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. అవినీతి, నల్లధనాన్ని అంతం చేయడమే తమ ఎజెండా అని.. పార్లమెంటును స్తంభింపజేయడమే విపక్షాల ఎజెండా అని ఎద్దేవా చేశారు. ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికలు, పార్టీలకు విరాళాలు తదితర అంశాలపై చర్చ జరపాలని తాను అఖిలపక్ష సమావేశంలో సూచించానన్నారు. అయితే విపక్షాలు నిరంతరం అరుపులు, నినాదాలతో పార్లమెం టును స్తంభింపజేసి, సభ ప్రతిష్టను దిగజార్చాయని మండిపడ్డారు. నేతలు రెచ్చగొట్టినా..: ఏటీఎంల వద్ద క్యూల్లో నిలబడిన ప్రజలను రెచ్చగొట్టడానికి కొంతమంది రాజకీయ నాయకులు యత్నించారని.. అయితే సాధారణ ప్రజలు అర్థం చేసుకుని సహకరించారని అన్నారు. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు వ్యవహరిం చారని ప్రశంసించారు. నోట్ల రద్దు అమల్లోకి వచ్చిన నవంబర్ 8న తాను ప్రజలను 50 రోజుల గడువు కోరిన విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. తాను మొదట్నుంచీ అదే విషయం చెబుతున్నానని అన్నారు. ఇప్పుడు మరోసారి చెబుతున్నానని 50 రోజుల పాటే కష్టాలుంటాయని.. ఆ తర్వాత అన్ని సమస్యలు క్రమంగా తొలగిపోతాయని మోదీ హామీ ఇచ్చారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న ప్రధాని ఎవరనేది చరిత్ర గుర్తుంచుకోదని, అవినీతిపై ప్రజల పోరాటాన్నే చరిత్ర గుర్తుంచుకుంటుందని అన్నారు. కాంగ్రెస్‌వన్నీ అబద్ధాలే: రాజీవ్ గాంధీ సామాన్య మానవుడికి కంప్యూటర్, మొబైల్ ఫోన్ అందించారని కాంగ్రెస్ నాయకులు తరచూ చెబుతుంటారని మోదీ అన్నారు. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్ ను బ్యాంకు కార్యకలాపాలకు వినియోగించవచ్చని తాను చెబితే.. పేద ప్రజల వద్ద మొబైల్ ఫోన్ లేదని అంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్నీ అబద్ధాలనే ప్రచారం చేస్తోందని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం నిరోధించడానికి ఎన్నికల సంఘం చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఇక్కడ మోదీ దేశంలోనే తొలి భారత నైపుణ్య సంస్థకు శంకుస్థాపన చేశారు. -
నోట్ల రద్దు ముందుగానే లీకైంది
కరెన్సీ కష్టాలకు జైట్లీనే కారణం: సుబ్రహ్మణ్యస్వామి సాక్షి ప్రతినిధి, చెన్నై: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ముందుగానే లీకైందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. కోయంబత్తూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయిందని, నోట్లు రద్దు చేయాలనే ఆలోచనే ఉంటే ముందస్తు ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించేందుకు ముందుగా బహిరంగ ప్రదేశాల్లో ఏటీఎంలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని, పన్నులు తగ్గించాలని సైతం తాను సూచించినట్లు తెలిపారు. తన సూచనలను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పట్టించుకోలేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న కరెన్సీ కష్టాలకు అరుణ్‌జైట్లీనే బాధ్యత వహించాలన్నారు. పెద్ద నోట్లు చెల్లవని కేంద్రం ప్రకటించక ముందే ఈ నిర్ణయం లీకైందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై తాను కేసులేవీ దాఖలు చేయడం లేదని, కేంద్రమే కేసు వేయాలన్నారు. అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడే కేంద్రాన్ని దుయ్యబట్టడం చర్చనీయాంశమైంది. -
పాతనోట్ల డిపాజిట్లపై ఆంక్షలు
రూ. 5 వేలకు మించితే డిసెంబర్ 30 వరకూ ఖాతాకు ఒక్కసారే అవకాశం ► అదీ బ్యాంకు అధికారులు సంతృప్తి చెందితేనే... ► గరీబ్ కల్యాణ్‌లో ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చని ప్రకటించిన కేంద్రం ► నవంబర్ 8 నాటికి ఆర్బీఐ వద్ద రూ.4.94 లక్షల కోట్ల రూ. 2 వేల నోట్లు ► రూ. 20 లక్షల కోట్ల పాత నోట్లు: ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం న్యూఢిల్లీ: రద్దైన పెద్ద నోట్ల డిపాజిట్లపై కేంద్ర ప్రభుత్వం సోమవారం మరిన్ని ఆంక్షలు విధించింది. డిసెంబర్ 19 నుంచి 30 వరకూ వ్యక్తిగత ఖాతాల్లో రద్దైన నోట్లను రూ. 5 వేలకు మించి ఒక్కసారి మాత్రమే జమ చేసుకోవాలని కేంద్రం పేర్కొంది. రూ. 5 వేలకు మించి డిపాజిట్ చేస్తున్న సమయంలో ఆలస్యానికి కారణాలు కూడా వెల్లడించాలని పేర్కొంది. తాజా నిబంధనలతో నల్ల కుబేరుల కోసం ప్రవేశపెట్టిన గరీబ్ కల్యాణ్ యోజన కింద భారీగా పాత నోట్లు బ్యాంకులకు చేరవచ్చనే ఆశాభావంతో ఉందని భావిస్తున్నారు. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనంతరం ... డిసెంబర్ 30 వరకూ ఖాతాల్లో పాత నోట్లను ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ డిపాజిట్లపై ఆంక్షలు విధిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘రూ. 500, రూ. 1000 నోట్ల డిపాజిట్లపై ప్రభుత్వం సమయానుకూలంగా సమీక్షిస్తోంది. నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని దాదాపు 5 వారాలు దాటింది. అధిక శాతం ప్రజలు పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేశారని భావిస్తున్నాం’ అంటూ ప్రకటనలో ప్రభుత్వం వెల్లడించింది. రద్దైన నోట్ల రూపంలో రూ. 5 వేలకు మించి జమ చేయాలంటే ఖాతాలకు కేవైసీ (నో యువర్ కస్టమర్) కంప్లైంట్ జత చేయాలని. కేవైసీ వివరాలు లేకపోతే... డిపాజిట్లు రూ.50 వేల వరకే పరిమితం అవుతాయని తెలిపింది. సంతృప్తి చెందితేనే..: బ్యాంకుల్లో క్యూలను తగ్గించే ఉద్దేశంతో కూడా తాజా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం నుంచే నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. రూ. 5 వేలకు మించి పాత నోట్ల డిపాజిట్ సమయంలో ఆలస్యంగా ఎందుకు చేస్తున్నారో కారణాల్ని తప్పనిసరిగా కనుక్కోవాలని బ్యాంకుల్ని ఆదేశించింది. ఇద్దరు బ్యాంకు అధికారుల సమక్షంలో ఖాతాదారుడ్ని ప్రశ్నించాలని, సంతృప్తికర సమాధానం వచ్చాకే ఆ మొత్తాన్ని జమ చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇక రూ. 5వేలు, అంతకంటే తక్కువ మొత్తాల్ని డిసెంబర్ 30 వరకూ ఎన్నిసారై్లనా డిపాజిట్ చేసుకోవచ్చంటూ స్పష్టతనిచ్చింది. డిసెంబర్ 19–30 మధ్య చేసే రికరింగ్ ఖాతాల డిపాజిట్లకు కూడా తాజా నిబంధనలు వర్తిస్తాయంటూ ఆర్బీఐ వెల్లడించింది. అయితే ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనలో భాగంగా ఎంత మొత్తమైనా పాత కరెన్సీ నోట్ల రూపంలో జమ చేసుకోవచ్చంటూ తెలిపింది. నవంబర్ 10–14 మధ్యలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు సేకరించిన నగదును జమ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. సహకార బ్యాంకుల్లో పాత నోట్లను డిపాజిట్ చేసిన వినియోగదారులు, ప్రాథమిక సహకార బ్యాంకుల ఖాతాదారుల కేవైసీ వివరాలు తెలుసుకునేందుకు నాబార్డ్ పూర్తి తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపింది. కాగా, ఆదాయపు పన్ను శాఖ అధికారులు బంగారం దుకాణం నుంచి రూ. 10 కోట్ల నగదు, బంగారం, వజ్రాభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు. 8 నాటికి రూ.4.94 లక్షల కోట్లు ప్రధాని మోదీ నవంబర్ 8న పాత నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించే సమయంలో... ఆర్బీఐ వద్ద రూ. 2 వేల నోట్ల రూపంలో రూ. 4.94 లక్షల కోట్ల మొత్తం ఉన్నట్లు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు రిజర్వ్‌బ్యాంకు సమాధానమిచ్చింది. 2,473 మిలియన్ల రూ. 2 వేల నోట్లు ఉన్నట్లు స్పష్టం చేసింది. ముంబైకి చెందిన ఆర్టీఐ కార్యకర్త అనిల్ గల్గాలికి దరఖాస్తుకు జవాబిస్తూ... నవంబర్8న రూ. 9.13 లక్షల కోట్ల మేర రూ.1,000 నోట్లు, రూ. 11.38 లక్షల కోట్ల మేర రూ. 500 నోట్లు ఉన్నట్లు పేర్కొంది. అయితే నవంబర్ 9 నుంచి నవంబర్ 19 మధ్యలో బ్యాంకులకు సరఫరా చేసిన కరెన్సీ నోట్ల వివరాలు వెల్లడించేందుకు మాత్రం ఆర్బీఐ నిరాకరించింది. ఆరా తీయరు: జైట్లీ రద్దయిన నోట్లను ఎంత మొత్తంలోనైనా ఒకేసారి డిపాజిట్ చేస్తే అధికారులు ఎలాంటి ప్రశ్నలూ అడగరని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం చెప్పారు. అయితే పదే పదే డిపాజిట్ చేస్తే ప్రశ్నిస్తారన్నారు. రద్దయిన నోట్ల చెల్లింపు వినియోగానికి ఇచ్చిన గడువు గతవారం ముగిసిందని, ఆ నోట్లు ఇంకా ఎవరివద్దయినా ఉంటే చెల్లుబాటు కావు కనుక బ్యాం కు లో డిపాజిట్ చేయాలని సూచించారు. ‘బ్యాంకుకు వెళ్లి ఒకేసారి ఎంత మొత్తాన్ని డిపాజిట్ చేసినా ఏ ప్రశ్నలూ అడగరు. రూ. 5 వేల పరిమితి వారికి వర్తించదు. అయితే ప్రతిరోజూ ఒకే వ్యక్తి వెళ్లి కొంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తూ ఉంటే ఆ డబ్బెలా వచ్చిందని అనుమానం వస్తుంది’ అని చెప్పారు. 2005కి ముందునాటి నోట్లనూ తీసుకోండి: ఆర్బీఐ 2005కి ముందు నాటి పాత రూ. 500, రూ వెయ్యి నోట్లను కూడా డిపాజిట్ల కోసం బ్యాంకులు అంగీకరించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ నోట్లను ఆర్బీఐ కార్యాలయాల్లో కూడా డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది. 2005కు ముందు నాటి పెద్ద నోట్లను బ్యాంకులు స్వీకరించడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్బీఐ స్పష్టత నిచ్చింది. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గువాహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్; న్యూఢిల్లీ, పట్నా, తిరువనంతపురం, కోచి ఆఫీసుల్లో 2005కు ముందు నోట్లను మార్చుకునే అవకాశం కల్పించామని, అయితే బ్యాంకుల్లో తీసుకోవద్దనేది తమ ఉద్దేశం కాదని సోమవారం తెలిపింది. -
ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులు?
► యూపీ ఎన్నికల ముందు కేంద్రం ప్రకటించనుందంటూ వార్తలు ► ఊహాగానాలేనంటూ తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయంపై విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం.. పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చేలా.. ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. రూ. 4 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్నుపోటు లేకుండా.. ఇప్పటివరకు రూ. 2.5 లక్షలుగా ఉన్న కనీస పన్ను ఆదాయాన్ని రూ. 4 లక్షలకు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాలు తెలిపాయంటూ ఈ వివరాలను ఇండియాటుడే టీవీ చానల్ సోమవారం వెల్లడించింది. సాధారణంగా పన్నుల్లో మార్పులను బడ్జెట్లో ప్రతిపాదించే సంప్రదాయానికి విరుద్ధంగా.. యూపీ ఎన్నికల తేదీల ప్రకటన కంటే ముందే ఈ మార్పులను కేంద్రం ప్రకటించనుందని తెలిపింది. అయితే, ఈ వార్తలను కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అవన్నీ ఊహాగానాలేనని కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫ్రాంక్ నోరొన్హా తోసిపుచ్చారు. ఆ చానల్ కథనం ప్రకారం... పన్ను శ్లాబులు ఇలా ఉండొచ్చు.. రూ.4–10 లక్షల మధ్య ఆదాయానికి 10 శాతం, 10–15 లక్షల ఆదాయానికి 15 శాతం, 15–20 లక్షలైతే 20 శాతం, రూ.20 లక్షలు దాటితే 30 శాతం పన్ను విధిస్తారని చెప్పింది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే... అధిక ద్రవ్యోల్బణం, పన్ను రేట్లతో బాధపడుతున్న ఉద్యోగులకు భారీ ఊరటనిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రూ.2.5 లక్షల లోపు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్ను లేదు. ప్రస్తుత పన్ను శ్లాబులు: • రూ. 2,50,001– రూ 5 లక్షల వరకూ 10 శాతం • రూ. 5,00,001– 10 లక్షల వరకూ 20 శాతం, • రూ. 10 లక్షలు దాటితే 30 శాతం పన్ను ఉంది. జైట్లీ సూచనప్రాయంగా... ∙డిసెంబర్ 14న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచనప్రాయంగా మాట్లాడుతూ... తదుపరి బడ్జెట్లో ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లను తగ్గిస్తూ... సామాన్యుడికి కేంద్ర ప్రభుత్వం వరాలు ఇస్తుందని చెప్పిన విషయం గమనార్హం. నోట్ల రద్దు నిర్ణయం వల్ల అధిక శాతం పన్ను పరిధిలోకి రావడంతో ప్రభుత్వానికి ఆదాయం పెరగొచ్చన్నారు. భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువ డిజిటల్‌కు మారడం వల్ల నల్లకుబేరులు పన్ను చట్రంలోకి వస్తారని... దీంతో ప్రస్తుత పన్ను ఆదాయం పెరుగుతుందన్నారు. దీంతో ప్రస్తుత పన్నులు మరింత సహేతుకంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. -
‘నోటు’ దెబ్బకు ఆ‘దారం’ తెగుతోంది!
► సూరత్‌లో టెక్స్టైల్ రంగం విలవిల ► తెలంగాణ కార్మికుల అష్టకష్టాలు ► మూతపడుతున్న దుకాణాలు ►30 శాతం తగ్గిన గ్రే బట్ట ఉత్పత్తి.. కోట్లలో నష్టం ► పనుల్లేక పస్తులుంటున్న కార్మికులు సాక్షి, ముంబై: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని సూరత్‌లో టెక్స్టైల్ రంగం విలవిల్లాడుతోంది. ఈ రంగంపై ఆధారపడి బతుకుబండి లాగుతున్న తెలంగాణ కార్మికులు ఉపాధికి దూరమవుతున్నారు. పలు జిల్లాల నుంచి పొట్టచేతబట్టుకుని ఇక్కడకు వచ్చిన వారంతా పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూరత్‌లో ప్రతినిత్యం గ్రే బట్ట సుమారు 4 కోట్ల మీటర్ల మేర ఉత్పత్తి అవుతుంది. అయితే పెద్దనోట్ల రద్దు దెబ్బకు దీని ఉత్పత్తి 30 శాతం తగ్గింది. ఫలితంగా టెక్స్టైల్ రంగం కోట్లల్లో నష్టపోతోంది. అనేక మంది ఫ్యాక్టరీలను నడపలేక కార్మికులకు వారానికి రెండు నుంచి నాలుగు రోజులపాటు సెలవులు ఇస్తున్నారు. కొందరైతే కొన్నిరోజులపాటు పరిశ్రమను పూర్తిగా మూసేయాలనే ఆలోచనలో ఉన్నారు. మనోళ్లే ఎక్కువ సూరత్‌లోని టెక్స్టైల్ రంగంలో అత్యధికంగా తెలంగాణకు చెందినవారే ఉన్నారు. పవర్‌లూమ్స్ పరిశ్రమలన్నీ కుదేలవడంతో వారి పరిస్థితి దుర్భరంగా మారింది. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు కూడా నానా అవస్తలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు కోసం వచ్చే బట్టల వ్యాపారులతో ఇక్కడి మార్కెట్లన్నీ కిటకిటలాడేవి. పెద్దనోట్ల రద్దు తర్వాత ఈ మార్కెట్లన్నీ బోసిపోయి కన్పిస్తున్నాయి. అనేక మంది తమ దుకాణాలను మూసివేసుకుని కూర్చుంటున్నారు. ఇలాగైతే ఫ్యాక్టరీ మూసివేయాల్సిందే.. నోట్ల రద్దుతో మార్కెట్లోని 30 శాతం దుకాణాలు మూతబడ్డాయి. బట్టలు కొనేందుకు ఎవరు రావడంలేదు. ఇప్పటికే కార్మికులకు జీతాలు ఇవ్వలేకున్నాం. తాత్కాలికంగా మా ఫ్యాక్టరీని మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. – రుద్ర శ్రీనివాస్, పవర్‌లూమ్స్ యజమాని, గుమ్మడవెల్లి, సూర్యాపేట జిల్లా జీతాలకే కష్టమైంది.. మార్కెట్లన్నీ బోసిపోతున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు రావడం తగ్గింది. కార్మికుల జీతాలు ఇవ్వడమే కష్టతరం గా మారింది. మార్కెట్లలో లావాదేవీలన్ని నిలిచిపోయాయి. – ఎనగందుల శ్రీధర్, గణేష్ సిల్క్ మిల్ షాపు యజమాని,తూర్పుగూడెం, సూర్యాపేట పనుల్లేవు.. పెద్ద నోట్ల రద్దు తర్వాత పనులు సరిగ్గా లభించడం లేదు. మా యజమాని ఫ్యాక్టరీకి రెండు రోజులు సెలవులు ప్రకటించాడు. పనుల్లేక పస్తులుంటున్నాం. – సిలివేరి నాగేష్, పవర్‌లూమ్స్ కార్మికుడు, కుక్కడం, సూర్యాపేట అంచనాలన్నీ తారుమారయ్యాయి.. నాలుగు నెలలకిందటే సొంతంగా ఫ్యాక్టరీ పెట్టా. పది మంది వర్కర్లున్న నా ఫ్యాక్టరీకి దీపావళి వరకు మంచి ఆర్డర్లు ఉండేవి. ఇప్పుడు అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఇలా పనులు లభించక ఇబ్బందులు పడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. –చిట్యాల నరేశ్, టెక్స్టైల్ డిజిటల్ ప్రింటింగ్ యజమాని, నర్సింహులపేట, మహబూబాబాద్ -
ఇది నల్లధన నిర్మూలన యజ్ఞం
► నోట్ల రద్దుపై మోదీ ట్వీట్ ► తాత్కాలిక కష్టంతో దీర్ఘకాలంలో ప్రయోజనాలు న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయంతో దీర్ఘకాలంలో ప్రయోజనాలుంటాయని, రైతులు, వర్తకులు, కార్మికులు లాభపడతారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నోట్ల రద్దుపై విపక్షాల విమర్శల నేపథ్యంలో మోదీ ట్విటర్లో స్పందించారు. కొన్ని రోజులు ఇబ్బందులు భరిస్తే భవిష్యత్తులో ఎన్నో లాభాలుంటాయని పేర్కొంటూ నోట్ల రద్దు ప్రయోజనాలపై గురువారం వరుస ట్వీట్స్ చేశారు. నగదు రహిత చెల్లింపుల దిశగా పెద్ద నోట్ల రద్దు చారిత్రక అవకాశంగా పేర్కొన్నారు. ‘ప్రభుత్వ నిర్ణయం కొంత ఇబ్బంది కలిగిస్తుందని నేనెప్పుడూ చెబుతూనే ఉన్నా. అరుుతే దీర్ఘకాల ప్రయోజనాల కోసం తాత్కాలిక ఇబ్బంది మార్గం సుగమం చేస్తుంది’ అని పేర్కొన్నారు. దేశ ఆర్థిక ప్రగతికి వెన్నెముకగా ఉన్న గ్రామీణ భారతీయు లు... అవినీతి, నల్లధనంతో ఎన్నో ఇబ్బందు లు పడ్డారు. అభివృద్ధిలో గ్రామాలు తమ వాటా అందుకోవాలి. ఈ నిర్ణయంతో రైతులు, వ్యాపారులు, కార్మికులు లాభపడతారు’ అని అన్నారు. ‘అవినీతి, ఉగ్రవాదం, నల్లధనంపై జరుగుతున్న ఈ యజ్ఞంలో హృదయపూర్వకంగా భాగస్వాములవుతున్న ప్రజలకు నా వంద నం’ అని మరో ట్వీట్ చేశారు. నల్లధనాన్ని భారత్ ఓడించింది అనేది నిజమయ్యేలా ప్రజలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని, ఇది పేదలు, మధ్యతరగతి సాధికారతకు సాయపడుతుందని చెప్పారు. యువతనుద్దేశించి ట్వీట్ చేస్తూ.. భారత్‌ను అవినీతి రహిత, నగదు రహిత కార్యకలాపాల దేశంగా మార్చేందుకు ప్రతినిధులుగా వ్యవహరించాలని సూచించారు. -
అడ్మిషన్‌కు నగదులేక విద్యార్థిని ఆత్మహత్య
రాంచీ: పాత పెద్ద నోట్ల రద్దుకు మరో విద్యార్థిని బలైంది. బీఈడీ అడ్మిషన్ ఫీజు సకాలంలో చెల్లించలేక జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ జిల్లాలో ఓ అమ్మాయి గురువారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిందు తన గ్రామీణ బ్యాంక్ ఖాతాలోని రూ.37,000 నుంచి ఫీజు కోసం రూ.30,000 విత్‌డ్రా చేయాలనుకుంది. అరుుతే, రెండ్రోజుల క్రితం బ్యాంకు అధికారులు ఆమెకు ఖాతా నుంచి కేవలం రూ.5,000 మాత్రమే ఇచ్చారు. రూ.30,000 ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. దీంతో సకాలంలో కాలేజీ ప్రవేశ రుసుం చెల్లించలేక, మనోవేదనకు గురైన బిందు ఆత్మహత్య చేసుకుందని గ్రామ సర్పంచ్ రాయ్మణి చెప్పారు. -
పెళ్లికి రూ.2.5 లక్షలు ఇవ్వలేం..
నగదు లేదని చేతులెత్తేస్తున్న బ్యాంకులు బోయినపల్లి/కమలాపూర్: గతంలో బిడ్డ.. కొడుకు పెళ్లి చేస్తే.. ఇందుకోసం ఆహ్వాన పత్రికను తొలుత దేవుడి దగ్గర పెట్టి దీవిం చమని కోరుకునేవారు.. నోట్ల రద్దుతో ప్రస్తు తం పత్రికను దేవుడి దగ్గర కాకుండా.. బ్యాంకు అధికారుల ముందు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. బ్యాంకులో వివాహ పత్రిక చూపించి రూ.2.50 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చన్న ప్రభుత్వ నిబంధనను అమలు చేసే విషయంలో బ్యాంకులు చేతు లెత్తేస్తున్నారుు. నగదు కొరతతో అంత మొత్తంలో సొమ్ము ఇవ్వలేమని మేనేజర్లు తేల్చి చెబుతుండడంతో బిడ్డల పెళ్లిళ్లు ఎలా చేయాలో తెలియక అనేకమంది ఆందోళన చెందుతున్నారు. పత్రిక చూపించినా ఇవ్వడం లేదు సోదరి వివాహం ఉందని బ్యాంకు అధికా రులకు పెళ్లి పత్రిక చూపించినా డబ్బులు ఇవ్వడం లేదని పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపికుంటకు చెందిన పులిపాక రమేశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 9న రమేశ్ సోదరి స్వప్ప వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణరుుంచారు. అరుుతే, నోట్ల రద్దు అనంతరం వివాహ పత్రిక చూపించి రూ. 2.50 లక్షల తీసుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించిగా.. సోమవారం పత్రిక పట్టుకొని ఎస్‌బీహెచ్‌కు వెళ్లాడు. అరుునా.. బ్యాంకు అధికారులు నగదు లేదని చెప్పి.. వెనక్కి పంపించారు. నలుగురి ఖాతాల్లో జమచేసి డ్రా.. రాజన్న సిరిసిల్ల జిల్లా బోరుునపల్లి మండలం స్థంబంపల్లికి చెందిన ముచ్చె లింగారెడ్డి కూతురు వివాహం ఈ నెల 8న. పెళ్లి ఖర్చుల నిమిత్తం తన ఖాతా నుంచి తీసుకొనేందుకు బోరుునపల్లి ఆంధ్రాబ్యాంకు వెళ్లాడు. పెళ్లి కార్డు చూపిస్తే అధికారులు రూ.24 వేలు ఇస్తామన్నారు. లక్ష కావాలని వేడుకోగా... ఒప్పుకున్న అధికారులు మెలిక పెట్టారు. ఒక్కరికే లక్ష ఇవ్వడం కుదరదని, రూ.24వేల చొప్పున నలుగురి ఖాతాల్లో జమ చేసుకుని, ఆ తర్వాత డ్రా చేసుకోవాలని చెప్పడంతో, లింగారెడ్డి అదే చేశాడు. ప్రజావాణిలో వేడుకున్నా.. కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కల్కినగర్‌కు చెందిన రాజమణి తన కొడుకు పెళ్లి ఖర్చులకు డబ్బులు ఇప్పించాలని సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి వచ్చారు. రాజమణి కుమారుడి వివాహం ఈ నెల 14న ఉంది. ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా బ్యాంకు అధికారులు డబ్బులు ఇవ్వడం లేదని.. ఖాతాలోని డబ్బులు ఇప్పించాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అలాగే, కామారెడ్డి మండలం అడ్లూర్‌కు చెందిన నారాయణపురం గంగయ్య, కామారెడ్డికి చెందిన డి.రాజం, లింగాపూర్‌కు చెందిన బండారు చిన్న భూంరెడ్డి కూడా పెళ్లి పత్రికలు తీసుకుని కలెక్టరేట్‌కు వచ్చారు. వివాహ ఖర్చుల నిమిత్తం బ్యాంకు ఖాతాల్లోని డబ్బును ఇప్పించాలని కలెక్టర్‌ను కోరారు. -
పెద్దనోట్ల రద్దుతో సామాన్యులకు అవస్థలు: చాడ
ఖమ్మం మయూరిసెంటర్: పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు అవస్థ పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మంలో సీపీఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా మహాసభలు జరిగాయి. చాడ మాట్లాడుతూ నల్లధనం వెలికితీత, స్వచ్ఛభారత్ అంటూ మోదీ అధికారంలోకి వచ్చారని, రెం డున్నరేళ్లు గడిచినా నల్లధనం ఊసెత్తలేదన్నారు. విదేశీ పర్యటనలో ప్రధానమంత్రి కార్పొరేట్ సేవల్లో తరిస్తున్నారని ఆరోపించారు. దేశంలో మతోన్మాద చర్యలు పుంజుకుంటున్నాయని, కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. -
సమాచారం లీక్ కాలేదు
సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుకు సంబం ధించిన సమాచారం ముందే బీజేపీ నేతలకు లీకైందంటూ వస్తున్న విమర్శలు పూర్తిగా అసంబద్ధమైనవి, అర్థం లేనివని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ నిర్ణయం వల్ల లబ్ధి పొందే సామాన్యుల వైపు నిలుస్తారా? లేదా అవినీతిపరుల వైపు ఉంటారా? అని విపక్షాలను ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు అనేది ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం కోసం తీసుకున్న చర్య అని మంగళవారమిక్కడ అన్నారు. -
పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయం ఢమాల్
-
నోట్ల రద్దుపై రగడ
-
ప్రజల తిరుగుబాటు తప్పదు!
నోట్ల రద్దు దిక్కుమాలిన నిర్ణయమన్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ఓ దిక్కుమాలిన నిర్ణయమని.. దీనితో దేశం ముఫ్ఫై ఏళ్లు వెనక్కి పోయే ప్రమాదముందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వానిది ఏకపక్ష నిర్ణయమని, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి ఉండాల్సిందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. నోట్ల మార్పిడితో ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని... దీనిపై ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. నోట్ల రద్దు, మార్పిడి పరిణామాలపై ముఖ్య నేతలు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి తన అభిప్రాయాలను, నిర్ణయాలను వివరించారు. నోట్ల రద్దుపై సరైన కసరత్తు లేకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా.. కొత్త రాష్ట్రమైన తెలంగాణ వేసుకున్న భారీ అంచనాలన్నీ తలకిందులయ్యాయని, సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. నిత్యావసరాలకు నగదు కోసం కూడా బ్యాంకుల చుట్టూ తిప్పుకునే పరిస్థితి తెచ్చిపెట్టారని మండిపడ్డారని... ఈ సమయంలో ఊరుకునే ప్రసక్తి లేదని, వివిధ మార్గాల్లో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారని సమాచారం. దీనిపై స్వయంగా ప్రధానిని కలసి వాస్తవ పరిస్థితులను వివరిద్దామని నేతలతో పేర్కొన్నట్లు తెలిసింది. బీజేపీకి చెందిన ఒకరిద్దరు సీనియర్ నాయకులు ప్రధాని మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆ పార్టీ సీఎంలు వ్యతిరేకిస్తున్న విషయాన్ని చర్చించినట్లు సమాచారం. ముఖ్యనేతలు, అధికారులతో.. నోట్ల రద్దు నిర్ణయం కారణంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే రంగాలన్నీ కుదేలయ్యారుు. ప్రతి వ్యాపారంపై నోట్ల రద్దు ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో శాఖల వారీగా వాటిల్లిన నష్టాన్ని, వివిధ రంగాల వారీగా వాస్తవ పరిస్థితులను కేసీఆర్ స్వయంగా అంచనా వేస్తున్నారు. వివిధ రంగాల నిపుణులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో వాస్తవ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏయే రంగాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఎంత నష్టం వాటిల్లుతుందనే సమగ్ర నివేదికను తయారు చేయిస్తున్నారు. నోట్ల రద్దుతో రాష్ట్రంతో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఏర్పడిన పరిస్థితులను సైతం కేసీఆర్ అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజల అభిప్రాయాలపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు నోట్ల మార్పిడికి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే అంశాన్ని పరిశీలించారు. అన్ని వర్గాల్లోనూ ఆగ్రహం సోషల్ మీడియాలో వెల్లువెత్తిన పోస్టింగ్‌లను స్వయంగా చూసిన సీఎం కేసీఆర్... ఆరంభంలో ఓ వర్గం మోదీని నెత్తిన పెట్టుకున్నా, కార్యాచరణకు వచ్చే సరికి అన్ని వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘‘నోట్ల రద్దు ఓ దిక్కుమాలిన నిర్ణయం. సామాన్య ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రతి కుటుంబం బ్యాంకులు, ఏటీఎంల దగ్గర రేయింబవళ్లు క్యూ కట్టే దుస్థితి వచ్చింది. కేవలం రూ.4 వేలు మాత్రమే మార్పిడి చేసే నిబంధన, రూ.2.5 లక్షల పరిమితి దాటితే ఆదాయపు పన్ను పడుతుందని భయపెట్టడం సరికాదు. మేకలు, గొర్?రలు పెంచే రైతులు సైతం లక్షల్లో నగదు లావాదేవీలు చేస్తారు. అంతమాత్రాన వాళ్లు నల్లధనం దాచుకున్న సంపన్నులు కారు. ఇవన్నీ కేంద్రం పట్టించుకోకుండానే.. తన నిర్ణయాన్ని ప్రజలపై రుద్దింది..’’ అని నేతలు, అధికారుల వద్ద సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. -
ఆరేడు నెలలు చర్చించాకే నిర్ణయం
పెద్ద నోట్ల రద్దుపై సిద్ధార్థనాథ్ సింగ్ క్రెడిట్ చంద్రబాబు తీసుకుంటే అభ్యంతరం లేదు సాక్షి, అమరావతి: రూ. 500, 1,000 నోట్లను రద్దు చేయాలన్న నిర్ణయం ఒక్క రోజులో జరిగింది కాదని, కేంద్రంలో కీలకమైన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు దీనిపై ఆరేడు నెలలుగా చర్చించిన తర్వాతే అమల్లోకి తీసుకువచ్చారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ వెల్లడించారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తాను లేఖ రాయడం వల్లే కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పుకోవడంతో పాటు టీడీపీ నేతలు అదే విషయాన్ని ప్రచారం చేయడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సిద్దార్థనాథ్‌సింగ్ స్పందించారు. బాబు తమ మిత్రపక్ష నాయకుడేనని,. కెడ్రిట్ ఎవరు తీసుకున్నా అభ్యంతరం లేదని అన్నారు.