
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ పెద్ద నోట్ల రద్దు సమయంలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆదాయపన్ను శాఖ (ఐటీ) విచారణలో తేలింది. ఆ సమయంలో ఆమె మాల్స్, భవనాలను కొనుగోలు చేసినట్టు గుర్తించారు. పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో కొన్ని ఆస్తులు చేతులు మారినట్లు కనుగొన్నారు. మద్రాసు హైకోర్టులో శశికళ ఆదాయ వ్యవహారాలకు సంబంధించిన ఓ పిటిషన్‌పై స్టే విధించాలని శశికళ రిట్ దాఖలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఐటీ శాఖను కోర్టు ఆదేశించింది. శనివారం న్యాయమూర్తి అనితా సుధాకర్ ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది.
శశికళ ఆదాయ, ఆస్తుల వ్యవహారం ముగిసిన అధ్యాయమని, ఇప్పుడు దానిపై విచారణ అవసరం లేదని శశికళ తరఫు లాయర్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో శశికళ చెన్నై పెరంబూరు, మదురై, కేకే నగర్‌లలో షాపింగ్ మాల్స్ పుదుచ్చేరిలో ఒక రిసార్ట్, కోయంబత్తూరులో పేపర్ మిల్, చెన్నై ఒరగడంలో చక్కెర మిల్లు, పాత మహాబలిపురం రోడ్డులో సాఫ్ట్‌వేర్ కంపెనీ, కోయంబత్తూరులో 50 పవన విద్యుత్ ప్లాంట్‌లు కొనుగోలు చేసినట్టు ఐటీ తరఫు న్యాయవాది ఆధారాలను కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ ఆస్తులన్నీ నగదు ద్వారానే జరిగినట్టు చెప్పారు. దీనిని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి త్వరితగతిన అన్ని ప్రక్రియలు ముగించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేశారు.