జనధన్ ఖాతాలో డబుల్ ధనం
న్యూఢిల్లీ: నోట్ల రద్దు తర్వాత 45 రోజుల్లో జనధన్ ఖాతాల్లో డబ్బు రెట్టింపు జమ అయింది. ఈ ఖాతాల్లో గతేడాది నవంబర్ 10 నుంచి డిసెంబర్ 23 మధ్య రూ. 41,523 కోట్లు జమ అయ్యాయి. దీంతో ఆ ఖాతాల్లో మొత్తం సొమ్ము రూ. 87 వేల కోట్లకు చేరింది. రూ. 30 వేల నుంచి రూ. 50 వేల మధ్య ఉన్న నగదు జమలు రూ. 2 వేల కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్ 9కి ముందు జనధన్ ఖాతా ల్లో మొత్తం రూ. 45,637 కోట్లు ఉంది. నోట్ల రద్దు ప్రకటన తర్వాత తొలి వారంలో జనధన్ ఖాతా ల్లో అత్యధికంగా రూ. 20,224 కోట్లు జమ అయినట్లు ఆ అధికారి చెప్పారు.
ఆ తర్వాత రోజుల్లో ఐటీ శాఖ హెచ్చరికలతో డిపాజిట్లు తగ్గాయని ఆయన తెలిపారు. జనధన్ ఖాతా ల నుంచి గత పక్షం రోజుల్లో రూ.3,285 కోట్ల డబ్బును ప్రజలు విత్ డ్రా చేసుకున్నారు. ఆశ్చర్యకరంగా 24.13 శాతం జనధన్ ఖాతా లు ఇంకా సున్నా బ్యాలెన్స్ తోనే ఉన్నాయి. జనధన్ ఖాతా ల్లోకి అత్యధిక మొత్తాల్లో డిపాజిట్లు వచ్చిన రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.