సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తులను తాము జప్తు చేసినట్లు ఆదాయపు పన్నుశాఖ మద్రాసు హైకోర్టుకు గురువారం తెలిపింది. చెన్నై పోయెస్ గార్డెన్‌లో జయ నివాసంతోపాటు అన్ని ఆస్తులు తమ స్వాధీనంలో ఉన్నాయని స్పష్టం చేసింది. పర్యవేక్షణకు ప్రయివేటు నిర్వాహకుడిని నియమించాల్సిందిగా కోరుతూ చెన్నై కేకే నగర్‌కు చెందిన అన్నాడీఎంకే నేత పుహళేంది మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. జయలలితకు రూ.913 కోట్లకు పైగా ఆస్తులున్నాయని, వాటన్నింటినీ ఎవరు నిర్వహించాలి, ఎవరు పర్యవేక్షించాలని జయ ఎలాంటి వీలునామా రాయనందున హైకోర్టు చొరవ తీసుకుని పర్యవేక్షకుడిని నియమించాలని ఆ పిటిషన్‌లో కోరారు.
ఈ కేసు విచారణ ఇవాళ న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, శరవణన్‌ల బెంచ్ ముందుకు వచ్చింది. ఐటీశాఖ అసిస్టెంట్ కమిషనర్ శోభ కోర్టుకు హాజరై, చెన్నై పోయెస్ గార్డెన్‌లోని జయలలిత బంగ్లా, ఆస్తులను ఇప్పటికే జప్తు చేశామని తెలిపారు. అలాగే తమిళనాడు, హైదరాబాద్ ప్రాంతాల్లోని జయ ఆస్తులన్నింటినీ తమ శాఖ ఇప్పటికే జప్తు చేసినందున పర్యవేక్షణ కోసం ప్రయివేటు వ్యక్తిని నియమించాలంటూ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరమే లేదని అన్నారు. ఈ కేసుపై తుది విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment