► యూపీ ఎన్నికల ముందు కేంద్రం ప్రకటించనుందంటూ వార్తలు
► ఊహాగానాలేనంటూ తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయంపై విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం.. పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చేలా.. ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. రూ. 4 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్నుపోటు లేకుండా.. ఇప్పటివరకు రూ. 2.5 లక్షలుగా ఉన్న కనీస పన్ను ఆదాయాన్ని రూ. 4 లక్షలకు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాలు తెలిపాయంటూ ఈ వివరాలను ఇండియాటుడే టీవీ చానల్ సోమవారం వెల్లడించింది. సాధారణంగా పన్నుల్లో మార్పులను బడ్జెట్‌లో ప్రతిపాదించే సంప్రదాయానికి విరుద్ధంగా.. యూపీ ఎన్నికల తేదీల ప్రకటన కంటే ముందే ఈ మార్పులను కేంద్రం ప్రకటించనుందని తెలిపింది. అయితే, ఈ వార్తలను కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అవన్నీ ఊహాగానాలేనని కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫ్రాంక్ నోరొన్హా తోసిపుచ్చారు.
ఆ చానల్ కథనం ప్రకారం... పన్ను శ్లాబులు ఇలా ఉండొచ్చు.. రూ.4–10 లక్షల మధ్య ఆదాయానికి 10 శాతం, 10–15 లక్షల ఆదాయానికి 15 శాతం, 15–20 లక్షలైతే 20 శాతం, రూ.20 లక్షలు దాటితే 30 శాతం పన్ను విధిస్తారని చెప్పింది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే... అధిక ద్రవ్యోల్బణం, పన్ను రేట్లతో బాధపడుతున్న ఉద్యోగులకు భారీ ఊరటనిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రూ.2.5 లక్షల లోపు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్ను లేదు.
ప్రస్తుత పన్ను శ్లాబులు:
• రూ. 2,50,001– రూ 5 లక్షల వరకూ 10 శాతం
• రూ. 5,00,001– 10 లక్షల వరకూ 20 శాతం,
• రూ. 10 లక్షలు దాటితే 30 శాతం పన్ను ఉంది.
జైట్లీ సూచనప్రాయంగా...
∙డిసెంబర్ 14న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచనప్రాయంగా మాట్లాడుతూ... తదుపరి బడ్జెట్‌లో ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లను తగ్గిస్తూ... సామాన్యుడికి కేంద్ర ప్రభుత్వం వరాలు ఇస్తుందని చెప్పిన విషయం గమనార్హం. నోట్ల రద్దు నిర్ణయం వల్ల అధిక శాతం పన్ను పరిధిలోకి రావడంతో ప్రభుత్వానికి ఆదాయం పెరగొచ్చన్నారు. భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువ డిజిటల్‌కు మారడం వల్ల నల్లకుబేరులు పన్ను చట్రంలోకి వస్తారని... దీంతో ప్రస్తుత పన్ను ఆదాయం పెరుగుతుందన్నారు. దీంతో ప్రస్తుత పన్నులు మరింత సహేతుకంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులు?
Published Tue, Dec 20 2016 3:00 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM
Advertisement