సాక్షి, అమరావతి: మధ్యతరగతి ఉద్యోగుల ఆశలపై ఆర్థికమంత్రి నీళ్లు చల్లారు. పన్ను శ్లాబుల్లో మార్పులేమీ చేయకుండా కేవలం స్టాండర్డ్ డిడక్షన్‌తో సరిపెట్టుకోమన్నారు. వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి నాలుగు కీలక మార్పులను ప్రతిపాదించారు. సుమారు 12 ఏళ్ల తర్వాత ఉద్యోగస్తులు, పెన్షనర్ల కోసం స్టాండర్డ్ డిడక్షన్‌ను తిరిగి ప్రవేశపెట్టడమే కొద్దిగా ఊరట కలిగించే విషయం. కానీ దానివల్ల వచ్చే లాభం కూడా చేతికందకుండా నానా మెలికలూ పెట్టారు జైట్లీ. చెల్లించే ఆదాయపన్నుపై వేసే సుంకాన్ని 3 నుంచి 4 శాతానికి పెంచారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో సీనియర్ సిటిజన్లపై మాత్రం కాస్త కరుణ చూపించారు. ఆ వివరాలు చూద్దాం...
స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000
ఒక ఉద్యోగి ఆఫీసుకు వెళ్లి రావడానికయ్యే వ్యయాలను దృష్టిలో పెట్టుకొని గతంలో స్టాండర్డ్ డిడక్షన్ కింద ఆదాయంలోంచి కొంత మొత్తాన్ని తగ్గించి మిగిలిన దానిపైనే పన్ను లెక్కించేవారు. కానీ దీన్ని 2006–07 అసెస్‌మెంట్ ఇయర్‌లో తొలగించారు. అప్పట్లో స్టాండర్డ్ డిడక్షన్ రూ.30 వేలుగా ఉండేది. 12 ఏళ్ల తర్వాత తిరిగి రూ.40,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను జైట్లీ ప్రకటించారు. దీనివల్ల 2.5 కోట్ల మంది లబ్ధి పొందుతారని, ప్రభత్వానికి రూ.8,000 కోట్ల ఆదాయం తగ్గుతుందని చెప్పారు. కానీ స్టాండర్డ్ డిక్షన్ నేపథ్యంలో ప్రస్తుతం మినహాయింపు పరిధిలో ఉన్న రవాణా, వైద్య చికిత్స అలవెన్సుల్ని పన్ను పరిధిలోకి తెచ్చారు.
అసలు డిడక్షన్ ఎంతంటే...
ఉద్యోగి జీతంలో నెలకు రూ.1,600 చొప్పున (ఏడాదికి రూ.19,200) రవాణా భత్యం ఉంటుంది. దీనిపై ఇపుడు పన్ను లేదు. అలాగే ఏడాదికి రూ.15,000 వరకు మెడికల్ ఖర్చులను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. ఆ లెక్కన ఏటా రూ.34,200పై ఇప్పుడు కూడా పన్ను లేదు!! మరిక రూ. 40,000 స్టాండర్డ్ డిడక్ష న్ వల్ల లాభమెంత? కేవలం రూ.5,800!! పెన్షన్లరకు ఇలాంటి భత్యాలు ఉండవు కనక స్టాండర్డ్ డిడక్షన్ వల్ల సీనియర్ సిటిజ న్స్‌కు లాభమని చెప్పాలి. ఇది వ్యాపారులు, వృత్తి నిపుణులకు వర్తించదు.
పెరిగిన సెస్ భారం
ఆదాయ పన్నుపై చెల్లించే సుంకాన్ని 3 నుంచి 4 శాతానికి పెంచారు. తద్వారా పన్ను చెల్లింపుదారులకు ట్యాక్స్ శ్లాబును బట్టి రూ.125 నుంచి రూ.2,625 వరకు భారం పడుతుంది. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలలోపు పన్ను ఆదాయమున్న వారు ప్రస్తుతం 5 శాతం పన్ను చెల్లించాలి. ఈ పరిమితిలో ఉన్నవారు అదనంగా రూ.125 వరకు చెల్లించాలి. అదే 10శాతం పన్ను పరిధిలో (రూ.5–10 లక్షలు) ఉన్నవారు గరిష్టంగా రూ.1,125, 30% పన్ను పరిధిలో ఉన్న వారు అదనంగా రూ.2,625 సుంకం చెల్లించాల్సి ఉంటుంది.
సీనియర్లకు కాస్త నయమే!
వయో వృద్ధుల వడ్డీ ఆదాయంపై టీడీఎస్ విధించే పరిమితిని ఐదు రెట్లు పెంచడమే కాకుండా, వైద్య చికిత్స వ్యయాలపై పన్ను మినహాయింపు పరిమితిని కూడా పెంచారు జైట్లీ. స్థిరాదాయాన్నిచ్చే ప్రధాని వయ వందన యోజన పథకాన్ని 2020 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సెక్షన్ 194ఏ కింద రూ.50,000 వడ్డీ ఆదాయం వరకు ఎలాంటి టీడీఎస్ వసూలు చేయరు. ప్రస్తుతం ఈ పరిమితి రూ.10,000 మాత్రమే. అదే విధంగా సెక్షన్ 80డీ కింద సీనియర్ సిటిజన్స్ చెల్లించే వైద్య బీమా ప్రీమియం, వైద్య చికిత్సా వ్యయాల పరిమితిని రూ. 50,000కు పెంచారు. ప్రసుత్తం ఈ పరిమితి రూ. 30,000గా ఉంది. అదే విధంగా సెక్షన్ 80డీడీబీ కింద తీవ్ర రోగాల (క్రిటికల్ ఇల్‌నెస్)కు చేసే చికిత్స వ్యయాలపై లభించే పన్ను మినహాయింపు పరిమితిని లక్ష రూపాయలకు పెంచారు. ప్రస్తుతం ఈ పరిమితి సీనియర్ సిటిజన్స్‌కు రూ.40,000, సూపర్ సీనియ ర్స్‌కు రూ.60,000 ఉంది. వడ్డీరేట్లు తగ్గుతుండటం తో వయోవృద్ధులకు స్థిరమైన ఆదాయాన్ని అందించడానికి ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వయ వందన యోజన పథకాన్ని 2020కి పొడిగించారు. ఎల్‌ఐసీ అందించే ఈ పథకంపై 8 శాతం వడ్డీ లభిస్తుంది. అంతేగాక ఈ పథకంలో ఇన్వెస్ట్‌మెంట్ పరిమితిని ప్రస్తుతం రూ.7.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు.
స్టాండర్డ్ డిడక్షన్‌కి బిల్లులక్కర్లేదు
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్‌లో ప్రకటించిన రూ.40,000 స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ చేయడానికి వేతన జీవులు, పెన్షనర్లు ప్రత్యేకంగా బిల్లులు, ఇతరత్రా పత్రాలేవీ సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర వివరణ ఇచ్చారు. వారు నేరుగా ఈ మినహాయింపు పొందవచ్చన్నారు.
ఉద్యోగుల ఆదాయాలే ఎక్కువ
ఉద్యోగులు తమ ఆదాయం వ్యాపారుల కంటే తక్కువని భావిస్తుంటారని, కానీ ఇది సరికాదని గణాంకయుక్తంగా చెప్పారు జైట్లీ. ‘‘వ్యా పారులతో పోలిస్తే ఉద్యోగస్తులే ఎక్కువ ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. 2016–17 అసెస్‌మెంట్ ఇయర్‌లో 1.89 కోట్ల మంది ఉద్యోగస్తులు రూ. 1.44 లక్షల కోట్ల ఆదాయ పన్ను చెల్లించారు. అంటే సగటున ఒక్కో ఉద్యోగి రూ.76,306 చెల్లించారు. కానీ ఇదే సమయంలో 1.88 కోట్ల మంది వ్యాపారులు రూ.48,000 కోట్ల పన్నే చెల్లించారు. వీరి సగటు చెల్లింపు రూ.25,753 మాత్రమే. పన్ను తక్కువ చెల్లిస్తున్నారంటే వారి ఆదాయం తక్కువే కదా!’’అంటూ లాజిక్ లాగారు ఆర్థిక మంత్రి!
Comments
Please login to add a commentAdd a comment