ఆదాయపు పన్నుపైనే ఆశలు!
- బేసిక్ లిమిట్‌ను పెంచాలంటున్న నిపుణులు
- 10 శాతం శ్లాబును మరింత విస్తరించాలి
- కొనుగోళ్లను పెంచటం తక్షణ కర్తవ్యం
- అలా చేస్తేనే ఆర్థిక వ్యవస్థ పరుగులు
- దానికి పన్ను మినహాయింపులే శరణ్యం
- ఫిక్కీ, ఏసీఏఐ ప్రతిపాదనలు
ఈ సారి అరుణ్ జైట్లీ పెట్టబోయే బడ్జెట్‌కు చాలా ప్రత్యేకతలున్నాయి. ఒకటి... ఫిబ్రవరి నెలాఖరుకు బదులు ఈ సారి ఫిబ్రవరి నెల మొదట్లోనే పెడుతున్నారు. రెండోది పెద్ద నోట్లను రద్దు చేసి... డిజిటల్ లావాదేవీల్ని పెంచటానికంటూ పలు చర్యలు చేపట్టాక ఈ బడ్జెట్‌ను తెస్తున్నారు. మూడోది... పెద్ద నోట్ల రద్దుతో ఇపుడు ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదనే విమర్శలొస్తున్న తరుణంలో, ఎకానమీకి ఊతమివ్వటానికి ఈ బడ్జెట్లో పలు చర్యలు తీసుకోవచ్చనే అంచనాలు చాలానే ఉన్నాయి. వీటన్నిటికీ తోడు... ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో జైట్లీ ఈ సారి గత రెండు బడ్జెట్లకు భిన్నమైన బడ్జెట్ తెస్తారని ఫిక్కీ, సీఐఐ, డెలాయిట్, కేపీఎంజీ వంటి ఆర్థిక సంస్థలతో సహా వివిధ రంగాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెచ్చి పరుగులు పెట్టించాలంటే ప్రధానంగా ఆదాయపు పన్ను శ్లాబుల్లో మినహాయింపులు తప్పనిసరి అన్నది వారి విశ్లేషణ. వారి ప్రతిపాదనల వివరాలివీ...
ఫిక్కీ, ఏసీఏఐ ప్రతిపాదనలు
1. ఆదాయపు పన్ను ప్రాథమిక మినహాయింపు ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ఉంది. దీన్ని రూ.3 లక్షలకు పెంచాలి.
2. మినహాయింపులు పోగా ప్రస్తుతం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఉండే పన్ను చెల్లించాల్సిన ఆదాయంపై 10 శాతం పన్ను విధిస్తున్నారు. దీన్ని రూ.10 లక్షల ఆదాయం వరకూ వర్తింపజేయాలి.
3. ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఉటే దానిపై 20 శాతం పన్ను విధిస్తున్నారు. ఆ పరిమితిని రూ.20 లక్షల వరకూ వర్తింపజేయాలి.
4. ఇక రూ.10 లక్షలు పైబడి పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఉంటే... వారు ప్రస్తుతం 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది. దాన్ని రూ.20 లక్షలు పైబడ్డ వారికి మాత్రమే వర్తింపజేయాలి.
డెలాయిట్ సర్వేలో తేలిందిదీ...
ప్రముఖ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ నిర్వహించిన సర్వేలో... రూ.2.50 లక్షలుగా ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని పలువురు సూచించారు. దీనివల్ల ప్రజల వద్ద నగదు మిగులుతుందని, కొనుగోళ్లు పెరుగుతాయని, పొదుపు పెరిగి పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని సంస్థ అంచనా వేస్తోంది.
అలాగే ఐటీ చట్టం 80సీ మినహాయింపుల్ని రూ.1,50,000 నుంచి రూ.2,50,000కు పెంచాలన్నది మరో సూచన. అంతేకాక నేషనల్ పింఛన్ పథకం, భవిష్య నిధి(పీఎఫ్) నుంచి నగదు ఉపసంహరణపై పూర్తిగా పన్ను మినహాయించాలి. ముందస్తు పన్ను చెల్లింపునకు మినహాయింపును మరింత పెంచాలి. వైద్య ఖర్చుల మినహాయింపు రూ. 15,000 నుంచి రూ.50,000కు పెంచాలి. ట్రావెలింగ్ అలవెన్స్‌పై రూ. 5,000 వరకు మినహాయింపు ఇవ్వాలి.
శ్లాబుల్ని సవరించాలి: సీఐఐ
పన్ను శ్లాబుల్ని సవరించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సూచించింది. బేసిక్ లిమిట్‌ను ప్రస్తుతమున్న రూ.2.50 లక్షల నుంచి కనీసం రూ.3 లక్షలకు పెంచాలని, శ్లాబుల్ని కూడా సవరించాలని సీఐఐ కోరింది.
వృద్ధి ఆధారిత బడ్జెట్ అవసరం
వినియోగాన్ని ప్రోత్సహించడం, పెట్టుబడుల్లో ప్రజల భాగస్వామ్యం పెంచడం, డిజిటలైజేషన్‌కు ప్రోత్సాహం, పన్ను పరిధిని విస్తరించడం, అధిక వృద్ధి సాధించేలా మొత్తంగా 2017 కేంద్ర బడ్జెట్ వృద్ధి ఆధారిత బడ్జెట్‌గా ఆశిస్తున్నాం. గార్, పన్ను మినహాయింపులు, జీఎస్టీలకు సంబంధించి విధానాల్ని స్పష్టంగా నిర్వచించాలని కోరుతున్నాం. ప్రస్తుత ఆర్థిక మందగమనం నేపథ్యంలో వ్యాపార నిర్వహణ సులభతరం చేయడం మరో కీలకాంశం. అలాగే వ్యవసాయం, మౌలిక వసతులు, సేవా రంగాలపై మరింత దృష్టిపెడతారని ఆశిస్తున్నాం.
– ఎన్.ఎహెచ్.భన్సాలీ, సీఈవో, ఇమామీ లిమిటెడ్(ఫైనాన్స్,స్ట్రాటజీ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్)
జూలై తరవాతే జీఎస్‌టీ: కేపీఎంజీ
ప్రముఖ ఆడిటింగ్ సంస్థ కేపీఎంజీ నిర్వహించిన ప్రీ బడ్జెట్ సర్వేలో వివిధ రంగాలకు చెందిన దాదాపు 750 మంది పాల్గొన్నారు. వారందరి అభిప్రాయాల్ని క్రోడీకరించిన అనంతరం సంస్థ తన నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం...
► దాదాపు సగం మంది నిపుణులు ఈ సారి గార్ (జనరల్ యాంటీ ఎవాయిడెన్స్ రూల్స్)ను వాయిదా వేయాలని కోరారు. గార్ నిబంధనల్ని 2012 బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. అయితే సరైన రీతిలో నిబంధనలు రూపొందించకపోవడంతో అమలు వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే గార్‌ను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. అలాగే ఆదాయం లెక్కింపు, వెల్లడి నిబంధనలను (ఐసీడీఎస్) వాయిదా వేయాలని దాదాపు 60 శాతం మంది అభిప్రాయపడ్డారు.
► నోట్ల రద్దు సమీప భవిష్యత్తులో తమ వ్యాపారాలపై ప్రభావం చూపే అవకాశం లేదని పలువురు పేర్కొన్నారు. నోట్ల రద్దుతో ఆదాయపు పన్ను వసూళ్లు పెరుగుతాయని దాదాపు 82 శాతం మంది అంచనా వేశారు.
► జీఎస్టీ అమలుకు 1, జులై 2017 అనువైనదని 49 శాతం మంది చెప్పగా... 43 శాతం మంది మాత్రం జులై తర్వాతే జీఎస్టీ అమలు చేయాలని కోరారు. బడ్జెట్ సమావేశాల్లో జీఎస్టీ నమూనా చట్టం ఆమోదించాలని 68 శాతం సూచించగా... జీఎస్టీ అమలు నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో పన్ను మినహాయింపులు, రాయితీ ఇవ్వాలని 82 శాతం మంది కోరారు. జీఎస్టీ ఆర్థిక రంగంపై సానుకూల ప్రభావం చూపుతుందని 95 శాతం మంది అభిప్రాయపడ్డారు.
► 85 శాతం మంది వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు ఆశిస్తున్నారు. 94 శాతం ఈ బడ్జెట్‌లో పన్ను మినహాయింపుల్లో ఉపశమనం దక్కవచ్చని భావిస్తున్నారు.
ప్రత్యక్ష పన్నుల్లో సంస్కరణలు ఆశిస్తున్నాం
ఈ బడ్జెట్ దేశానికే కాకుండా, బీజేపీ ప్రభుత్వానికి చాలా కీలకమైంది. జీడీపీ వృద్ధి అంచనాల్ని అందుకోవడం, నల్లధనం వెలికి తీసేందుకే నోట్ల రద్దు నిర్ణయమని నిరూపించుకోవడం కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఎజెండాలు.. ఈ బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్నుల సంస్కరణలు, భూముల రిజిస్ట్రేషన్ సంస్కరణలతో పాటు డిజిటలైజేషన్‌కు మరింత ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాం. ఆర్థిక సమానత్వ సాధనకు, మేకిన్ ఇండియా కోసం కొత్త పథకాలు ప్రవేశపెడతారని ఆశిస్తున్నాం
– సంజయ్ సేథీ, సీఈవో, షాప్‌క్లూస్