చేదు గుళికలా? తీపి పలుకులా? | An open letter to finance minister Arun Jaitley from the salaried class | Sakshi
Sakshi News home page

చేదు గుళికలా? తీపి పలుకులా?

Published Wed, Jun 25 2014 2:08 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

చేదు గుళికలా? తీపి పలుకులా? - Sakshi

చేదు గుళికలా? తీపి పలుకులా?

సబ్సిడీల కోత తప్పదనే సంకేతాలు...
- రైల్వే చార్జీల వడ్డనే నిదర్శనమంటున్న విశ్లేషకులు
- వృద్ధిని గాడిలోపెట్టడం, ఆర్థిక క్రమశిక్షణే లక్ష్యం
- ఐటీ మినహాయింపు పరిమితి పెంపుపై ఉత్కంఠ
- ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలి బడ్జెట్‌పైనే దేశవ్యాప్తంగా ఆసక్తి...

పదేళ్ల ఎదురుచూపుల తర్వాత బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు తొలి బడ్జెట్ ఎలా ఉండబోతోంది? ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించనున్న మొట్టమొదటి బడ్జెట్‌లో దేశ ప్రజలకు చేదు గుళికలు ఉంటాయా? తీపి కబుర్లు వినిపిస్తారా? ఇవే ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్నలు.
 
అసలే ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంతో ఆపసోపాలు పడుతున్న తరుణంలో కార్పొరేట్ రంగం అనేక ఆశలతో ప్రభుత్వంవైపు చూస్తోంది. మరోపక్క, ద్రవ్యోల్బణం సెగతో అల్లాడుతున్న ప్రజలు కూడా బడ్జెట్‌లో తమకు ఉపశమనం కలిగించే చర్యలు ఉంటాయన్న నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జైట్లీ తొలి పరీక్షను ఎలా ఎదుర్కొంటారన్న ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను వచ్చే నెల 10న ప్రవేశపెట్టనుంది.
 
ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ఆశలు, ఆకాంక్షలు, విజ్ఞప్తులు ఇతరత్రా అంశాల సమాహారంతో అందిస్తున్న ‘కౌంట్‌డౌన్’ ఇది... ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సైన్యం యూపీఏ ప్రభుత్వ తప్పులను ఎండగడుతూనే... ప్రజలకు ఊరటనిచ్చే అనేక వరాలు, హామీలను కూడా గుప్పించింది. దీనికి ప్రతిఫలంగా భారీ మెజారిటీతో సుస్థిర మోడీ సర్కారు కొలువుదీరింది. వస్తూవస్తూనే ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టాలంటే కొన్ని కఠిన చర్యలు తప్పవంటూ కుండబద్దలుకొట్టిన మోడీ... అదేంటో వెంటనే చూపించారు. రైల్వే చార్జీలను(ప్రయాణికులు, సరుకు రవాణా రెండూ) భారీగా పెంచేసి ప్రజలు, కార్పొరేట్లపై మోయలేని భారం మోపారు.
 
పడిపోతున్న వృద్ధిరేటుకు చికిత్స చేయడమే లక్ష్యమంటూ ఊదరగొడుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొట్టతొలి బడ్జెట్‌లో మరెన్ని బాంబులు పేల్చుతారోనని అటు కార్పొరేట్లు, ఇటు సామాన్య ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. అదుపుతప్పుతున్న ద్రవ్యలోటును కట్టడి చేయడం, వృద్ధి రేటును తిరిగి పట్టాలెక్కించాలంటే సబ్సిడీల కోత, వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) అమలు వంటి కీలక చర్యలు తప్పవంటూ నిపుణులు, ప్రపంచబ్యాంక్ వంటి సంస్థలు పదేపదే చెబుతున్నారు.
 
దీనికి అనుగుణంగానే రైల్వే చార్జీల పెంపుతో మోడీ ప్రభుత్వం సంకేతాలు కూడా ఇచ్చింది. అయితే, అందరూ ఆందోళన చెందుతున్నట్లుగా మరీ అంత చేదు గుళికలేవీ బడ్జెట్‌లో ఉండకపోవచ్చని... ఒకవేళ ఒకటోరెండో ఇలాంటి చర్యలు ఉన్నప్పటికీ ఆమోదనీయ స్థాయిలోనే ఉంటాయని సిట్రస్ అడ్వయిజర్స్ వ్యవస్థాపకుడు సంజయ్ సిన్హా అభిప్రాయపడ్డారు.
 
‘రైల్వే చార్జీల పెంపు ద్వారా సబ్సిడీలను వీలైనంతమేర కోతపెట్టే దిశగా తాము అడుగులేస్తున్న సంకేతాలను ప్రభుత్వం ఇచ్చింది. దీనికితోడు ఆర్థిక సంస్కరణలను మరింత పరుగులు పెట్టిస్తామన్న సందేశాన్ని కూడా మోడీ ప్రభుత్వం స్పష్టంగా వినిపించింది’ అని ఆయన అంటున్నారు. రైల్వేల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను అనుమతించే ప్రతిపాదనను రైల్వే బడ్జెట్‌లో ప్రకటించేలా కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే.
 
ఐటీ మినహాయింపువైపే చూపు...
సబ్సిడీల తగ్గింపు, పన్ను ఆదాయాల పెంపు వంటి కఠిన చర్యలపై దృష్టిపెడుతూనే... మధ్యతరగతి వర్గాలను సంతృప్తిపరిచేలా మోడీ తన వ్యూహాన్ని అమలు చేయొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత ఆదాయపు పన్ను(ఐటీ) మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న రూ. 2 లక్షల నుంచి రూ.3-5 లక్షల స్థాయి పెంచొచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇలాంటి ‘ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్’పై జైట్లీ కచ్చితంగా దృష్టిపెట్టొచ్చని.. దీనివల్ల దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై చాలా సానుకూలత పెరిగేందుకు దోహదం చేస్తుంది’ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ై
 
డెరెక్ట్ ట్యాక్స్ కోడ్(డీటీసీ)లో ఐటీ మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలుగా ప్రతిపాదించడం తెలిసిందే. దీనికి బీజేపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం కూడా ఓకే చెప్పింది. మరి స్వయంగా వాళ్ల సర్కారే ఇప్పుడు కేంద్రంలో కొలువుదీరిన నేపథ్యంలో ఒకవేళ డీటీసీ తక్షణం అమలు చేయకపోయినా, ఈ ప్రతిపాదనను కార్యరూపంలోకి తీసుకొస్తుందా లేదా అనే ఆసక్తి నెలకొంది.
 
జైట్లీ బడ్జెట్‌పై  10  కీలక అంచనాలు..
 1    ఐటీ మినహాయింపు పరిమితి ఇప్పుడున్న రూ.2 లక్షల స్థాయి నుంచి  పెంపు.
 2    పొదుపును ప్రోత్సహించేందుకుగాను ఆదాయపు పన్ను మినహాయింపునకు ఉద్దేశించిన సెక్షన్ 80సీలో మార్పులు చేర్పులు. ప్రస్తుతం ఈ విభాగం కింద రూ. లక్ష వరకూ వ్యయం, పొదుపు మొత్తంపై ఐటీ మినహాయింపు ఉంది.
 3    కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కొన్ని సామాజిక పథకాల రద్దు. ఈ నిధులను నేరుగా రాష్ట్రాలకే బదలాయించడం ద్వారా వాటికి మరింత స్వేచ్ఛనిచ్చేలా వ్యూహం.
 4    పారిశ్రామిక రంగం నుంచి పెట్టుబడుల జోరు పెంచేందుకుగాను పన్ను ప్రోత్సాహకాలు.
 5    స్టాక్ మార్కెట్ జోరు నేపథ్యంలో డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని పెంచడం ద్వారా ఖజానాకు మరిన్ని నిధులు జమచేయడం.
 6    జీఎస్‌టీ అమలుకు నిర్ధిష్ట డెడ్‌లైన్. వచ్చే ఏడాది మధ్యనుంచి లేదా 2016 ఏప్రిల్ నుంచి అమలు చేసేలా ప్రకటన.
 7    పరోక్ష పన్నుల(ఎక్సైజ్, కస్టమ్స్)ల్లో కొన్ని స్వల్ప మార్పులు.
 8    ఏప్రిల్ 1, 2015 నుంచి డెరైక్ట్ ట్యాక్స్ కోడ్(డీటీసీ) అమలు ప్రకటన. విధివిధానాలు ఈ ఏడాదిలోనే ఖరారు చేసేలా.
 9    విద్య, నైపుణ్యాల పెంపు, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి పథకాలకు భారీగా నిధుల కేటాయింపు. గ్రామీణ ఇళ్ల నిర్మాణం, రోడ్లు, ప్రత్యేక ఆర్థిక, తయారీ మండళ్లపై ప్రత్యేక దృష్టి.
 10    వృద్ధికి ఊతమిచ్చేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, భూసేకరణ చట్టాల్లో మార్పులు.
 
చర్యలకు సమయమిదే: జైట్లీ
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ‘గత రెండేళ్లలో ఆర్థిక ప్రగతి మందగించింది. ఇది ఓ సవాలు వంటిది. ఆర్థిక వృద్ధికి చర్యలు చేపట్టాల్సిన సమయం ఇదే’ అని ఆయన ఉద్ఘాటించారు.
 
రక్షణ మంత్రి కూడా అయిన జైట్లీ మంగళవారం న్యూఢిల్లీలో నేవీ వేడుకల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వరుసగా రెండేళ్లలో 5% కంటే తక్కువ వృద్ధి రేటు నమోదు కావడం రెవెన్యూ వసూళ్లపై ప్రతికూల ప్రభావం చూపిందని చెప్పారు. ఇన్వెస్టర్లలో విశ్వాసం పునరుద్ధరించడానికీ పారిశ్రామిక, వ్యవసాయ సంఘాలతో పాటు ఇతర వర్గాలతో చర్చించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement