పార్టీలకు కొత్త మినహాయింపుల్లేవు
రద్దయిన నోట్ల డిపాజిట్లపై జైట్లీ స్పష్టీకరణ
► రద్దయిన నోట్లను విరాళంగా స్వీకరించొద్దు
► అలా చేస్తే ఐటీ విచారణ ఎదుర్కొనక తప్పదన్న జైట్లీ
ముంబై/న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు పాతనోట్లను డిపాజిట్ చేస్తే ఐటీ విచారణ ఉండదంటూ వస్తున్న వార్తలన్నీ వదంతులేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు ఐటీ విచారణ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లుగా చట్టాల్లో కొత్తగా మార్పులేమీ చేయలేదని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. చట్టప్రకారం పార్టీల అకౌంట్లను కూడా తనిఖీ చేస్తామన్నారు. ‘నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత రాజకీయ పార్టీలు తమకొచ్చే విరాళాలను రద్దయిన నోట్ల రూపంలో స్వీకరించరాదు. ఒకవేళ ఏ పార్టీ అయినా స్వీకరిస్తే అది నిబంధనలకు విరుద్ధమే’ అని జైట్లీ తెలిపారు.‘రెండున్నరేళ్లుగా మేం అధికారంలో ఉన్నాం.
అప్పటినుంచి రాజకీయ పార్టీలకు సంబంధించి న్యాయ, పన్ను విధానాల్లో ఎటువంటి మార్పులు తీసుకురాలేదు. 15–20 ఏళ్లుగా అమల్లో ఉన్న విధానమే కొనసాగుతోంది. ప్రస్తుత వ్యవస్థ ప్రకారం ఏ రాజకీయ పార్టీ అయినా నల్లదనాన్ని వైట్‌మనీగా మార్చుకునేందుకు తప్పుడు దార్లలో వెళ్లిందని అనుమానం వస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు నియమాలు అందుబాటులో ఉన్నాయి’అని జైట్లీ చెప్పారు. రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా కూడా జైట్లీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ఐటీ శాఖకు రాజకీయ పార్టీల నిధులపైనా విచారణ జరిపే అధికారం ఉందన్నారు. పార్టీల ఆదాయం, కానుకల విషయంలో ఐటీ చట్టం 1961లోని సెక్షన్ 13 (ఏ) నియమాలు వర్తిస్తాయని ఇందులో ఏమాత్రం సందేహం అవసరం లేదని అధియా వెల్లడించారు. అనంతరం ఢిల్లీలో జరిగిన ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో జైట్లీ మాట్లాడుతూ.. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత రద్దయిన మొత్తాన్నీ చెలామణిలోకి తీసుకురాలేమని.. ఇందులో కొంత మొత్తాన్ని మళ్లీ తక్కువ విలువైన కరెన్సీతో ముద్రించి అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. మిగిలిన ఖాళీని డిజిటల్ కరెన్సీ భర్తీ చేస్తుందని ఆయన వెల్లడించారు.
ఇన్నాళ్లూ.. నగదు ప్రవాహం ఎక్కువగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థలో యథేచ్చగా పన్ను ఎగవేతలు జరిగాయని, నల్లధనం, అవినీతి రాజ్యమేలాయన్నారు. ‘నోట్లను చెలామణిలోకి తీసుకువచ్చేందుకు ఎక్కువ సమయం పట్టదు. అతి త్వరలో కరెన్సీని బ్యాంకింగ్, పోస్టల్ వ్యవస్థ ద్వారా ఆర్బీఐ మార్కెట్లోకి ప్రవేశ పెడుతుంది. దీని వల్ల ప్రజల సమస్యలు తగ్గుతాయి. డిజిటల్ లావాదేవీ విషయంలో గత ఐదు వారాల్లో చాలా మార్పు వచ్చింది. పార్లమెంటులోని ఓ వర్గానికి మాత్రమే ఈ విషయం తెలియలేదు’అని జైట్లీ తెలిపారు. ‘ఈ నిర్ణయం వల్ల ఆర్థిక, సామాజిక రంగాల్లో ఫలితాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీ ని వల్ల స్వల్పకాలమే కష్టాలుంటాయి’అని ఆర్థిక మంత్రి అన్నారు. దేశంలో 75 కోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు పెద్ద మొత్తం ఈ–వ్యాలెట్‌లున్నందున డిజిటల్ లావాదేవీలు మరింత ఊపందుకుంటాయనిఆశాభావం వ్యక్తం చేశారు.
ఎప్పుడైనా జీఎస్టీ
ఏప్రిల్ 1, 2017 నుంచి, సెప్టెంబర్ 16 మధ్యలో ఎప్పుడైనా జీఎస్టీ అమల్లోకి రావొచ్చని జైట్లీ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్ 10 కీలకాంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందన్న జైట్లీ.. పన్ను నిర్వహణ ఒక్కటే పెండింగ్‌లో ఉన్నందున త్వరలోనే దీనిపైనా ఓ నిర్ణయం తీసుకుని జీఎస్టీని అమల్లోకి తెస్తామన్నారు. ‘ఇది లావాదేవీలపై పన్ను. ఆదాయపు పన్ను కాదు. ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా లావాదేవీలపై పన్నును అమల్లోకి తీసుకురావొచ్చు. కొత్త పన్ను వ్యవస్థను తీసుకొచ్చేందుకు మరింత పకడ్బందీగా నిర్ణయం తీసుకోనున్నాం’అని జైట్లీ స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు కావాలనే జీఎస్టీని ఆలస్యం చేశాయని విమర్శించారు.
కాగా, నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఇంతవరకు రూ.5.5లక్షల కోట్ల విలువైన కొత్తనోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి పంపించినట్లు ఆర్బీఐ ప్రకటించింది. డిసెంబర్ 31 లోపు రూ.6–6.5 లక్షల కోట్లు మార్కెట్లోకి చేరేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. నవంబర్ 8కి ముందు మార్కెట్లో రూ.15.44లక్షల కోట్ల విలువైన రద్దయిన (రూ.500, వెయ్యి) నోట్లున్నాయి. దీంతో పోలిస్తే.. 35.6శాతం కరెన్సీ మార్కెట్లోకి విడుదల చేశామని వెల్లడించింది.