ప్రతీకారం తీర్చుకున్న అమిత్‌ షా | BJP now largest party in the Upper House | Sakshi
Sakshi News home page

యూపీలో బీజేపీ ప్రతీకారం

Published Sat, Mar 24 2018 1:46 AM | Last Updated on Fri, Mar 29 2019 5:33 PM

BJP now largest party in the Upper House - Sakshi

అరుణజైట్లీ, అభిషేక్‌ సింఘ్వీ, జీవీఎల్‌ నరసింహారావు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఉత్తరప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. తొమ్మిదో అభ్యర్థిని బరిలోదింపి ప్రత్యర్థి ఎత్తులను చిత్తుచేస్తూ తన అభ్యర్థిని గెలిపించుకుంది. భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరగటంతోపాటు ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో ఎస్పీ, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థి విజయానికి గండికొట్టింది. మొన్నటి గోరఖ్‌పూర్, ఫూల్పూర్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. మిగిలిన ఆరు రాష్ట్రాల్లోనూ అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు మెజారిటీ స్థానాలు గెలుచుకున్నాయి.

కర్ణాటకలో కాంగ్రెస్‌ 3, బీజేపీ ఒక స్థానంలో, పశ్చిమబెంగాల్‌లో 4 స్థానాల్లో తృణమూల్, కాంగ్రెస్‌ ఒక సీటును, ఛత్తీస్‌గఢ్‌లోని ఏకైక స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. కేరళలో ఎల్డీఎఫ్‌ మద్దతుతో జేడీయూ అభ్యర్థి విజయం సాధించారు. తెలంగాణలోని మూడుసీట్లను టీఆర్‌ఎ‹స్‌ గెల్చుకుంది. తాజా ఫలితాలతో రాజ్యసభలో ఎన్డీయే బలం 104కు చేరగా ఇందులో బీజేపీ ఖాతాలో 86 సీట్లున్నాయి. ఏప్రిల్‌ 2న ఖాళీ కానున్న మొత్తం 59 స్థానాలుకు నోటిఫికేషన్‌ వెలువడగా.. ఇందులో 33 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో బీజేపీ 16 స్థానాలు గెలుచుకుంది. ఎన్నికలు జరిగిన 26 స్థానాల్లో బీజేపీ 12 చోట్ల గెలిచింది.  

యూపీలో బీజేపీ జోరు
ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 9 స్థానాలను కైవసం చేసుకోగా.. ఎస్పీ ఒక స్థానంలో గెలిచింది. ఎస్పీ మద్దతుతో బరిలో నిలిచిన బీఎస్పీ ఓటమిపాలైంది. ఎనిమిది మంది సభ్యులను గెలిపించుకునేందుకు అవసరమైన బలమే ఉన్నప్పటికీ.. విపక్షకూటమిని చీల్చేందుకు బీజేపీ 9వ అభ్యర్థిని బరిలోకి దించింది. దీంతో బీఎస్పీ, బీజేపీ 9వ అభ్యర్థి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

ఓటింగ్‌ పూర్తయిన తర్వాత.. కౌంటింగ్‌ ముందు ఇద్దరు సభ్యుల తీరుపై ఎస్పీ, బీఎస్పీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీనిపై విచారణ జరిపిన ఈసీ.. ఓ బీఎస్పీ, ఓ బీజేపీ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లవని స్పష్టం చేసింది. ఒక్కోక్కటిగా ఫలితాలు వెలువడగా.. బీజేపీ అభ్యర్థులు కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ, పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు సహా 8 మంది విజయం సాధిచారు. ఎస్పీ తరపున జయాబచ్చన్‌ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.

అందరి అ‘టెన్షన్‌’!
పదో అభ్యర్థి కౌంటింగ్‌ ఉత్కంఠను పెంచింది. బీజేపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి అనిల్‌ కుమార్‌ అగర్వాల్, బీఎస్పీ అభ్యర్థి అంబేడ్కర్‌ మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. తొలి ప్రాధాన్య ఓట్లలో ఇద్దరు సభ్యులకూ సరిపోయేంత మెజారిటీ (37 ఓట్లు) రాకపోవటంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాలని అధికారులు నిర్ణయించారు. అయితే వ్యూహాత్మకంగా తొలి 8 మంది అభ్యర్థులకు 39 మంది ఎమ్మెల్యేల చొప్పున ఓట్లను బీజేపీ వేయించింది. రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సి వచ్చినపుడు 8 మంది అభ్యర్థులకు అదనంగా పడిన తొలి ప్రాధాన్య ఓట్లను పరిగణనలోకి తీసుకోవటంతోపాటు.. రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించటంతో బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు.  

కమలానికి ఛత్తీస్‌‘గఢ్‌’
ఛత్తీస్‌గఢ్‌లోని ఏకైక రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ అభ్యర్థి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సరోజ్‌ పాండే సునాయాసంగా విజయం సాధించారు. 90 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో 87 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 49 మంది బీజేపీ, ఒక స్వతంత్ర అభ్యర్థి, మరో బీఎస్పీ అభ్యర్థి సరోజ్‌ పాండేకు ఓటేశారు.

జార్ఖండ్‌లో చెరొకటి
జార్ఖండ్‌లో రెండు సీట్లకు ఎన్నికలు జరగగా ఒక సీటును బీజేపీ, మరో సీటును కాంగ్రెస్‌ గెలుచుకున్నాయి. 82 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో ఎన్డీయే కూటమికి 47 మంది మద్దతుంది. ఇక్కడ ఒక రాజ్యసభ సీటు గెలిచేందుకు 28 మంది సభ్యుల మద్దతు అవసరం. దీంతో బీజేపీ ఒక సీటును సునాయాసంగా గెలుచుకోగా.. రెండో స్థానానికి పోటీ చేసి ఓడిపోయింది.

మమతకే పశ్చిమబెంగాల్‌ జై
పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో బలమైన పార్టీగా ఉన్న తృణమూల్‌ తాజా రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు సీట్లను సునాయాసంగా గెలుచుకుంది. సరైన బలం లేకున్నా తృణమూల్‌ మద్దతుతో ఐదో అభ్యర్థిగా బరిలోకి దిగిన కాంగ్రెస్‌ (అభిషేక్‌ సింఘ్వీ) ఓ స్థానాన్ని కైవసం చేసుకుంది. 294 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో ఒక్కో రాజ్యసభ సభ్యుడు గెలిచేందుకు 49 ఓట్లు అవసరం. 42 మంది సభ్యులున్న కాంగ్రెస్‌కు మిగిలిన తృణమూల్‌ సభ్యులు మద్దతు తెలిపారు.

కేరళ జేడీయూదే..
రాజ్యసభకు కేరళనుంచి ఒక అభ్యర్థిని మాత్రమే పంపే అవకాశం ఉండగా.. ఇందుకు అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఎల్డీఎఫ్‌ నేరుగా తమ అభ్యర్థిని బరిలో దించనప్పటికీ.. జేడీయూ (శరద్‌యాదవ్‌ వర్గం) రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర కుమార్‌కు సంపూర్ణ మద్దతు తెలిపింది. 140 మంది ఎమ్మెల్యేలున్న రాష్ట్ర అసెంబ్లీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యేందుకు 71 సభ్యుల మద్దతు అవసరం. అయితే అధికార వామపక్ష కూటమి మద్దతుతో వీరేంద్ర కుమార్‌ 89 ఓట్లు సంపాదించారు.  

కర్ణాటకలో కాంగ్రెస్‌ హవా..
రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందింది. జేడీఎస్‌ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. మొత్తం 224 ఎమ్మెల్యేల్లో 188 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్కో అభ్యర్థి విజయానికి 46 సీట్లు అవసరం కాగా.. బీజేపీ అభ్యర్థి రాజీవ్‌ చంద్రశేఖర్‌ 50 ఓట్లతో గెలిచారు. కాంగ్రెస్‌ మొదటి అభ్యర్థి ఎల్‌.హనుమంతయ్య 44 ఓట్లతో, రెండో అభ్యర్థి జేసీ చంద్రశేఖర్‌ 46 ఓట్లతో గెలుపొందగా, మూడో అభ్యర్థి నాసీర్‌ అహ్మద్‌ 42 ఓట్లతో గెలుపొందారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement