ఫుట్‌బాల్ ఆటకు క్రేజ్ పెంచేందుకు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఫుట్‌బాల్ ఆడుతున్న ఎంపీలు, స్పీకర్ సుమిత్రా మహాజన్
ఐదు సవరణల్ని ప్రతిపాదించిన ప్రతిపక్షాలు, మళ్లీ లోక్‌సభకు బిల్లు
న్యూఢిల్లీ: ఐదు సవరణలతో ఆర్థిక బిల్లు– 2017ను రాజ్యసభ ఆమోదించింది. ఈ పరిణామంతో రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. రాజ్యసభలో ఎన్డీఏకు మెజార్టీ లేకపోవడంతో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన ఐదు సవరణల్ని అడ్డుకోలేకపోయింది. దీంతో సవరణల ఆమోదం కోసం బిల్లు లోక్‌సభకు వెళ్లనుంది. మొత్తం ఐదు సవరణల్లో మూడింటిని కాంగ్రెస్ సభ్యుడు దిగ్విజయ్ సింగ్, రెండింటిని సీతారాం ఏచూరీ(సీపీఎం) ప్రతిపాదించారు. ఓటింగ్ ప్రారంభానికి ముందే 10 మంది సభ్యులున్న తృణమూల్ కాంగ్రెస్ వాకౌట్ చేసింది. మొత్తం 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీఏ మైనార్టీలో కొనసాగుతోంది. సభలో బీజేపీకి 56 మంది సభ్యులుండగా ఎన్డీఏకు మొత్తంగా 74 మంది ఉన్నారు.
అంతకముందు ఆర్థిక బిల్లుపై చర్చకు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమాధానమిస్తూ.. వివిధ పథకాల లబ్ధికి ఆధార్‌ను తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాల్ని సమర్ధించారు. ఈ విధానంతో మోసాలతో పాటు పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. ఆధార్‌ను తీసుకొచ్చిన ఘనత యూపీఏదే అని.. దాని మరింత విస్తరించడం ఎన్డీఏ ప్రభుత్వ విధి అని చెప్పారు. గతంలో ఆధార్‌పై బీజేపీ, కాంగ్రెస్‌లో కొందరి సభ్యులకు అనుమానాలుండేవని, ప్రధానికి సమర్పించిన నివేదికతో ఆ సందేహాలు తొలగిపోయాయని తెలిపారు. లోక్‌పాల్ నియామకంలో జాప్యంపై లోక్‌సభలో ప్రతిపక్షం ఎదురుదాడి చేసింది.
కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ... సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చెప్పిన వివరాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పలువురు ప్రతిపక్ష సభ్యులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి జైట్లీ స్పందిస్తూ.. లోక్‌పాల్ నియామకానికి అవసరమైన చట్ట సవరణల్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. 2013తో పోల్చితే 2015లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యక్ష నియామకాలు 89 శాతం తగ్గాయని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2013 లో 1,51,841 నియామకాలు చేస్తే.. 2015లో15,877 నియమాకాలే జరిగాయని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు.