సాక్షి, ఢిల్లీ : గుజరాత్లో తొలి దశ శాసనసభ ఎన్నికలకు ఒక్క రోజు ముందు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయని అధికార భారతీయ జనతా పార్టీ సరిగ్గా మొదటి విడత ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను బయట పెట్టింది. పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ ఎన్నికల్లోనూ తమది అభివృద్ది మంత్రమే అని, అన్నివర్గాల అభివృద్ధి సూత్రంతోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రం గుజరాత్ అని జైట్లీ పేర్కొన్నారు.
తొలి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం
యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో మొదటి దశకు రంగం సిద్ధమైంది. తొలి విడత పోలింగ్కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. గుజరాత్ శాసనసభలో మొత్తం 182 స్థానాలున్నాయి. ఇందులో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 89 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటింగ్ కోసం 24 వేల 689 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3 కోట్ల 32 లక్షల 42 వేల 599 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తొలిదశ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల నుంచి 977 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 57 మంది మహిళా అభ్యర్థులున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ రాజ్‌కోట్-పశ్చిమ నుంచి బరిలోకి దిగగా ఆయనతో పాటు పలువురు ప్రముఖులు మొదటి దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment