కమల వికాసం..
అన్ని వర్గాలకు చెందిన నియోజకవర్గాల్లోనూ ఆధిక్యత
న్యూఢిల్లీ: ముస్లిం మైనారిటీలు.. దళితులు.. గ్రామీణ ప్రాంతాలు.. పట్టణ ప్రాంతాలు.. ఇలా ఎక్కడ చూసినా కమల వికాసమే. మొత్తంగా ఉత్తరప్రదేశ్‌లో 2014 సార్వత్రిక ఎన్నికల నాటి ఫలితాలే పునరావృతమయ్యాయి. దీంతో దేశంలోనే ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రమైన యూపీలో బీజేపీ రికార్డు స్థాయి విజయాన్ని కైవసం చేసుకుంది. దాదాపు అన్ని వర్గాలకు చెందిన నియోజకవర్గాల్లోనూ కమలనాథులు స్పష్టమైన ఆధిక్యత చూపించారు. సంప్రదాయంగా తమకు పట్టున్న నియోజకవర్గాల్లోనే కాదు.. బీజేపీ గెలుపు అసాధ్యం అనుకునే స్థానాల్లోనూ కాషాయం రెపరెపలాడింది.
గ్రామీణం(97/142)
గ్రామీణ జనాభా 93 శాతానికిపైగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఉత్తరప్రదేశ్‌లో 142 ఉన్నాయి. 2012లో వీటిల్లో 9 సీట్లు మాత్రమే గెలిచిన కమలనాథులు.. ఇప్పుడు ఆ సంఖ్యను 97కు పెంచుకోగలిగారు. కాంగ్రెస్–ఎస్‌పీ బలం 105 నుంచి 28కి.. బీఎస్‌పీ సీట్లు 26 నుంచి మూడుకు తగ్గిపోయాయి.
ముస్లిం మైనారిటీలు(93/133)
ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం మైనార్టీల సంఖ్య 22 శాతం కంటే ఎక్కువగా ఉన్న అసెంబ్లీ్ల నియోజకవర్గాలు 133 ఉన్నాయి. తాజా ఎన్నికల్లో ఈ స్థానాల్లో బీజేపీ 93 చోట్ల విజయం సాధించింది. 2012లో బీజేపీ సాధించిన సీట్ల కంటే ఇవి నాలుగు రెట్లు ఎక్కువ. ఇదే సమయంలో కాంగ్రెస్–సమాజ్‌వాదీ కూటమి 2012లో 75 చోట్ల విజయం సాధిస్తే.. ఈసారి 30 సీట్లకే పరిమితమైంది. బీఎస్‌పీ బలం 25 నుంచి ఐదుకు పడిపోయింది.
దళితులు(107/140)
యూపీలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితుల సంఖ్య 23 శాతం కంటే ఎక్కువ ఉంది. వీటిల్లో 107 స్థానాల్లో కాషాయ జెండా ఎగిరింది. 2012లో బీజేపీకి ఈ స్థానాల్లో దక్కింది ఎనిమిది సీట్లే. ఇదే సమయంలో కాంగ్రెస్–సమాజ్‌వాదీ కూటమి బలం 94 నుంచి 22 సీట్లకు పడిపోయింది. బీఎస్‌పీ 34 నుంచి ఐదు స్థానాలకే పరిమితమైంది.