తర్వాతి గురి దక్షిణాదిపైనే ..!
బెంగళూరు: ఉత్తరప్రదేశ్‌లో అఖండ విజయంతో దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకునే దిశగా బీజేపీ అడుగులు వేయనుందా? ముఖ్యంగా కేరళ, తమిళనాడులో దూకుడు పెంచనుందా? అన్న ప్రశ్నలపై రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలంటే బీజేపీ మరి కొంత సమయం వేచిచూడక తప్పదనేది కొందరి వాదన కాగా...కర్నాటకలో విజయం సాధించాకే కేరళ, తమిళనాడుపై దృష్టి పెట్టవచ్చనేది మరికొందరి విశ్లేషణ.
కర్నాటకలో అధికారం చేజిక్కించుకున్నాక.. కేరళలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించుకునే లక్ష్యంతో కమలం ముందుకు సాగుతుందని, తమిళనాడులో అన్నాడీఎంకే చీలిక వర్గంతో కలిసి నడుస్తుందనేది వారి అభిప్రాయం. కేరళలో చాలా వేగంగా పావులు కదపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరికొందరి లెక్క ప్రకారం తమిళనాడు, కేరళలో పార్టీ విస్తరణకు బీజేపీ మరో మూడు నాలుగేళ్లు వేచిచూడాల్సిందే.. తమిళనాడులో విస్తరణకు ప్రాంతీయ పార్టీలు అడ్డంకిగా నిలుస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ఓట్ల శాతం పరంగా చూస్తే కేరళలో ఇప్పటికే మంచి స్థానంలో ఉందని చెబుతున్నారు.