అమిత్ షాకు సీఎంల ఎంపిక బాధ్యత
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతోపాటు మణిపూర్‌లకు ముఖ్యమంత్రుల ఎంపిక బాధ్యతను బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు అప్పగిస్తూ ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆదివారం నిర్ణయం తీసుకుంది. గోవా ముఖ్యంమంత్రిగా రక్షణ మంత్రి మనోహర్ పరీకర్‌ను ఇప్పటికే పార్టీ ఎంపిక చేసింది. ఆయా రాష్ట్రాల పరిశీలకులు ఎమ్మెల్యేలను సంప్రదించి ముఖ్యమంత్రి అభ్యర్థుల పేర్లను అమిత్ షాకు చెబుతారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆదివారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ప్రధాని మోదీ, ఇతర సభ్యులు హాజరయ్యారు.
ఉత్తరప్రదేశ్‌కు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పార్టీ కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌లను పరిశీలకులుగా బీజేపీ నియమించింది. ఉత్తరాఖండ్‌కు పరిశీలకులుగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పార్టీ కార్యదర్శి సరోజ్ పాండేలు నియమితులయ్యారు. మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్, పార్టీ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్దేలు మణిపూర్ బాధ్యతలు చూసుకుంటారు.