గోవా, మణిపూర్‌ బీజేపీవే.. | BJP set to form government in Goa and Manipur | Sakshi
Sakshi News home page

గోవా, మణిపూర్‌ బీజేపీవే..

Published Mon, Mar 13 2017 1:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

గోవా, మణిపూర్‌ బీజేపీవే.. - Sakshi

గోవా, మణిపూర్‌ బీజేపీవే..

గోవా ముఖ్యమంత్రిగా పరీకర్‌
బలనిరూపణకు 15 రోజుల గడువు
మణిపూర్‌లోనూ చక్రం తిప్పిన కమలనాథులు
బీజేపికి ఎన్‌పీపీ, ఎల్‌జేపీ మద్దతు
గవర్నర్‌ నజ్మాహెప్తుల్లాను కలిసిన బీజేపీ మద్దతుదారులు
రెండు రాష్ట్రాలలో కమలం కన్నా హస్తానికే ఎక్కువ సీట్లు


పణజి/ఇంపాల్‌: మినీరణంగా పేరొందిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కమల నాథుల విజయపరంపరం ఇంకా కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో స్పష్టమైన విజయాన్ని నమోదుచేసిన బీజేపీ.. తక్కువ సీట్లకే పరిమితమైన గోవా, మణిపూర్‌లలోనూ పీఠాలను కైవసం చేసుకోగలిగింది. దీంతో పంజాబ్‌ ఒక్కదానికే కాంగ్రెస్‌ పరిమితం కావలసి వచ్చింది. గోవా, మణిపూర్‌లలో ఏ పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం లేదు. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ కన్నా కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. కానీ చిన్నపార్టీలు, ఇండిపెండెంట్ల మద్దతును బీజేపీ సంపాదించగలిగింది.

స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కోసమే..
తీర రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసమే తాము బీజేపీకి మద్దతిస్తున్నామని జీఎఫ్‌పీ నాయకుడు విజయ్‌ సర్దేశాయ్‌ తెలిపారు. అస్థిరత కారణంగా రాష్ట్రం అభివృద్ధికి దూరం కావడం తమకు ఇష్టం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి పరీకర్‌ నాయకత్వం వహిస్తున్నారన్న కారణంతోనే తాము బీజేపీకి మద్దతిస్తున్నామని ఎంజీపీ నాయకులు సుదిన్‌ ధావలికర్‌ తెలిపారు. పరీకర్‌ను చూసి తాము బీజేపీకి మద్దతు లేఖ ఇచ్చామని, ఆయన లేకుంటే మద్దతిచ్చేవారం కాదని సుదిన్‌ పేర్కొన్నారు. అంతకుముందు పణజిలో సమావేశమైన బీజేపీ శాసనసభ్యులు పారికర్‌ను శాసనసభాపక్షనేతగా ఎంపిక చేయాల్సిందిగా కోరుతూ ఒక తీర్మానం చేసి పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు పంపించారు. తమ ప్రతిపాదనను అధిష్టానం అంగీకరించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను కలసినట్లు బీజేపీ గోవా అధ్యక్షుడు వినయ్‌ టెండూల్కర్‌ చెప్పారు.

కాంగ్రెస్‌ కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన బీజేపీ
గోవాలో బీజేపీ 32.5శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌ కన్నా ఇది 4.1శాతం ఎక్కువ అయినా అది ఎక్కువ సీట్లు సాధించలేకపోయింది. 28.4శాతం ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్‌ 17 సీట్లు గెలుచుకోగా 32.5శాతం ఓట్లు తెచ్చుకున్న బీజేపీ 13 సీట్లను మాత్రమే గెలుచుకోగలగడం విశేషం. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్‌ 17, బీజేపీ 13, ఎంజీపీ 3, జీఎఫ్‌పీ 3, ఇండిపెండెంట్లు 3 స్థానాలలో గెలవగా ఎన్‌సీపీ ఒక స్థానంలో విజయం సాధించింది. గోవాలో 1.2 శాతం మంది నోటాను ఉపయోగించుకున్నారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో నోటా ఇంతశాతం మరెక్కడా నమోదు కాలేదు.

పరీకర్‌ నాయకత్వంలో గోవాలో బీజేపీ ప్రభుత్వం
గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమయ్యింది. ముఖ్యమంత్రి గా రక్షణ మంత్రి మనోహర్‌ పరీకర్‌ను బీజేపీ అధినాయకత్వం ఎంపిక చేసింది. గవర్నర్‌ మృదులా సిన్హాను ఆదివారం సాయంత్రం కలసిన పరీకర్‌ తన నాయకత్వంలో గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశమి వ్వాల్సిందిగా కోరారు. పరీకర్‌ను ముఖ్యమంత్రిగా నియమించిన గవర్నర్‌.. మెజారిటీ నిరూపించుకునేందుకు 15 రోజుల గడువిచ్చారు. అంతకుముందు, తమకు ఎన్‌సీపీ, స్థానిక పార్టీలు, కొందరు ఇండిపెండెంట్లు మద్దతిస్తున్నట్లు ఆయన గవర్నర్‌కు తెలిపారు.

ముగ్గురేసి ఎమ్మెల్యేలున్న గోవా ఫార్వర్డ్‌ పార్టీ (జీఎఫ్‌పీ),  మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ), ఒక ఎమ్మెల్యే ఉన్న ఎన్‌సిపి, ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతిస్తున్న లేఖలను పరీకర్‌ గవర్నర్‌కు సమర్పించారు. 13 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ బలం వీరి మద్దతుతో 22కు చేరుకుంది. 40 మంది ఎమ్మెల్యేలున్న గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 21 మంది ఎమ్మెల్యేలు సరిపోతారు. కాంగ్రెస్‌ పార్టీ 17 మంది ఎమ్మెల్యేలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీకి అవసరమైన నలుగురు ఎమ్మెల్యేల మద్దతును సాధించలేకపోయింది.

మణిపూర్‌ పీఠంపై కాషాయ జెండా రెపరెపలు
కాంగ్రెస్‌ కన్నా బీజేపీకి 7 సీట్లు తక్కువ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 31 సీట్ల కన్నా 10 సీట్ల వెనుకబాటు అయితేనేం మణిపూర్‌ గద్దెపై కాషాయ జెండా రెపరెపలాడబోతోంది. బీజేపీకి మద్దతిస్తున్నట్లు నలుగురు ఎమ్మెల్యేలున్న నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ), ఒక ఎమ్మెల్యే ఉన్న లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) ఆదివారం ప్రకటించాయి. ఎన్‌పీపీ, ఎల్‌జేపీలతో అవగాహన కుదిరిందని.. మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని బీజేపీ ప్రధాన కార్యదర్శి (బీజేపీ మణిపూర్‌ వ్యవహారాల బాధ్యుడు) రామ్‌ మాధవ్‌ వెల్లడించారు. ఈ రెండు పార్టీలూ కేంద్రంలో ఎన్‌డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. వీటి చేరికతో బీజేపీ బలం 26కు చేరుకుంది. కాగా, ఎన్‌డీఏలో భాగస్వామ్యపక్షంగా ఉన్న నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌) కూడా మణిపూర్‌లో బీజేపీకే మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది. దీనికి తోడు ఓ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతుగా నిలిచారు.

కాగా, బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలంతా ఆదివారం రాత్రి గవర్నర్‌ నజ్మా హెప్తుల్లాను కలిశారు. ‘60 సీట్లున్న మణిపూర్‌ అసెంబ్లీలో బీజేపీ బలం 32కు చేరింది. 11 మంది స్వతంత్ర సభ్యులు బీజేపీకి మద్దతు పలికారు’ అని గవర్నర్‌ను కలిసిన తర్వాత బీజేపీ నేత, అస్సాం మంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్యామ్‌కుమార్‌పై పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీకి మద్దతిచ్చారని హిమంత తెలిపారు. కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశం లేదని ఈ పార్టీ స్పష్టంగా ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement