ప్రజాస్వామ్యానికి పాతరేసిన బీజేపీ
విమర్శించిన కాంగ్రెస్ పార్టీ
పణజి/న్యూఢిల్లీ: గోవా, మణిపూర్‌లలో ప్రజాస్వామ్యానికి బీజేపీ పాతరేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గోవాలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉన్నామని, ప్రజలు తమకే అనుకూలంగా తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి శాంతారామ్ నాయక్ పేర్కొన్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే బీజేపీ అనైతిక పద్ధతుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన అన్నారు.
పారికర్‌ను ‘విలన్’గా ఆయన అభివర్ణించారు. మేం శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటుండగానే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయని శాంతారామ్ పేర్కొన్నారు. తగినంత సంఖ్యాబలం లేనందున గోవాలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం లేదని కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్ శనివారం చెప్పారని కూడా శాంతారామ్ గుర్తుచేశారు.
మణిపూర్‌లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కిడ్నాప్
ఇంఫాల్ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ బలగాల సాయంతో మణిపూర్‌కి చెందిన ఓ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని బీజేపీ కిడ్నాప్ చేసిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. సీఐఎస్‌ఎఫ్ బలగాలను, విమానాశ్రయ అధికారులను దుర్వినియోగం చేసి అసబుద్దీన్ అనే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని బీజేపీ కిడ్నాప్ చేసిందని, ఆ ఎమ్మెల్యేని కలకత్తాకు తరలించారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ మోడీ ప్రభుత్వం ప్రమాదకరమైన ఆట ఆడుతోందని ఆయన పేర్కొన్నారు. చట్టాన్ని, సమాఖ్య స్ఫూర్తిని మోడీ ప్రభుత్వం పట్టపగలు ఖూనీ చేస్తోందని సుర్జేవాలా విమర్శించారు.