ఏపీకి రిక్త హస్తమే!
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం
- విభజనచట్టంలోని హామీల ప్రస్తావనేదీ?
- రాజధాని నిర్మాణానికి నిధులు సున్నా
- బడ్జెట్ ప్రసంగాన్ని బల్లలు చరిచి స్వాగతించిన టీడీపీ ఎంపీలు
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం భారీ రెవెన్యూ లోటులో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలాంటి ఊరట కలిగించలేదు. అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి పైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇక రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీల ప్రస్తావన అసలే లేదు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేయడం, రెవెన్యూ లోటు భర్తీ వంటి ముఖ్యమైన హామీలను సైతం ఈ బడ్జెట్‌లో విస్మరించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ల ఏర్పాటుకు నిర్దిష్ట కేటాయింపులు జరపలేదు. మిగిలిన మెట్రోల్లో కలిపి కేటాయింపులు చూపారు. బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగినా అధికార టీడీపీ ఎంపీలు ఒక్కరు కూడా నిరసన తెలిపిన దాఖలాలు లేవు. పైపెచ్చు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రశంసిస్తూ బల్లలు చరచడం పట్ల వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రానికి కొత్త సంస్థలేవీ?
కనీసం అప్పులు చేసేందుకు కూడా ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం(ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనలను సడలించలేదు. అలాగే 2014–15 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన రూ.16,000 కోట్ల రెవెన్యూ లోటులో ఇప్పటివరకు కేవలం రూ.4,000 కోట్ల మాత్రమే కేంద్రం భర్తీ చేసింది. మిగతా రూ.12 వేల కోట్ల లోటు భర్తీపై కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావిస్తారని ఆశించినప్పటికీ నిరాశే మిగిలింది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కొత్తగా సంస్థలను, ఆర్థిక సాయాన్ని ప్రకటించలేదు. పన్ను రాయితీలు, ప్రోత్సాహకాల పరిధిని పెంచాలన్న డిమాండ్‌పై బడ్జెట్‌లో పరిష్కారం చూపలేదు. జాతీయస్థాయి విద్యాసంస్థల నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు కావాల్సి ఉన్నప్పటికీ అరకొరగా నిధులు విదిల్చారు.
ప్రత్యేక హోదాకు మంగళం!
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. పదేళ్లు కావాల్సిందేనని బీజేపీ నేతలు, పదిహేనేళ్లు ఇవ్వాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేశారు. తాము వస్తే అలా ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ప్రత్యేక హోదా మాత్రం పత్తా లేకుండా పోయింది. హోదా సాధన కోసం రాష్ట్రంలో ప్రజా పోరాటాలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో దాని గురించి ఏదైనా ప్రకటన చేస్తారని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. అయినా టీడీపీ నాయకులు నోరుమెదపక పోవడం గమనార్హం. ఏపీకి హోదా కంటే ప్యాకేజీ మేలన్న చంద్రబాబు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో కేంద్రం దీన్ని తేలిగ్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కనిపించని ‘ప్రత్యేక ప్యాకేజీ’
రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు పూర్తిగా సహకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నిధులు మాత్రం ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారు. ఈ బడ్జెట్‌లో రాజధాని నిర్మాణం ఊసే లేకుండా జాగ్రత్తపడ్డారు. రాష్ట్ర ప్రజలు దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న విశాఖ రైల్వే జోన్ ఊసూ లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావనే కనిపించలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా నిధుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.