దేశాన్ని నవ్యపథంలో నడిపిస్తుంది
కేంద్ర బడ్జెట్‌ను స్వాగతించిన ఏపీ సీఎం
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్ దేశాన్ని నవ్య పథంలో నడిపిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీలు అతిపెద్ద ఆర్థిక సంస్కరణలని, అవి దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతాయని చెప్పారు. దేశానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరేలా బడ్జెట్‌ను రూపొందించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను ఆయన అభినందించారు. బుధవారం రాత్రి విజయవాడలోని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో భూసమీకరణ విధానంలో 35 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు రెండేళ్లపాటు కేపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపును ఇచ్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రత్యేక ప్యాకేజీతోనే ప్రయోజనం
ప్రత్యేక హోదాతో సమానమైన ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని.. అందుకే స్వాగతించానని చెప్పారు. కొందరు ప్రత్యేక హోదా వల్ల ఏదో ఒనగూరుతుందని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించేలా మంత్రివర్గంలో తీర్మానం చేసి, విభాగాల వారీగా జీవోలు జారీ చేయాలని కేంద్రాన్ని కోరారు. దేశంలో బ్రిటిషు వాళ్లు వేగంగా రైల్వే మార్గాలు వేస్తే.. ఇండియన్ రైల్వే నినాదాలతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
పార్టీలను అడ్డుపెట్టుకుని దోచుకుంటున్నారు..
దేశంలో కొన్ని రాజకీయపార్టీలను పార్టీ ఫండ్‌ల కోసమే ఏర్పాటు చేశారని.. వాటిని అడ్డంపెట్టుకుని దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ సభ్యత్వాల ద్వారా నిధులు సేకరిస్తుందన్నారు.
పోలవరానికి ప్రత్యేకంగా నిధులివ్వలేదు
కేంద్ర బడ్జెట్‌లో పోలవరానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదని, అయితే నాబార్డు ద్వారా ఇప్పటికే రూ.1,981 కోట్ల రుణం మంజూరు చేశారన్నారు.