పాతనోట్ల డిపాజిట్లపై ఆంక్షలు | restrictions on The old banknotes deposits | Sakshi
Sakshi News home page

పాతనోట్ల డిపాజిట్లపై ఆంక్షలు

Published Tue, Dec 20 2016 3:18 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

పాతనోట్ల డిపాజిట్లపై ఆంక్షలు - Sakshi

పాతనోట్ల డిపాజిట్లపై ఆంక్షలు

రూ. 5 వేలకు మించితే డిసెంబర్‌ 30 వరకూ ఖాతాకు ఒక్కసారే అవకాశం
అదీ బ్యాంకు అధికారులు సంతృప్తి చెందితేనే...
గరీబ్‌ కల్యాణ్‌లో ఎంతైనా డిపాజిట్‌ చేసుకోవచ్చని ప్రకటించిన కేంద్రం
నవంబర్‌ 8 నాటికి ఆర్‌బీఐ వద్ద రూ.4.94 లక్షల కోట్ల రూ. 2 వేల నోట్లు
రూ. 20 లక్షల కోట్ల పాత నోట్లు: ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం  


న్యూఢిల్లీ: రద్దైన పెద్ద నోట్ల డిపాజిట్లపై కేంద్ర ప్రభుత్వం సోమవారం మరిన్ని ఆంక్షలు విధించింది. డిసెంబర్‌ 19 నుంచి 30 వరకూ వ్యక్తిగత ఖాతాల్లో రద్దైన నోట్లను రూ. 5 వేలకు మించి ఒక్కసారి మాత్రమే జమ చేసుకోవాలని కేంద్రం పేర్కొంది. రూ. 5 వేలకు మించి డిపాజిట్‌ చేస్తున్న సమయంలో ఆలస్యానికి కారణాలు కూడా వెల్లడించాలని పేర్కొంది. తాజా నిబంధనలతో నల్ల కుబేరుల కోసం ప్రవేశపెట్టిన గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద భారీగా పాత నోట్లు బ్యాంకులకు చేరవచ్చనే ఆశాభావంతో ఉందని భావిస్తున్నారు. నవంబర్‌ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనంతరం ... డిసెంబర్‌ 30 వరకూ ఖాతాల్లో పాత నోట్లను ఎంతైనా డిపాజిట్‌ చేసుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అయితే ఇప్పుడు ఆ డిపాజిట్లపై ఆంక్షలు విధిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్  జారీ చేసింది. ‘రూ. 500, రూ. 1000 నోట్ల డిపాజిట్లపై ప్రభుత్వం సమయానుకూలంగా సమీక్షిస్తోంది. నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని దాదాపు 5 వారాలు దాటింది. అధిక శాతం ప్రజలు పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేశారని భావిస్తున్నాం’ అంటూ ప్రకటనలో ప్రభుత్వం వెల్లడించింది. రద్దైన నోట్ల రూపంలో రూ. 5 వేలకు మించి జమ చేయాలంటే ఖాతాలకు కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) కంప్లైంట్‌ జత చేయాలని. కేవైసీ వివరాలు లేకపోతే... డిపాజిట్లు రూ.50 వేల వరకే పరిమితం అవుతాయని తెలిపింది.

సంతృప్తి చెందితేనే..: బ్యాంకుల్లో క్యూలను తగ్గించే ఉద్దేశంతో కూడా తాజా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం నుంచే నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. రూ. 5 వేలకు మించి పాత నోట్ల డిపాజిట్‌ సమయంలో ఆలస్యంగా ఎందుకు చేస్తున్నారో కారణాల్ని తప్పనిసరిగా కనుక్కోవాలని బ్యాంకుల్ని ఆదేశించింది. ఇద్దరు బ్యాంకు అధికారుల సమక్షంలో ఖాతాదారుడ్ని ప్రశ్నించాలని, సంతృప్తికర సమాధానం వచ్చాకే ఆ మొత్తాన్ని జమ చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇక రూ. 5వేలు, అంతకంటే తక్కువ మొత్తాల్ని డిసెంబర్‌ 30 వరకూ ఎన్నిసారై్లనా డిపాజిట్‌ చేసుకోవచ్చంటూ స్పష్టతనిచ్చింది. డిసెంబర్‌ 19–30 మధ్య చేసే రికరింగ్‌ ఖాతాల డిపాజిట్లకు కూడా తాజా నిబంధనలు వర్తిస్తాయంటూ ఆర్‌బీఐ వెల్లడించింది. అయితే ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనలో భాగంగా ఎంత మొత్తమైనా పాత కరెన్సీ నోట్ల రూపంలో జమ చేసుకోవచ్చంటూ తెలిపింది.

నవంబర్‌ 10–14 మధ్యలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు సేకరించిన నగదును జమ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. సహకార బ్యాంకుల్లో పాత నోట్లను డిపాజిట్‌ చేసిన వినియోగదారులు, ప్రాథమిక సహకార బ్యాంకుల ఖాతాదారుల కేవైసీ వివరాలు తెలుసుకునేందుకు నాబార్డ్‌ పూర్తి తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపింది. కాగా, ఆదాయపు పన్ను శాఖ అధికారులు బంగారం దుకాణం నుంచి రూ. 10 కోట్ల నగదు, బంగారం, వజ్రాభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు.

8 నాటికి రూ.4.94 లక్షల కోట్లు
ప్రధాని మోదీ నవంబర్‌ 8న పాత నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించే సమయంలో... ఆర్‌బీఐ వద్ద రూ. 2 వేల నోట్ల రూపంలో రూ. 4.94 లక్షల కోట్ల మొత్తం ఉన్నట్లు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు రిజర్వ్‌బ్యాంకు సమాధానమిచ్చింది. 2,473 మిలియన్ల రూ. 2 వేల నోట్లు ఉన్నట్లు స్పష్టం చేసింది. ముంబైకి చెందిన ఆర్టీఐ కార్యకర్త అనిల్‌ గల్గాలికి దరఖాస్తుకు జవాబిస్తూ... నవంబర్‌8న రూ. 9.13 లక్షల కోట్ల మేర రూ.1,000 నోట్లు, రూ. 11.38 లక్షల కోట్ల మేర రూ. 500 నోట్లు ఉన్నట్లు పేర్కొంది. అయితే నవంబర్‌ 9 నుంచి నవంబర్‌ 19 మధ్యలో బ్యాంకులకు సరఫరా చేసిన కరెన్సీ నోట్ల వివరాలు వెల్లడించేందుకు మాత్రం ఆర్‌బీఐ నిరాకరించింది.
 
ఆరా తీయరు: జైట్లీ
రద్దయిన నోట్లను ఎంత మొత్తంలోనైనా ఒకేసారి డిపాజిట్‌ చేస్తే అధికారులు ఎలాంటి ప్రశ్నలూ అడగరని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సోమవారం చెప్పారు. అయితే పదే పదే డిపాజిట్‌ చేస్తే ప్రశ్నిస్తారన్నారు. రద్దయిన నోట్ల చెల్లింపు వినియోగానికి ఇచ్చిన గడువు గతవారం ముగిసిందని, ఆ నోట్లు ఇంకా ఎవరివద్దయినా ఉంటే చెల్లుబాటు కావు కనుక బ్యాం కు లో డిపాజిట్‌ చేయాలని సూచించారు. ‘బ్యాంకుకు వెళ్లి ఒకేసారి ఎంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసినా ఏ ప్రశ్నలూ అడగరు. రూ. 5 వేల పరిమితి వారికి వర్తించదు. అయితే ప్రతిరోజూ ఒకే వ్యక్తి వెళ్లి కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేస్తూ ఉంటే  ఆ డబ్బెలా వచ్చిందని అనుమానం వస్తుంది’ అని చెప్పారు.

2005కి ముందునాటి నోట్లనూ తీసుకోండి: ఆర్‌బీఐ
2005కి ముందు నాటి పాత రూ. 500, రూ వెయ్యి నోట్లను కూడా డిపాజిట్ల కోసం బ్యాంకులు అంగీకరించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ నోట్లను ఆర్‌బీఐ కార్యాలయాల్లో కూడా డిపాజిట్‌ చేసుకోవచ్చని పేర్కొంది. 2005కు ముందు నాటి పెద్ద నోట్లను బ్యాంకులు స్వీకరించడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్‌బీఐ స్పష్టత నిచ్చింది. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గువాహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్‌; న్యూఢిల్లీ, పట్నా, తిరువనంతపురం, కోచి ఆఫీసుల్లో 2005కు ముందు నోట్లను మార్చుకునే అవకాశం కల్పించామని, అయితే బ్యాంకుల్లో తీసుకోవద్దనేది తమ ఉద్దేశం కాదని సోమవారం తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement