Garib Kalyan
-
ఖాతాల్లోని నల్లధనంపై ఆరా
-
ఖాతాల్లోని నల్లధనంపై ఆరా
► 60 లక్షల ఖాతాల్లో రూ. 7 లక్షల కోట్ల డిపాజిట్లు గుర్తించిన కేంద్రం ► గరీబ్ కల్యాణ్ సద్వినియోగం చేసుకోకపోతే చర్యలు తప్పవు: కేంద్రం న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీతలో భాగంగా కేంద్రం బ్యాంకు ఖాతాల్లోని నల్లసొమ్ముపై కేంద్రం దృష్టి సారించింది. వ్యక్తిగత, కంపెనీ, సంస్థల ఖాతాల్లో భారీ మొత్తంలో జమైన నగదు అక్రమమా? సక్రమమా? తేల్చే పనిలో పడింది. ఇంతవరకూ కేంద్రానికి అందిన సమాచారం మేరకు 60 లక్షల వ్యక్తిగత, కంపెనీ, సంస్థల ఖాతాల్లో రూ. 7 లక్షల కోట్లు చేరింది. ఇవన్నీ రూ. 2 లక్షలకు పైబడ్డ మొత్తాలుగా గుర్తించిన కేంద్రం వాటి పుట్టుపూర్వోత్తరాలపై ఆరాతీస్తోంది. తనిఖీల్లో భాగంగా ఎవరైనా సరైన ఆధారాలు చూపకుంటే ఆ నగదును స్వాధీనం చేసుకుంటామని, బ్యాంకులో డిపాజిట్ చేసేస్తే నల్లధనం సక్రమం కాబోదని హెచ్చరించింది. కేవలం వ్యక్తిగత ఖాతాల్లో రూ. 2 లక్షలకు మించి జమైన మొత్తాలు రూ. 3– 4 లక్షల కోట్లగా ఉండవచ్చని అంచనా వేశారు. అప్రకటిత ఆదాయం కోసం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై)లో పన్ను, జరిమానా చెల్లించే అవకాశం కల్పించామని, ఆ పథకం సద్వినియోగం చేసుకోకపోతే... తప్పకుండా వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాయి. రూ.4,172 కోట్ల అప్రకటిత ఆదాయం. తనిఖీల్లో డిసెంబర్ 28 వరకూ రూ. 4,172 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని కనుగొన్నామని, రూ. 105 కోట్ల విలువైన కొత్త నోట్లను సీజ్ చేశామని ఐటీ శాఖ వెల్లడించింది. -
‘గరీబ్ కల్యాణ్’తో ప్రయోజనాలు
తాజా ఆదాయ వెల్లడి స్కీమ్‌పై బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషణ ద్రవ్యలోటు కట్టడికి దోహదపడుతుందని అంచనా న్యూఢిల్లీ: కేంద్రం ప్రకటించిన రెండవ విడత స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్ 2) ద్వారా ప్రభుత్వం లక్షించిన రూ.లక్ష కోట్లు లభిస్తే ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేకూర్చుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్ఏ–ఎంఎల్) విశ్లేషించింది. ఐడీఎస్ 2 ద్వారా రూ. లక్ష కోట్లు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంటూ, ఈ మొత్తం వస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు– చేసే వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) కట్టడికి ఇది ఎంతో దోహదపడే అంశంగా పేర్కొంది. ముఖ్యంగా ఏడవ వేతన కమిషన్ సిఫారసులకు అనుగుణంగా ఫండింగ్, బ్యాంకులకు మరింత మూలధం అందజేయడం వంటి అంశాల కోణంలో ఐడీఎస్ 2 ద్వారా లభించే ఆదాయం దోహదపడుతుందని బీఓఎఫ్ఏ అంచనావేసింది. కొత్త పథకం ఇదీ... ఐడీఎస్ 2 పథకాన్ని కేంద్రం డిసెంబర్ 16న ప్రకటించింది. మార్చి 31 వరకూ ఈ పథకం అమల్లో ఉంటుంది. దీని ప్రకారం పథకానికి దరఖాస్తు పెట్టుకునే ముందే ‘వెల్లడి మొత్తానికి’ సంబంధించిన మొత్తంలో మొదట 49.9 శాతం పన్ను చెల్లించాలి. అలాగే ఈ దరఖాస్తుకు ముందే ‘వెల్లడి మొత్తం’లో 25 శాతాన్ని వడ్డీరహిత రీతిలో నాలుగేళ్ల కాలానికి ‘లాక్–ఇన్’ విధానంలో డిపాజిట్ చేయాలి. మిగిలిన 25 శాతాన్ని వెనక్కు తీసుకోవచ్చు. అవినీతి, బినామీ ఆస్తుల నిర్వహణ, అక్రమ ధనార్జన, విదేశీ మారకద్రవ్య నిల్వల ఉల్లంఘనలు, ఫారిన్ బ్లాక్ మనీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఈ పథకం వర్తించదు. -
‘గరీబ్ కల్యాణ్’ అందరికీ కాదు..
దరఖాస్తుకు ముందే పన్ను, లాక్–ఇన్ మొత్తం చెల్లించాలి... ► అవినీతి, కేసులు, అక్రమ ధనార్జన, డ్రగ్స్ అక్రమ రవాణా వంటి కేసుల్లో ఉన్నవారికి ఇది వర్తించదు ► కొత్త ఆదాయ వెల్లడి స్కీమ్‌పై సీబీడీటీ వివరణ న్యూఢిల్లీ: నల్లకుబేరులకు సంబంధించి కేంద్రం తాజాగా, చివరి అవకాశంగా ప్రకటించిన ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకం అందరికీ వర్తించబోదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, 2016కు సంబంధించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) ఈ మేరకు వివరణలతో తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦ పథకానికి దరఖాస్తు పెట్టుకునే ముందే ‘వెల్లడి మొత్తానికి’ సంబంధించిన మొత్తంలో మొదట 49.9 శాతం పన్ను చెల్లించాలి. దరఖాస్తులో ఇలా పన్ను చెల్లించినట్లు ఆధారం ఉండాలి. అలాగే ఈ దరఖాస్తుకు ముందే ‘వెల్లడి మొత్తం’లో 25 శాతాన్ని వడ్డీరహిత రీతిలో నాలుగేళ్ల కాలానికి ‘లాక్–ఇన్’ విధానంలో డిపాజిట్ చేయాలి. కట్టిన పన్నును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వడం జరగదు. ♦ అవినీతి, బినామీ ఆస్తుల నిర్వహణ, అక్రమ ధనార్జన, విదేశీ మారకద్రవ్య నిల్వల ఉల్లంఘనలు, ఫారిన్ బ్లాక్ మనీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఈ పథకం వర్తించదు. ♦ స్పెషల్ కోర్ట్ (సెక్యూరిటీ లావాదేవీల సంబంధ ఆరోపణల విచారణ) యాక్ట్, 1992, సెక్షన్ 3 కింద నోటిఫై చేసిన ఏ వ్యక్తీ ఈ పథకం పరిధిలోకి రాబోడు. ♦ వెల్లడించిన సొమ్ము పైన పేర్కొన్న అంశాల పరిధిలోకే వస్తుందని, సంబంధిత డిక్లరెంట్ కీలకమైన కొన్ని అంశాలు దాచిపెట్టాడని తదుపరి ఏ సందర్భంలోనైనా రుజువైతే... తగిన చట్టపరమైన చర్యలన్నింటినీ తీసుకోవడం జరుగుతుంది. ♦ డిసెంబర్ 17న ప్రారంభమైన ఈ పథకం డిక్లరేషన్లు, డిపాజిట్ల నిమిత్తం 2017 మార్చి 31 వరకూ అందుబాటులో ఉంటుంది. ♦ ఇన్ ప్రింట్ లేదా డిజిటల్ సిగ్నేచర్ కింద ఎలక్ట్రానికల్‌గా ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్‌కు లేదా ఇన్‌కంట్యాక్స్ కమిషనర్‌కు డిక్లరేషన్ ఇవ్వవచ్చు. తరువాత 30 రోజుల్లో పన్ను అధికారులు ఇందుకు సంబంధించి డిక్లరెంట్కు ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు. ♦ ఈ పథకం కింద నల్లధనాన్ని ప్రకటించని వారు అటు తర్వాత ట్యాక్స్ రిటర్న్ రూపంలో ఆ మొత్తాన్ని వెల్లడించవచ్చు. అయితే ఇందుకు సంబంధించి మొత్తం 77.25 శాతం పన్ను, జరిమానాలుగా చెల్లించాలి. ఈ రెండు పథకాలనూ వినియోగించుకోకపోతే.. పట్టుకున్న మొత్తంలో పన్నుతో పాటు ఆ మొత్తంలో 10 శాతం జరిమానా పడుతుంది. సంబంధిత వ్యక్తి ప్రాసిక్యూషన్‌ను కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. -
పాతనోట్ల డిపాజిట్లపై ఆంక్షలు
-
పాతనోట్ల డిపాజిట్లపై ఆంక్షలు
రూ. 5 వేలకు మించితే డిసెంబర్ 30 వరకూ ఖాతాకు ఒక్కసారే అవకాశం ► అదీ బ్యాంకు అధికారులు సంతృప్తి చెందితేనే... ► గరీబ్ కల్యాణ్‌లో ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చని ప్రకటించిన కేంద్రం ► నవంబర్ 8 నాటికి ఆర్బీఐ వద్ద రూ.4.94 లక్షల కోట్ల రూ. 2 వేల నోట్లు ► రూ. 20 లక్షల కోట్ల పాత నోట్లు: ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం న్యూఢిల్లీ: రద్దైన పెద్ద నోట్ల డిపాజిట్లపై కేంద్ర ప్రభుత్వం సోమవారం మరిన్ని ఆంక్షలు విధించింది. డిసెంబర్ 19 నుంచి 30 వరకూ వ్యక్తిగత ఖాతాల్లో రద్దైన నోట్లను రూ. 5 వేలకు మించి ఒక్కసారి మాత్రమే జమ చేసుకోవాలని కేంద్రం పేర్కొంది. రూ. 5 వేలకు మించి డిపాజిట్ చేస్తున్న సమయంలో ఆలస్యానికి కారణాలు కూడా వెల్లడించాలని పేర్కొంది. తాజా నిబంధనలతో నల్ల కుబేరుల కోసం ప్రవేశపెట్టిన గరీబ్ కల్యాణ్ యోజన కింద భారీగా పాత నోట్లు బ్యాంకులకు చేరవచ్చనే ఆశాభావంతో ఉందని భావిస్తున్నారు. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనంతరం ... డిసెంబర్ 30 వరకూ ఖాతాల్లో పాత నోట్లను ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ డిపాజిట్లపై ఆంక్షలు విధిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘రూ. 500, రూ. 1000 నోట్ల డిపాజిట్లపై ప్రభుత్వం సమయానుకూలంగా సమీక్షిస్తోంది. నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని దాదాపు 5 వారాలు దాటింది. అధిక శాతం ప్రజలు పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేశారని భావిస్తున్నాం’ అంటూ ప్రకటనలో ప్రభుత్వం వెల్లడించింది. రద్దైన నోట్ల రూపంలో రూ. 5 వేలకు మించి జమ చేయాలంటే ఖాతాలకు కేవైసీ (నో యువర్ కస్టమర్) కంప్లైంట్ జత చేయాలని. కేవైసీ వివరాలు లేకపోతే... డిపాజిట్లు రూ.50 వేల వరకే పరిమితం అవుతాయని తెలిపింది. సంతృప్తి చెందితేనే..: బ్యాంకుల్లో క్యూలను తగ్గించే ఉద్దేశంతో కూడా తాజా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం నుంచే నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. రూ. 5 వేలకు మించి పాత నోట్ల డిపాజిట్ సమయంలో ఆలస్యంగా ఎందుకు చేస్తున్నారో కారణాల్ని తప్పనిసరిగా కనుక్కోవాలని బ్యాంకుల్ని ఆదేశించింది. ఇద్దరు బ్యాంకు అధికారుల సమక్షంలో ఖాతాదారుడ్ని ప్రశ్నించాలని, సంతృప్తికర సమాధానం వచ్చాకే ఆ మొత్తాన్ని జమ చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇక రూ. 5వేలు, అంతకంటే తక్కువ మొత్తాల్ని డిసెంబర్ 30 వరకూ ఎన్నిసారై్లనా డిపాజిట్ చేసుకోవచ్చంటూ స్పష్టతనిచ్చింది. డిసెంబర్ 19–30 మధ్య చేసే రికరింగ్ ఖాతాల డిపాజిట్లకు కూడా తాజా నిబంధనలు వర్తిస్తాయంటూ ఆర్బీఐ వెల్లడించింది. అయితే ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనలో భాగంగా ఎంత మొత్తమైనా పాత కరెన్సీ నోట్ల రూపంలో జమ చేసుకోవచ్చంటూ తెలిపింది. నవంబర్ 10–14 మధ్యలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు సేకరించిన నగదును జమ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. సహకార బ్యాంకుల్లో పాత నోట్లను డిపాజిట్ చేసిన వినియోగదారులు, ప్రాథమిక సహకార బ్యాంకుల ఖాతాదారుల కేవైసీ వివరాలు తెలుసుకునేందుకు నాబార్డ్ పూర్తి తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపింది. కాగా, ఆదాయపు పన్ను శాఖ అధికారులు బంగారం దుకాణం నుంచి రూ. 10 కోట్ల నగదు, బంగారం, వజ్రాభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు. 8 నాటికి రూ.4.94 లక్షల కోట్లు ప్రధాని మోదీ నవంబర్ 8న పాత నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించే సమయంలో... ఆర్బీఐ వద్ద రూ. 2 వేల నోట్ల రూపంలో రూ. 4.94 లక్షల కోట్ల మొత్తం ఉన్నట్లు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు రిజర్వ్‌బ్యాంకు సమాధానమిచ్చింది. 2,473 మిలియన్ల రూ. 2 వేల నోట్లు ఉన్నట్లు స్పష్టం చేసింది. ముంబైకి చెందిన ఆర్టీఐ కార్యకర్త అనిల్ గల్గాలికి దరఖాస్తుకు జవాబిస్తూ... నవంబర్8న రూ. 9.13 లక్షల కోట్ల మేర రూ.1,000 నోట్లు, రూ. 11.38 లక్షల కోట్ల మేర రూ. 500 నోట్లు ఉన్నట్లు పేర్కొంది. అయితే నవంబర్ 9 నుంచి నవంబర్ 19 మధ్యలో బ్యాంకులకు సరఫరా చేసిన కరెన్సీ నోట్ల వివరాలు వెల్లడించేందుకు మాత్రం ఆర్బీఐ నిరాకరించింది. ఆరా తీయరు: జైట్లీ రద్దయిన నోట్లను ఎంత మొత్తంలోనైనా ఒకేసారి డిపాజిట్ చేస్తే అధికారులు ఎలాంటి ప్రశ్నలూ అడగరని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం చెప్పారు. అయితే పదే పదే డిపాజిట్ చేస్తే ప్రశ్నిస్తారన్నారు. రద్దయిన నోట్ల చెల్లింపు వినియోగానికి ఇచ్చిన గడువు గతవారం ముగిసిందని, ఆ నోట్లు ఇంకా ఎవరివద్దయినా ఉంటే చెల్లుబాటు కావు కనుక బ్యాం కు లో డిపాజిట్ చేయాలని సూచించారు. ‘బ్యాంకుకు వెళ్లి ఒకేసారి ఎంత మొత్తాన్ని డిపాజిట్ చేసినా ఏ ప్రశ్నలూ అడగరు. రూ. 5 వేల పరిమితి వారికి వర్తించదు. అయితే ప్రతిరోజూ ఒకే వ్యక్తి వెళ్లి కొంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తూ ఉంటే ఆ డబ్బెలా వచ్చిందని అనుమానం వస్తుంది’ అని చెప్పారు. 2005కి ముందునాటి నోట్లనూ తీసుకోండి: ఆర్బీఐ 2005కి ముందు నాటి పాత రూ. 500, రూ వెయ్యి నోట్లను కూడా డిపాజిట్ల కోసం బ్యాంకులు అంగీకరించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ నోట్లను ఆర్బీఐ కార్యాలయాల్లో కూడా డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది. 2005కు ముందు నాటి పెద్ద నోట్లను బ్యాంకులు స్వీకరించడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్బీఐ స్పష్టత నిచ్చింది. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గువాహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్; న్యూఢిల్లీ, పట్నా, తిరువనంతపురం, కోచి ఆఫీసుల్లో 2005కు ముందు నోట్లను మార్చుకునే అవకాశం కల్పించామని, అయితే బ్యాంకుల్లో తీసుకోవద్దనేది తమ ఉద్దేశం కాదని సోమవారం తెలిపింది.