ఖాతాల్లోని నల్లధనంపై ఆరా
► 60 లక్షల ఖాతాల్లో రూ. 7 లక్షల కోట్ల డిపాజిట్లు గుర్తించిన కేంద్రం
► గరీబ్ కల్యాణ్ సద్వినియోగం చేసుకోకపోతే చర్యలు తప్పవు: కేంద్రం
న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీతలో భాగంగా కేంద్రం బ్యాంకు ఖాతాల్లోని నల్లసొమ్ముపై కేంద్రం దృష్టి సారించింది. వ్యక్తిగత, కంపెనీ, సంస్థల ఖాతాల్లో భారీ మొత్తంలో జమైన నగదు అక్రమమా? సక్రమమా? తేల్చే పనిలో పడింది. ఇంతవరకూ కేంద్రానికి అందిన సమాచారం మేరకు 60 లక్షల వ్యక్తిగత, కంపెనీ, సంస్థల ఖాతాల్లో రూ. 7 లక్షల కోట్లు చేరింది. ఇవన్నీ రూ. 2 లక్షలకు పైబడ్డ మొత్తాలుగా గుర్తించిన కేంద్రం వాటి పుట్టుపూర్వోత్తరాలపై ఆరాతీస్తోంది. తనిఖీల్లో భాగంగా ఎవరైనా సరైన ఆధారాలు చూపకుంటే ఆ నగదును స్వాధీనం చేసుకుంటామని, బ్యాంకులో డిపాజిట్ చేసేస్తే నల్లధనం సక్రమం కాబోదని హెచ్చరించింది.
కేవలం వ్యక్తిగత ఖాతాల్లో రూ. 2 లక్షలకు మించి జమైన మొత్తాలు రూ. 3– 4 లక్షల కోట్లగా ఉండవచ్చని అంచనా వేశారు. అప్రకటిత ఆదాయం కోసం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై)లో పన్ను, జరిమానా చెల్లించే అవకాశం కల్పించామని, ఆ పథకం సద్వినియోగం చేసుకోకపోతే... తప్పకుండా వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాయి.
రూ.4,172 కోట్ల అప్రకటిత ఆదాయం.
తనిఖీల్లో డిసెంబర్ 28 వరకూ రూ. 4,172 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని కనుగొన్నామని, రూ. 105 కోట్ల విలువైన కొత్త నోట్లను సీజ్ చేశామని ఐటీ శాఖ వెల్లడించింది.