ఆ ఎమ్మెల్యేలు దున్నేశారు..! | CID investigations Reveal About Chandrababu and Team Land Exploitation | Sakshi
Sakshi News home page

ఆ ఎమ్మెల్యేలు దున్నేశారు..!

Published Sat, Jan 18 2020 3:17 AM | Last Updated on Sat, Jan 18 2020 2:34 PM

CID investigations Reveal About Chandrababu and Team Land Exploitation - Sakshi

రాజధానే లేకుండా రాష్ట్రాన్ని విభజించి కేంద్రం సృష్టించిన సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని.. దేవతల రాజు ఇంద్రుడి అమరావతిని తలదన్నే రీతిలో ఆంధ్రులకు అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నగరాన్ని నిర్మిస్తానన్న నారా చంద్రబాబు నాయుడు ఆ ముసుగులో అంతర్జాతీయ కుంభకోణానికి తెర తీశారు. సన్నిహితులైన నేతలు, అనుచరులు, బినామీలకు రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తామనే అంశంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చి ‘ఓత్‌ ఆఫ్‌ సీక్రసీ’కి పాతరేసి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు బాటలు పరిచారు. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లతోపాటు టీడీపీ కీలక నేతలు, బినామీలు 2014 జూన్‌ 1 నుంచి రాజధానిపై అధికారికంగా ప్రకటన చేసే వరకూ అంటే 2014 డిసెంబర్‌ 30 దాకా రైతుల నుంచి కారుచౌకగా వేలాది ఎకరాలను కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంపై ‘సీఐడీ’ దర్యాప్తు చేస్తోంది. సీఐడీ దర్యాప్తులో వెల్లడైన అంశాల్లో చంద్రబాబు, నారా లోకేష్, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా, యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, జీవీఆర్‌ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ తదితరులు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడటానికి సంబంధించి ఒక భాగం ఈ కథనం.

సాక్షి, అమరావతి: ఓత్‌ ఆఫ్‌ సీక్రసీ (అధికారిక రహస్యాల ప్రమాణం)ని తుంగలో తొక్కి.. రాజధాని ఏర్పాటు చేయబోయే ప్రాంతంపై సన్నిహితులకు లీకులిచ్చి.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు తెరతీసి.. రైతుల నుంచి చౌకగా భూములు కాజేశాక.. తాపీగా ‘అమరావతి’ని ప్రకటించి రూ.వేల కోట్లు దోచేసిన మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ నేతల బాగోతం సీఐడీ (క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌) దర్యాప్తులో బట్టబయలైనట్లు తెలిసింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిన చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, జీవీఆర్‌ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ తదితరులపై ఐపీసీ 418, 420, 406, 403, 409 సెక్షన్ల కింద కేసులు  నమోదు చేసేందుకు సీఐడీ సిద్ధమైంది. రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిన వారి ఆదాయ మార్గాలు, ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించిన కీలక ఆధారాలను సీఐడీ సేకరించింది. ఆదాయపు పన్ను చెల్లించకుండా నల్లధనం(బ్లాక్‌ మనీ)తో భూములు కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. పన్నులు ఎగవేసిన భూచోళ్లపై చర్యలు తీసుకోవాలని ఆదాయపు పన్ను శాఖను కోరనున్నట్లు తెలిసింది.

నేతల భూ దోపిడీకి ఆధారాలు ఇవిగో..
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలో జూన్‌ 1, 2014 నుంచి డిసెంబర్‌ 31, 2014 మధ్య జరిగిన భూముల క్రయవిక్రయాలపై సీఐడీ దర్యాప్తు చేసింది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల నుంచి సేకరించిన పత్రాలను క్షుణ్నంగా అధ్యయనం చేసింది. దర్యాప్తులో వెల్లడైన అంశాల్లో మచ్చుకు కొన్ని ఇవీ..

- రాజధానికి కూత వేటు దూరంలో ఉండే తాడికొండలో 2014 జూన్‌ 6న అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు సర్వే నెంబర్‌ 93–బీలో 7.12 ఎకరాలను తన అల్లుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కుమారుడు పుట్టా మహేష్‌ కుమార్‌ పేరుతో కొనుగోలు చేశారు. విజయవాడకు చెందిన జీబీఆర్‌ హేచరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ గడ్డం బుచ్చారావుకు చెందిన ఈ భూమిని ఎకరం రూ.21 లక్షల చొప్పున కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మరో రెండు రోజులకు అంటే జూన్‌ 8న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. 

- అమరావతి మండలం వైకుంఠపురం సర్వే నెంబర్‌ 257లో 1.12 ఎకరాలను ఎకరం రూ.1.12 కోట్ల చొప్పున గుమ్మడి సురేష్‌ అనే వ్యక్తి కొనుగోలు చేసి నవంబర్‌ 21, 2014న రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అనంతవరం, నిడమర్రు, మంగళగిరి, పెదపరిమి గ్రామాల్లో కూడా 30.32 ఎకరాల భూమిని ఆయన కొనుగోలు చేశారు. గుమ్మడి సురేష్‌ ఆదాయ మార్గాలు,  ఆదాయపు పన్ను చెల్లింపులను పరిశీలించిన సీఐడీ అతడికి అంత భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసే స్థోమత లేదని నిర్దారణకు వచ్చింది. గుమ్మడి సురేష్‌కు, ప్రత్తిపాటి పుల్లారావుకు ఉన్న సన్నిహిత సంబంధాలపై ఆధారాలను సేకరించింది. 
- చంద్రబాబు సన్నిహితుడు, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ అభినందన హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరఫున ఫిరంగిపురం, జి.కొండూరు మండలం వెంకటాపురం, నవులూరు, ఆత్మకూరు, కంకిపాడు మండలం పమిడిముక్కల, జగన్నాథపురం, ఇబ్రహీంపట్నంలలో జూన్‌ 19, 2014న రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ నెంబర్‌ 5704, 5704, 5706ల ద్వారా, జూలై 22, 2014న రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ నెంబర్‌ 7627 నుంచి 7637 వరకు 60 ఎకరాలను రాజధానిపై అధికారిక ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకు కొన్నట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది.

- చంద్రబాబు మరో సన్నిహితుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీఆర్‌ ఆంజనేయులు తుళ్లూరు మండలం మందడంలో సర్వే నెంబర్‌ 430/1, 430/3లలో సెప్టెంబరు 23, 2014న ఎకరం రూ.22.62 లక్షల చొప్పున తన తండ్రి గోనుగుంట్ల సత్యనారాయణ పేరుతో భూములు కొన్నారు. మందడంలో గోనుగుంట్ల సత్యనారాయణ, కుమార్తె లక్ష్మీ సౌజన్య పేరుతో 9.65 ఎకరాలు కొన్నారు. వెలగపూడిలో 4.71, కొండమరాజుపాలెంలో 2.04, ఐనవోలులో 2.43, నేలపాడులో 4.03, నీరుకొండలో 1.29, వెంకటపాలెంలో 0.7 ఎకరాలను లక్ష్మీసౌజన్య పేరుతో కొన్నారు. లింగాయపాలెంలో సత్యనారాయణ పేరుతో 1.25 ఎకరాలు, సన్నిహితుడు కొత్త వెంకట ఆంజనేయులు, కొత్త శివరామకృష్ణల పేర్లతో వెంకటపాలెంలో 0.60 ఎకరాలు కొన్నారు. మందడంలో 2.985 ఎకరాలను జీవీఆర్‌ ఆంజనేయులు కొనుగోలు చేశారు. వీటిని డిసెంబర్‌ 30, 2014కు ముందే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు  సీఐడీ తేల్చింది.

- ధూళిపాళ్ల నరేంద్ర తుళ్లూరు మండలం కొండమరాజుపాలెం 1.21 ఎకరాలను ఎకరా రూ.6.05 లక్షల చొప్పున తన కుమార్తె ధూళిపాళ్ల వీరవైష్ణవి పేరుతో కొనుగోలు చేశారు. ఐనవోలులో 69–1లో 0.22, 69–2లో 1.86 ఎకరాలను కుమార్తె పేరుతో కొన్నారు. ఈ భూములను డిసెంబర్‌ 2014కు ముందే కొనుగోలు చేసి రాజధాని ప్రకటన వెలువడ్డాక రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు సీఐడీ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 
- చంద్రబాబు కుటుంబానికి సన్నిహితుడైన వేమూరి రవికుమార్‌ ప్రసాద్‌ డైరెక్టర్‌గా ఉన్న సెవెన్‌ హిల్స్‌ లాజిస్టిక్స్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, గోష్ఫాద గ్రీన్‌ ఫీల్డ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేర్లతో తుళ్లూరు, వైకుంఠపురం, మందడం, వెంకటపాలెం, ధరణికోటలలో 25.91 ఎకరాలు కొనుగోలు చేశారు. నారా లోకేష్‌ సన్నిహితుడైన కనుమూరి కోటేశ్వరరావు ప్రతినిధిగా ఉన్న ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరఫున శాఖమూరు, వెలగపూడి, ధరణికోటలో 5.16 13.15 ఎకరాలు కొన్నారు. ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరఫున కంతేరులో 13.15 ఎకరాల కొన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ భూములన్నీ డిసెంబర్‌ 30, 2014లోపు కొన్నవే.

పయ్యావుల కేశవ్‌ తుళ్లూరు మండలం ఐనవోలులో సర్వే నెంబరు 48/3లో 2.13 ఎకరాలను ఎకరం రూ.6.39 లక్షల చొప్పున తన కుమారుడు విక్రమసింహా పేరుతో కొనుగోలు చేసి అక్టోబర్‌ 13, 2014న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఐనవోలులోనే ఎకరం రూ.5.88 లక్షల చొప్పున మరో 1.96 ఎకరాలను విక్రమసింహా పేరుతో నవంబర్‌ 3, 2014న కేశవ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. కొండమరాజుపాలెంలో పయ్యావుల విక్రమసింహా పేరుతో 4.84 ఎకరాలు, తన సోదరుడి కుమార్తె హారిక పేరుతో 1.18 ఎకరాలను కేశవ్‌ కొనుగోలు చేశారు. 

- ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న తెలంగాణ నేత వేం నరేంద్రరెడ్డి తన కుమారుడు వేం కృష్ణ కీర్తన్‌ పేరుతో ఐనవోలులో 1.99 ఎకరాలు, కొండమరాజుపాలెంలో 0.50 ఎకరాలను కొనుగోలు చేశారు. తనకు సన్నిహితుడైన వేమీశ్వర్‌రెడ్డి పేరుతో కొండమరాజుపాలెంలో 1.20 ఎకరాలను డిసెంబర్‌ 30, 2014కు ముందే కొన్నట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది.
తుళ్లూరు మండలం నేలపాడు సర్వే నెంబర్‌ 112/డీలో తన కుమారుడు పల్లె కృష్ణ కిశోర్‌రెడ్డి పేరుతో ఎకరం రూ.5.07 లక్షల చొప్పున 1.69 ఎకరాలను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి డిసెంబర్, 2014కు ముందే కొనుగోలు చేసి మార్చి 30, 2016న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. నేలపాడులోనే మరో 0.84 ఎకరాలను తన కుమారుడి పేరుతో మే 5, 2016న పల్లె రఘునాథరెడ్డి రిజిస్ట్రేషన్‌ చేయించారు. 

ఆ సెక్షన్లు ఏం చెబుతున్నాయంటే?
ఐపీసీ సెక్షన్‌ 418: ఓ లావాదేవీకి సంబంధించి ప్రయోజనాలను పరిరక్షించి తీరాల్సి ఉన్నా, నష్టం వస్తుందని తెలిసీ మోసానికి పాల్పడటం. ఇందుకు మూడేళ్ల జైలు శిక్ష. జరిమానా, రెండూ విధించవచ్చు.
420: వంచన లేదా మోసం ద్వారా ఆస్తిని బదలాయించడం. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా. రెండూ విధించవచ్చు.
403: దురుద్దేశంతో ఆస్తిని దుర్వినియోగం చేయడం. ఈ నేరానికి గాను రెండేళ్ల జైలు శిక్ష. జరిమానా. రెండూ విధించవచ్చు.
406: నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడటం. ఇందుకు గాను మూడేళ్ల జైలు శిక్ష. జరిమానా. రెండూ విధించవచ్చు
409: ఆస్తి విషయంలో పబ్లిక్‌ సర్వెంట్‌ లేదా బ్యాంకర్‌ లేదా వ్యాపారి, ఏజెంట్‌ నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడటం. ఇందుకు గాను పదేళ్ల జైలు శిక్ష, జరిమానా. రెండూ విధించవచు.

పక్కా ప్రణాళికతో...
- జూన్‌ 12, 2014న విశాఖపట్నంలో చంద్రబాబు తొలి కేబినెట్‌ సమావేశాన్ని నిర్వహించారు. రాజధాని ప్రాంతంపై అప్పటికే నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ఆ విషయం వెల్లడించకుండా చినబాబు, తన కోటరీ ప్రధాన నేతలకు మాత్రమే ఉప్పందించారు. ఆ తర్వాత రహస్య అజెండాలో భాగంగా నూజివీడు, ఆగిరిపల్లి, బాపులపాడు పరిసరాల్లో రాజధాని అంటూ కొందరు మంత్రులు ప్రచారం చేశారు. ఇదే అదనుగా ఈ ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేసి పది రోజుల్లోనే ఎన్నారైలకు విక్రయించిన కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు రూ.400 కోట్లకుపైగా లబ్ధి పొందినట్లు టీడీపీ కీలక ఎంపీ ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
టీడీపీ నేతలు మారుబేరాలు చేసి కనిష్ఠంగా రూ.15 వేల కోట్లను కొల్లగొట్టినట్లు రియల్‌ వర్గాల అంచనా. ఇలా దోచేసిన డబ్బులతోనే మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు ప్రాంతాల్లో చంద్రబాబు బృందం భారీగా భూములు కొనుగోలు చేసింది. 

గుంటూరు–విజయవాడ మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ సీఎం చంద్రబాబు, కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు ఆగస్టు 9, 2014న వేర్వేరు సమావేశాల్లో ప్రకటించారు. దీంతో నూజివీడు, గన్నవరం, ముసునూరు ప్రాంతాల్లో భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అక్కడ భూములు కొన్న ఎన్నారైలు, చిన్న వ్యాపారులు సంక్షోభంలో కూరుకుపోయారు. దిక్కుతోచక కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

తాడికొండ మండలం కంతేరు వద్ద సర్వే నంబర్లు 27/3బి, 22/2ఎ, 63/1, 62/2బి, 27/3ఎలలో 7.21 ఎకరాలను రూ.67.88 లక్షలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందే కొనుగోలు చేసి తన కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ పేరుతో అగ్రిమెంట్‌ చేసుకున్నారు. జూలై 7, 2014న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత సెప్టెంబరు 8, 2014న కంతేరులోనే సర్వే నెంబర్లు 63/బి, 56లలో ఉన్న 2.46 ఎకరాలను రూ.19.68 లక్షలకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. లింగమనేని ఇన్‌ఫో సిటీ సంస్థకు చెందిన చిగురుపాటి వెంకటగిరిధర్‌ నుంచి జీపీఏ ద్వారా కంతేరు వద్దే సర్వే నెంబర్లు 63/2బి, 63/1, 56 సర్వే నెంబర్లలో ఉన్న 4.55 ఎకరాలను రూ.36.40 లక్షలకు కొనుగోలు చేశారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ ఇలా 14.22 ఎకరాలను కేవలం రూ.1.23,76,000లకు కొనుగోలు చేసింది. అధికారిక రహస్యాలను కాపాడతానని ప్రమాణం చేసిన మరుక్షణమే చంద్రబాబు వాటికి తిలోదకాలు ఇచ్చారనేందుకు హెరిటేజ్‌ పుడ్స్‌ కొనుగోలు చేసిన భూములే నిదర్శనం.

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు నన్నపనేని లక్ష్మీనారాయణ అత్యంత సన్నిహితుడు. రాజధానికి కూత వేటు దూరంలో చంద్రబాబు, యనమల కొనుగోలు చేసిన భూమికి సమీపంలోనే నన్నపనేని లక్ష్మీనారాయణ పేరుతో సర్వే నెంబర్‌ 397–బీ, 398–బీ లో 1.5 ఎకరాలు, 397–ఎ2, 397–ఎ1, 398–ఎ, 397–బీ, 398–బీలో 4.505 ఎకరాలు, 380లో ఒక ఎకరాతోపాటు మరో సర్వే నంబర్‌తో కలిపి మొత్తం 7.50 ఎకరాల భూమిని రూ.కోటికే కొనుగోలు చేసి ఆగస్టు 13, 2014న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. రాజధానిపై దేవినేని ఉమాకు నాడు చంద్రబాబు ముందే సమాచారం ఇచ్చి భూమిని కొనుగోలు చేయించారు అనడానికి ఈ రిజిస్ట్రేషన్‌ పత్రాలే రుజువు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement