‘ఇన్‌సైడర్‌’పై ఈడీ కేసు! | Enforcement Directorate set to investigate land scam in Amaravati | Sakshi
Sakshi News home page

అమరావతిలో మనీల్యాండరింగ్‌ బాగోతం.. ‘ఇన్‌సైడర్‌’పై ఈడీ కేసు!

Published Tue, Feb 4 2020 3:19 AM | Last Updated on Tue, Feb 4 2020 8:04 AM

Enforcement Directorate set to investigate land scam in Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై దర్యాప్తునకు ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సిద్ధమైంది. రాజధాని పేరుతో సాగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఈడీ సోమవారం ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ) కేసు నమోదు చేసింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, మరికొందరు టీడీపీ నేతలపై సీఐడీ ఇచ్చిన ఆధారాల నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు హయాంలో రాజధాని ఏర్పాటుపై పథకం ప్రకారం ముందే లీకులు ఇచ్చి అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి లబ్ధి పొందేలా దోహదపడ్డారనే అభియోగాలున్నాయి. దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందనే విషయాన్ని నిర్ధారించింది.

2014 జూన్‌ నుంచి డిసెంబర్‌ లోపు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా సీఆర్‌డీఏ పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టు మంత్రివర్గ ఉపసంఘం నిగ్గు తేల్చింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఎన్‌ఆర్‌ఐ వేమూరి రవికుమార్‌ ప్రసాద్, పరిటాల సునీత, జీవీ  ఆంజనేయులు, లింగమనేని రమేష్, పయ్యావుల కేశవ్, పుట్టా మహేష్‌ యాదవ్, దూళిపాళ నరేంద్ర, లంకా దినకర్, కంభంపాటి రామ్మోహన్‌రావు తదితర టీడీపీ నేతలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడినట్టు మంత్రివర్గ ఉప సంఘం స్పష్టం చేసిన సంగతి తెలిందే. అంతటితో ఆగకుండా టీడీపీ నేతల బంధుమిత్రులకు చెందిన భూములు ఉన్న ప్రాంతాన్ని సీఆర్‌డీఏ పరిధిలోకి తేవడం, అవసరమైన చోట వారి భూములకు మినహాయింపు ఇవ్వడం, రాజధాని ప్రాంతంలో నిర్మాణాల విషయమై పథకం ప్రకారం వారికి ఉప్పందించి లాభపడేలా చేయడంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు మంత్రివర్గ ఉప సంఘం నిర్ధారించింది. 

తెల్లకార్డుదారులు 761.34 ఎకరాల భూమి కొనుగోలు 
మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా తీగలాగిన రాష్ట్ర నేర పరిశోధన శాఖ (సీఐడీ) గత ప్రభుత్వ పాలనలో జరిగిన భూ కుంభకోణాలను నిగ్గు తేల్చింది. అమరావతిలో నాలుగు వేల ఎకరాల భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించింది. అమరావతి రాజధాని కోర్‌ ఏరియాలో 797 మంది తెల్లరేషన్‌ కార్డుదారులు 761.34 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సేకరించారు. పేద వర్గాలుగా తెల్లకార్డులు పొందిన వారు దాదాపు రూ.276 కోట్లు పెట్టి ఆ భూములు ఎలా కొన్నారనే దానిపై సీఐడీ కూపీ లాగింది. పచ్చ నేతలకు బినామీలుగా తెల్లకార్డుదారుల పేర భూములు కొన్నట్టు నిర్ధారణ కావడంతో ఇందులో మనీ ల్యాండరింగ్, అక్రమ ఆదాయం వంటి అంశాలు ముడిపడ్డాయి.  

టీడీపీ మాజీ మంత్రులపై కేసు నమోదు 
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. మభ్యపెట్టి తన భూమి కొనుగోలు చేశారని వెంకటాయపాలెంకు చెందిన దళిత మహిళ పోతురాజు బుజ్జి ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. టీడీపీ మాజీ మంత్రులు పి.నారాయణ, పత్తిపాటి పుల్లారావులతోపాటు టీడీపీ నాయకుడు బెల్లంకొండ నరసింహారావుపై సెక్షన్‌ 420, 506 రెడ్‌విత్‌ 120(బి)తోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సెక్షన్‌ 3(1)(జి)(పి) కేసు నమోదు చేసిన సీఐడీ.. పలు ప్రాథమిక ఆధారాలు సేకరించింది. అమరావతి ,పెద్దకాకాని, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి గ్రామాల్లో తెల్లకార్డు దారులను బినామీలుగా అడ్డుపెట్టుకుని 720 ఎకరాలను కొనుగోలు చేసినట్టు నిర్ధారించింది. ఈ కేసును సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి దర్యాప్తు చేస్తున్నారు.

ఆధారాలతో సహా ఈడీకీ లేఖ రాసిన సీఐడీ
రాజధాని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో మనీ ల్యాండరింగ్‌ జరిగిందని, దీనిపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చెన్నై రీజినల్‌ కార్యాలయానికి సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్‌ గత నెలలో లేఖ రాశారు. ఈ మేరకు ఎన్‌పోర్సుమెంట్‌ సదరన్‌ రీజియన్‌ స్పెషల్‌ డైరెక్టర్‌కు రాజధాని ప్రాంతంలో తెల్లకార్డుదారుల పేరుతో కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన డాక్యుమెంట్లతోపాటు, తెల్లరేషన్‌ కార్డు హోల్డర్ల వివరాలను పంపించారు. 2015 అక్టోబర్‌లో వెంకటపాలెంకు చెందిన పి.బుజ్జి భూమిని అప్పటి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ దన్నుతో వారి బినామీలు మోసం చేసి, బెదిరించి, బలవంతంగా తక్కువ ధరకు కొనుగోలు చేసినట్టు ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఆ లేఖలో సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు. రాజధాని భూముల కొనుగోల్‌మాల్‌లో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరడంతో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేపట్టనుంది. 

ఐటీ ‘తెల్ల’బోయేలా..
తెల్లకార్డు కలిగిన పేద వర్గాలు కోట్లు పెట్టి రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వ్యవహారంలో సీఐడీ అందించిన వివరాలను పరిశీలిస్తే ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు సైతం తెల్లబోయేలా చేసింది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌ (ఆంధ్రప్రదేశ్‌ – విజయవాడ)కు గత నెల 22న సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్‌ ఆధారాలతో సహా లేఖ రాశారు. 2014 – 2015లో పేద వర్గాల వారు భారీ మొత్తాలను పెట్టుబడి పెట్టి రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని, తెల్లకార్డు కలిగిన వారికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది దర్యాప్తు చేస్తే వారి వెనుక టీడీపీ నేతల పెట్టుబడి బయటకు వస్తుందని సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌ రాసిన లేఖలో పేర్కొన్నారు. వీరిలో కొంత మంది పాన్‌కార్డు సమర్పించారని, అత్యధిక శాతం వారికి పాన్‌కార్డులు లేవని, వారి పేర్లు, తెల్లకార్డు నంబర్లు, కొనుగోలు చేసిన భూముల దస్తావేజులు, వాటి మార్కెట్‌ విలువ తదితర వివరాలను ఐటీ శాఖకు ఆయన అందజేశారు. వీటిపై సమగ్ర దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

అన్ని కోణాల్లో దర్యాప్తు
రాజధానిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు రాజధాని భూముల కొనుగోలులో జరిగిన మనీ ల్యాండరింగ్‌పై ఈడీ దర్యాప్తు చేస్తుంది. తెల్లకార్డు కలిగిన పేదలు అంత పెద్ద మొత్తాలు పెట్టి భూములు ఎలా కొనుగోలు చేశారనే దానిపై ఐటీ శాఖ దర్యాప్తు చేయాల్సి ఉంది. రాజధానిలో జరిగిన అక్రమాలపై సంబంధిత అన్ని శాఖలు దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి. 
– సునీల్‌కుమార్, సీఐడీ ఏడీజీ

నిరుపేదలు భూములు కొన్నారట!
దేవతల రాజు ఇంద్రుని రాజధాని అమరావతిని తలదన్నేలా ఆంధ్రులకు కొత్త రాజధాని నిర్మించడం మాటేమోగానీ.. కటిక నిరుపేదలను బినామీలుగా చేసుకుని వేలాది కోట్ల రూపాయల భూములను కాజేయడంలో చంద్రబాబు బృందం సఫలీకృతమైంది. ఓత్‌ ఆఫ్‌ సీక్రసీని తుంగలో తొక్కి.. రాజధానిపై అధికారిక ప్రకటన చేయక ముందే లీకులు ఇచ్చి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా తక్కువ ధరలకే భారీగా భూములు కొల్లగొట్టి అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడింది. ఏడాదికి రూ.60 వేలలోపు ఆదాయం ఉండే వారిని దారిద్య్రరేఖకు దిగువన  ఉన్న వారిగా గుర్తిస్తారు. ఇలాంటి వారికి తెల్లరేషన్‌కార్డును సర్కార్‌ జారీ చేస్తుంది.

ఇలాంటి నిరుపేదలకు ప్రభుత్వం ప్రకటన చేయక ముందే.. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నది తెలిసే అవకాశమే లేదు. కానీ, ఇలాంటి వారు 797 మంది రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయక ముందే.. అంటే 2014 జూన్‌ 1 నుంచి 2014 డిసెంబర్‌ 30 వరకు 761.34 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. వీరిలో ఏ ఒక్కరూ ఆదాయపు పన్ను చెల్లించ లేదు. ఈ దృష్ట్యా వీరంతా గత ప్రభుత్వ పెద్దల బినామీలని స్పష్టమవుతోంది. చంద్రబాబు బృందం తమ కుటుంబ సభ్యులు, వ్యాపార సంస్థలు, సమీప బంధువుల పేర్లతో తక్కువ ధరకే వేలాది ఎకరాలను కాజేసింది చాలక.. తమ డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసే వారు, అనుచరులను ముందు పెట్టి భూములను కొనుగోలు చేసినట్లు సీఐడీ తేల్చింది.  

- తెల్లరేషన్‌కార్డు పొందడానికి ఏడాదిలో గరిష్ట ఆదాయం రూ.60,000
- ఏడాదిలో గరిష్టంగా ఆదా చేసే మొత్తం రూ.5,000
- 20 ఏళ్లున్న వ్యక్తి 65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆదా చేసే మొత్తం రూ.2.25 లక్షలు
- 797 మంది తెల్లరేషన్‌కార్డుదారులు కొన్న భూమి(ఎకరాల్లో) 761.34
పాన్‌కార్డు కలిగిన వారు  268  
పాన్‌కార్డులు లేని వారు 529
రిజిస్ట్రేషన్‌ (ప్రభుత్వం నిర్ణయించిన) ధర ప్రకారం ఆ భూమి విలువ (రూ.కోట్లలో): 38.56
బహిరంగ మార్కెట్‌ విలువ ప్రకారం ఆ భూమి విలువ (రూ.కోట్లలో) రూ.220  

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఇలా.. 
2014 మే 16న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. సింగపూర్‌ను తలదన్నేలా రాజధాని నిర్మిస్తామంటూ అదే రోజు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆ వెంటనే ఓత్‌ ఆఫ్‌ సీక్రసీని తుంగలో తొక్కుతూ.. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో రాజధానిని ఏర్పాటు చేస్తామని కీలకమైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. తన సామాజిక వర్గానికి చెందిన వారికి చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇస్తూ.. రాజధాని అక్కడ.. ఇక్కడ అంటూ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు ఇలా తెర తీశారు. 
- 2014 జూన్‌ 9న కృష్ణా జిల్లా నూజివీడు పరిసర ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తామని తమ అనుకూల ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయించారు. 
- 2014 జూన్‌ 12న కృష్ణా జిల్లా ఆగిరిపల్లి, బాపులపాడు పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు కొందరు మంత్రుల ద్వారా ప్రకటింపజేశారు. 
2014 జూలై 5న కృష్ణా జిల్లా ముసునూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటూ ఇంకొందరు మంత్రులతో పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయించారు. 
- 2014 ఆగస్టు 5న కృష్ణా జిల్లా గన్నవరం పరిసర ప్రాంతాలు రాజధాని ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రాంతమంటూ మరికొందరు మంత్రులు చెప్పుకొచ్చారు. 
చంద్రబాబునాయుడు, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు 2014 ఆగస్టు 9న వేర్వేరు సమావేశాల్లో మాట్లాడుతూ గుంటూరు – విజయవాడ  మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 
- 2014  సెప్టెంబరు 4న విజయవాడ – గుంటూరు పరిసర ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. 
తీరా 2014 డిసెంబర్‌ 30న తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు 2015 జనవరి 1న ఈ మండలాల్లో 29 గ్రామాల్లో అవసరమైన భూమిని సమీకరించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసి..  ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. 

పక్కా ప్లాన్‌తో భూ దందా
టీడీపీ పెద్దలు, నేతలు.. లంకలు, పోరంబోకు, ప్రభుత్వ భూములను కాజేసి ఆ భూములను ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. ప్రభుత్వ పెద్దలకు మంచి రేటు వచ్చే ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయించి, రైతులను వెనక్కు నెట్టేసి తీవ్ర నష్టం చేశారు. 2014 జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు గుంటూరు జిల్లాలోని రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2,279.91 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 1,790 ఎకరాలు కొనుగోలు చేశారు. మొత్తం 4,069.91 ఎకరాలు కొనుగోలు చేసి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా లబ్ధి పొందారు. చంద్రబాబు నాయుడు కుటుంబీకులు తాడికొండ మండలం కంతేరు గ్రామంలో 14.22 ఎకరాల భూమిని హెరిటేజ్‌ ఫుడ్స్‌ కోసం కొనుగోలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే ఈ కొనుగోలు జరగడం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు అద్దం పట్టింది. 

జోన్ల అలైన్‌మెంట్లలోనూ మాయ
రాజధానిలో జరిగిన భూ కుంభకోణంలో మరో కోణం ఇష్టాను సారంగా సరిహద్దులు నిర్ణయించడం. జోన్ల అలైన్‌మెంట్లను తమకు అనుకూలంగా మార్చడం. అప్పటి అధికార పార్టీ నాయకులు, వారి బంధువులు, అనుయాయుల భూములేవీ ల్యాండ్‌ పూలింగ్‌ జోన్‌లోకి రాకుండా చేయడానికి ఉద్దేశపూర్వకంగా సరిహద్దులను మార్చారు. 2015 జూన్‌లో రాజధాని పరిధిని 217 చదరపు కిలోమీటర్లుగా ప్రకటించారు. ఆ తర్వాత సింగపూర్‌కు చెందిన సుర్బానాజురాంగ్‌కు డ్రాఫ్ట్‌ ప్లాన్‌ బాధ్యతలను ప్రభుత్వం అందించింది. సుర్బానాజురాంగ్‌ ప్రభుత్వానికి రాజధాని ప్లాన్‌ అందించింది.

ఈ ప్లాన్‌ ప్రకారం 391.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని డ్రాఫ్ట్‌ ప్లాన్‌ను రూపొందించింది. అయితే దీన్ని అప్పటి ప్రభుత్వం పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా కేవలం 217 చదరపు కిలోమీటర్లకు పరిమితి చేస్తూ ఫిబ్రవరి 2016లో నోటిఫికేషన్‌ జారీ చేసి, ఆ మేరకు ల్యాండ్‌ పూలింగ్‌ చేపట్టింది. జురాంగ్‌ కంపెనీ ఇచ్చిన డ్రాఫ్ట్‌ ప్లాన్‌కు భిన్నంగా రాజధాని నగరాన్ని కుదించడం వెనుక తమకు రాజకీయంగా అనుకూలమైన వ్యక్తులను పూలింగ్‌ నుంచి మినహాయించి, వాటి విలువ పెరిగేలా చేసి వారికి ఆర్థికంగా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం వెల్లడవుతోంది. 
మంగళగిరి సమీపంలోని కాజా టోల్‌గేట్‌ సమీపంలో ఉన్న రామకృష్ణా హౌసింగ్‌ను సీఆర్డీయే జోన్‌ పరిధిలోకి రాకుండా తప్పించి ఆ కంపెనీకి ప్రయోజనం చేకూర్చారు. 
నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్‌పీ రామారావు కంపెనీ వీబీసీ ఫెర్టిలైజర్స్‌కు చందర్లపేటలో కేటాయించిన 498.3 ఎకరాల విషయంలో వారికి అత్యంత అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ కంపెనీకి భూములు కేటాయించిన తర్వాత సీఆర్డీయే ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి విస్తరించారు. త ద్వారా ఆ భూములకు మంచి రేటు వచ్చేలా చేశారు.
రాజధాని నగరం చుట్టూ నిర్మించ దలచిన ఇన్నర్‌ రింగురోడ్డు, దాన్ని అనుసంధానిస్తూ నిర్మించ దలచిన రోడ్ల విషయంలో కూడా అలైన్‌మెంట్లను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ కంపెనీ పేరుమీద కొనుగోలుచేసిన భూములు ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు పక్కనే ఉన్నాయి. మురళీ మోహన్‌ కుంచనపల్లె సమీపంలో కొనుగోలు చేసిన 53.29 ఎకరాలకు ఆనుకుని ఇన్నర్‌ రింగు రోడ్డు వచ్చేలా చేశారు. 

అసైన్డ్‌ చట్టానికి తూట్లు.. 
రాజధాని ప్రాంతంలో అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసి ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చిన వారికి 900 ప్లాట్లు కేటాయించారు. తద్వారా పీఓటీ చట్టాన్ని తుంగలో తొక్కారు. రాజధానికి భూములు తీసేసుకుంటారని ఎస్సీ, ఎస్టీలను భయపెట్టి.. టీడీపీ నేతలు కారుచౌకగా వారి భూములను కొన్నారు. మంగళగిరి సబ్‌ రిజిస్టార్‌ వాటిని రిజిస్టర్‌ చేయకుండా పక్కన పెడితే.. జీఓ ఎంఎస్‌ నెంబర్‌ 258, 580, 575  జారీ చేసి, భూములు కొనుగోలు చేసిన వారిని శివాయి జమేదార్లుగా పరిగణించి వారి నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములు తీసుకున్నారు. లేని లంక భూములు కూడా ఉన్నట్లు సృష్టించి ప్లాట్లు కేటాయించారు. ఎస్సీ,  ఎస్టీల నుంచి   కొల్లి శివరాం 47.39 ఎకరాల అసైన్డ్‌ భూమి కొన్నారు. ఇతను లోకేశ్‌కు బినామీ అని బయట ఎవరిని అడిగినా చెబుతారు. గుమ్మడి సురేష్‌  42.92 ఎకరాలు, బరసు శ్రీనివాసరావు (నారా లోకేష్‌  మనుషులు) 14.07 ఎకరాల అసైన్డ్‌ భూమి తక్కువ ధరకు కొన్నారు. మొత్తంగా 338.887 ఎకరాల అసైన్డ్‌ భూములను తక్కువ ధరకే కొనుగోలు చేసి ప్రతిఫలంగా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు పొంది ఆర్థికంగా లబ్ధి పొందారు.    

లింగమనేనికి భారీగా లబ్ధి
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యాపార వేత్త లింగమనేని రమేష్‌ తన భార్య సుమన.. ఇతరులు ప్రశాంతి, స్వర్ణకుమారి, ఎల్‌.వి.రమేష్, ఎల్వీఎస్‌ రాజశేఖర్‌ పేర్లమీదే కాకుండా తన సంస్థలు లింగమనేని ఎస్టేట్స్, ఐజెఎం, లింగమనేని ఎడ్యుకేషనల్‌ అకడమిక్‌ ఫౌండేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్‌ లిమిటెడ్, హైదరాబాద్‌ ఎల్‌ఈపీఎల్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్, కుముదల ఎస్టేట్స్, లింగమనేని ఆగ్రో ప్రై వేట్‌ లిమిటెడ్, లౌక్య హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, స్వర్ణిక ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, వల్లభ ఫీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, విఘ్నేష్‌ వెంచర్స్, వైట్‌సిటీ ప్రాజెక్ట్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేర్లమీద పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి.

విచిత్రంగా ఈ భూములేవీ రాజధాని నగరం పరిధిలోకిగానీ, సీఆర్డీయే పరిధిలోకి రాలేదు. లింగమనేని ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భూములకు కేవలం పది మీటర్ల దూరంలో రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోయింది. ఇందుకు ప్రతిఫలంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. లింగమనేనికి చెందిన గెస్ట్‌హౌస్‌ను తన నివాసంగా మార్చుకున్నారు. 158 ఎకరాలకు సంబంధించి ఇలాంటి అక్రమాలు జరిగాయని ఇప్పటి వరకు రికార్డులు లభించాయి. ప్లాట్ల కేటాయింపులో కూడా భారీగా అక్రమాలు జరిగాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్న వారు, పైస్థానంలో ఉన్న వారు తమకు అనుకూలమైన ప్రాంతంలో ప్లాట్లను పొందగా, వీరి స్థానంలో ప్లాట్లు దక్కాల్సిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement