చంద్రబాబుకు ఇచ్చిన నోటీస్‌లో ఆయన తనయుడు నారా లోకేశ్ పేరును ప్రస్తావించిన ఐటీ శాఖ
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో తాత్కాలిక భవన నిర్మాణ సంస్థల నుంచి ముడుపులు పిండుకోవడంలో ‘చినబాబు’ కూడా చేతివాటం చూపిన విషయం ఐటీ నోటీసులతో వెలుగులోకి వచ్చింది. ఈమేరకు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు జారీ చేసిన 46 పేజీల సుదీర్ఘ నోటీసుల్లో నారాలోకేశ్ పేరును కూడా ఆదాయపు పన్ను శాఖ ప్రస్తావించింది. లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు, టీడీపీ కార్యదర్శిగా ఉన్న కిలారు రాజేశ్ అక్రమ నగదు తరలింపులో కీలకపాత్ర పోషించినట్లు ఐటీ శాఖ స్పష్టమైన సాక్ష్యాధారాలతో వెల్లడించింది.
‘మీ కుమారుడు నారా లోకేష్ సన్నిహితులు నగదు తీసుకున్నారనేందుకు పక్కా అధారాలివీ.. వీటిపై మీరు ఏం సమాధానం చెబుతారు?’ అంటూ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఎక్సెల్ షీట్లు, నగదు తరలింపు సమయంలో జరిపిన వాట్సాప్ మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ల రూపంలో అందించి మరీ నోటీసులను జారీ చేసింది.
విశాఖకు చెందిన ఆర్‌వీఆర్ నిర్మాణ రంగ సంస్థకు చెందిన రఘు రేలా ఆయన సన్నిహితుల ద్వారా కూడా భారీ మొత్తాలను తరలించినట్లు సాక్ష్యాలతో స్పష్టం చేసింది. ఈ చాటింగ్‌లన్నీ మీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో 2020 ఫిబ్రవరిలో సోదాలు జరిపినప్పుడు స్వాధీనం చేసుకున్న శ్యాంసంగ్ ఫోన్ నుంచి సేకరించినవని, వీటిని శ్రీనివాస్ కూడా ధృవీకరించినట్లు ఐటీ శాఖ చంద్రబాబుకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది.
కిలారుకు రూ.4.5 కోట్లు.. అయితే ఓకే!
లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేష్‌కు రూ.4.5 కోట్లను నగదు రూపంలో ఎలా చేరవేశారో ఐటీ శాఖ పూర్తి సాక్ష్యాధారాలతో నోటీసుల్లో వివరించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వీరు ముడుపుల వ్యవహారాన్ని యధేచ్ఛగా కొనసాగించారు. 2019 మే 22న చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు దీన్ని ధృవీకరిస్తున్నాయి.
ఆ రోజు చంద్రబాబు పీఏ శ్రీనివాస్ డబ్బుల పంపిణీ గురించి అడగ్గా కిలారు రాజేష్‌కు రూ.4.5 కోట్లను పార్టీ ఆఫీసులో అందించినట్లు పార్థసాని పేర్కొన్నాడు. అంకిత్ బలదూత ద్వారా రూ.2.2 కోట్లు పంపగా, రఘు రేలాకు సన్నిహితుడైన శ్రీకాంత్ ద్వారా మిగిలిన మొత్తాన్ని పంపినట్లు చెప్పడంతో ‘‘అయితే ఓకే..’’ అంటూ చంద్రబాబు పీఏ శ్రీనివాస్ బదులిచ్చాడు.
ఈమేరకు నగదు తరలింపులకు సంబంధించి శ్రీకాంత్ ఫోన్ నుంచి జరిగిన వాట్సాప్ సంభాషణలను కూడా ఐటీ అధికారులు జత చేశారు. వాంగ్మూలం నమోదు సమయంలో ఈ సంభాషణలను మనోజ్ వాసుదేవ్‌కు చూపగా అది నిజమేనని అంగీకరించినట్లు ఐటీశాఖ పేర్కొంది. డేటా చౌర్యం ఐటీ గ్రిడ్ కేసులో కూడా కిలారు రాజేష్ కీలక పాత్రధారిగా వ్యవహరించిన విషయం విదితమే.
రఘు ద్వారా రూ.20.18 కోట్లు తరలింపు..
విశాఖకు చెందిన రఘు రేలా ఆర్‌వీఆర్ పేరుతో రియల్ ఎస్టేట్‌తో పాటు 18కిపైగా కంపెనీలను ఏర్పాటు చేసి వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. షాపూర్జీ పల్లోంజీ నుంచి అక్రమంగా నగదు తరలింపులో రఘు రేలా కీలకప్రాత పోషించినట్లు గుర్తించిన ఐటీ అధికారులు ఆర్‌వీఆర్ గ్రూపులో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న సాక్ష్యాల ఆధారంగా మనోజ్ వాసుదేవన్‌ను విచారించారు.
చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఆదేశాల మేరకు రఘు రేలా ద్వారా మొత్తం రూ.20.18 కోట్లను తరలించినట్లు మనోజ్ పార్ధసాని అంగీకరించాడు. ఈ నగదు తరలింపులో రఘుకు సన్నిహితులైన కృష్ణ, నారాయణ అనే ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారని, అయితే వారి గురించి తనకు ఎటువంటి వివరాలు తెలియవని పేర్కొన్నాడు. విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌కు ఈ మొత్తాన్ని తరలించారని, ఇందుకు ఎక్సెల్ షీట్ స్పష్టమైన ఆధారమని ఐటీ శాఖ వెల్లడించింది.
ఆ బంధం ఎంత బలమైనదంటే..
నగదు తరలింపులో కీలకంగా వ్యవహరించిన మనోజ్ వాసుదేవ్ పార్థసాని 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. టీడీపీ ఘోరంగా ఓడిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయన పీఏ శ్రీనివాస్‌కు మనోజ్ వాసుదేవ్ ఒక మెసేజ్ పంపారు. తన జీవితంలో ఇటువంటి దారుణమైన రాజీనామా లేఖను చూడలేదని అందులో పేర్కొన్నారు.
వీరి మధ్య బంధం ఎంత బలంగా ఉందనేందుకు ఆ మెసేజ్ నిదర్శనమని ఐటీ శాఖ తన నోటీసులో పేర్కొంది. నిర్మాణ రంగ సంస్థల నుంచి నగదును అక్రమంగా తరలించారనేందుకు ఇవి తిరుగులేని సాక్ష్యాలని, నగదు తరలింపులో మీ తనయుడు లోకేశ్ సన్నిహితులు కీలక పాత్ర పోషించారనేందుకు ఇవన్నీ నిదర్శనమని చంద్రబాబుకు జారీ చేసిన నోటీసుల్లో ఐటీ శాఖ స్పష్టంగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment