సాక్షి, అమరావతి: ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ సోదాల్లో అడ్డంగా దొరికిపోయి ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు రోజుకోరకమైన అడ్డగోలు వాదన వినిపించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఐటీ సోదాలు జరిగిన చంద్రబాబు నాయుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్) పెండ్యాల శ్రీనివాస్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని తొలుత బుకాయించిన టీడీపీ నాయకులు ఇప్పుడు అదే శ్రీనివాస్ ఇంట్లో కేవలం రూ.2.63 లక్షలే దొరికాయని, రూ.2,000 కోట్లు కాదని ఎదురు దాడికి దిగుతుండడం గమనార్హం. తద్వారా వారు తప్పును పరోక్షంగా అంగీకరించినట్లయిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అప్పుడెందుకు మౌనం పాటించారో?
చంద్రబాబు దగ్గర పీఏస్‌గా పనిచేసిన శ్రీనివాస్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్, వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, లోకేశ్ సన్నిహితులు కిలారు రాజేశ్, నరేన్ చౌదరి ఇళ్లు, కార్యాలయాల్లో ఐదు రోజులపాటు ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు చంద్రబాబు, లోకేశ్ సహా టీడీపీ నేతలెవరూ ఎందుకు నోరు మెదపలేదని హైకోర్టు న్యాయవాది కోటంరాజు వెంకటేష్ శర్మ ప్రశ్నించారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ప్రతిరోజూ గంటల తరబడి మీడియా సమావేశాల్లో మాట్లాడే చంద్రబాబు నాయుడు తన మనుషులపై ఐటీ దాడులు జరిగితే ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని వైఎస్సార్‌సీపీ అధికారి ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రముఖుడి దగ్గర పీఎస్‌గా పనిచేసిన వ్యక్తి, వారికి సంబంధించిన మూడు ఇన్‌ఫ్రా కంపెనీల్లో సోదాలు జరిపి, రూ.2,000 కోట్ల మేర అక్రమ లావాదేవీలను గుర్తించినట్లు ఐటీ శాఖ ప్రకటించిన తర్వాత టీడీపీ నాయకులు పొంతన లేనివిధంగా స్పందించడాన్ని బట్టి దొరికిపోయామనే కలవరం వారిలో కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
విస్తృతమైన కసరత్తు తర్వాతే ఐటీ శాఖ ప్రెస్‌నోట్
ఐటీ శాఖ సోదాల్లో గుర్తించిన రూ.2,000 కోట్ల అక్రమ లావాదేవీలతో చంద్రబాబుకు సంబంధం ఉందని ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండడంతో వారిని ఏమార్చేందుకు టీడీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని కార్పొరేట్ లా నిపుణుడు వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాల పంచనామా పత్రాల పేరుతో రెండు కాగితాలను బయటపెట్టి.. దొరికింది రూ.2,000 కోట్లు కాదని, రూ.2.63 లక్షలు, 12 తులాల బంగారం మాత్రమేనని తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రూ.2,000 కోట్ల అవినీతి జరిగినట్లు ఐటీ శాఖ స్పష్టం చేసిందని ఐటీ నిపుణుడు వేణుగోపాల్ తెలిపారు. విస్తృతమైన కసరత్తు చేసి, ఎన్నో ఆధారాలు సేకరించిన తర్వాతే ఐటీ శాఖ ప్రెస్‌నోట్ విడుదల చేసిందని వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని ఐటీ శాఖ కచ్చితంగా మరింత ముందుకు తీసుకెళుతుందని చెప్పారు. పెండ్యాల శ్రీనివాస్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మూడు రోజుల క్రితం అన్నాడని, ఇప్పుడు దొరికింది రూ.2.63 లక్షలేనని ఎందుకు చెబుతున్నాడని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మొన్నటివరకూ సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు దగ్గర మనిషి ఎలా అయ్యాడని ప్రశ్నించారు.
మరో పంచనామా...
ఐటీ శాఖ విడుదల చేసిన పంచనామా పెండ్యాల శ్రీనివాస్ దగ్గర స్వాధీనం చేసుకున్న రూ.2.63 లక్షలు, 12 తులాల బంగారానికి మాత్రమే సంబంధించినదని ఐటీ నిపుణుడు వేణుగోపాల్ తెలిపారు. రూ.2,000 కోట్ల అక్రమ లావాదేవీల ఫైళ్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, ఆర్థిక అంశాల గురించి రాసుకున్న పుస్తకాలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పంచనామా కూడా ఉంటుందని వ్యాఖ్యానించారు. అందులో రూ.2,000 కోట్ల అక్రమ ఆర్థిక లావాదేవీల గుట్టు ఉంటుందనే నిజాన్ని ప్రతిపక్ష నాయకులు ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారని తెలిపారు. అవినీతి వ్యవహారాల్లో అడ్డంగా దొరికిపోవడం వల్లే టీడీపీ నేతలు కంగారుపడుతూ రకరకాల వక్రీకరణలను తెరపైకి తెస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు.
చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్, సన్నిహితుల ఇళ్లు, ఇన్‌ఫ్రా కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో రూ.2 వేల కోట్లకు పైగా నల్లధనానికి సంబంధించి ఆధారాలు దొరికాయంటూ ఐటీ శాఖ 13వ తేదీన విడుదల చేసిన నోట్
Comments
Please login to add a commentAdd a comment