న్యూఢిల్లీ: నల్లధనం చెలామణీ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం(ఈసీ) దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ సన్నిహితులతోపాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఆదివారం ఆదాయ పన్ను శాఖ అధికారులు జరిపిన దాడులపై బుధవారం నాటికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కోరింది. కేంద్ర రెవెన్యూ కార్యదర్శిపాండే, సీబీడీటీ చైర్మన్ పీసీ మంగళవారం ఎన్నికల సంఘంను కలిసి ఐటీ, ఈడీ, కస్టమ్స్, డీఆర్‌ఐ విభాగాలు జరిపిన సోదాలపై వారికి వివరించారు. మధ్యప్రదేశ్‌లో దాచిన డబ్బును భారీగా ఢిల్లీకి తరలించి, నిల్వ ఉంచుతున్నట్లు అందిన నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకే దాడులు జరిపినట్లు తెలిపారు.
ఈ దాడుల్లో రూ.281 కోట్ల లెక్కలో చూపని డబ్బు వెలుగు చూసిందని వివరించారు. విదేశాల్లో ఆస్తులు, బీనామీ ఆస్తులు, ఆస్తుల కీలక పత్రాలకు సంబంధించి త్వరలో ఐటీ శాఖ కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. స్పందించిన ఈసీ.. నల్లధనం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని కోరింది. అయితే, దర్యాప్తు సంస్థలు ఈ విషయంలో నిష్పాక్షికంగా వ్యవహరించాలని, దాడులకు ముందుగా సంబంధిత రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారు(సీఈవో)లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వచ్చిన మార్చి 10వ తేదీ తర్వాత ఐటీ శాఖ పలువురు రాజకీయ నేతలు, వారి సంబంధీకులపై దాడులు చేపట్టడంపై కేంద్ర సంస్థలను ప్రభుత్వం రాజకీయంగా వాడుకుంటోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment