‘గరీబ్ కల్యాణ్’ అందరికీ కాదు..
దరఖాస్తుకు ముందే పన్ను, లాక్–ఇన్ మొత్తం చెల్లించాలి...
► అవినీతి, కేసులు, అక్రమ ధనార్జన, డ్రగ్స్ అక్రమ రవాణా వంటి కేసుల్లో ఉన్నవారికి ఇది వర్తించదు
► కొత్త ఆదాయ వెల్లడి స్కీమ్‌పై సీబీడీటీ వివరణ
న్యూఢిల్లీ: నల్లకుబేరులకు సంబంధించి కేంద్రం తాజాగా, చివరి అవకాశంగా ప్రకటించిన ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకం అందరికీ వర్తించబోదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, 2016కు సంబంధించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) ఈ మేరకు వివరణలతో తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
♦ పథకానికి దరఖాస్తు పెట్టుకునే ముందే ‘వెల్లడి మొత్తానికి’ సంబంధించిన మొత్తంలో మొదట 49.9 శాతం పన్ను చెల్లించాలి. దరఖాస్తులో ఇలా పన్ను చెల్లించినట్లు ఆధారం ఉండాలి. అలాగే ఈ దరఖాస్తుకు ముందే ‘వెల్లడి మొత్తం’లో 25 శాతాన్ని వడ్డీరహిత రీతిలో నాలుగేళ్ల కాలానికి ‘లాక్–ఇన్’ విధానంలో డిపాజిట్ చేయాలి. కట్టిన పన్నును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వడం జరగదు.
♦ అవినీతి, బినామీ ఆస్తుల నిర్వహణ, అక్రమ ధనార్జన, విదేశీ మారకద్రవ్య నిల్వల ఉల్లంఘనలు, ఫారిన్ బ్లాక్ మనీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఈ పథకం వర్తించదు.
♦ స్పెషల్ కోర్ట్ (సెక్యూరిటీ లావాదేవీల సంబంధ ఆరోపణల విచారణ) యాక్ట్, 1992, సెక్షన్ 3 కింద నోటిఫై చేసిన ఏ వ్యక్తీ ఈ పథకం పరిధిలోకి రాబోడు.
♦ వెల్లడించిన సొమ్ము పైన పేర్కొన్న అంశాల పరిధిలోకే వస్తుందని, సంబంధిత డిక్లరెంట్ కీలకమైన కొన్ని అంశాలు దాచిపెట్టాడని తదుపరి ఏ సందర్భంలోనైనా రుజువైతే... తగిన చట్టపరమైన చర్యలన్నింటినీ తీసుకోవడం జరుగుతుంది.
♦ డిసెంబర్ 17న ప్రారంభమైన ఈ పథకం డిక్లరేషన్లు, డిపాజిట్ల నిమిత్తం 2017 మార్చి 31 వరకూ అందుబాటులో ఉంటుంది.
♦ ఇన్ ప్రింట్ లేదా డిజిటల్ సిగ్నేచర్ కింద ఎలక్ట్రానికల్‌గా ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్‌కు లేదా ఇన్‌కంట్యాక్స్ కమిషనర్‌కు డిక్లరేషన్ ఇవ్వవచ్చు. తరువాత 30 రోజుల్లో పన్ను అధికారులు ఇందుకు సంబంధించి డిక్లరెంట్‌కు ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు.
♦ ఈ పథకం కింద నల్లధనాన్ని ప్రకటించని వారు అటు తర్వాత ట్యాక్స్ రిటర్న్ రూపంలో ఆ మొత్తాన్ని వెల్లడించవచ్చు. అయితే ఇందుకు సంబంధించి మొత్తం 77.25 శాతం పన్ను, జరిమానాలుగా చెల్లించాలి. ఈ రెండు పథకాలనూ వినియోగించుకోకపోతే.. పట్టుకున్న మొత్తంలో పన్నుతో పాటు ఆ మొత్తంలో 10 శాతం జరిమానా పడుతుంది. సంబంధిత వ్యక్తి ప్రాసిక్యూషన్‌ను కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది.