పూణె: మహారాష్ట్రలోని పూణెను అంతుచిక్కని వ్యాధి పట్టిపీడిస్తోంది. తాజాగా మరో ఐదుగురు అరుదైన నాడీ సంబంధిత రుగ్మతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో మహారాష్ట్రలో గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్) అనుమానిత కేసుల సంఖ్య 163కి చేరింది. ఆరోగ్య శాఖ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాధి కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురు మృతిచెందారని తెలిపారు.
కొత్తగా జీబీఎస్(Guillain-Barré syndrome) కారణంగా ఎవరూ మరణించనప్పటికీ సోమవారం కొత్తగా మరో ఐదు కేసులు నమోదయ్యాయని వైద్యాధికారి తెలిపారు. మొత్తం 127 మంది జీబీఎస్‌తో బాధపడుతున్నట్లు తేలిందని ఆయన తెలిపారు. పూణె నగరంలో 32, పూణె మునిసిపల్ కార్పొరేషన్‌కు కొత్తగా అనుసంధానించిన గ్రామాల నుండి 86, పింప్రి చించ్వాడ్‌లో 18, పూణె గ్రామీణ ప్రాంతంలో 19, ఇతర జిల్లాల్లో ఎనిమిది సహా 163 అనుమానిత కేసులు ఉన్నాయన్నారు. 163 మంది రోగులలో 47 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని 47 మంది ఐసియులో చికిత్స పొందుతున్నారని, 21 మంది వెంటిలేటర్లపై ఉన్నారని ఆ అధికారి వివరించారు.
పూణె నగరంలోని వివిధ ప్రాంతాల నుండి మొత్తం 168 నీటి నమూనాలను(Water samples) రసాయన, జీవ విశ్లేషణ కోసం ప్రజారోగ్య ప్రయోగశాలకు పంపినట్లు ఆయన తెలిపారు. దీనిలో ఎనిమిది నీటి వనరులు కలుషితమైనట్లు తేలిందని ఆయన అన్నారు. జీబీఎస్ అనేది ఒక అరుదైన రుగ్మత. ఇది సోకినప్పుడు శరీరంలోని వివిధ అవయవాలు అకస్మాత్తుగా మొద్దుబారిపోతాయి. కండరాల బలహీనత ఏర్పడుతుంది. చేతులు, కాళ్లలో తీవ్రమైన బలహీనత ఏర్పడుతుంది. కలుషితమైన ఆహారం, నీటిలో కనిపించే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా జీబీఎస్ వ్యాప్తికి కారణమని నిపుణులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఎన్‌కౌంటర్‌లో ట్విస్ట్.. కంగుతిన్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment