ఎన్నికలు–నోట్ల రద్దు వేరువేరు!
ఐదు రాష్ట్రాల్లో విజయం మాదే!
► రామమందిరం జాతీయ స్వాభిమానాంశం
► అభివృద్ధే ఎజెండా
► సాక్షి ఇంటర్వ్యూ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్
సాక్షి ప్రతినిధి : దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. అధికారంలో ఉన్న బీజేపీకి కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో యూపీతోపాటుగా పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికల్లో నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం ఎంత? అభివృద్ధి నినాదం పనిచేస్తుందా? లేక రామమందిరం మరోసారి ఊపిరిపోస్తుందా? మణిపూర్‌లో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందా? అనే అంశాలపై మణిపూర్‌లో పార్టీ బాధ్యతలు చూస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంట ర్వ్యూవిశేషాలు.
ఐదు రాష్ట్రాల్లో పరిస్థితిపై...
ఈ ఐదు రాష్ట్రాల్లో గెలవటం మాకు చాలా కీలకం. ఐదుచోట్లా గెలిచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. యూపీలో ఎస్పీ–కాంగ్రెస్ ఏకమై బీజేపీ విజయాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయి. ప్రజలకు మోదీ పాలనపై అపారమైన విశ్వాసం ఉంది. ప్రజలు అభివృద్ధినే విశ్వసిస్తారు. మా ప్రచారం కూడా అభివృద్ధి ఎజెండాగానే సాగుతోంది. యూపీలో కచ్చితంగా కనీస మెజారిటీని సంపాదిస్తాం. పంజాబ్‌లో గట్టిపోటీ ఉంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకత సహజమే. అయినా మాకే విజయావకాశాలున్నాయి. గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌ల్లోనూ గెలుస్తాం.
ఓట్లకోసమే ‘రామమందిరం’ మళ్లీ తెరపైకి తెచ్చారన్న విమర్శలపై
ఈ ఆరోపణలు అర్థరహితం. 1989 నుంచీ బీజేపీ అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని జాతీయ స్వాభిమానాంశంగా గుర్తించి మేనిఫెస్టోలో పెడుతూ వస్తోంది. దీన్ని మతపరమైన అంశంగా మేమెప్పుడూ గుర్తించలేదు. రామమందిర నిర్మాణం అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున దీనిపై వ్యాఖ్యానించటం సరికాదు.
ట్రిపుల్ తలాక్‌పై..: ట్రిపుల్ తలాక్ అంశం మేం లెవనెత్తింది కాదు. ముస్లిం మహిళలే తమ స్వాభిమానం కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాతే ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై మీ అభిప్రాయం చెప్పమని సుప్రీంకోర్టు అడిగినప్పుడే ప్రభుత్వం స్పందించింది.
మణిపూర్‌లో పరిస్థితేంటి?
మణిపూర్‌లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. దీనికి కారణం అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వమే. తన పీఠాన్ని కాపాడుకునేందు కు నాగాలు, మైతీల మధ్య కాంగ్రెస్ చిచ్చుపెడుతూ వచ్చింది. అదే నేటి పరిస్థితి (బంద్‌లు హింసాత్మకంగా మారాయి)కి కారణమైంది. చాలా సమస్యలు మణిపూర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. మేం కూడా ‘చేంజ్, ప్రొగ్రెస్, డెవలప్‌మెంట్’ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం.
నోట్లరద్దు... బీజేపీకి వరమా? శాపమా?
నోట్లరద్దు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం కాదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం. అయినా ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందా లేదా అన్నది ఎన్నికల ఫలితాల తర్వాతే విశ్లేషణ చేయాలి. ఒకటి మాత్రం స్పష్టం. దేశంలో 70–80 శాతం ప్రజలు ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. మాది మాటల ప్రభుత్వం కాదు. చేతల ప్రభుత్వం. 2019 ఎన్నికలే మోదీ ప్రభుత్వం పనితీరుకు రెఫరెండం.