నాలుగు రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలే: అమిత్ షా | will form our governments in four states, says amit shah | Sakshi
Sakshi News home page

నాలుగు రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలే: అమిత్ షా

Published Sat, Mar 11 2017 3:56 PM | Last Updated on Fri, Mar 29 2019 5:33 PM

నాలుగు రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలే: అమిత్ షా - Sakshi

నాలుగు రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలే: అమిత్ షా

పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలే ఏర్పాటు అవుతాయని పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల ట్రెండ్లు వచ్చిన తర్వాత.. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయని, ఐదు రాష్ట్రాల ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆయా ప్రాంతాలు కొత్త ఎత్తులను చూస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయాలకు గాను కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు కూడా ధన్యావాదాలు చెప్పారు.  ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలో స్వాతంత్ర్యం తర్వాత ఇంత పెద్ద విజయం ఇదేనని ఆయన అన్నారు. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయని ఆయన స్ఫష్టంగా చెప్పారు. ఇది ఆయా రాష్ట్రాల ప్రజల విజయమని, వాళ్ల విశ్వాసం సాధించిన విజయమని, నరేంద్రమోదీ నాయకత్వం సాధించిన విజయం అన్నారు.

మోదీ ప్రభుత్వం మూడేళ్లలో గరీబ్ కళ్యాణ్ యోజన, ఇతర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్లే ఈ విజయాలు వచ్చాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పనితీరును ప్రజలు స్వాగతించారని అన్నారు. పెద్దనోట్ల రద్దుతో పాటు చిన్న చిన్న గ్రామాలకు విద్యుత్ సరఫరా లాంటివి ప్రజలను ఆకట్టుకున్నాయని చెబుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కువ ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మోదీ నిలిచారన్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలు చూపించిన విశ్వాసాన్ని నిలబెట్టుకోడానికి ప్రధాని మోదీ, బీజేపీ నాయకులు నూటికి నూరుశాతం నిలబడ్డారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ మీద, బీజేపీ మీద బురద చల్లడానికి రకరకాల ప్రయత్నాలు జరిగాయని, యూపీ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పినప్పుడు చాలామంది తమను ఎద్దేవా చేశారని అన్నారు. యూపీ, ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాలు చాలాకాలం నుంచి సుస్థిరమైన, పనిచేసే ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నాయని, ప్రజలు మోదీ మీద, బీజేపీ మీద ఉంచిన విశ్వాసాన్ని రాబోయే ఐదేళ్ల పాటు నిలబెట్టుకుంటామని చెప్పారు. ఇక అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లోని పది సీట్లకు గాను ఆరుచోట్ల బీజేపీ గెలిచిందని.. తాను కాంగ్రెస్ గురించి ఇంతకంటే ఎక్కువగా ఏమీ చెప్పబోనని అన్నారు. ఇంతకుముందు కంటే కూడా ఆయా స్థానాల్లో తమ పరిస్థితిని మెరుగుపరుచుకున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement