నవ భారతమే మన స్వప్నం
ప్రధాని మోదీ విజయోత్సవ ప్రసంగం
న్యూఢిల్లీ: యువత కలలు కంటున్న నవ భారతమే మన స్వప్నమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. మహిళల కలలు, ఆకాంక్షలు నెరవేర్చి.. పేదల ప్రగతికి సమున్నత అవకాశాలు కల్పించే నవభారతాన్ని దేశం కోరుకుంటున్నదని, అలాంటి నవభారతానికి ఇది పునాది అని మోదీ పేర్కొన్నారు. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లోనూ, చిన్న రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీ అద్భుతమైన విజయాలు సాధించిన నేపథ్యంలో హస్తినలో కమలనాథులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అగ్రనేతలు, శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. పేదల అభివృద్ధే.. దేశాభివృద్ధి అని, ప్రజల ఆశలను నెరవేర్చడమే మన ధ్యేయమని ఆయన కమలనాథులకు ఉద్భోదించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఎన్నికల ఫలితాలు మెజారిటీ ప్రజల ఆకాంక్షను ప్రతిఫలిస్తాయని, కానీ ప్రభుత్వం మాత్రం అందరినీ కలుపుకొనిపోవాలని పేర్కొన్నారు.
ఇంకా ప్రధాని మోదీ ఏమన్నారంటే..
- ఈ తీర్పు ప్రజలకు సేవ చేసేందుకు దక్కిన అవకాశం. సేవ చేయాలని ఆదేశిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది.
- అధికారం అంటే పదవులు కాదు. ఈ బాధ్యతను మరింత వినయంగా మనం నెరవేర్చాల్సి ఉంది.
- ఎన్నో తరాలు నేతలు తమ జీవితమంతా ధారపోస్తే మన పార్టీ నిర్మితమైంది. అటల్‌జీ, అద్వానీజీ నాటిన విత్తనాలే ఇప్పుడు ఫలితాలను ఇచ్చాయి.
- ఈ ఏడాది దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ శతజంయతి ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన 'కర్మభూమి'అయిన యూపీలో ఈ ఎన్నికల విజయాలు మనకు భావోద్వేగమైనవి.
- ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేద్దాం.