యూపీ ఎన్నికల ఫలితాలతో ‘న్యూ ఇండియా’కు పునాది
⇒ ఎన్నికల అభినందన సభలో మోదీ ఉద్ఘాటన
⇒ మహామహుల జీవితాల త్యాగఫలమే ఈ ఫలితమన్న ప్రధాని
⇒ అమిత్ షా పార్టీకి కొత్త గుర్తింపు తెచ్చారని ప్రశంస
⇒ మోదీకి ప్రజామోదమే ఈ ఫలితాలన్న బీజేపీ చీఫ్
న్యూఢిల్లీ: యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయంతో కేంద్ర ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ విజయంతో 125కోట్ల ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేదిశగా 2022 (దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు) కల్లా న్యూ ఇండియా (నవ భారతం) నిర్మిస్తామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో.. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రికి అభినందన సభ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి అశోక్ రోడ్డు ప్రారంభం నుంచి పార్టీ కార్యాలయం వరకు కార్యకర్తల జయజయధ్వానాల మధ్య మోదీ ర్యాలీగా తరలివచ్చారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర ముఖ్యనేతలు మోదీకి స్వాగతం పలికారు. అభినందన సభలో మోదీ తమపై నమ్మకముంచి భారీ మెజారిటీతో గెలిపించిన యూపీ, ఉత్తరాఖండ్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. భావోద్వేగ అంశాలేమీ లేకుండా కేవలం అభివృద్ధి ఎజెండాతోనే ఎన్నికలు జరిగాయన్నారు.
‘న్యూ ఇండియా’కు ఇదే పునాది
‘దేశ రాజకీయాల దశ, దిశను యూపీ ఫలితాలు నిర్ణయిస్తాయి. ఈ విజయంతో దేశంలోని యువకుల (దేశంలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే) కలల సాధనకు, మహిళల సాధికారత సాకారానికి, పేదల, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను నిజం చేయడానికి న్యూ ఇండియా నిర్మాణానికి పునాది పడింది’ అని ప్రధాని తెలిపారు. దేశంలోని పేదలు ఏదో ఆశించే స్థితి నుంచి ‘స్వశక్తితో ముందుకెళ్తాం. పని ఇప్పించండి’ అనే ఉన్నతమైన ఆలోచన చేస్తున్నారన్నారు. ‘ఈ ఎన్నికల్లో గెలిచిందెవరు? ఓడిందెవరు? అనే చర్చ అనవసరం. ప్రజామోదం మనకు లభించింది. మన శక్తిమేర వారి ఆశలు, ఆకాంక్షలను పూర్తిచేయాలి. విజయం మనలో మరింత బాధ్యతను పెంచి, వినమ్రతతో పనిచేసేందుకు కొత్త శక్తినిస్తుంది’ అని మోదీ అన్నారు. ప్రజాసేవ చేసేందుకు అధికారం రూపంలో ఒక అవకాశం దక్కుతుందని ప్రధాని తెలిపారు. ‘దేశంలో మధ్యతరగతి ప్రజలు చాలా కీలకం. దేశం కోసం ఏదైనా చేసే శక్తి వారిలో ఉంది. కానీ వారిపైనే తీవ్రమైన భారం పడుతోంది. అందుకే వారి కలలను సాకారం చేయడం మా బాధ్యత. మధ్యతరగతి ప్రజలున్న చోటే బీజేపీకి జనామోదం ఎక్కువగా కనిపించింది’ అని ప్రధాని వెల్లడించారు.
తరతరాల శ్రమే ఈ విజయం!
బీజేపీ సాధించిన ఈ విజయం ఒక్క రాత్రిలో వచ్చింది కాదని.. దీని వెనుక ఎందరో నాయకులు, కార్యకర్తల కఠోరశ్రమ దాగి ఉందని ప్రధాని తెలిపారు. వాజ్‌పేయి, అడ్వాణి, కుశభావ్ ఠాక్రే, జానా కృష్ణమూర్తి వంటి మహామహులు వారి జీవితాలను త్యాగం చేశారని పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంత ఘనవిజయాన్ని అందుకున్న ఈ సంవత్సరమే.. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవం కావటం గర్వించదగ్గ విషయమని ప్రధాని తెలిపారు. దేశంలోని చివరి వ్యక్తి వరకు సంస్కరణ ఫలాలు అందాలని అభిలషించిన దీన్‌దయాళ్ ఆ దిశగా పనిచేస్తూ తన జీవితాన్ని అంకితం చేశారన్న మోదీ.. ఆయన ఆశీర్వాదంతోనే ఈ విజయం ప్రాప్తమైందన్నారు.
అంతా అమిత్ షాయే!
యూపీ, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ ఘన విజయానికి పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అండ్ కో తీవ్రంగా కృషిచేసిందని ప్రధాని ప్రశంసించారు. ‘ఈ విజయోత్సవ గౌరవం అందుకోవటానికి వారికే అర్హత ఉంది. దేశ చరిత్రలోనే ఓ రాజకీయ పార్టీకి ఇంత భారీ విజయాన్నందించిన ఘనత అమిత్ షాదే. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించటం, సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకుని దేశంలోని మూలమూలలకు పార్టీని విస్తరింపజేయటంలో షా పాత్ర అత్యంత కీలకం’ అని మోదీ ప్రశంసించారు. నవ భారత నిర్మాణానికి ప్రతిఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని, వారి వాగ్దానాలను ‘నరేంద్రమోదీ’ యాప్ ద్వారా తెలపాలని మోదీ ఆదివారం ఉదయం ట్విటర్లో కోరారు. ‘నైపుణ్యం, సామర్థ్యం కలిగిన 125 కోట్ల మంది ప్రజలతో కూడిన నవ భారతం ఉద్భవిస్తోంది. ఈ భారతం అభివృద్ధికి చిహ్నమవుతుంది. 2022 కల్లా గాంధీ, సర్దార్ పటేల్, అంబేడ్కర్‌లు గర్వపడేలా నవభారతాన్ని నిర్మించాలి’ అని మోదీ ట్వీట్ చేశారు.
2019లో మరిన్ని సీట్లు: అమిత్ షా
2014 సాధారణ ఎన్నికల కన్నా.. యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల ఫలితాలు గొప్పవని అమిత్ షా తెలిపారు. ప్రధాని ప్రసంగానికి ముందు అమిత్ షా మాట్లాడుతూ.. ‘యూపీ విజయం అపూర్వం, అద్భుతం. ప్రధాని నరేంద్ర మోదీ పేదలకోసం తీసుకుంటున్న నిర్ణయాలకు ఇది ప్రజామోదం. వచ్చే ఏడాది జరగనున్న హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగిస్తాం. ఈ ఎన్నికల విజయంతో 2019లో మరింత భారీ ప్రజామోదం పొందుతాం. మోదీ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు. నోట్లరద్దుతో పేదలు బీజేపీకి దగ్గరయ్యారు’ అని తెలిపారు.
2022 నాటికి నవ భారతం
Published Mon, Mar 13 2017 1:23 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement